అప్పుడప్పుడు గుర్తుకువస్తుంది ఈ కథ. ఎందుకంటే...

చాలా ఏళ్ళ క్రితం విపులలో ఒక కథ చదివాను. అది నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. అందులో ఒక జంట ఒక ఊరికని కారులో బయల్దేరుతుంటారు. భార్య మీద అతనికి బహు శ్రద్ధ, అనురాగం, ఆప్యాయతానూ. ప్రతి చిన్న విషయంలోనూ భార్య పట్ల శ్రద్ధ వహిస్తుంటాడు. జాగ్రత్తలు చెబుతుంటాడు. ఆమె కారు కిటికీ తెరచిందనుకోండి. నీకు చల్లగాలికి జలుబు చేస్తుందేమో ప్రియా, కిటికీ ముయ్యకూడదూ అని సున్నితంగా చెబుతాడు. ఆమె సీట్లో పడుకోవాలనుకుంటే చిన్న దిండు ఇచ్చి సౌకర్యంగా అమర్చుకొమ్మంటాడు. ఏమయినా తింటావా, తాగుతావా అని అప్పుడప్పుడు కనుక్కుంటాడు. నాకు కథ పూర్తిగా గుర్తుకులేదు. అందువల్ల నేను ఉదహరించినవి అందులో లేకపోవచ్చు కానీ అలా అలా ఆమె పట్ల అతడు అమిత శ్రద్ధ తీసుకుంటూవుంటాడు. ఆమె కూడా చిరునవ్వుతో అతనికి జవాబు ఇస్తూవుంటుంది.

ప్రయాణంలో మధ్యలో ఒక దగ్గర కారు ఆపి అక్కడి దృశ్యం ఒకటి చూద్దాం పద అని కారు దిగి వెళుతుంటాడు. అతని వెనకాలే ఈమె  అనుసరిస్తుంది. రా, ఇక్కడ నుండి చూస్తే దృశ్యం బావుంటుంది అని దగ్గిరికి ఆదరంగా పిలుస్తాడు. ఆమె విసుగ్గా తలతిప్పి నిలుచున్న చోటు నుండి కదలదు. అతను చూపే అమితమయినమయిన శ్రద్ధ ఆమెను అసహనానికి గురిచేస్తూవుంటుంది. అతనంతగా తనని ప్రేమించకపోతే బావుండుననుకుంటుంది. చిరాగ్గా వెనుతిరిగి విసవిసా కారులోకి వెళుతుంది. అతను గాభరాగా ఏమయింది ప్రియా అని కారు దగ్గరికి పరుగుపరుగున  వెళతాడు. సరిగ్గా ఇలాగే కథ లేదేమో కానీ ఇలాంటిదే.

కట్ చేస్తే మా ఆవిడ కారు నడుపుతూ వుంటుంది. నేను పక్కన కూర్చొని బోలెడన్ని సలహాలూ, సూచనలూ ఇస్తుంటాను. నేనెలాగూ వద్దన్నా నా అనుభవసారం అంతా ధారపోస్తుంటాను కాబట్టి ఆమె (మనస్సులో) విసుక్కుంటూ  ఈ చివిన విని ఆ చెవిన వదిలేస్తుంది. ఆ విషయం అర్ధమయ్యి ఈ మధ్య కాస్త మూసుకుంటున్నాను. కాకపోతే ఆ కథలో పెళ్ళాం మీద అమితమయిన ప్రేమ - నా కథలో కారు మీద అమితమయిన ప్రేమ!

ఆ కథ సంగతి కాస్సేపు పక్కన బెడితే మా ఆవిడ వాహన చోదకత్వ ప్రతిభాపాటవాలు చూస్తుంటే నాకు డర్రుగానే వుంది. ఇలా కూడా జనాలు డ్రైవింగ్ చేస్తుంటారా అని ముక్కున వేలేసుకుంటూవుంటాను. ఆమె కారు నడప బట్టి ఇంతకాలం అయినా ఏ విపరీతాలు ఇంకా ఏమీ జరగలేదేంటా అని నాలోన నేను తెగ హాశ్చర్యపడిపోతుంటాను. ఏదో  ఒకరోజు నా కారుకో, ఇంకెవరికో బాగానే వుంది లెండి.

