ఆ ప్రేమ ఎందుకు విఫలం అయ్యిందంటే...

అప్పట్లో ఓ రెండు మూడేళ్ళు మా బంధువుల అమ్మాయితో చాలా గాఢంగా ప్రేమలో పడ్డాను. నిజానికి నేను నచ్చి ఆమె నన్ను ప్రేమలో పడేసిందనుకోండి. ఆ నచ్చడానికి వెనుక చచ్చేంత కారణం ఒకటి వుంది. నిజానికి నేనేమీ నచ్చలేదు కానీ నన్ను నచ్చుకుంది. ఎందుకనగా ఆమె పదవతరగతి చదువుతున్నప్పుడు ఆమెను గిల్లేసాను. అది ఆమె తనమీద ఇష్టం అనుకుంది. ఆ గిల్లుడు మనకు క్యాజువల్ అని ఆమెకు తెలియదు. ఓ అయిదేళ్ళ తరువాత ఇహ మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని అడిగింది. పెళ్ళి? మన మధ్య ప్రేమే లేదు - అప్పుడే పెళ్ళి దాకా వచ్చావా అని ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆశ్చర్యపోవడం ఆమె వంతు అయ్యింది. మన మధ్య ప్రేమ లేదా అని నోరు తెరచింది. లేదు కదా అన్నాన్నేను గోళ్ళు గిల్లుకుంటూ. మరి అప్పుడు గిల్లిందీ అని అడిగింది? ఓసోస్ అదీ ఓ ఇసయమేనా, ఎంతో మందిని అలా గిల్లేస్తుంటాం లేవో అన్నాను. ఆమె మ్రాన్పడిపోయింది.

అప్పుడు ఆ అమ్మాయి గారికి దగ్గరగా కూర్చొని అంతా వివరించాను. అప్పుడెప్పుడో అయిదేళ్ళ క్రితం నిన్ను కెలికాను కానీ ఆ తరువాత మళ్లీ నిన్ను ముట్టుకున్నానా? అసలెప్పుడప్పుడయినా నీతో దోమా, ప్రేమా అని డైలాగులేసానా అని ప్రశ్నించాను. లేదు అంది. మరి ప్రేమ అని ఎలా అనుకున్నావ్ అని పళ్ళు నూరాను. నాతో ఎంతో బావుండేవాడివి కదా అంది. నాకు నచ్చిన ఆడాళ్ళందరితో నేను అలాగే వుంటానూ, అలా స్నేహాన్ని ప్రేమ అనుకుంటే పొరపాటు కాదా అని దులిపేసాను. సరే జరిగిందేదో జరిగింది కానీ ఇకపై నన్ను ప్రేమించెయ్ అని ఏకపక్షంగా తీర్మానించింది. నా వల్ల కాదు మొర్రో అన్నా వినకుండా ప్రేమ ముగ్గులోకి దింపింది.

అలా లవ్వులోకి పీకలోతుగా మునిగిపోయాక నన్ను మార్చాలని చూసింది. అలాగే ఓయ్యెస్ నేను మారతా నువ్వూ మారూ మరి నేనూ డిమాండ్లు పెట్టేవాడిని. అతి ప్రేమతో, ఆమె మీది పొజెసివ్నెస్ తో ఆమెను బాగా అవస్థలు పెట్టేవాడిని. నేను నిజంగానే నాలో మార్పు కోసం కృషిచేసి మారిపోయాను. మూడేళ్ళు మారి వుంటే నీలో జీవితాంతం మార్పు వస్తుంది అంది. అయితే ఆమె మాత్రం నాకోసం పెద్దగా మారలేకపోయింది. ఒక ముఖ్యమయిన విషయంలో నేను చెప్పింది ఖాతరు చెయ్యలేదు. దాంతో మాలో మాకు విభేదాలు వచ్చాయి. మాట్లాడుకొని గౌరవంగా విడిపోయాము. ఆమెకు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్ళు మారి వుండి ఆపై మళ్ళీ నా రూటులోకి నేను వచ్చేసాను.  ఇప్పటికీ మామధ్య ఒకరిమీద ఒకరికి గౌరవం వుంది. ఇండియా వెళ్ళినప్పుడు ఆమెని కొద్దిసేపు కలిసి వస్తుంటాను.

అప్పటి నా ప్రేమ అన్నది ఆకర్షణ తప్ప నిజం కాదు. అందుకే అందులో విఫలం అయివుంటాను. నాది నిజమయిన ప్రేమ అయివుంటే నేనింత ప్రేమించాను కాబట్టి నువ్వూ అంతగా ప్రేమించాలి అని డిమాండ్ చేస్తానా? నేను ఇంత మారాను కాబట్టి నువూ ఎంతో మారు అని పోరుతానా? నిజమయిన ప్రేమ కానీ, ఆరాధన కానీ అన్‌కండీషనలుగా వుండాలి. త్యాగాలు వుండాలి కానీ తీర్పులు వుండవద్దు. అలాంటి సోకాల్డ్ ప్రేమల్లో వుండే ఇంకో పొరపాటు ఏమిటంటే విపరీతమయిన ప్రేమ - తద్వారా వచ్చే సున్నితతత్వం - అందువల్ల పొజెసివ్నెస్. ఆమెకు వుండేది కాదు కానీ నాకు విపరీతంగా వుండేది. దాంతో ఆమెను మానసికంగా ఎంతో  అవస్థ పెట్టాను. నన్ను వదిలించుకున్నాక హాయిగా ఊపిరి పీల్చుకొనివుంటుంది - శని వదిలిపోయిందని. ఆ ప్రేమానుభవం నుండి పొరపాట్లు తెలుసుకున్నాను కనుకనే ఆ పై నా ప్రియురాళ్లను ఆరాధించేవాడినంతే.  అప్పటినుండి ఎప్పుడూ ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు.

ఇహపోతే ఆమె  ప్రేమేమీ అచ్చమయింది కాదులెండీ. నిజంగా నేనంటే పిచ్చపిచ్చగా ఇష్టమయి నన్ను ప్రేమిస్తే అది వేరుగా వుండేది. అప్పుడేప్పుడో కెలికాడు కదా, పాతివ్రత్యం నిలబెట్టుకోవాలి అని పట్టుదలవహిస్తే ఫలితాలు ఇలా వుండక ఏం చేస్తాయి? సరే, కష్టమయ్యో, ఇష్టమయ్యో నన్ను కట్టుకుందామని పట్టుదల వహించింది. బాగానే కృషి చేసింది కానీ నేనే ఆమె అభిమానాన్ని నిలుపుకోలేకపోయాను. అయితే ఒక ముఖ్యమయిన, నా సంక్షేమం కోసం బాగా అవసరమయిన విషయంలో ఆమె తగిన విధంగా స్పందించకుండా మొరాయించింది, ప్రాధాన్యత వేరేదానికి ఇచ్చింది కాబట్టి ఆమె మీద నా మనస్సు విరిగింది. ఏదేమయినా గొడవలు లేకుండా ప్రశాంతంగా, చక్కగా విడిపోయాము. అది కూడా ఆమెలో మెచ్చుకోవాల్సిన విషయం.

ఏదేమయినప్పటికీ ఆమెను అప్పుడు ఆరాధించివుంటే, ఆమె నుండి ఎలాంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా వుండి వుంటే, ఆమె చెప్పినట్లే వినివుంటే మా బంధం బలపడివుండేది - మాకు పెళ్ళి అయివుండేది. అప్పుడింత పరిణతి ఎక్కడిది? ఆమె కూడా అదే నా పట్ల చేసివుండవచ్చు కానీ మనకు లేని పరిణతి ఆమె నుండి మాత్రం ఎలా ఆశిస్తాం? సో, మా ప్రేమ విఫలం అవడానికి బాధ్యత నాదే.

ప్రేమకూ ఆరాధనకూ తేడా ఏంటి?

అసలయితే ప్రేమ కూడా ఉత్కృష్టమయినదే అవాలి కానీ మన సినిమాలూ, ఏసిడ్ బుడ్డీలు పట్టుకొని చేసే ప్రేమలూ, ప్రతిఫలం ఆశించే ప్రేమల వల్ల జనాల్లో దాని విలువ తగ్గిపోయింది. అయితే ఆరాధన అన్న పదం అందరూ ఎక్కువగా ఎక్కడపడితే అక్కడ ఉపయోగించరు కాబట్టి దాని ఉదాత్తత అయినా మిగిలే వుంది. ప్రేమలో కూడా వాస్తవానికి ఆరాధన వుంటుంది, వుండాలి కానీ నిజమయిన ఆరాధన అంటే ఏంటో నా అభిప్రాయం చెబుతాను. అది సరి అయినదో కాదో మీరు చెప్పండి.

