బోర్ కొడుతోంది...బోర్ కొడుతోంది...ఏం చెయ్యాలి...ఏం చెయ్యాలి?

... అని నిన్నంతా ఆలోచించి కొన్ని చర్యలు చేపట్టాను. ఏంటో లైఫంతా రొటీనుగా సాగుతున్నట్లనిపించింది. అలా ఎక్కువ రోజులు అనిపిస్తే కష్టమే. పొద్దునే లేవగానే స్ప్రింగులా లేచి ఉత్సాహంగా జీవన గమనంలోకి ఉరకాలనిపించకపోతే మన బ్యాటరీలు ఫుల్లుగా లేనట్లే. కొంతమంది నిరర్ధకులు అలాగే జీవితం అనే బండిని లాగిస్తుంటారనుకోండి. వారికి మార్పు అన్నా, చేర్పు అన్నా అసహ్యం. మంచో చెడో వున్న స్థ్తితి వున్నట్లుగానే వుండాలనుకునే జీవఛ్ఛవాలు వాళ్ళు. మార్పు కోసం మనం కృషి చేసినప్పుడు అన్నిట్లో, అన్ని వేళలా మనం విజయం సాధించకపోవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ ఆ కృషిలో ఎంత ఆనందం అనుభవిస్తాం? ఏదయినా ఒక విషయాన్ని సరిదిద్దేపనిలో ఎంత ఆనందం మనకు దొరుకుతుందీ? ఎందుకీ హైరానా, హయిగా ఎడ్జస్టు కాలేక అని కొందరనుకుంటారు కానీ చెప్పా కదా జీవఛ్ఛవాలకీ, జీవితాలకీ తేడా తెలియని నిరర్ధక వాదులు వారందరూనూ.

ఈ టాపిక్కులో ఎక్కడినుండి ఎక్కడికో వెళుతున్నట్లున్నాను. అయినా సరే, కానివ్వండి. ఓకే. మీరు ఉదయమే లేస్తారు. మీకు ఏమని అనిపిస్తుంది. ఛీ, నా ఎదవ జీవితం అని మీ జీవితాన్ని, మిమ్మలని తిట్టుకుంటారా లేక హుశారుగా నవ్వుతూ, తుళ్ళుతూ పనులు చేసుకుంటారా? లేకపోతే ధర్మరాజంత స్థితప్రజ్ఞుడిగా మొఖంలో ఏ భావాలూ లేకుండా అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడుపొట్టకు కాస్త అన్నమే పడవేయురా అని కలికాల తత్వాలతో మెట్టవేదాంతం ఆలాపిస్తుంటారా? మొదటిదే నిజమైతే మన పరిస్థితుల్లో ఎక్కడో ఏదో లోపం వున్నట్లే. అది మీకు తెలిసిందే. అది మనం సవరించుకోనన్నా సవరించుకోవాలి లేకపోతే మనమన్నా సర్దుకోవాలి. ఆ రెండు కుదరకపోతే వాస్తవ పరిస్థితులను అంగీకరించడమయినా చెయ్యాలి.

వ్యక్తిత్వ వికాస బోధకుల్లా నేనేమీ నా పరిస్థితులని దాచేసి ప్రవచించబోవడం లేదు. అప్పుడప్పుడు ఆ పర్సనాలిటీ ప్రీచర్సును చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వారంతా ఎల్లప్పుడూ పరిపూర్ణులన్నట్లుగానే వ్రాస్తుంటారు. నేనేదో ప్రతి రోజూ స్ప్రింగులా పక్కమీదినుండి పెందరాళే లెస్తాను అని కాదు. మనుషులకి వుండేట్లుగానే నాకూ సమస్యలున్నాయి. నా బాటరీలలో చార్జ్ తక్కువయ్యిందని నాకు తెలుసు. నా మనస్సు ఫుల్లు చార్జీలో లెదంటే ఎక్కడో రీఛార్జింగులో తేడా వున్నట్లూ తెలుసు. ఆ తేడా ఏమిటో కూడా నాకు తెలుసు. దాన్ని రిపైర్ ఎలా చెయ్యొచ్చో కూడా తెలుసు. అయితే పలు కారణాల వల్ల ఆ రిపేర్లు ఆలస్యం అవుతుంటాయి. ఈ లోగా ప్రతిరోజూ మనం దాటేస్తూనే వుండక తప్పదు కదా.  అందువల్ల నేనూ అప్పుడప్పుడయినా లేవగనే దందగమారి జీవితం అని విసుక్కుంటూ కాళ్ళీడ్చుకుంటూ పనికి వెళ్ళే సందర్భాలు కద్దు. అయితే జీవితంలోని మోనాటనీని తప్పించి జీవితంలోకి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకై ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనేవుంటాను. పలు విషయాల్లో అందుకు అనుగుణంగా మార్పు, చేర్పులు చేస్తూనేవుంటాను. మరి మీరు? 

