ఆడదానికి ఏం కావాలి?

స్త్రీకి పురుషుడి నుండి ప్రేమ కావాలని మరీ పద్ధతిగా చెప్పమాకండి. అది అందరికీ తెలిసిందే కదా. వేరే సంగతులు చూద్దాం. శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు స్త్రీలకు బాగా అవసరమయిన ఆంశాలని రచయిత జాన్ గ్రే చెబుతారు. ఆ ఎమోషన్స్ ఆడవారికి ముఖ్యంట. అవి మగవారికీ, అందరికీ అవసరమే కానీ స్త్రీల విషయంలో మాత్రం మగవారి నుండి అవి బాగా ఆశిస్తారు.

శ్రద్ధ: ఆడవారేమన్నా అప్సెట్టయ్యారని అనిపించిదనుకోండి. మనమేం చేస్తాం? ఆత్మరక్షణకి ప్రయత్నిస్తాం. అలా చెయ్యొద్దు - తల తీసుకువెళ్ళి రోకట్లో పెట్టెయ్యమని చెబుతాడీ రచయిత. వాళ్ళ బాధలూ గట్ర వినెయ్యాలిట. వాళ్ళు మనల్ని తిడుతున్నా, అవమాన పరుస్తున్నా నోరు మూసుకొని కూర్చొని వాళ్లకి కలిగిన కష్టాలకి గాను సానుభూతి ప్రకటిస్తుండాలిట. వాళ్ళ సమస్యల పట్ల శ్రద్ధ చూపిస్తుండాలిట. ముందు కాస్త ఇబ్బంది పడితే పడ్దారు కానీ పారిపొవద్దంటాడు. అలా వాళ్ళు మన బుర్రల్ని దంచీ దంచీ విశ్రాంతి పొందుతారుట. మగవారు  పరుగెత్తితే ఆశాభంగం చెందుతారుట. అలా వారు కష్టపడి అనగా మన బుర్రల్ని తినీ సేదతీరాకా మన ఓపికని మెచ్చుకొని మనతో మంచిగా వుంటార్ట. మరి తెలిసీ, తెలిసీ రోట్లో తల పెట్టే ధైర్యం మీకు వుందా? నాకయితే ఇంకా రాలేదు సుమండీ. ప్రాక్టీసు చేస్తున్నా. ఇదివరలో గొడవ పెట్టేసుకొని మరీ పారిపోయేవాడిని. కాకపోతే ఈ పుస్తకం చదివాక మౌనంగా పారిపోతున్నా. కొంచెం బెటరూ.

అవగాహన: వాళ్ళ పట్ల మనకుండే అవగాహన వారిని సంతోషపెడుతుందంట. ఎప్పుడూ, ఎక్కువగా మన గురించి మనమే పట్టించుకోకుండా వారి యొక్క ఆసక్తులూ, అభిరుచులూ, ఆత్మాభిమానాలూ దృష్టిలో వుంచుకొని ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కువ సంతోషంగా వుంటారు.

గౌరవం: మగవారి కన్నా ఎక్కువగా గౌరవానికి స్త్రీలు ప్రాధాన్యత నిస్తారు. తరతరాలుగా మనం స్త్రీలను చెప్పుకింద తేలులాగా అణిచివేస్తూ వస్తున్నాం  కాబట్టి వారికి తగినంత గౌరవం ఇవ్వడానికి ఇష్టపడుతుండకపోవచ్చు. వాళ్ళు మనకు గౌరవం ఇస్తుండాలి కానీ మనం వారికి ఇవ్వడం ఏంటి అని అనిపిస్తుండొచ్చు. నేను అప్పుడప్పుడు మా ఆవిడని చాలా ఈజీగా తీసిపారేస్తుంటాను. అప్పుడు ఆమె గౌరవానికి భంగం కలిగినట్లు అనిపించినా తేలిగ్గా తీసుకుంటాను. అలాంటి విషయాల్లో నేను సవరించుకోవాల్సివుంది. వారు చెప్పేవి నచ్చకపోయినా, విభేదాలు వున్నా అవి సగౌరవంగా తెలియజెయ్యాలి కానీ తీసిపారేస్తే వారియొక్క అహం దెబ్బతిని మనమీది గౌరవం తగ్గుతుంది. అగౌరపరచకుండా వుండటమే కాకుండా వారి పట్ల బహిరంగంగా కూడా సముచితమయిన గౌరవం చూపిస్తూపోయినప్పుడు బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి. స్త్రీలకు తమ రెస్పెక్ట్ పట్ల అంత పట్టింపు వుంటుందని అనుకోలేదు.

అంకితత్వం: వారి పట్ల మనకుండే నిబద్ధత వారిని చాలా సంతృప్తి పరుస్తుంది. వారి పట్లనే మనం ఫోకస్ చేసి వుండటం వారిని ఆహ్లాదపరుస్తుంది. మనం సాధారణంగా మన పట్లనో లేక మన ప్రియురాలి పట్లనో ఫోకస్ చేసివుంటాం కానీ ఇంట్లో ఆవిడ పట్ల మనకు ఫోకస్ ఎందుకుంటుందీ? బోరు కొట్టదూ. వారికి విశాలభావాలు అయినా నేర్పించాలి లేదా మనం అలాంటి విషయాల్లో కుచించుకుపోవాలి.

