నిన్న కొద్దిగా స్పిరిట్ పారాయణం చేసా

మా దగ్గర మీటప్పు గ్రూపులు ఏమున్నాయా అని వెతుకుతుండగా మా ఎదుటి కామ్యూనిటీలోనే కాస్త స్పిరిట్ ధారపోసే గురువు గారున్నట్లు అర్ధమయ్యింది. వార్నీ అనుకొని ఆ విశేషాలు చూసాను. స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ కాదులెండి. స్పిరుచువాలిటీ. దానికీ మనకూ ప్రస్థుతం ఆమెడ దూరం కదా. మరి? వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారు. అందులో వాళ్ళు ఆధ్యాత్మికతను పొందుతారు. నేనేమో సెల్ఫ్ హిప్నటిజం చేసుకుంటూ ప్రశాంతతను పొందుతాను. సెల్ఫ్ హిప్నటిజం చేసుకునే గ్రూపులు దొరకవు కాబట్టి ఇలా మెడిటేషను గ్రూపుల్లో చేరి నా పని నేను కానిచ్చేద్దామని. ఒక్కడ్నే చేసుకోవాలంటే ఉత్సాహం రావడం లేదు.

నాకు చాలా ఏళ్ళ నుండి ధ్యానం లేదా సెల్ఫ్ హిప్నటిజం యొక్క విలువ తెలుసు కానీ ఎప్పుడూ అది సక్రమంగా పాటించడానికి కుదర్లేదు. అది చేసినప్పుడు నా మనస్సు చాలా బావుంటుంది. ప్రశాంతంగా, పాజిటివ్గా వుంటుంది. నా డిగ్రీ అయిన తరువాత కొన్ని సెమినార్లల్లో పాల్గొన్నాను. అక్కడి ఉపన్యాసకులు  మూడు నాలుగు సందర్భాల్లో ధ్యానం గురించి చెప్పారు. దేవుడిని నమ్మకపోతే మీకు నచ్చిన వ్యక్తిని మనస్సులో నిలుపుకొని అయినా ధ్యానం చెయ్యమన్నారు. ఆ మాట బాగా నచ్చింది మరియు నాలో బాగా నాటుకుంది.

అందుకే నేను ధ్యానం/హిప్నటిజం చేస్తున్నప్పుడు నాకు నచ్చిన వారిని మనస్సులో నిలుపుకొంటుంటాను. మనకు వున్నది ఒక్క దేవతా? వాళ్లు వాళ్ళు నా మనస్సులో కొట్లాడుకొని, కాట్లాడుకొని ఎవరో ఒకరు నిలుస్తారు. నిన్న కూడా నా మనస్సుని అలా వదిలేసా. ఈసారి నా మదిలొ అంతర్యుద్ధాలు ఏమీ జరుగలేదు. నెమ్మదిగా నా ఇష్టసఖి ఒకరు నా మనస్సులో నిలిచింది. నా పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. ఆ తరువాత ఆమె నాకు ఎన్నో ఆదేశాలూ, ఉపదేశాలూ ఇచ్చింది. అవన్నీ వినమ్రతతో స్వీకరించాను. నా లక్ష్యం గురించి ఉద్భోధించి దానిమీద మనస్సు నిలుపుతూ మిగతావన్నీ నాటకంలోని పాత్రవలె చిరునవ్వుతో, డిటాచ్మెంటుతో నడిపించెయ్యమంది.