ఈ కాలంలో ప్రేమకు అర్ధం పరస్పరం ప్రేమించుకునే ప్రేమ అని ఎక్కువమంది భావిస్తున్నారు. అలా కాకుండా, ఎలాంటి ప్రతి ప్రేమనూ, ప్రతిఫలాన్నీ ఆశించని ప్రేమని ఆరాధన అంటాను నేను. అయితే ఆరాధన అంటే అక్కడే ఆగిపోదు. అలా అని గొంగచాటుగా, వన్ సైడ్ లవ్ అని కాదు. రెండు వైపులా ప్రేమ వుండొచ్చు కానీ అది ప్రధానం కాదు. ఎదుటి వ్యక్తిని బాగా ఇష్టపడుతూ, అభిమానిస్తూ, దేవత లాగా భావిస్తూ పోవడమే ఆరాధన నా దృష్టిలో. నేను ఇంత ప్రేమించాను కాబట్టి నువ్వు అంతా ప్రేమించాలి అనే కొలతలు, లెక్కలు వుండవు. ఆర్య సినిమాలో అదే కాన్సెప్ట్ అనుకుంటాను.   అలా ఎదుటివారినుండి ఏమీ ఆశించని ఆరాధనే నాకు ఎక్కువగా నచ్చుతుంది. ప్రేమలో పడ్డామా పంతాలు మొదలవుతాయి.

అయితే ఈ ఆరాధనలో కూడ తేడాలు, వైవిధ్యాలు, స్థాయిలు వుంటాయి. జస్ట్ ఇష్టపడటమే కాకుండా ఇష్టపడ్డ వ్యక్తి యొక్క ఇష్టాలకి తగ్గట్టుగా జీవించడం ఒకటి. అంటే మన జీవితాన్ని వారికి అంకితం చెయ్యడం. మనసా, వాచా, కర్మేణా మనం ఇష్టపడుతున్న వారికి అంకితం అవడం. మన ఇష్టాల కోసం కాకుండా ఆ వ్యక్తి యొక్క ఇష్టప్రకారం, ఆశల ప్రకారం, ఆశయాల ప్రకారం జీవించడం. ఇందులో ఎంతో ఆనందం వస్తుంది. మన కోసం మనం జీవించడంలో కొత్తదనం వుండదు - అది అందరూ చేసేదే. అదే మరొకరి కోసం వారి యొక్క కనుసన్నల్లో, వారి యొక్క మనస్సుతో జీవిస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అయితే అంతగా మన మనస్సుని వారికి అంకితం చెయ్యాలంటే ఎదుటి వారి వ్యక్తిత్వం కూడా వున్నతమయినది అయితేనే కుదురుతుంది. అలా అయితేనే వారిని చాలా ఇష్టపడుతాం కాబట్టి అంతగా మనని మనం సమర్పించుకోగలం. 

అయితే ఇష్టపడ్డ వ్యక్తిని ఆరాధించడం పెద్ద గొప్పేం కాదు. అది అందరికీ ఇష్టమే. అంకితమవడం మాత్రం అందరికీ సాధ్యపడదు కానీ మనకిష్టమయిన వారికే మనం దాసోహం అంటాము కాబట్టి అదీ ఓకే. అయితే కొన్నిసార్లు ఇష్టమే పడని వ్యక్తిని కూడా ఆరాధించడానికి సిద్ధపడుతుంటాం. అది ఆరాధనలో ఉన్నతమయినది. దాన్నే సబ్మిసివ్నెస్ అంటారు. ఈ రకమయిన ఆరాధనలో మీరు ఎదుటివారి ప్రమేయంతోనో లేక మీకై మీరో వారికి దాసోహం అంటారు. ఎదుటివారిలో మీకు చాలా నచ్చకపోవచ్చు. వారి వ్యక్తిత్వం మీరు అసహ్యించుకోవచ్చు.  వారి భావాలూ, అభిప్రాయాలూ మీ వాటితో ఏమాత్రం పొంతన లేకపోవచ్చు. అయినా సరే మీకు ఆ బలమయిన వ్యక్తిత్వానికి సాగిలపడాలని అనిపించవచ్చు. 

అప్పుడు మీకై మీరు ఆ వ్యక్తికి ప్రణమిల్లి మీ వ్యక్తిత్వాన్ని, అహాన్ని సమర్పించేసుకుంటారు. వారి మనస్సును ఆవాహన చేసుకుంటారు. వారికోసం...వారికొసమే మీరు జీవిస్తారు. మీ హృదయాన్ని పక్కనపెట్టేసి వారి హృదయమే మీదిగా చేసుకుంటారు. అప్పుడు వారి ఇష్టాలే మీవి అవుతాయి. వారి కష్టాలే మీవి అవుతాయి. వారి ఆశలే మీ ఆశయాలవుతాయి. ఇంకా వైరుధ్యాలకి చోటెక్కడ? అంతగా సాగిలపడిపోలేని వారు వెనక్కి తగ్గుతారు. మామూలు ఆరాధనకో లేక, సాధారణ ప్రేమకో లేక సగటు ద్వేషాలకో పారిపోతారు. అలా కాకుండా మనస్సుని, హృదయాన్నీ అనుకున్నవారికి అప్పగించేసి నిశ్చింతగా సేదతీరుతున్నవారు  నిర్మలమయిన జీవనం గడుపుతూవుంటారు. ప్రియురాలి లేదా ప్రియుడి సేవలో, సన్నిధిలో తాద్మాత్మ్యం చెందుతూనేవుంటారు.

కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ పనిచేస్తున్నట్లుగానే వుంది

మా ఆవిడకి ఏవేవో కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ఎన్నో ప్రయత్నాలు చేసి ఓ రెండు నెలల క్రింద కైరోప్రాక్టిక్ (వెన్నుపూస నిపుణులు) చికిత్స లో చేర్పించాను. ఇదివరకులా నొప్పి నివారణ ఔషధాలు మింగడం, జాండూబాం లాంటివి పూసుకోవడం ఈమధ్య చెయ్యడం లేదు. నొప్పులు చాలావరకు తగ్గాయి. ఇదివరకు బాధా తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు పది శాతం మాత్రమే ఆ నొప్పులు వున్నాయని చెప్పవచ్చు. ఇంకా ఒక నెల చికిత్స వుంది.

కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఏమయినా క్వాక్ ట్రీట్మెంటో లేక కల్ట్ ట్రీట్మెంటో అని ముందు సందేహించాను. కొన్ని అరుదయిన రిస్కులు వున్నా సిద్ధపడి చేర్పించాను. ఒక నెల తరువాత చూస్తే పెద్దగా ఫలితం కనపడలేదు. ఫలితాలు కనపడటం లేదని ఆ డాక్టరుని వివరంగా సంప్రదించాము. ఇంకా ఫలితాలు కనపడనందుకు అంతను కూడా కాస్త విస్మయం వ్యక్తపరిచాడు. మీ ఆవిడ చాలా సున్నితం బాబూ అందుకే చాలా సున్నితంగా చికిత్స చెయ్యాల్సివస్తోంది - అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నట్టున్నాయి అని వాపోయాడు. మా ఆవిడ సున్నితత్వం గురించి ఇదివరకు కూడా వాపోయాడు లెండి.

అయితే ఈమధ్య కొన్ని వారాలుగా మాత్రం తను తక్కువగా, తక్కువ సందర్భాల్లో నొప్పితో బాధపడటం గమనించాను. మా ఆవిడ కూడా గుణం కనిపిస్తోందని చెప్పింది. చికిత్స మొదట్లో ఎక్స్‌రేలు తీసి తన వెన్నుపూసలో ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయో సవివరంగా చూపించారు. మూడు నెలల కోర్సు అయిపోయాక మళ్ళీ ఎక్స్‌రేలు తీసి అవి ఎంతవరకు సర్దుకున్నాయో చూపిస్తారు.

ఇహపోతే ఈ చికిత్సకు తోడుగా ఆర్థిరైటిస్ కోసం గానూ కొన్ని డైటరీ సప్లిమెంట్స్ వాడుతుండమని మా కుటుంబ వైద్యుడూ, నేనూ పదేపదే చెప్పాము కానీ ఆ చెవిన విని ఈ చెవిన వదిలేసింది. మా అమ్మలుతో కలిసి రోజూ ఆమె ముక్కు మూసి, నోట్లో నీళ్ళు పోసి అందులో మందుగుండు సామాగ్రి (అనగా టాబ్లెట్లు) వేసి మూతిమూస్తే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇవాళ ఇంటికి వెళ్ళాక అమ్మలుతో ఈ కుట్ర గురించి చర్చించాలి. అంత బలవంతంగా ఎందుకులే ఆమె బాధేదో ఆమె పడుతుంది కదా అని ఊరుకోలేమండీ బాబూ. ఈ నొప్పులతో వాళ్ళ మూడు ఖరాబు అయి మన బుర్రల్ని తినేస్తుంటారు.

శిశువు జెండర్ చెప్పని తల్లితండ్రులు! ఆసక్తికరమయిన వార్త

టొరొంటో స్టార్ న్యూస్ వెబ్ సైటులో ఒక ఆసక్తికరమయిన వార్త చూసాను. వారికి పుట్టిన మూడో శిశువు పాపా, బాబా అన్నది వారు లోకానికి తెలియజేయడం లేదు. ఎందుకు అంటే పుట్టడం ఏదో ఒక లింగంతో పుట్టివుండవచ్చు కానీ కాస్త పెరిగి పెద్దయ్యాక తను ఏ సెక్స్ కావాలంటారో ఎవరికి తెలుసు? అందువల్ల ఒక జెండర్ తో పుట్టారు కదా అని అది వారి మీదికి రుద్దకుండా వారు స్వేఛ్ఛగా తమకు నచ్చిన సెక్స్ ను ఎన్నుకునే అవకాశం, వాతావరణం మేము కలగజేస్తున్నాం అని అంటున్నారు.