ఆమోదం (వాలిడేషన్): ఈ పాయింట్ నాకు సరిగ్గా అర్ధం కాలేదు. మరోసారి చదవాలి కానీ అర్ధం అయినంతవరకు వ్రాస్తాను. అప్సెట్ కావడం ఆడవారి హక్కు అంటాడు రచయిత. వాళ్ళు మానసికంగా బాధల్లో వున్నప్పుడు ఏవో కొంపలు మునిగిపోతున్నాయని ఖంగారు పడి ఎందుకలా కంగారు పడిపోతున్నావంటూ వారిని కంగారు పెట్టకుండా తాపీగా మనల్ని వుండమంటాడు. వారి యొక్క అప్సెట్ మైండ్ వాలిడే అంటాడు. వాళ్ళలా కాసేపు బాధపడి బయటకి వస్తారని ఈలోగా ఎందుకలా అని అడగకుండా వారికి కావాల్సినంత సానుభూతి ప్రవహింపచెయ్యమనీ రచయిత సలహా.

భరోసా: వారికి అన్నివిధాలా, అన్ని వేళలా భరోసాగా వుండాలి. నేనున్నాను కదా, నీకెందుకు భయం, అంతా మంచిగా జరుగుతుందిలే అనే విశ్వాసాన్ని వారికి అందివ్వగలగాలి.  ఇదే సందు అనుకొని ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోవాలి. వారి యొక్క ఆందోళన సబబు అయిందని గుర్తిస్తూ సానుభూతి, ధైర్యం చెప్పాలి కానీ అందులో సమస్య ఏముంది, అంతా నువ్వు చేసుకున్నదే, నీ ఖర్మ, అందుకు బాధ్యత నీదే, నువ్వు ఇలా చేస్తే సమస్యలు కొని తెచ్చుకుంటావు అని వారు వర్రీలో వున్నప్పుడే వాయించొద్దు. ఏ విషయం ఎప్పుడు ఎలా చెబితే బావుంటుందో కూడా ఆ పుస్తకంలో జాన్ గ్రే వివరించాడు.

మరి స్త్రీనుండి పురుషుడికి ఏం అవసరమో ఇంతకుముందు టపాలో చెప్పుకున్నాం కదా.  నమ్మకం, అంగీకారం, ప్రశంస, ఆరాధన, అనుమతి, ప్రోత్సాహం. ఆడవారికి ప్రాధాన్యమయినవేమో ఇవీ: శ్రద్ధ, అవగాహన, గౌరవం, అంకితత్వం, ఆమోదం, భరోసాలు. ఇలా ఆడవారి, మగవారి ప్రాధాన్యతలకు వున్న తేడాల్ని గమనించుకుంటూ పోతే ఎంతో కొంత సఖ్యత అయినా వున్నదానికంటే మెరుగుపడుతుంది కాదూ?

13 comments:

  1. మీరుమరీ ఆ పుస్తకానికి Brand Ambassador అయిపోతున్నారు.

    ReplyDelete
  2. రోకట్లో కాదండీ.రోట్లో

    ReplyDelete
  3. AADAVAARIKI EM KAAVALI? LEKA POTHE AADA VAALLAKU EM KAAVALI?

    TITLE MAARCHAMANI NAA VINNAPAM.

    ReplyDelete
  4. @ ABCD
    జీవితానికి పనికి వచ్చే పుస్తకాలు కొన్ని చదువుతున్నాననీ, వాటిని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో భాంగంగా వాటి గురించి తరచుగా వ్రాస్తుంటానని ఈమధ్య ఓ పోస్టులో వ్రాసాను. నేను చదువుతున్న 'మార్స్ నుండి మగాళ్ళు...' అన్న పుస్తకం ఇంకా పూర్తవలేదు. 2/3 అయ్యింది. అది పూర్తయేదాకా అప్పుడప్పుడు ఆ పుస్తకం పై కబుర్లు వుంటాయి. ఆ తరువాత మరో పుస్తకం పని పడతాను.

    @ అజ్ఞాత
    ధన్యవాదాలు. సవరించాను.

    @ కమల్
    ఇంకా నయ్యం. ఆడ తీసేసి స్త్రీ అనో మహిళ అనో పెట్టమనలేదు - ఎందుకంటే కొంతమంది సుకుమారులకి ఆడ పదం అంటేనే మోటుగా తయారయ్యింది. పనికి మాలిన సున్నితత్వాలు పెరిగిపోయినప్పుడు ఇలాంటి ధోరణులు పుడుతుంటాయి. 'మగవాడి'కి లేని ఇబ్బంది 'ఆడదాని'కి ఏంటిట? టైటిల్ మార్చను.