సమస్యలు, బాధలు, ఎగుడుదిగుళ్ళు అన్నవి సహజం. అయితే విషయం ఏమిటంటే చాలామంది మార్చుకొతగ్గ పరిస్థితులకు కూడా రాజీ పడి కూర్చుంటారు. పోరాడితే పోయేది మానసిక ప్రశాంతతే అని సర్దుకుకూర్చుంటారు. అలా ప్రశాంతత పోతుందనుకుంటారే కానీ ఆ పొరాడే క్రమంలో, పరిస్థితులను సరిదిద్దే క్రమంలో, ఈ ఛాలెంజీలని ఎదుర్కొనే క్రమంలో ఎంత ఆనందం, తృప్తీ పొందుకుంటామో అలాంటివారికి అర్ధం కాదు. 

నిజమే. కొన్ని కొన్ని మన జీవిత కాలంలో మార్చుకోలేము. అలాంటి వాటిని అంగీకరించాల్సిందే. ఉధాహరణకి నా విషయమే తీసుకుంటే నేను కాస్త పొట్టి. కానీ నాకు అసలు ఆ విషయమే గుర్తుకు వుండదు - ఎవరయినా గుర్తు చేస్తే తప్ప. ఎందుకంటే నా ఎత్తుని నేను మార్చుకోలేను - అందువల్ల ఆ వాస్తవాన్ని నేను అంగీకరించేసాను. ఇక నా ఎత్తు నన్ను చేసేదేముందీ? అలా అని అన్ని విషయాల్లో రాజీ పడతానా? లేదు. పోరాడుతూనే వుంటాను.

నేను ఒక కంప్యూటర్ కళాకారుడిని.   నేను చేసే ప్రోగ్రామింగ్ సరిగ్గా వచ్చేంతవరకూ రకరకాల ప్రయోగాలు చేస్తూనేవుంటాను - పరీక్షిస్తూనేవుంటాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి ఊరకే కూర్చోను. నాక్కావాల్సిన ఫలితం వచ్చేదాకా శ్రమిస్తూనేవుంటాను. ఆ శ్రమలో ఆనందం పొందుతాను. విజయం వరించగానే సంబరపడతాను. అలా ఒక్కో విజయం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని, మరింత ఆనందాన్ని సృష్టించుకుంటూ, సృజించుకుంటూ వెళుతూనే వుంటుంది.  ఎవరు ఎక్కువ ఉత్సాహంగా వుంటారు? ఎవరు ఎక్కువ ఆనందంగా వుంటారు? మెట్ట వేదాంతం, సొట్ట సైకాలజీ వల్లిస్తూ ఊరకే సర్దుబాట్లు చేసుకొని కూర్చునేవారా లేక నిరంతరం ప్రయత్నించి విజయాన్ని కైవసం చేసుకునేవారా? సమాధానం మీకు తెలుసు.

మన జీవిత గమనంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే వుంటాయి. వాటికి తిట్టుకుంటూ సర్దుబాట్లు చేస్కుంటూపోతున్నామా లేక సమస్యా పరిష్కారానికై శ్రమిస్తూపోతున్నామా అన్నది చూసుకోవాలి. నాకు అలాంటి సవాళ్ళు వున్నప్పుడు, ఎదురయినప్పుడు మరీ నవుతూ, తుళ్ళుతూ వుంటానని చెప్పలేను కానీ ఒకవైపు తిట్టుకుంటూనే మరో వైపు కృషిచేస్తూనేవుంటాను.  నేను ఆశావహుడిని. ఆశ నన్ను నడిపిస్తూనే వుంటుంది. ప్రయత్నిస్తూనేవుంటాను వుంటాను. ఆ ప్రయత్నాల్లో ఆనందిస్తూనే వుంటాను.  నా బ్యాటరీలు రీచార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూవుంటాను.  ఆ క్రమంలో కిందామీదా పడుతూనేవుంటాను. అందులోనే ఆనందం పొందుతుంటాను. ఆ విజయమే కనుక నను వరించినప్పుడు బ్రహ్మానందం  పొందుతుంటాను. అలా నేను జీవిస్తూనేవుంటాను. 