లోకంలో జరుగుతున్న మార్పులు గుర్తించకుండా, పట్టించుకోకుండా వుండే జనాలకు ఈ వార్త విపరీతంగా అనిపించవచ్చు కానీ వివిధ రకాల జెండర్ సమస్యలను పరిశీలిస్తూ జెండర్ ఐడెంటిటీ కి విలువ ఇచ్చే నాలాంటి వారికి ఈ వార్త ఒకింత విస్మయం కలజేస్తుంది కానీ విపరీతంగా అనిపించదు. మనకు తెలిసిన ఆడ, మగా, కొజ్జా లనే మూడు రకాల లింగాలే కాదండీ. ఇంకా చాలా రకాలు వున్నాయి. జెండర్ గుర్తింపు అన్నది ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. ఆ ఏరియాలో ఎంతో కొంత అభివృద్ధి కనపడుతోంది.

ఆ తల్లితండ్రులకు నా అభినందనలు. ఆ వ్యాసం చాలా పొడుగ్గా వున్నందువల్ల కొంతమేరకే చదివాను. ఆ వ్యాసానికి వ్యాఖ్యలు కూడా చూడండి. కొన్ని చదివాను - ఆసక్తికరంగా వున్నాయి. ఎక్కువ భాగం తిట్లే లెండి. మీరు మాత్రం ఇప్పుడు నన్ను తిట్టరా ఏంటీ :)  ఇహ కానివ్వండి మరి.

http://www.parentcentral.ca/parent/babiespregnancy/babies/article/995112--parents-keep-child-s-gender-secret

లింక్ తెరచుకొవట్లేదు అని కొందరంటున్నారు కాబట్టి ఆ వ్యాసం ప్రధాన భాగం ఇందులోనే ఇస్తున్నాను. నాకయితే ఆ లింక్ పనిచేస్తోంది.

“So it’s a boy, right?” a neighbour calls out as Kathy Witterick walks by, her four month old baby, Storm, strapped to her chest in a carrier.


Each week the woman asks the same question about the baby with the squishy cheeks and feathery blond hair.

Witterick smiles, opens her arms wide, comments on the sunny spring day, and keeps walking.

She’s used to it. The neighbours know Witterick and her husband, David Stocker, are raising a genderless baby. But they don’t pretend to understand it.

While there’s nothing ambiguous about Storm’s genitalia, they aren’t telling anyone whether their third child is a boy or a girl.

The only people who know are Storm’s brothers, Jazz, 5, and Kio, 2, a close family friend and the two midwives who helped deliver the baby in a birthing pool at their Toronto home on New Year’s Day.

“When the baby comes out, even the people who love you the most and know you so intimately, the first question they ask is, ‘Is it a girl or a boy?’” says Witterick, bouncing Storm, dressed in a red-fleece jumper, on her lap at the kitchen table.

“If you really want to get to know someone, you don’t ask what’s between their legs,” says Stocker.

When Storm was born, the couple sent an email to friends and family: “We've decided not to share Storm's sex for now — a tribute to freedom and choice in place of limitation, a stand up to what the world could become in Storm's lifetime (a more progressive place? ...).”

Their announcement was met with stony silence. Then the deluge of criticisms began. Not just about Storm, but about how they were parenting their other two children.

The grandparents were supportive, but resented explaining the gender-free baby to friends and co-workers. They worried the children would be ridiculed. Friends said they were imposing their political and ideological values on a newborn. Most of all, people said they were setting their kids up for a life of bullying in a world that can be cruel to outsiders.

Witterick and Stocker believe they are giving their children the freedom to choose who they want to be, unconstrained by social norms about males and females. Some say their choice is alienating.

In an age where helicopter parents hover nervously over their kids micromanaging their lives, and tiger moms ferociously push their progeny to get into Harvard, Stocker, 39, and Witterick, 38, believe kids can make meaningful decisions for themselves from a very early age.

“What we noticed is that parents make so many choices for their children. It’s obnoxious,” says Stocker.

Jazz and Kio have picked out their own clothes in the boys and girls sections of stores since they were 18 months old. Just this week, Jazz unearthed a pink dress at Value Village, which he loves because it “really poofs out at the bottom. It feels so nice.” The boys decide whether to cut their hair or let it grow.

Like all mothers and fathers, Witterick and Stocker struggle with parenting decisions. The boys are encouraged to challenge how they’re expected to look and act based on their sex.

“We thought that if we delayed sharing that information, in this case hopefully, we might knock off a couple million of those messages by the time that Storm decides Storm would like to share,” says Witterick.

They don’t want to isolate their kids from the world, but, when it’s meaningful, talk about gender.

This past winter, the family took a vacation to Cuba with Witterick’s parents. Since they weren’t fluent in Spanish, they flipped a coin at the airport to decide what to tell people. It landed on heads, so for the next week, everyone who asked was told Storm was a boy. The language changed immediately. “What a big, strong boy,” people said.

The moment a child’s sex is announced, so begins the parade of pink and barrage of blue. Tutus and toy trucks aren’t far behind. The couple says it only intensifies with age.

“In fact, in not telling the gender of my precious baby, I am saying to the world, ‘Please can you just let Storm discover for him/herself what s (he) wants to be?!.” Witterick writes in an email.

యోగాశ్రమానికీ, బుద్ధ బోధనలకీ వెళ్ళొచ్చాను

శనివారం ఉదయమే లేచి ఎనిమిదిన్నర గంటలకు వున్న హఠ యోగా క్లాసుకి అందుకున్నాను. యోగా ఎప్పుడో ఇండియాలో వున్నప్పుడు బహుశా పదిహేనేళ్ళ క్రితం చేసివుంటాను. ఇప్పుడు మళ్ళీ చేస్తుంటే అనిపించింది - ఆధునిక జీవితం వల్ల అవయవాలు వంగడం అన్నది ఎంత కష్టం అయిపోయిందనీ. క్లాసు చక్కగా నచ్చింది. ఎందుకంత బాగా నచ్చింది అన్నది చెబితే ఔచిత్య భంగం అవుతుంది. అందుకని ఆ వివరాలు వద్దులెండి. యోగా తరువాత అరగంట ధ్యానం కూడా జరిగింది. ఆదివారం కూడా యోగా తదితర కార్యక్రమాలతో  ఒక పూట అక్కడే గడిపెయ్యొచ్చు కానీ వెళ్ళలేకపోయాను. పచ్చని పరిసరాలతో ఆ యోగా సెంటర్ బావుంది కానీ హైవేకి కాస్త దగ్గర్లో వున్నందున వాహన రణగొణ ధ్వనులు వినపడుతూనేవున్నాయి. ఆ యోగాశ్రమ నిర్వాహకురాలితో కాస్సేపు మాట్లాడాను. ఆమెతో ఇంకా వివరంగా మాట్లాడాల్సి వుంది. ఆ కేంద్రంలో చాలా ఆరుబయట చాలా జాగా వుంది. నేను పైపైన పరిశీలిస్తే నాకు గార్డెన్ ఏమీ కనిపించలేదు. వారేమయినా తోటని పెంచుతున్నారేమో లేదా తోటను పెంచే వుద్దేశ్యం వుందేమో కనుక్కుంటాను. వారికి తోట కానీ లేదా ఆ వుద్దేశ్యం కానీ వుంటే నేను వారితో కలిసి పని చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తాను. ఆ నిర్వాహకురాలు ఆదే ప్రాంగణలోని మరో భవంతిలో నివసిస్తుంది.

ఆదివారం మధ్యాహ్నం ఒక పూట ఒక చర్చిలో ఒక శ్రీలంక బౌద్ధ భిక్షువు ద్వారా బోధనలు వున్నాయి. అందులో ప్రేమైక ధ్యానం గురించి కూడా చక్కగా చెప్పి శిక్షణ ఇచ్చారు. నాకు సిద్ధార్ధుడు అంటే చిన్నప్పటి నుండీ ఇష్టమే అయినా కూడా ఇలా బోధనలు వినడం ఇదే మొదటి సారి. ఆ నాలుగు గంటల తరగతికి నేను కాకుండా ఇంకా పదిమంది వచ్చారు. అంతా తెల్లోళ్ళే. బోధనల మధ్యలో రెండు విడతలుగా ధ్యాన శిక్షణ ఇచ్చారు. మేము ధ్యానంలో వుండగా ఆ బుద్ధ భాంతే మాకు సూచనలు ఇచ్చారు. అలా మేమంతా సుషుప్తిలో (ట్రాన్స్) వుండగా వారిచ్చిన సూచనలు నాకు హిప్నటిక్ సజెషన్స్ లాగానే అనిపించాయి. అందువల్ల బలీయమయిన ట్రాన్స్ లోకి వెళ్ళగలిగాను.

అయితే ఈ బౌద్ధ సంఘం మొదలెట్టింది 2002 లోనే కావడం వల్ల వారికింకా ఒక ఆలయం అంటూలేదు. అందుకే విశాల మనస్థత్వం కలిగిన యూనిటేరియన్ చర్చిలల్లొ బోధనలు జరుపుతున్నారు. స్థలం కొన్నారట కానీ ఆలయ నిర్మాణం ఇంకా మొదలవలేదు. ప్రధాన బిక్షువు చాలా కష్టాలు పడి ఇక్కడ తమ సంఘాన్ని స్థాపించి సిద్ధార్ధుని బోధనలను, ధ్యానాన్నీ ఇక్కడి వారికి అందివ్వాలని కృషి చేస్తున్నారు.