నిన్నటి సమావేశానికి ఆరుగురు వచ్చారు. ఒకరు చైనీస్ కాగా మిగతావారందరూ తెల్లోళ్లు. చైనీస్ యువతి పేరు వీనస్. మా నిర్వాహకునికి బుద్ధుని బోధలంటే చాలా ఇష్టం. అలా అని బుద్ధిస్ట్ కాదు. స్పిరుచువాలిటీ కి సంబంధించి ఎన్నో పుస్తకలౌ చదివారు. ఎంతో జ్ఞానం వున్నట్లుగా అనిపించింది. మంద్ర స్వరంతో మాతో ముచ్చట్లు పెట్టారు.  మన భారతీయ రచయితల పుస్తకాలు కూడా బాగా చదివారు. వివేక్ చోప్రా వాక్యాలు కొన్ని ఉటకంకించారు. వారి ముచ్చట్లలో దేవుడికి సంభించిన విషయాలు మాత్రం తీసివేసి తత్వశాస్త్ర విషయాలు మాత్రం నేను ఏరుకున్నాను. నేనో నాస్తికుడిననీ ముందే వారికి చెప్పుకున్నాను. బుద్ధ బోధనల పట్ల ఆసక్తి వుందనీ తెలియపరిచాను. 

పరిచయాలు, కొంత చర్చ అయ్యాక అరగంట ధ్యానం చేసాము. ఆ తరువాత మరొక గంటన్నర తత్వ శాస్త్ర విషయాల గురించి చర్చ జరిగింది. నాకున్న సందేహాలలో కొన్నింటిని నివృత్తి చేసుకున్నాను. వీనస్ కూడా చురుకుగా చర్చలో పాల్గొన్నది. వీరితో పాటు వారం వారం ఆదివారం సాయంత్రం ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను. వీలయితే తెల్లవారు ఝామునే రోజూ ధ్యానం చెయ్యాలి. దానికోసం ముందు పక్కమీదినుండి లేవాలి కదా. రోజూ ఆలస్యంగా లేచి ఆఫీసుకి ఆదరాబాదరాయణమే సరిపాయే. చెయ్యాలి, చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి.  

ఆ సమావేశం ముగించుకొని రాత్రి తొమ్మిదిగంటలకు నా కారు లోకి వచ్చి స్టార్ట్ చేసి హెడ్‌లైట్స్ వెయ్యబోతే దానికి స్విచ్చు ఎక్కడవుందో మరిచేపోయాను. వెతికితే దొరకలేదు. పాత కారు కాబట్టి ఆటో లైట్స్ లేవు. హు, బాగానే వుంది, స్పిరిట్ బాగానే తలకెక్కింది అనుకొని తల కొన్ని సార్లు విదిలిస్తేగానీ స్విచ్చెక్కడుందో గుర్తుకువచ్చి ఛావలేదు. 

మా మీటప్ గురించి మా నిర్వాహకుని సమీక్ష చూడండి: 
A genuine honor to sit and practice with everyone last night. Thanks to Patty & Sarath for adding their energy to the mix, I hope you both enjoyed the experience. It's always nice to tap into the collective awareness & I appreciate everyone's willingness to share their insights during our post meditation discussion. We grow together when we are able to be open in this way. Namaste y'all

7 comments:

 1. స్పిరిట్ బాగానే తలకెక్కింది అనుకొని తల కొన్ని సార్లు విదిలిస్తేగానీ స్విచ్చెక్కడుందో గుర్తుకువచ్చి ఛావలేదు.
  you can achieve the same effect with a quarter whiskey

  ReplyDelete
 2. సెల్ఫ్ హిప్నాటిజానికి , ధ్యానానికి ఉన్న తేడా ఏమిటి? రెండింటిలోనూ ఒకే స్ఠితిని పొందవచ్చా?

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  ఆమాత్రం స్పిరిట్ తలకెక్కించుకోవడానికి అరగంట అలా కష్టపడకుండా ఓ పెగ్గేసుకొని పడుకొమ్మంటారా :)

