కెనడా కబుర్లు - మంచినీళ్ళ బిందెలు

అప్పుడప్పుడూ నేను కెనడాకి వచ్చి వున్న రోజుల గురించి వ్రాస్తాను కానీ అవి కాలక్రమంలో వుండకపోవచ్చు. మొదటిసారి కెనడాకి వచ్చినప్పుడు వచ్చి నన్ను తోడ్కొని వెళతాడు అని చెప్పిన మిత్రుని యొక్క మిత్రుడు విమానాశ్రయానికి రావడం ఎగ్గొట్టడంతో చేసేది లేక ఒక హాస్టల్ లాంటి దాంట్లో కొద్దిరోజుల కోసం సెటిల్ అయ్యాను.
 
మనం దేశం ఎల్లలు దాటి రావడం అదే మొదటిసారి కాబట్టి ప్రతి ఒక్కటీ వింతగా గమనిస్తుండేవాడిని. అలాగే నేను మనిషినే కాబట్టి నాకు ఆకలి దప్పులయ్యేవి కూడానూ. ఆ హాస్టల్లో ఫుడ్డు వుండదు. బయటకి వెళ్ళి తినేవాడిని. అయితే దప్పిక కూడా అప్పుడప్పుడవుతూ వుంటుంది కదా. మంచినీళ్ళ కోసం చుట్టూ చూసేవాడిని. ఊహు కనపడేవి కావు. మంచినీళ్ళ బిందెలు కానీ, కుండలు కానీ ఆ హాస్టల్లో లేకపోవడం ఆశ్చర్యం అనిపించింది. మరి వీళ్ళకి దప్పిక కాదా? ఎలా తమ దాహార్తిని తీర్చుకుంటారు? రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు శీతల పానీయాలో, ఉష్ణ పానీయాలొ లాగిస్తారు సరే. ఇంట్లో సంగతేంటీ? 
 
చేసే పనేమీ లేదు కాబట్టి కెనడియన్స్ ఎలా దాహార్తిని తీర్చుకుంటారు అనేది రెసెర్చ్ చెయ్యడం మొదలు పెట్టాను. అందుకోసం ఆ హాస్టల్లో వున్నవారిని కనిపెట్టడం మొదలెట్టాను. అబ్బే ఒక్కరూ మంచి నీళ్ల గ్లాసుతో మంచినీళ్ళు తాగుతున్న దాఖలాలు కనపడలేదు. అందరూ పొడుగాటి కప్పుల్లోనో, ప్లాస్టిక్కు బాటిళ్ళలోనో ఏవో ద్రావకాలు తాగుతున్నారు గానీ గ్లాసెత్తడం లేదు. హార్నీ, తెల్లోళ్ళు మామూలు మనుషులు కాదు సుమా - వీళ్ళు మంచి నీళ్ళు కూడా ముట్టరు అని నా రిసెర్చులో తీర్మానించేసాను.  అయినా ఛండాలంగా, పురాతన కాలంలో లాగా రోజూ మంచినీళ్ళు తాగడం ఏంటీ ఇక్కడికి వచ్చాక కూడా - మరీ మోటుగా వుండదూ అని నేను కూడా కూల్ డ్రింక్స్ తాగడం మొదలెట్టాను. 
 
అలా కెనడాకి వచ్చిన రెండు రోజులు బాగానే గడిచింది. మూడో రోజు నుండీ వంట్లో మంట మొదలయ్యింది. వంట్లో సెగలు వెలువడుతున్నట్లుగా అనిపించసాగింది. ఏంటా ఇసయం అని మళ్ళీ దానిమీదా పరిశోధన ప్రారంభించా. నా వంటికి మంచినీళ్ళు కావాలని తేల్చేసా? ఇప్పుడు దానికి మంచినీళ్ళు ఎక్కడ తెచ్చిచ్చేదీ? అసలు మంచి నీళ్ళంటూ కనపడితే కదా. ఎక్కడ వెతికినా బిందెలూ లేవు, కుండలు లేవు. మంచినీళ్ళని ఎవరినయినా కనుక్కుందామంటే మోటుగా వుంటుందేమోనని సంశయం. ఎలాగోలా సాయంత్రం వరకు తర్కిస్తూ గడిపా కానీ నా బాడీ బాయిల్ అవుతున్నట్లు అనిపించి ఇక లాభం లేదని రిసెప్షనిస్టుని మంచినీళ్ళు ఎక్కడ అని అడిగాను. 
 
కిచెన్లో అన్నాడు. కిచెనెక్కడ అని అడిగాను. బేస్మెంట్లో అని చెప్పాడు. అందులోకి వెళ్ళి వెతికితే కిచెన్ కనిపించింది కానీ కుండలు మాత్రం కనిపించలా. విసుక్కుంటూ వచ్చి కిచెనులో మంచి నీళ్ళెక్కడా అని నిలదీసినట్లే అడిగాను. ట్యాప్ దగ్గర పట్టుకో అన్నాడు. హ?! అతను భుజాలు ఎగరేసి కిచెన్ సింకు దగ్గర వున్న ట్యాప్ లోంచి పట్టుకొని తాగమన్నాడు.  వార్నీ కలికాలం కాకపోతే ట్యాప్ లోంచి నీళ్ళు పట్టుకొని తాగడం ఏంట్రా - ఏ బిందెలోనుండో, కుండ లోనుండో పట్టుకొని తాగాలి కానీ అని వాడిని తిట్టుకొని వెళ్ళి మంచినీళ్ళు తాగి ఆవిర్లు ఆపుకున్నాను. అప్పుడర్ధమయ్యింది వీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ తాగుతారో.
 
ఇన్నాళ్ళకి కూడా ఎప్పుడన్నా హోటళ్ళల్లో బస చేసినప్పుడు అదే సమస్య మా ఆవిడకి ఎదురవుతూ వుంటుంది. మామూలుగా మంచినీళ్ళు కావాలంటే రెస్ట్ రూములో వుండే సింకు దగ్గర వుండే ట్యాప్ లో నీళ్ళే గతి. ఆమె విసుక్కుంటూ వెండింగ్ మెషినులోంచో లేక కారు లోంచో వాటర్ బాటిల్స్ తెచ్చుకొని తాగుతుంది. నాకయితే అంత ఓపిక, అభ్యంతరాలూ వుండవు. లాగిచ్చేస్తానంతే.

4 comments:

  1. I know!
    It is a big cultural and behavioral shift!!

    ReplyDelete
  2. In London,people drink water even funnier way

    ReplyDelete
  3. it is funny but true .in western countries people drink beer or cola to quench their thirst,which is not a
    good habit. But I was told that tap
    water is good and safe and free from
    any health hazards ,in those countries unlike in our country.
    ramanarao.muddu.

    ReplyDelete
  4. I think you might be interested in knowing this.

    http://www.energybulletin.net/stories/2011-05-10/methane-well-water-gas-fracking

    - Chakri

    ReplyDelete