ఆ భాంతే ( బౌద్ధ భిక్షువులను భాంతే అంటారు) ఒక చక్కని దృష్టాంతరం చెప్పారు. వీరి మెడిటేషన్ క్లాసులు విన్న ఒక స్త్రీ ధ్యానం పాటించి మరునాడు వారికి ఫోన్ చేసింది. మీరు నాకు ధ్యానంలోకి వచ్చి నాతో మాట్లాడారనీ, సూచనలు ఇచ్చారనీ చెప్పిందిట. అబ్బే నేను అలా రాలేదు, మీరు నాకు గుర్తే లేరు అని వీరు చెప్పారట. వీరినుండి అవును అన్న సమాధానం ఆశించిన ఆమె ఎంతగానో నిరాశ పడింది. కాదు, మీరు వచ్చారు, నాతో మాట్లాడారు అందిట. లేదు, నేను నా పనుల్లో నేను వున్నాను, నాకంత మహిమలు లేవు అని వీరు అన్నారుట.  మరి నాకు అనిపించిందేమిటి అని ఆమె అడిగింది. అది భ్రాంతి అని ఆమెకి విశదీకరించారు ఈ భిక్షువు. ఇలా కాస్త నేల మీద నడిచే భావజాలం వుంటుంది కాబట్టే నాకు కాస్త బౌద్ధం నచ్చుతుంది.

ఆ క్లాసు నుండి వచ్చి కారు స్టార్ట్ చేద్దామని నా కారు కీస్ పెడుతూవుంటే అసలే పోలేదు. ఏంటబ్బా అనుకొని చూస్తే మరో కారు కీ ఆ కారులో పెట్టేస్తున్నా. మళ్ళీ ఈ సారి కూడా స్పిరిట్ బాగానే తలకెక్కిందనుకొని తల విదిలించుకున్నాను. వచ్చేవారం ఆదివారం ఉదయం పూటంతా యోగా సెంటరులోనూ మధ్యాహ్నం అంతా మరొక బౌద్ధ క్షేత్రం లోనూ గడపాలని చూస్తున్నాను. ఆ క్షేత్రంలో జెన్ బుద్ధ గురించి బోధిస్తారు. ధ్యానమూ కూడా వుంటుంది. వీలయితే శనివారం సాయంత్రం నిన్న వెళ్ళిన బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళితే అక్కడ బుద్ధుని జన్మ దినోత్సవ వేడుకలు వుంటాయి. ఆ వేడుకలు చూడటానికి కుటుంబంతో సహా వెళ్ళ వెళ్లవచ్చు. మా వాళ్ళూ వస్తారేమో చూస్తాను.

ఇక్కడే వ్యవసాయం చేద్దామని...

నేను ఇండియా వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు అయినా వ్యవసాయం చెయ్యాలని వుందని కొన్నాళ్ళ క్రిందట ఓ టపా వ్రాసాను. ఆ వెళ్ళేదెప్పుడో, ఆ ఎగసాయం చేసేదెప్పుడో అని ఏం ఇక్కడే ఎందుకు చెయ్యకూడదూ అనిపించింది. ఆ అవకాశాల గురించి పరిశీలించాను. మాకు మరీ దగ్గర్లోనూ లేదా అరగంట దూరంలోనూ కూడా కొన్ని వ్యవసాయ క్షేత్రాలు వున్నాయి. వారిని కనుక్కుంటాను. సరదాగా తోటపని లేదా వ్యవసాయం వీకెండ్సులో వారితో కలిసి చెయ్యాలని వుంది అని అడుగుతాను. అలాగే ఫ్లోరిస్టులను, నర్సరీలను కూడా కనుక్కుంటాను.

ముందయితే మా ఇంటికి దగ్గర్లో వున్న క్షేత్రంలో కనుక్కుంటాను. మరి వాళ్ళు నేను అడిగినదానికి ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ కొందరినయినా అడిగి చూస్తాను. ఎవరూ ఒప్పుకోకపోతే మరో విధంగా చూద్దాం. మనకు మనస్సుంటే మార్గం వుండకపోదు.

ఎందుకు వ్యవసాయం అప్పుడప్పుడయినా చెయ్యాలనుకుంటున్నాను? మనం ఎలాగూ మన ఆరోగ్యం కోసం వ్యాయామం చెయ్యక తప్పదు కదా. ఆ చేసేదేదో తోటపనో, వ్యవసాయమో చేస్తే ఇటు ఆరోగ్యమూ అటు ప్రకృతితో మమేకమూ వస్తాయి. స్వచ్చమయిన గాలి, పరిసరాలు ఆ కాస్సేపయినా దొరుకుతాయి. అలాగే అక్కడవున్న ఆలమందలతో మనకు సన్నిహిత్వం ఏర్పడుతుంది. ఎప్పుడూ కృత్రిమ ప్రపంచంలో పడి దొర్లకుండా ఆటవిడుపు లభిస్తుంది. అటు రైతులకూ సహాయకరంగా వుంటుంది. నా పనికి ప్రతిఫలంగా డబ్బులు రాకపోయినా ఓ బుట్టెడు తాజా పళ్ళో, కూరగాయలో నాకు రాకపోవు.

ఇక్కడి వ్యవసాయం, గార్డెనింగ్ మీద అవగాహన వస్తుంది. ముందు ముందు విశ్రాంత రోజుల్లోనో లేక అంతకుముందేనో నేనూ ఓ చిన్న ప్లాట్ తీసుకొని హాబీగా తోటపనో లేక హాబీ అగ్రికల్చరో చెయ్యడానికి ఉత్సాహం వస్తుంది. మా పిల్లలకీ తరచుగా ప్రకృతిని పరిచయం చెయ్యగలవీలుంటుంది. వారికీ ఇష్టమయితే ఎప్పుడయినా నాతో పాటు పని చెయ్యడానికి అవకాశం దొరుకుతుంది. వేగవంతమయిన ఆధునిక జీవితం నుండి ఇలా పలాయనం చెందడానికి, సేదతీరడానికి ఈ విధంగా నాకు వీలవుతుంది.

ఎప్పుడన్నా ఖర్మకాలి కంప్యూటర్ కళాకారుల బ్రతుకు అలాగే నా బ్రతుకూ బజారున పడాల్సి వస్తే ఎంచక్కా కెనడాకి వెళ్ళిపోయి ఏ ఎగ్రికల్చర్ నర్సరీలో లేదా ఫ్లోరిస్ట్ దగ్గరో, అంతక్కాకపోతే ఏ రైతు దగ్గరో పనిచేస్తూ నా కుటుంబాన్ని పోషించగలిగే ఆత్మవిశ్వాసమూ ఏర్పడుతుంది. నాకు శ్రమ అంటే గౌరవం వుంది కాబట్టి ఏ పనికయినా నేను వెనుకాడను. ఇక్కడ రిక్షాలు వుండవు కాబట్టి రిక్షా తొక్కి అయినా నా కుటుంబాన్ని పోషించుకోగలను అన్న డైలాగ్ చెప్పలేను.

వీలయితే ఈ రోజే మా దగ్గరి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళివస్తాను. మీలో ఎవరికయినా ఇలాంటి ఆలోచనలు వుంటే, ప్రయోగాలు చేసివుంటే, లేదా సమాచారం వుంటే నాతో, మాతో కూడా పంచుకోండి. 

ఇలా అయిపోతున్నానేంటీ నేనూ :)

ఈమధ్య కాస్త తాత్విక చింతన పెరిగింది నాలో. ఎందుకంటారూ? ఆధ్యాత్మిక చింతన అనుకునేరు. కాదు. సాత్విక మరియు మితాహారం తీసుకుంటున్నందువల్లనో, డైటరీ సప్లిమెంట్స్ వల్లనో, కొన్ని సమస్యల నుండి పలాయనమో, పెరుగుతున్న వయస్సో లేక ఎందువల్లనో చెప్పలేను కానీ ధ్యానం వగైరా విషయాల మీద ఆసకి పెరిగింది. ఇదివరకూ లేదని కాదు, ఆ ప్రయత్నాలు చెయ్యలేదని కాదు గానీ ఇప్పుడు ఇంకా ఆ ఆసక్తి విజృంభించింది. అలా అని అంతా దాని మీదే పడతానని కాదు. బ్యాలన్స్ చేసుకుంటాను. పరిపూర్ణాహారం లాగా మన ఆసక్తులూ పరిపూర్ణంగా వుంటూ సమతుల్యత పాటించాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి నిండుతనం వస్తుంది.

బిడిఎసెం లాంటి వాటిల్లోకి ఉచితంగా జొరబడి ఆ మందిరాలు దర్శిద్దామంటే వున్న పరిమితుల వల్ల మీటప్పులకి మాత్రం అప్పుడప్పుడు వెళ్ళగలుగుతున్నాను కానీ అసలయిన వాటికి వెళ్ళడం ఇంకా కుదర్లేదు. కొన్నేమో ప్రతి నెలా మొదటి శుక్రవారమే అనుమతిస్తాయి. మరి కొన్ని రెండో శనివారమే అనుమతిస్తాయి. సరిగ్గా ఆ సమయానికి ఏ కుంటుంబ బాధ్యతలో అడ్దువస్తాయి. ఈలోగా ఈ విషయాలు ముందుపడుతున్నాయి అంతేకాని ఆ ఆసక్తులు తగ్గాయని కాదు. అవి అవే, ఇవి ఇవే. దేనిదారి దానిదే.

