వచ్చే నెల ఇల్లు మారుతున్నాం

మా రెంటల్ కమ్యూనిటీ వాడు నెలకి ఓ వంద డాలర్లు కిరాయి పెంచుతా అన్నాడు. మూడున్నర ఏళ్ళనుండి వుంటున్నాం కాస్త తగ్గించరా బాబూ అంటే ససేమిరా వినలేదు. వళ్ళుమండి వేరే ఇల్లు చూసుకున్నాం. వెళ్లిపోతున్నామని చెప్పాక ఇప్పుడు రెంటు తగ్గిస్తాం వుండమంటాడు మా వాడు. కుదర్దు అని చెప్పేసా. ప్రస్థుతం మా నెల కిరాయి $1200. $1300 కి పెంచుతా అని ముందు అన్నాడు. ఇప్పుడేమో $1250 కే వుండమంటాడు. కొత్త కిరాయి ఇల్లు మాకు $1200 కే దొరికింది. పైగా అది కాస్త పెద్ద ఇల్లు. ఇప్పుడు మేము వుంటున్న ఇల్లు 1000 చదరపు అడుగులు కాగా కొత్తది 1200 అడుగులు. పైగా గరాజ్ కూడా వుంది. అందులో మా కొత్త కారే కాకుండా ఎన్నో సామాన్లూ పెట్టుకోవచ్చు.

కొత్త ఇల్లు చూసుకోవాలంటే కొన్ని చిక్కులు వున్నాయి. మా పెద్దమ్మాయి మళ్లీ తన పాఠశాలే కావాలంటుంది. చిన్నదీ అంతే. మంచి స్కూల్స్  కాబట్టి మా ప్రాంతంలో కిరాయిలు ఎక్కువ. మా ఆవిడకి ప్రకృతి సౌందర్యాల్లాంటి తొక్కలేం అవసరం లేదు కాని ఇంకాస్త పెద్ద ఇల్లు కావాలంటుంది. మనకేమో కాస్త ఇంటిముందు లేక్ వ్యూలూ వుండాలంటాను. అందరి కోరికలు తీరాలంటే చాలా డబ్బులుండాలి. అంత దృశ్యం  మనకు లేదు కాబట్టి చివరికి రాజీ పడింది ఎవరో మీరు ఈపాటికి గ్రహించేవుంటారు. ఇంకెవరూ - త్యాగరాజుని నేనే. సరస్సు దృశ్యం త్యాగం చేసాను. మేము కొత్తగా వెళ్ళే కమ్యూనిటీ కూడా చూడచక్కగానే వుంటుంది కాని ఇంటిముందు సరస్సులు వుండవు.

పైగా ఈ ప్లేసులో పార్టీ హవుజ్ కూడా వుంది. మా పెద్దమ్మాయి స్వీట్ సిక్స్‌టీన్ పార్టీ అందులోనే చేస్తుండొచ్చు. మరీ పెద్ద వేడుక చెయ్యాలని అనుకోవడం లేదు కానీ పెద్దగా చేస్తే మాత్రం నాకు బాగా తెలిసిన బ్లాగ్మిత్రులని నేను ఆహ్వానిస్తుండొచ్చు. ఆ వేడుక ఆగస్టులో వుంటుంది. 

అసలు స్వంతంగా ఇల్లే కొందామని ఆలోచించి చించి విరమించుకున్నాం. మా ప్రాంతంలో ఇళ్ళ ధరలు బాగా తగ్గుతున్నాయి. గత ఏడాదికీ, ఈ ఏడాదికీ 7 శాతం తగ్గాయి. ఇంకా రెండు మూడేళ్ళయినా ధరలు ఇలాగే తగ్గుతూ వుంటాయని అంచనా. పైగా ఈ ప్రాంతంలో మేము రెండేళ్ళకంటే ఎక్కువ వుండకపోవచ్చు. మా పెద్దమ్మాయికి ఎక్కడ కాలేజీ సీటు వస్తే అక్కడికి దగ్గరలో ఉద్యోగం చూసుకోవాలి. ఈ దేశాలకి వచ్చిన దగ్గరినుండీ కోల్డ్ బెల్ట్ లోనే వుంటున్నాం కాబట్టి కాస్తయినా దక్షిణానికి తద్వారా వెచ్చదనానికి చేరువగా వెళ్ళాలని మా అభిమతం.

కారుకు బదులుగా పుషప్ స్కూటర్ రైలు స్టేషనుకి వెళ్ళడానికి ఉపయొగిస్తా అని చెప్పాగా. అది తెచ్చి వాపస్ ఇచ్చి ఎలెక్ట్రిక్ స్కూటర్ తెచ్చుకుని పరీక్షిస్తున్నాను. బాగానే వుంది కానీ అదీ వాపస్ ఇచ్చెయ్యాలి. ఎందుకంటే కొత్త ఇంటికి కొద్ది రోజుల్లో వెళతాము కాబట్టి అది ఇక అక్కరలేదు. ఒక మైలు కన్నా కాస్త ఎక్కువ దూరం వుంటుంది. ఓ 25 నిమిషాల నడక. ఎంచక్కా లాగించెయ్యొచ్చు. పెట్రోలూ ఆదా, పార్కింగూ ఆదా. పైగా చక్కని వ్యాయామం కూడానూ. ప్రకృతినీ, ప్రజలనీ పరిశీలిస్తూ పరవశిస్తూ నడిచెయ్యొచ్చు. ఇప్పుడు వుంటున్న ఇల్లేమో రెండు మైళ్ళ దూరం వుంటుంది. నడిస్తే నలభై అయిదు నిమిషాలవుతోంది. మరీ అంతసేపు ఉదయమూ, సాయంత్రమూ నడవలేక మానేసాను.

2 comments:

  1. స్కూల్, పెద్ద సౌకర్యవంత మైన ఇళ్ళు, మళ్ళీ స్కూల్ ల తో మీ సరస్సు, సౌందర్యాన్ని కంపేర్ చేసినప్పుడే అనుకున్నా... ఇదేమన్న పెద్ద ఇంపార్టెంటా అని... కావల్సినప్పుడు చెరువు గట్టు కెల్లి రండి.. చికాగో ల పెద్దది ఉంది కదా... మీరైతే పెద్ద త్యాగి కాలేదు.. గురూ గారు..

    ReplyDelete
  2. @ కాయ
    అంతేనంటారా. నా లెవలుకి అదే గొప్ప త్యాగం లెద్దురూ. మనం పెద్దగా పట్టించుకోము గానీ పరిసరాల సౌందర్యం కూడా ముఖ్యమే. దానివల్ల మనస్సుల్లొ ప్రశాంతత వుండి ఇళ్ళల్లో చికాకులు కాస్త తగ్గడం లాంటి ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. అయితే అన్ని ప్రయోజనాలూ కావాలంటే కుదరవు కాబట్టి వోకే.

    ReplyDelete