  @ భాస్కర్
  స్థూలంగా చెప్పాలంటే రెండింటి స్థితీ ఒక్కటే. వివరాల్లోకి వెళితే తేడాలు చాలానే వుంటాయి. రెండింటిలోనూ ట్రాన్స్ (సుషుప్తి) లోకి వెళతాం. అలా వెళ్ళాక ఆ స్థితిని ఎలా వినియోగించుకుంటున్నాం అన్న దాన్ని బట్టి తేడాలుంటాయి. కొందరు (నమ్మకం వున్నవారు) పరమాత్మ సాక్షాత్కారం కోసం కృషి చేస్తారు. నాలాంటివారు ఆత్మ సాక్షాత్కారం కోసం కృషి చేస్తారు. సుషుప్తి స్థితి పొందాక నేను భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నానో విజువలైజ్ చేసుకుంటాను. ఆ లక్ష్యలను చేరేందుకు నా మనస్సును సంసిద్ధం చేస్తూ ఆదేశాలు ఇచ్చుకంటాను. మరి కొంత సేపు నా మనస్సును స్వేఛ్చగా తిరగాడనిస్తాను. ఆ దశలో అలా మన మనస్సులో స్పష్టతా, ప్రశాంతతా మరియు ఉత్తేజం కలుగుతూ వుంటాయి.

  ReplyDelete
 4. ఈ విషయం లో నాకు కొన్ని సందేహాలున్నాయండి. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. కానీ సరిగ్గా చెయ్యలేను. ఎప్పుడో ఎవరో చెప్పిన గుర్తు,,ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఆ ధ్యాస సరిగ్గా కుదిరి చావట్లేదు. మహా చేస్తే ఒక పది నిమిషాలు. అంతే కళ్ళు తెరుచుకుపోతాయ్. ఇంతకుముందు మరీ ఘోరం గా వుండేది ఇప్పటితో పోల్చుకుంటే. ఎలచేయ్యోచ్చో తెలియదు. కానీ ప్రాణాయామం చేస్తాను..(దాన్ని ప్రాణాయామం అంటారో లేదో తెలియదు) ఊపిరిబిగబట్టి వుంచి మెల్లగా వదులుతూ, మరల పీలుస్తూ అలా అలా ఒక అరగంట చేస్తాను ఎప్పుడైనా వర్క్ ఎక్కువైపోయి మైండ్ పనిచెయ్యడం మానేస్తే..ధ్యానం సరిగ్గా చెయ్యడానికి మీ సూచనలేమైనా వున్నాయండి?

  ReplyDelete
 5. @ ప్రబంధ్
  ధ్యానం గురించి నాకు వున్నది మీలాంటి మిడిమిడి జ్ఞానమే కాబట్టి ఎవరయినా బాగా తెలిసిన వారు మనకు సూచిస్తే బావుంటుంది. నా వుద్దేశ్యం ప్రకారం ఎలాగయినా ట్రాన్స్ లోకి వెళ్ళడం ప్రధానం. వెళ్ళాక ఏం చెయ్యాలనేది మీ ప్రాధాన్యతలు, అభిరుచులను బట్టి వుంటుంది. నాకూ ప్రాణయామం మీద ఆసక్తి ఎక్కువ - ప్రాక్టీసు తక్కువ. ముందు ధ్యానం రోజూ వారీ చేస్తే తరువాత ప్రాణయామం చెయ్యొచ్చు అని వాయిదా వేస్తుంటాను. నెట్టులో చూడాలి ప్రాణయామం గురించి.

  ReplyDelete
 6. హ్మ్! ఈవీనస్ సంగతేవిటో!! రెండుమూడు సార్లు ప్రస్తావించారు కాని వివరాలేం చెప్పలేదు?

  ReplyDelete
 7. @ అజ్ఞాత
  ఆమె గురించి ఎక్కువగా చెప్పడానికి అక్కడ ఏమీలేదు :) ఉత్సాహంగా మాట్లాడింది. ధ్యానం గురించి ఏవేవో వివరించింది కానీ యాస సమస్య వల్ల నాకు అవి అంతగా అర్ధం కాలేదు. సమావేశం అయ్యాక ఆమెతో విడిగా మాట్లాడుదాం అనుకున్నా కానీ కుదర్లేదు. వచ్చేసారి అయినా మాట్లాడాలి. ఆమె రోజూ మెడిటేషన్ చేస్తుందంట. రోజూ యోగా చెయ్యడానికి నాకు తోడుగా వుంటుందేమోనని నాకు చిరు ఆశ. చూద్దాం.

  ReplyDelete