నాకు నా చిన్నప్పటి నుండీ బుద్ధుడు అన్నా, బుద్ధుని బోధనలన్నా ఇష్టమే కాని మరీ ఎక్కువ పట్టించుకోలేదు. అతని యొక్క అనుచరగణం ఆ మానవుడిని కాస్తా మహనీయుడిని మాత్రమే చేసి ఊరుకోకుండా మహిమాన్వితుడిని చేసారు. అక్కడ చిర్రెత్తుకొస్తుంది. అందుకని కూడా అటెళ్ళలేదు. ఇప్పుడు అలాంటి విషయాలను మినహాయించి, మన్నించి ఆ బోధనలను పరిశీలించాలనుకుంటున్నాను. అందుకే మా చుట్టుపక్కల బౌద్ధ మందిరాలు, బౌద్ధ గణాలు ఏమున్నాయో తెలుసుకున్నాను. శ్రీలంక మరియు జపాన్ సంతతి వారి బౌద్ధ మందిరాలు వున్నాయి. జెన్ బౌద్ధం కూడా ఇక్కడ వుంది. నాకు ఆ తేడాలు ఇంకా తెలియవు  కానీ తెలుసుకుంటాను. వారి కార్యక్రమాల్లో పాల్గొని, వారి బోధలు వినీ, వారి ధ్యానం చేసీ చూస్తాను. డెట్రాయిటుకి దగ్గర్లోని సౌత్ ఫీల్డులో కూడా ఒక పెద్ద బౌద్ధ ఆశ్రమం వుంది. మాకు దగ్గర్లో మాత్రం చిన్న చిన్న మందిరాలూ, సెంటర్లూ వున్నాయి. మరి ఇంకా నాకు తెలియనివి పెద్దవి ఏమన్నా వున్నాయేమో చూడాలి. ఒక కేంద్రంలో తాయ్చీ కూడా నేర్పిస్తారు. ఇదివరలో ఒకసారి కొద్దిగా నేర్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడూ నేర్చుకుంటాను.

ఇక మాకు ఒక అరగంట దూరంలో ఓ చక్కటి యోగాశ్రమం వుంది. చూడటానికి, వివరాలయితే చక్కగా వుంది. అక్కడికి వెళ్ళాక కూడా అలాగే వుంటుందని ఆశిస్తాను. ఆ ఆశ్రమం ఎలా వుంటుందో వారి మాటల్లోనే చూడండి. పై ఫోటో కూడా ఆ యోగా కేంద్రానిదే. నాకు యోగా అంటే ఇష్టమే. ఇండియాలో వున్నప్పుడు కొన్ని సార్లు వెళ్ళాను. అయితే దాన్ని కొనసాగించలేకపోయాను. ఇందులో యోగాతో పాటు ధ్యానం కూడా వుంటుంది.  నాకు జ్ఞానయోగా నేర్చుకోవాలని వుంది.  ఈ ఆదివారం ఒక పూట ఈ ధ్యాన మందిరంలో మరొక పూట జెన్ బుద్ధ కేంద్రంలో గడపాలని ఆలోచన.

The Ashram is situated on a serene property surrounded by six acres of rolling hills and majestic trees. This quiet setting filled with fresh air provides the ideal atmosphere to learn and practice yoga.

బరువు తగ్గించకుండానే బొజ్జ తగ్గించడం ఎలా?

ఎలా...? నాకు తెలిసింది తక్కువ - మిమ్మల్ని అడగాల్సిందే ఎక్కువ. అందుకే మీకు తెలిసిన విషయాలుంటే చెప్పండిక. నా బరువు 52 కేజీల ప్రాంతంలో తిరగాడుతోంది. ఈ వారంతానికల్లా 50 కి దిగొచ్చు. అంతకంటే బరువు దిగడం నా ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇక బరువు తగ్గించకుండా మిగతా పొట్టను తగ్గించే కృషిలో వున్నాను. నా నడుము/బొజ్జ/పొట్ట సైజు 32 అంగుళాలు వుంది. ఆటగాడి శరీరం కావాలంటే దాన్ని 28 కి తగ్గించక తప్పదు.

మనం కనుక బరువు ఎక్కువగా వుంటే పొట్ట తగ్గించడానికి ముందు చెయ్యాల్సింది బరువు తగ్గడం అనుకుంటాను. అది సరే. బరువు తగ్గినా సరే ఇంకా పొట్ట తగ్గాల్సినప్పుడే వస్తుంది సవాలు. పెద్దగా శరీరక శ్రమ చెయ్యని కంప్యూటర్ కళాకారులు లాంటివారు , టివిలు, వీడియోలు చూస్తూ శ్రమించే గృహిణులూ లాంటివారు ఎక్కువగా ఈ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వేరే అవయవాలని పెద్దగా పని చేయించేది లేదు కాబట్టి కాలరీలు సరాసరి బొజ్జలోకి వెళ్ళి బజ్జుంటాయి.

అయితే ఈ విషయానికి పరిష్కారం పొట్ట వ్యాయామాలు అంటూ బెల్లీ ఫ్యాటుని కరిగించే ప్రయత్నాలు చేస్తూ అపసోపాలు పడుతుంటారు కానీ నా అవగాహన ప్రకారం ఆ ప్రయత్నాలు వ్యర్ధం. మనం చెయ్యాల్సింది మిగతా అవయవాలకు శ్రమ కలిగించడం. అలాంటప్పుడు కాలరీలు అన్నీ అక్కడ ఖర్చు అయిపోతాయి కాబట్టి నడుము దగ్గర కొవ్వు పేరుకుపోవడం తక్కువవుతుంది. నా అభిప్రాయం కరెక్టేనా?

అందుకే నేను నిన్నటినుండి వెయిట్ లిఫ్టింగ్ మొదలెట్టాను. అంటే మీరు మరీ ఊహించేసుకోకండి. డంబెల్స్ ఎత్తడం మొదలెట్టాను. ఎంత బరువువి అని కూడా అడగమాకండి. సిగ్గుపోతుంది. మా అమ్మలు అయితే ఆ డంబెల్స్ ను తన చిటికెనవేలుతో ఎత్తగలనని చెప్పేసింది. సర్లెండి. ప్రారంభం కదా. ఎలాగోలా కానిచ్చేద్దాం.   ఓ గంట సేపు అవి చేసాను. హిందీ సినిమా తీస్మార్ఖాన్ చూసుకుంటూ నడిపించేసాను. అన్నట్లు ఆ సినిమాలోని మై నేం ఈజ్ షీలా అన్న పాట మా అందరికీ సూపరుగా నచ్చేసిందండోయ్.

అంచేత నా అవగాహన ప్రకారం బరువు తగ్గకుండానే బొజ్జ తగ్గాలంటే పొట్ట వ్యాయామాలు మానివేసి మిగతా అవయవాలలో కండ పెంచడం మొదలెట్టాలి. ఒక ప్రత్యేక ప్రదేశంలో కొవ్వు కరిగించడం అన్నది అపోహ అని నా ఫిజికర్ ట్రైనర్ ఒకరు అప్పట్లో చెప్పారు. మనం మజిల్ పెంచడం మొదలెట్టినప్పుడు శరీరం అంతా కూడా కొవ్వు తగ్గుతుంది. అలాగే పొట్టలో పేరుకుపోయిన కొవ్వు సంపద కూడా కరిగిపోతుంది.

సో, ఇక నా బొజ్జ ఎప్పటికప్పుడు ఎన్ని అంగుళాలు తగ్గుతోందో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనేవుంటాను. ఆసక్తి వున్న వారు, నాలాగే బెల్లీ తగ్గించాలనుకునేవారు, ఆథ్లెటిక్ బాడీ పెంచాలనుకునేవారు ఒక వైపు నాలా కృషి చేస్తూ మరో వైపు నా తాజా సమాచారాల కోసం చూస్తుండండి.

ఇండియాలో ఓ చక్కటి ఆశ్రమాన్ని సూచిద్దురూ

అంటే నేను నా భోగలాలసనలన్నీ గిరవాటేసి సన్నాసుల్లో కలుస్తున్నానని సంబర పడకండి. అదేమీలేదు కాదు కానీ అది అదే ఇది ఇదే. మళ్లీ ఇండియాకి వచ్చినప్పుడు కొద్దిరోజులు నా శైలిలో ఆనందించినా కొద్దిరోజులు ప్రశాంతంగా, ప్రకృతికి దగ్గరగా జీవించాలని వుంది. ఈ కోరిక చాన్నాళ్ళ నుండి వుంది కానీ ఎప్పుడూ కుదరలేదు. అందుకే ఈ సారి పక్కాగా ప్రణాళిక వెయ్యాలి. మళ్ళీ భారత్ ఎప్పుడు వస్తానో తెలియదు కానీ సమాచారం అయితే సేకరించిపెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.