ఒక్కసారి మీరు కూడా రేపు ఉదయం నిద్ర లేచినప్పుడు మీ బ్యాటరీలు ఫుల్లు ఛార్జింగులో వున్నాయా లేవా అన్నది సరిచూసుకోండి. మిమ్మల్నీ, మీ జీవితాన్నీ మీరు తిట్టేసుకున్నారనుకోండి - ఎక్కడో, ఎందుకో మీ జీవితం సరిగ్గా రిఛార్జ్ అవడం లేదన్నమాటే కదా. అయినా సరే సర్దుకొని మూసుక్కూర్చుంటారా లేక సరదాగా ఆ సవాళ్ళని సరిచేస్తారా అన్నది మీరు తేల్చుకోండి. సర్దుకొని పోవడం తేలికే. అవును మనుషులు మురుగు కాలువల ఒడ్డున మురికిపేటల్లోనూ జీవిస్తుంటారు, బంజారా హిల్స్ లోనూ జీవిస్తుంటారు - ఆ మధ్యలో కూడా జీవిస్తుంటారు. ఎలాంటి జీవితం అయినా ఒక్కటే కదా అనుకున్నప్పుడు ఇహ ఇంకా ఈ టపా చదవడం కూడా వ్యర్ధమే. దయచేసి మూసివెయ్యండి మరి.

ఇక నా సంగతంటారా, నిన్న బోరుకొట్టింది అని చెప్పా కదా. కొన్ని స్వల్పమయిన మార్పు చేసాను. అవేంటో మరోసారి చెబుతానులెండి. మనలో ఉత్సాహం రావడానికి, నింపడానికి ఓ బ్రహ్మాండమే బ్రద్దలయేంత విరీతాలు జరుగనఖ్ఖరలేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చక్కని ఫలితాలను ఇస్తాయి. నా లైఫ్ కెమిస్ట్రీలో రసాయనాలను కొద్దిగా అటూఇటూ మార్చిచూసాను. ప్రస్థుతానికయితే ఆ మిశ్రమం పనిచేస్తున్నట్లుగానే వుంది. ఇంకా చూద్దాం. పనిచెయ్యకపోతే ఆ మిశ్రమన్ని మళ్ళీ మార్చేద్దాం.  

12 comments:

 1. గురువుగారు,
  ఎంత చక్కగా చెప్పారండి! నేనూ దీని గురించే ఆలొచిస్తున్నాను కొద్ది రొజులుగా. వ్యక్తిగత మరియు వ్రుత్తి జీవితాలు బోర్ కొడుతున్నాయి. ఏమి చెయ్యాలా అని అలోచిస్తున్నాను. మే మార్పుల కోసం వేచి చూస్తా..వీలయితే ఆచరిస్తా..లేకపొతే అందులోనుంచి అయిడాస్ వస్తాయేమో చూస్తా..

  ReplyDelete
 2. ఎప్పట్లానే బాగా రాసారండి..

  ReplyDelete
 3. బావుందండి. బాగా చెప్పారు.

  ReplyDelete
 4. super ...రీచార్జ్

  ReplyDelete
 5. నిన్న, ఏంటబ్బా గురువు గారు ఏమీ వ్రాయటం లేదు అనుకున్నా... బోర్ కొట్టిందా ఐతే ..

  మార్పు కోసం చేసే ప్రయత్నాలలో తెలివైన శత్రువులు బాగా పనికి వస్తారు గురువు గారు... ఇంతకు ముందు జిమ్మ్ , ఆటలకి పోవాలంటే కొంచెం బద్దకం గా ఉండేది.. నా అపార్ట్మెంట్ సహ మానవుడు నా శత్రువై కూచున్నాడు.. వాడికీ బోర్ కొట్టి ఉంటుంది కొన్నాళ్ళ పాటు.. రాను రాను చాలా ఫన్ వస్తున్నది ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఉండటం వల్ల..

  క్రికెట్ లో ఇక్కడ ఎప్పుడూ విరుద్ధ టీం లలో ఉంటూ ఒకరికొకరం గట్టి పోటీ నిచ్చుకుంటూ చుక్కలు చూపించు కుంటున్నాం.. వాడు నా బౌలింగ్ లో కొట్టి కొట్టీ .. తప్పని సరిగా అవుట్ అవుతున్నాడు..అయ్యేలా ట్రిక్ చేస్తున్నా.. .. నేనేమో, వీడి గురించి తెలుసు కాబట్టి.. అసలు అవుట్ కాకుండా వీడి బౌలింగ్ మాత్రం డిఫెన్సివ్ గా ఆడుతున్నా...