    ReplyDelete
  5. @కాళిదాసు
    మీ వ్యాఖ్యలు ప్రచురించలేదు. మీరు ఇచ్చిన లింక్ పైరేటెడ్ ఈ-పుస్తకం గా భావిస్తున్నాను.

    ReplyDelete
  6. గురువు గారు..మాకెందుకీ పెళ్ళైన వారి గోల... అంటే ఇప్పుడే అయన్నీ ఎందుకనీ
    ...పైకి రావటానికి కావల్సిన లక్షణాలు అంటే, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసం తో ఆ మాదిరిగా ముందుకు పోవటం, నలుగురిలో నాలుకలా ఉండటం... ఇలాంటి పాజిటివ్ ధోరణి కి సంబంధించిన పుస్తకాల వివరాలు ఇవ్వగలరు...తెలుగు వి అయితే ఇంకా మంచిది..
    @Kamal: ఆడదాన్ని ఆడది అనకపోతే.. ఆడది గారు అంటారా... ఏ ఊరు వయ్యా మీది..

    ReplyDelete
  7. I am enjoying your translation...
    please take time share as much as you can. ( I am lazy to read the compelte book :)

    ReplyDelete
  8. meeku "kaaya" lanti abhimaani (sishyudu ?) okadu chaalu encourage cheyyadaaniki :)

    ReplyDelete
  9. @కాయ్
    ఇది పెళ్ళయిన వారికే కాదు మిత్రమా ఆడవారినెవరినయినా అర్ధం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. అలాగే మగవారిని కూడా. తెలుగు పుస్తకాల గురించి మళ్ళీ తెలుగులో వ్రాయడం ఎందుకులెండి. అయినా చూద్దాం. అవి నాకు లభ్యం అవడం తక్కువ. ఈ పుస్తకం అయ్యాక ఇంకో పుస్తకం మీరు చెప్పిన కోవలోనిదే ఎన్నుకుంటాను.

    @ సినిమా
    కాయ గురించి :)

    ఇది ఆ పుస్తకానికి తెలుగు తర్జుమా కాదండీ - పరిచయం మాత్రమే. నేను ఎంత వ్రాసినా కొంతే అవుతుంది కాబట్టి ఆ పుస్తకం చదవడం మంచిది.

    ReplyDelete
  10. అంటే.. మీరు ఇక్కడ వ్రాస్తున్నది కొంచెం లోతైన విశ్లేషణ లా ఉంది.. ఇప్పుడు ఇలాంటి విషయాలు పుస్తకాలు చదివి తెలుసు కోవటం కంటే.... రంగం లో దూకాక.. మనకు వచ్చిన వారిని అర్థం చేస్కోవడానికి ప్రయత్నించే సమయం లో... అప్పుడు కొంచెం ఆసక్తి ఉంటుందేమో.. నేనేమో బచ్చా గాణ్ణి... ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు..
    వివరాలు అంటే రివ్యూ ఇవ్వమని కాదు.. తెలిసిన కొన్ని పుస్తకాలు చెప్తే చదవటానికి ప్రయత్నిస్తా...
    @cenima: seems spelled intentionally wrong cinema ?... Thanks anyways...

    ReplyDelete
  11. @ కాయ
    తెలుగులో నాకు ఎక్కువగా తెలియవు. అందరికీ తెలిసినవే యండమూరివి విజయానికి అయిదు మెట్లు, తప్పు చేద్దాం రండి వగైరాలు మాత్రమే నాకు తెలుసు. విజయానికి అయిదుమెట్లు చదవలేదు కానీ తప్పు చేద్దాం రండి చదివాను. మార్పుకి సంబంధించి మంచి పుస్తకం అది.

    పధ్నాలుగు ఏళ్ళ క్రితం డిల్ట్ సంస్థ దివాకర్ గారియొక్క ట్రైనింగ్ సెషన్సుకి హైదరాబాదులో వెళ్ళాను. చాలా బాగా నచ్చాయవి. అప్పుడు ఆ క్లాసుల్లో వారు మంచి ఇంగ్లీషు పుస్తకాల లిస్ట్ ఒకటి ఇచ్చారు. ఆ లిస్ట్ ఎప్పుడన్నా వెతికి ఇస్తాను.

    ReplyDelete
  12. అన్నాయ్, ఈ పుస్తకం చదువుదామని దాదాపు రెండేళ్ల కింద మొదలు పెట్టాను కానీ, మొదటి అధ్యాయం అవగానే ఎందుకో ఆపేసా (ది ఫౌంటైన్ హెడ్ కోసం అనుకుంటా). మళ్లీ మొదలు పెట్టలేదు. కానీ రెండే రెండు పోస్టుల్లో మొత్తం కాన్సెప్ట్ చెప్పేసావ్. థాంక్సన్నాయ్. ఇకనుంచి ఇది ఇంట్లో ఆచరించి చూస్తా.

    ReplyDelete
  13. అయ్ బాబోయ్ !! ఆడవారికి ఇన్ని కావాల ? పిడికెడు పసుపు, చిటికెడు కుంకుమ మాత్రమే అనుకున్నానే ?

    ReplyDelete