ఇండియాలో మఠాలకూ, ఆశ్రమాలకూ కొదవేమీలేదని తెలుసు. నాకు కావాల్సింది కాస్త మంచి ఆశ్రమం. దొంగ బాబాలు, స్వాముల మఠాలు కాదు. నిజాయితీగా, నిష్కల్మషంగా బోధించే లేదా చర్చించే గురువు గారు కావాలి. వారికి ఎంత మంచి వ్యక్తిత్వం వుంటే అంత మంచిది. వారు ప్రసిద్ధులే అయివుండాలని ఏమీ లేదు. వారి ఆశ్రమమ ప్రకృతికి దగ్గర్లో, పర్వత సానువుల్లో, నాగరికతకు దూరంలో, ప్రశాంతంగా ఎంత వుంటే అంత మంచిది. వారి ఆశ్రమంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసినా సరే ఇతరుల అభిప్రాయాలకు అభ్యంతరం లేని విధంగా వుంటే బావుంటుంది. నేనేమీ వాదనలు పెట్టుకోను కానీ నా మానాన నేను వుండగలిగేలా వుంటే సౌకర్యంగా వుంటుంది. 

నాకు ఆధ్యాత్మిక చర్చలంటే బోధనలంటే అయిష్టం కానీ తాత్విక చింతనలంటె ఇష్టమే. అందువల్ల నేను కొద్ది రోజులు గడపబోయే ఆశ్రమంలో లేదా తాత్విక/ఆధ్యాత్మిక సంస్థలో ఆధ్యాత్మికం తక్కువా, తాత్వికం, వ్యక్తిత్వం ఎక్కువా వుంటే బావుంటుంది. నా గొంతెమ్మ కోరికలు అన్నీ తీరడం కష్టం కాబట్టి  కొన్ని విషయాలు బావున్నప్పుడు మరి కొన్ని విషయాల్లో రాజీ పడటానికి నేను సిద్ధం.

ఇప్పుడు చెప్పండి. నాకు తగ్గ గురువు గారు కానీ, ఆశ్రమం కానీ, సంస్థ కానీ ఇండియాలో ఎక్కడున్నాయి? వారి యొక్క లేదా వాటి యొక్క వివరాలు ఏంటీ? అన్నట్లు యు ఎస్, కెనడాల్లో కూడా ఇలాంటివి ఏమయినా వుంటే కూడా సూచించండి.

అప్పుడప్పుడు గుర్తుకువస్తుంది ఈ కథ. ఎందుకంటే...

చాలా ఏళ్ళ క్రితం విపులలో ఒక కథ చదివాను. అది నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. అందులో ఒక జంట ఒక ఊరికని కారులో బయల్దేరుతుంటారు. భార్య మీద అతనికి బహు శ్రద్ధ, అనురాగం, ఆప్యాయతానూ. ప్రతి చిన్న విషయంలోనూ భార్య పట్ల శ్రద్ధ వహిస్తుంటాడు. జాగ్రత్తలు చెబుతుంటాడు. ఆమె కారు కిటికీ తెరచిందనుకోండి. నీకు చల్లగాలికి జలుబు చేస్తుందేమో ప్రియా, కిటికీ ముయ్యకూడదూ అని సున్నితంగా చెబుతాడు. ఆమె సీట్లో పడుకోవాలనుకుంటే చిన్న దిండు ఇచ్చి సౌకర్యంగా అమర్చుకొమ్మంటాడు. ఏమయినా తింటావా, తాగుతావా అని అప్పుడప్పుడు కనుక్కుంటాడు. నాకు కథ పూర్తిగా గుర్తుకులేదు. అందువల్ల నేను ఉదహరించినవి అందులో లేకపోవచ్చు కానీ అలా అలా ఆమె పట్ల అతడు అమిత శ్రద్ధ తీసుకుంటూవుంటాడు. ఆమె కూడా చిరునవ్వుతో అతనికి జవాబు ఇస్తూవుంటుంది.

ప్రయాణంలో మధ్యలో ఒక దగ్గర కారు ఆపి అక్కడి దృశ్యం ఒకటి చూద్దాం పద అని కారు దిగి వెళుతుంటాడు. అతని వెనకాలే ఈమె  అనుసరిస్తుంది. రా, ఇక్కడ నుండి చూస్తే దృశ్యం బావుంటుంది అని దగ్గిరికి ఆదరంగా పిలుస్తాడు. ఆమె విసుగ్గా తలతిప్పి నిలుచున్న చోటు నుండి కదలదు. అతను చూపే అమితమయినమయిన శ్రద్ధ ఆమెను అసహనానికి గురిచేస్తూవుంటుంది. అతనంతగా తనని ప్రేమించకపోతే బావుండుననుకుంటుంది. చిరాగ్గా వెనుతిరిగి విసవిసా కారులోకి వెళుతుంది. అతను గాభరాగా ఏమయింది ప్రియా అని కారు దగ్గరికి పరుగుపరుగున  వెళతాడు. సరిగ్గా ఇలాగే కథ లేదేమో కానీ ఇలాంటిదే.

కట్ చేస్తే మా ఆవిడ కారు నడుపుతూ వుంటుంది. నేను పక్కన కూర్చొని బోలెడన్ని సలహాలూ, సూచనలూ ఇస్తుంటాను. నేనెలాగూ వద్దన్నా నా అనుభవసారం అంతా ధారపోస్తుంటాను కాబట్టి ఆమె (మనస్సులో) విసుక్కుంటూ  ఈ చివిన విని ఆ చెవిన వదిలేస్తుంది. ఆ విషయం అర్ధమయ్యి ఈ మధ్య కాస్త మూసుకుంటున్నాను. కాకపోతే ఆ కథలో పెళ్ళాం మీద అమితమయిన ప్రేమ - నా కథలో కారు మీద అమితమయిన ప్రేమ!

ఆ కథ సంగతి కాస్సేపు పక్కన బెడితే మా ఆవిడ వాహన చోదకత్వ ప్రతిభాపాటవాలు చూస్తుంటే నాకు డర్రుగానే వుంది. ఇలా కూడా జనాలు డ్రైవింగ్ చేస్తుంటారా అని ముక్కున వేలేసుకుంటూవుంటాను. ఆమె కారు నడప బట్టి ఇంతకాలం అయినా ఏ విపరీతాలు ఇంకా ఏమీ జరగలేదేంటా అని నాలోన నేను తెగ హాశ్చర్యపడిపోతుంటాను. ఏదో  ఒకరోజు నా కారుకో, ఇంకెవరికో బాగానే వుంది లెండి.

అదీ పక్కన పెడితే ఇదివరకు ఒక కింగులా కారు నడిపేవాడిని. కొంతకాలం క్రింది దాకా మా ఇంట్లో మనకు తప్ప ఎవరికీ డ్రైవింగ్ రాదు కాబట్టి మనదే రాజ్యం లా వుండేది. ఇప్పుడు నా డ్రైవింగును విమర్శించడానికీ, సలహాలు, సూచనలు ఇవ్వాడానికీ మా ఇంట్లో రెండు ప్రతిపక్షాలు తయారయ్యేయి. ప్రధాన ప్రతిపక్షమే ప్రధాన సమస్య. ఏం చేస్తాం. అన్ని రోజులూ మనవి కావు కదా. అనువు కానప్పుడు అధికులమనరాదు కదా.

వచ్చే నెల ఇల్లు మారుతున్నాం

మా రెంటల్ కమ్యూనిటీ వాడు నెలకి ఓ వంద డాలర్లు కిరాయి పెంచుతా అన్నాడు. మూడున్నర ఏళ్ళనుండి వుంటున్నాం కాస్త తగ్గించరా బాబూ అంటే ససేమిరా వినలేదు. వళ్ళుమండి వేరే ఇల్లు చూసుకున్నాం. వెళ్లిపోతున్నామని చెప్పాక ఇప్పుడు రెంటు తగ్గిస్తాం వుండమంటాడు మా వాడు. కుదర్దు అని చెప్పేసా. ప్రస్థుతం మా నెల కిరాయి $1200. $1300 కి పెంచుతా అని ముందు అన్నాడు. ఇప్పుడేమో $1250 కే వుండమంటాడు. కొత్త కిరాయి ఇల్లు మాకు $1200 కే దొరికింది. పైగా అది కాస్త పెద్ద ఇల్లు. ఇప్పుడు మేము వుంటున్న ఇల్లు 1000 చదరపు అడుగులు కాగా కొత్తది 1200 అడుగులు. పైగా గరాజ్ కూడా వుంది. అందులో మా కొత్త కారే కాకుండా ఎన్నో సామాన్లూ పెట్టుకోవచ్చు.

కొత్త ఇల్లు చూసుకోవాలంటే కొన్ని చిక్కులు వున్నాయి. మా పెద్దమ్మాయి మళ్లీ తన పాఠశాలే కావాలంటుంది. చిన్నదీ అంతే. మంచి స్కూల్స్  కాబట్టి మా ప్రాంతంలో కిరాయిలు ఎక్కువ. మా ఆవిడకి ప్రకృతి సౌందర్యాల్లాంటి తొక్కలేం అవసరం లేదు కాని ఇంకాస్త పెద్ద ఇల్లు కావాలంటుంది. మనకేమో కాస్త ఇంటిముందు లేక్ వ్యూలూ వుండాలంటాను. అందరి కోరికలు తీరాలంటే చాలా డబ్బులుండాలి. అంత దృశ్యం  మనకు లేదు కాబట్టి చివరికి రాజీ పడింది ఎవరో మీరు ఈపాటికి గ్రహించేవుంటారు. ఇంకెవరూ - త్యాగరాజుని నేనే. సరస్సు దృశ్యం త్యాగం చేసాను. మేము కొత్తగా వెళ్ళే కమ్యూనిటీ కూడా చూడచక్కగానే వుంటుంది కాని ఇంటిముందు సరస్సులు వుండవు.