అదీ పక్కన పెడితే ఇదివరకు ఒక కింగులా కారు నడిపేవాడిని. కొంతకాలం క్రింది దాకా మా ఇంట్లో మనకు తప్ప ఎవరికీ డ్రైవింగ్ రాదు కాబట్టి మనదే రాజ్యం లా వుండేది. ఇప్పుడు నా డ్రైవింగును విమర్శించడానికీ, సలహాలు, సూచనలు ఇవ్వాడానికీ మా ఇంట్లో రెండు ప్రతిపక్షాలు తయారయ్యేయి. ప్రధాన ప్రతిపక్షమే ప్రధాన సమస్య. ఏం చేస్తాం. అన్ని రోజులూ మనవి కావు కదా. అనువు కానప్పుడు అధికులమనరాదు కదా.

5 comments:

 1. wait reduction sangati emaindi ippudu enni kilolu

  ReplyDelete
 2. @ అజ్ఞాత
  ధన్యవాదాలండి. గుర్తుంచుకొని మరీ నా బరువు గురించి అడిగినందుకు. గత వారం 52 కిలోల మైలు రాయి దాటేసాను. అంటే నా బరువు 51.5 కిలోలు అప్పుడు. అయితే వారాంతం మళ్ళీ కొంత బరువు 53 కి పెరిగాను. ముఖ్యంగా ఒక కొత్త తెలుగు హొటలుకి వెళ్ళి బఫేలో ఎన్నో రుచికరమయిన పదార్ధాలు లాగేసినందువల్ల బరువు కాస్త పెరగాల్సి వచ్చింది. ఇవాళ ఉదయం మళ్ళీ 52.5 కి దిగాను. ఈ వారం 50 కిలోలకు దిగాలనేది నా ప్రయత్నం. ఆ తరువాత వారాంతాలు కొద్దిగా పెరిగినా మళ్లీ పనివారంలో తగ్గించుకోవచ్చు కాబట్టి అంతగా సమస్య అనిపించదు.

  ReplyDelete
 3. భార్య కారు నడుపుతుంటే ఏ భర్తకైనా భయమే లెండి______అదే కారు గురించి! మీరందుకు మినహాయింపు కాదన్నమాట అయితే! మీ వైఫ్ మీ భయాలను నిజం చేయకూడదనే కోరుకుందాం!

  మీరు చెప్పిన కథకొస్తే_____ప్రేమ ఉండటం మంచిదే కానీ ఎవరి స్పేస్ వాళ్లకుండటం అంతకంటే ముఖ్యం! ఏమంటారు!

  ReplyDelete
 4. రుచికరమయిన పదార్థాలు వడ్దించే ఆ తెలుగు రెస్టారెంట్ ఎదో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకొండి గురువుగారు, మంచి స్వదేశీ రెస్టారెంట్ కోసం సెర్చింగ్ ఇక్కడ. అదెంటో అన్ని ఇండియన్ రెస్టారెంట్లలో అవే రొటీన్ పదార్థాలు తిని బోరు కొడుతోంది.

  ReplyDelete
 5. @ సుజాత
  చాలా మంది భర్తలకీ ఇదే సిండ్రోం అని అర్ధం అవుతోంది. ఏం చేస్తాం, తగ్గించుకుంటాం. ఏదన్నా అయితే అప్పుడంటాం :)

  కథ గురించి - నిజమేలెండి. ప్రేమతోనయినా సరే ఇతరుల సరిహద్దులను గుర్తించి హద్దులను దాటకూడదంటారు.

  @ గాలి
  ఓ మీరుండేదీ ఇక్కడేనా? విష్ణు విలాస్. షాంబర్గులో వుంటుంది. తెలుగు బఫే. బాగానే వుంది కానీ బఫేక్కూడా సర్వీస్ ఫీజ్ అని 15 శాతం ముక్కు పిండి వసూలు చేసాడు. దాంతో మండింది నాకు. మరోసారి వెళ్ళనని వట్టేసుకున్నా. చికాగోలో ప్రియా రెస్టారెంట్ చాలా బావుంటుంది కానీ ఈమధ్య అదీ అంతగా బావుండటం లేదని ఎవరో అన్నారు. అదీ షాంబర్గులోనే అనుకుంటా.

  ReplyDelete