  ReplyDelete
 6. ఎవరైనా ఏదైనా టపా పోస్ట్ చేసేది... బాగుందో బాగా లేదో పొగటటానికి మాత్రమే కాదు.. మీ జీవితం లో కూడా ఇలాంటివి ఏమైనా ఏడిస్తే .. ఇక్కడ ఏడ్చి చావండి అని ... కదా గురువు గారూ ....

  ReplyDelete
 7. @ గాలి
  నా మార్పులు మీకు మక్కీమక్కీగా లాభించకపోయినా ఆ స్ఫూర్తితో మీరు అన్నట్లే కొత్త ఆలోచనలు రావచ్చు. వ్రాస్తాను - కొద్ది రోజుల్లో. ఆ ఫలాలని ఆస్వాదించడంలో బ్యుజీగా వున్నా :)

  @ ప్రబంధ్
  :)
  పర్సనాలిటీ డెవెలప్మెంట్ పుస్తకాలు చదివేవారికి నేను వ్రాసే విషయాలు, ఐడియాలు కొత్తగా అనిపించకపోవచ్చు కానీ అలా ఆ కాంటెంట్ నమిలి వదిలెయ్యకుండా నా జీవితానికి ఎలా అన్వయించుకుంటానో చెప్పడమే నా ఉద్దేశ్యం.

  ReplyDelete
 8. @ ప్రసీద, జగ్గంపేట్
  :)

  @ కాయ
  యెప్. అందుకే నిన్న ఆ పనులతో తీరికలేకుండా వుండి పోస్టులు వెయ్యలేకపోయాను.

  తెలివైన శత్రువులు! నిజమే, విద్యాస్పర్ధల్లాంటివి మన శ్రేయస్సుకే ఉపయోగపడుతాయి.

  మీరన్నది నిజమే. ఇతరులు కూడా తమ తమ జీవితానుభవాలను ఇక్కడ సందర్భానికీ, పోస్టుకూ తగ్గట్టుగా పంచుకుంటే ఇంకా ఐలాంటి టపాలకు మరింత శోభ వస్తుంది. ఏమోలెండి, కామెంట్లు రావడమే ఎక్కువా, మళ్ళీ వివరంగా వ్రాయమంటే అసలే బద్దకిస్తారు మనవాళ్ళు.

  ReplyDelete
 9. మీ టప ఆలోచింపచేసేది గా వుంది అండి..నాకు కూడా రోజు పొద్దున్నే లేచి ఆఫీసు కి వెళ్ళాలి రోజు ఒకటే ఇల్లు, ఆఫీసు అంటే నచ్చదు అప్పుడప్పుడు ఒకటి రెండు వారాలు ఇంట్లో వంట చెయ్యను..నా వంట నాకే బోర్ అనిపించి.. ఇంకా మార్పు కోసం బీచ్ కి లేదా హికింగ్ కి వెళ్లి అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ వుంటాను..లేదంటే నాకిష్టమైన సినిమా, నవల లేదా టీవీ షో లు చూస్తూ కాలం గడిపేస్తాను..ఆఫీసు లో వర్క్ రొటీన్ అయినపుడు కొత్త కొత్త వర్క్ నేర్చుకొని చెయ్యడానికి చూస్తాను. ఐన గని ఎక్కడో అక్కడ మల్లి నిరాశ వస్తుంటుంది. ఇంతేనా జీవితం అనిపిస్తూ వుంటుంది.. ఒక్కో సారి ఇలా బ్లాగ్ లు చదువుతుంటే అబ్బ నా లాంటి వాళ్ళు ఇంకా వున్నారు నేనేమి పెద్ద weirdo ని కాదు అని ఒక చిన్న ఆనందం కలుగుతుంది..మనకి ఏది అనుకూలం గ వుంటుందో అది తెలుసుకొని ప్రయత్నిస్తూ పోవడమే జీవితం ఏమో..

  ReplyDelete
 10. Sarath ji u r just awsome. :)

  ReplyDelete
 11. @ వినీల
  మన జీవితాలు చాలా వరకు పాత చింతకాయపచ్చడిల్లాంటివే. అది తప్పించడం అంతగా కుదరదు కనుక అప్పుడు కొత్తకొత్తగా తాలింపు వేస్తూ పోతూ అందులోనే కొంగొత్త రుచులు చూస్తూ వుండాలంతే.

  @ రాఘవ్
  :)

  ReplyDelete
 12. Relating to this post, please check this out
  http://lifehacker.com/5800954/escape-the-rut-of-your-daily-routine-by-trying-something-new-for-30-days

  ReplyDelete