పైగా ఈ ప్లేసులో పార్టీ హవుజ్ కూడా వుంది. మా పెద్దమ్మాయి స్వీట్ సిక్స్‌టీన్ పార్టీ అందులోనే చేస్తుండొచ్చు. మరీ పెద్ద వేడుక చెయ్యాలని అనుకోవడం లేదు కానీ పెద్దగా చేస్తే మాత్రం నాకు బాగా తెలిసిన బ్లాగ్మిత్రులని నేను ఆహ్వానిస్తుండొచ్చు. ఆ వేడుక ఆగస్టులో వుంటుంది. 

అసలు స్వంతంగా ఇల్లే కొందామని ఆలోచించి చించి విరమించుకున్నాం. మా ప్రాంతంలో ఇళ్ళ ధరలు బాగా తగ్గుతున్నాయి. గత ఏడాదికీ, ఈ ఏడాదికీ 7 శాతం తగ్గాయి. ఇంకా రెండు మూడేళ్ళయినా ధరలు ఇలాగే తగ్గుతూ వుంటాయని అంచనా. పైగా ఈ ప్రాంతంలో మేము రెండేళ్ళకంటే ఎక్కువ వుండకపోవచ్చు. మా పెద్దమ్మాయికి ఎక్కడ కాలేజీ సీటు వస్తే అక్కడికి దగ్గరలో ఉద్యోగం చూసుకోవాలి. ఈ దేశాలకి వచ్చిన దగ్గరినుండీ కోల్డ్ బెల్ట్ లోనే వుంటున్నాం కాబట్టి కాస్తయినా దక్షిణానికి తద్వారా వెచ్చదనానికి చేరువగా వెళ్ళాలని మా అభిమతం.

కారుకు బదులుగా పుషప్ స్కూటర్ రైలు స్టేషనుకి వెళ్ళడానికి ఉపయొగిస్తా అని చెప్పాగా. అది తెచ్చి వాపస్ ఇచ్చి ఎలెక్ట్రిక్ స్కూటర్ తెచ్చుకుని పరీక్షిస్తున్నాను. బాగానే వుంది కానీ అదీ వాపస్ ఇచ్చెయ్యాలి. ఎందుకంటే కొత్త ఇంటికి కొద్ది రోజుల్లో వెళతాము కాబట్టి అది ఇక అక్కరలేదు. ఒక మైలు కన్నా కాస్త ఎక్కువ దూరం వుంటుంది. ఓ 25 నిమిషాల నడక. ఎంచక్కా లాగించెయ్యొచ్చు. పెట్రోలూ ఆదా, పార్కింగూ ఆదా. పైగా చక్కని వ్యాయామం కూడానూ. ప్రకృతినీ, ప్రజలనీ పరిశీలిస్తూ పరవశిస్తూ నడిచెయ్యొచ్చు. ఇప్పుడు వుంటున్న ఇల్లేమో రెండు మైళ్ళ దూరం వుంటుంది. నడిస్తే నలభై అయిదు నిమిషాలవుతోంది. మరీ అంతసేపు ఉదయమూ, సాయంత్రమూ నడవలేక మానేసాను.

నిన్న కొద్దిగా స్పిరిట్ పారాయణం చేసా

మా దగ్గర మీటప్పు గ్రూపులు ఏమున్నాయా అని వెతుకుతుండగా మా ఎదుటి కామ్యూనిటీలోనే కాస్త స్పిరిట్ ధారపోసే గురువు గారున్నట్లు అర్ధమయ్యింది. వార్నీ అనుకొని ఆ విశేషాలు చూసాను. స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ కాదులెండి. స్పిరుచువాలిటీ. దానికీ మనకూ ప్రస్థుతం ఆమెడ దూరం కదా. మరి? వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటారు. అందులో వాళ్ళు ఆధ్యాత్మికతను పొందుతారు. నేనేమో సెల్ఫ్ హిప్నటిజం చేసుకుంటూ ప్రశాంతతను పొందుతాను. సెల్ఫ్ హిప్నటిజం చేసుకునే గ్రూపులు దొరకవు కాబట్టి ఇలా మెడిటేషను గ్రూపుల్లో చేరి నా పని నేను కానిచ్చేద్దామని. ఒక్కడ్నే చేసుకోవాలంటే ఉత్సాహం రావడం లేదు.

నాకు చాలా ఏళ్ళ నుండి ధ్యానం లేదా సెల్ఫ్ హిప్నటిజం యొక్క విలువ తెలుసు కానీ ఎప్పుడూ అది సక్రమంగా పాటించడానికి కుదర్లేదు. అది చేసినప్పుడు నా మనస్సు చాలా బావుంటుంది. ప్రశాంతంగా, పాజిటివ్గా వుంటుంది. నా డిగ్రీ అయిన తరువాత కొన్ని సెమినార్లల్లో పాల్గొన్నాను. అక్కడి ఉపన్యాసకులు  మూడు నాలుగు సందర్భాల్లో ధ్యానం గురించి చెప్పారు. దేవుడిని నమ్మకపోతే మీకు నచ్చిన వ్యక్తిని మనస్సులో నిలుపుకొని అయినా ధ్యానం చెయ్యమన్నారు. ఆ మాట బాగా నచ్చింది మరియు నాలో బాగా నాటుకుంది.

అందుకే నేను ధ్యానం/హిప్నటిజం చేస్తున్నప్పుడు నాకు నచ్చిన వారిని మనస్సులో నిలుపుకొంటుంటాను. మనకు వున్నది ఒక్క దేవతా? వాళ్లు వాళ్ళు నా మనస్సులో కొట్లాడుకొని, కాట్లాడుకొని ఎవరో ఒకరు నిలుస్తారు. నిన్న కూడా నా మనస్సుని అలా వదిలేసా. ఈసారి నా మదిలొ అంతర్యుద్ధాలు ఏమీ జరుగలేదు. నెమ్మదిగా నా ఇష్టసఖి ఒకరు నా మనస్సులో నిలిచింది. నా పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. ఆ తరువాత ఆమె నాకు ఎన్నో ఆదేశాలూ, ఉపదేశాలూ ఇచ్చింది. అవన్నీ వినమ్రతతో స్వీకరించాను. నా లక్ష్యం గురించి ఉద్భోధించి దానిమీద మనస్సు నిలుపుతూ మిగతావన్నీ నాటకంలోని పాత్రవలె చిరునవ్వుతో, డిటాచ్మెంటుతో నడిపించెయ్యమంది.

నిన్నటి సమావేశానికి ఆరుగురు వచ్చారు. ఒకరు చైనీస్ కాగా మిగతావారందరూ తెల్లోళ్లు. చైనీస్ యువతి పేరు వీనస్. మా నిర్వాహకునికి బుద్ధుని బోధలంటే చాలా ఇష్టం. అలా అని బుద్ధిస్ట్ కాదు. స్పిరుచువాలిటీ కి సంబంధించి ఎన్నో పుస్తకలౌ చదివారు. ఎంతో జ్ఞానం వున్నట్లుగా అనిపించింది. మంద్ర స్వరంతో మాతో ముచ్చట్లు పెట్టారు.  మన భారతీయ రచయితల పుస్తకాలు కూడా బాగా చదివారు. వివేక్ చోప్రా వాక్యాలు కొన్ని ఉటకంకించారు. వారి ముచ్చట్లలో దేవుడికి సంభించిన విషయాలు మాత్రం తీసివేసి తత్వశాస్త్ర విషయాలు మాత్రం నేను ఏరుకున్నాను. నేనో నాస్తికుడిననీ ముందే వారికి చెప్పుకున్నాను. బుద్ధ బోధనల పట్ల ఆసక్తి వుందనీ తెలియపరిచాను. 

పరిచయాలు, కొంత చర్చ అయ్యాక అరగంట ధ్యానం చేసాము. ఆ తరువాత మరొక గంటన్నర తత్వ శాస్త్ర విషయాల గురించి చర్చ జరిగింది. నాకున్న సందేహాలలో కొన్నింటిని నివృత్తి చేసుకున్నాను. వీనస్ కూడా చురుకుగా చర్చలో పాల్గొన్నది. వీరితో పాటు వారం వారం ఆదివారం సాయంత్రం ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను. వీలయితే తెల్లవారు ఝామునే రోజూ ధ్యానం చెయ్యాలి. దానికోసం ముందు పక్కమీదినుండి లేవాలి కదా. రోజూ ఆలస్యంగా లేచి ఆఫీసుకి ఆదరాబాదరాయణమే సరిపాయే. చెయ్యాలి, చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి.  

ఆ సమావేశం ముగించుకొని రాత్రి తొమ్మిదిగంటలకు నా కారు లోకి వచ్చి స్టార్ట్ చేసి హెడ్‌లైట్స్ వెయ్యబోతే దానికి స్విచ్చు ఎక్కడవుందో మరిచేపోయాను. వెతికితే దొరకలేదు. పాత కారు కాబట్టి ఆటో లైట్స్ లేవు. హు, బాగానే వుంది, స్పిరిట్ బాగానే తలకెక్కింది అనుకొని తల కొన్ని సార్లు విదిలిస్తేగానీ స్విచ్చెక్కడుందో గుర్తుకువచ్చి ఛావలేదు. 

మా మీటప్ గురించి మా నిర్వాహకుని సమీక్ష చూడండి: 
A genuine honor to sit and practice with everyone last night. Thanks to Patty & Sarath for adding their energy to the mix, I hope you both enjoyed the experience. It's always nice to tap into the collective awareness & I appreciate everyone's willingness to share their insights during our post meditation discussion. We grow together when we are able to be open in this way. Namaste y'all

ఆటగాడి శరీరం అంటే?

కొంతమంది సన్నగా వుంటారు. పొట్ట ఏమీ వుండదు కానీ కండ కూడా వుండదు. ఫర్వాలేదు. బొజ్జలేకుండా సన్నగా వుంటే ఆరొగ్యానికి మంచిదే కదా. కొందరు బొద్దుగా వుంటారు. అలా అని వారికి కూడా అంతగా పొట్ట వుండకపోవచ్చు. అవర్ గ్లాసు ఆకారం కాకపోయినా ఫ్లాటుగా అలా వుంటారు. కొంతలో కొంత అదీ ఫర్వాలేదు. బొజ్జ గణపయ్య కానంతవరకూ సన్నగా వున్నా, లావుగా వున్నా ఫర్వాలేదు. అయితే ఆయా శరీరాలకు తగ్గట్టుగా తక్కువలో తక్కువ నడుమూ, ఎక్కువలో ఎక్కువ బరువూ వుంటే అలాంటి శరీరాన్ని ఆటగాడి శరీరం అనొచ్చని నాకు కలిగిన అవగాహన.

ఆథ్లెటిక్ బాడీ గురించి నాకు కొద్దిగా అవగాహనా, ఎక్కువగా కోరికా మినహా నాకూ ఎక్కువగా తెలియదండోయ్. దాని గురించి తెలుసుకునే క్రమంలోనే ఈ టపాలు వ్రాస్తున్నాను. మీకు తెలిసిన విశేషాలు నాతో పంచుకుంటారని ఆశ. నెట్టులో చూస్తే చేతుల కండరాలు ఎంత సైజులో వుండాలి, కాళ్ళ కండరాలు ఎంత పరిమాణంలో వుండాలి గట్రా, గట్రా వివరాలున్నాయి లెండి. మనం మరీ అంత పికీగా పనులు చేపట్టనవసరం లేదు కానీ చక్కని శరీరం మనది కావాలంటే స్థూలంగా ఏం అవసరమో చూద్దాం.

నా శరీరాన్నే కనుక ఉదాహరణకు తీసుకుంటే కనుక ఆథ్లెటిక్ బాడీ కోసం నా నడుము కొలత 28 ఇంచులు వుండాలి. బరువు 58 కిలోలు వుండాలి. నా ఎత్తు 5'3'' కు నా బరువు 58 కిలోల లోపుగా వుంటేనే మంచిది. అంటే అర్ధం నేను ఆటగాడి శరీరం సాధించాలంటే నేను వుండాల్సిన మ్యాగ్జిమం బరువుకి వెళ్ళాలన్నమాట. బరువు పెంచడం ఏముంది - చాలా సులభం. కానీ ఆ బరువు పొట్టలో మాత్రం కాకుండా మిగతా శరీరం అంతా పెంచాలి.  అదే నాముందు వున్న సవాలు. నా నడుముని నా శరీరానికి తగ్గట్లుగా కనీసానికి తగ్గించాలి. అంటే నా నడుము కొలత 28 ఇంచులుగా నిర్వహిస్తూ నా బరువు 58 కి పెంచాలి. అప్పుడు నాది గంట గ్లాసు ఆకారం అవుతుంది. అలాంటి అవర్ గ్లాసు ఆకారం  మెయింటేన్ చేసేవారు చాలా తక్కువ మంది వుంటారు. ఆ తక్కువ మందిలో నేనూ ఒకడిని కావాలనే నా ఆరాటం. మనకు మంచి ఆరాటాలు లేకపోతే, పెట్టుకోకపోతే చెడు ఆరాటాలు మన మనస్సుని ఆక్రమించేస్తాయి.

ఆథ్లెటిక్ బాడీ సంపాదించాలన్న నా లక్ష్యానికి ఉపలక్ష్యం నా నడుము కొలత తగ్గించడం. అందుకే నేను నా బరువు తగ్గిస్తూ వస్తూంట. తద్వారా నా పొట్ట తగ్గుతూ వస్తోంది. ఇప్పటిదాకా నా బరువు మాత్రమే గమనిస్తూ వస్తున్నాను కానీ నా నడుము కొలత మీద దృష్టి పెట్టలేదు. ఇంటికి వెళ్ళాక నా నడుము కొలత ఎంత వుందీ చూసుకుంటాను. అది 28 కి వచ్చాక ఇక దాన్ని అలాగే కాపాడుతూ నా బరువు పెంచేస్తూవుంటాను. దానికోసం బరువులు ఎత్తాలి, రెసిస్టెన్స్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పుడు శరీర భాగాల్లో కండ పెరిగి బరువు పెరుగుతాను. శరీరంలోకి చేరి ఎక్కువయిన కాలరీలు సరాసరి నా బొజ్జలోకి చేరి కొవ్వు పట్టకుండా మిగతా శరీరానంతా కండ పట్టించడమే ఇప్పుడు నా ముందు వున్న ప్రయాస. అందుకోసం ఊరికే ట్రెడ్మిల్లు చేస్తే లాభం వుండదు. జిమ్ముకి వెళ్ళాలి. బరువులు ఎత్తాలి. కష్టపడాలి. 

ఆడవారి ఐడియల్ కొలతలు 36-24-36 ఇంచులు (90-60-90 సెంటీమీటర్లు) అంటారు. మరి మొగవారికి ఎంతో తెలియదు. మహిళలూ మరి మీ ఐడియల్ కొలతలకి మీరెంత దగ్గర్లో వున్నారు? నా శరీరానికి సంబంధించిన ఐడియల్ కొలతలు ఎప్పుడో వ్రాసిపెట్టుకున్నా. ఆ టేబుల్ లేదా ఆ కాల్క్యులేటర్ కోసం నెట్టులో వెతికాను కానీ దొరకలేదు. ఆ లింక్ ఇచ్చివుంటే మీ ఎత్తును బట్టి, జెండర్ ను బట్టి మీ కొలతలు ఎంత వుండాలో మీకు సులభంగా తెలిసేది. ఎవరి దగ్గరన్నా ఆ చార్ట్ లేదా ఆ సమాచారం వుంటే లింక్ ఇవ్వండి.  

ఆథ్లెటిక్ బాడీ పెంచాలిక

ఇది మళ్ళీ నా బరువు టపాలెండి. చదివితే చదవండి లేకపోతే వెళ్లిరండి.

డైటరీ సప్లిమెంట్లు మారుస్తున్న కారణాన నా వెయిట్ కంట్రోల్ ప్రాజెక్టుకి కొద్దిరోజులు విరామం వచ్చినా మళ్ళీ దారిలో పడ్డాను. గత వారాంతానికి ముందు 53 కిలోలు వుండగా వారాంతం ఊర్లు తిరిగినందున ఆరోగ్యకరమయిన ఆహారం తీసుకోవడం కుదరక ఓ కేజీ పెరిగి 54 అయ్యాను. పని వారం మొదలయిన దగ్గరి నుండీ రోజుకి ఓ అరకిలో తగ్గిస్తూ ఇవాల్టికి 52.5 కేజీలకి దిగాను. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే రేపు ఉదయానికల్లా నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న, కృషి చేసున్న నా ఉపలక్ష్యం అయిన 52 కిలోగ్రాముల బరువుకి దిగుతాను.

అలా 52 కి దిగాక బరువు పరంగా నా అసలు లక్ష్యమయిన 50 కి దిగాలి. ఆ లక్ష్యం చేరుకున్నాక ఇక నా బరువుని ఎప్పుడూ 50 - 52 మధ్యనే వుంచగలగాలి. తక్కువ తినడమూ, ఆరొగ్యకరమయిన ఆహారం తీసుకోవడమూ అలవాటయ్యాయి కనుక అదేమంత పెద్ద సమస్య అవదనుకుంటున్నాను. ఇహ ఆ తరువాతా ఆథ్లెటిక్ బాడీ కోసం కృషిచెయ్యాలి. అదీ సాధిస్తే... ఆ... సాధిస్తే... అహ మీకు చెప్పలేనండీ బాబూ. నాకు సిగ్గేస్తోంది. బాడీ బ్యుల్డర్ అవాలి. ఇవన్నీ జరిగేపనులేనంటారా? ఎన్నో ఏళ్ళుగా నన్ను గమనిస్తున్నారుగా. అందుకే అది నేను సాధించగలనో లేదో మీరే చెప్పాలి :)

ఆథ్లెటిక్ బాడీ అంటే ఏమిటి? ఉదాహరణకు నా శరీరం సైజుకి ఎలాంటి కొలతలు వుంటే నా బాడీని అలా అంటారు లాంటి కబుర్లు త్వరలో వ్రాస్తాను. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధిస్తూ వెళుతుంటే మనలో ఉత్సాహమూ, మనమీద మనకు నమ్మకమూ పెరుగుతూవుంటాయి కదూ. మనలో మనకు ఎంతో సంతోషంగానూ, సంతృప్తిగానూ అనిపిస్తుంటుంది కూడానూ.  అందుకే నా ఆరోగ్యం గురించిన చిరు లక్ష్యాలు ఇవన్నీ. అలాగే మిగతా ఏరియాలల్లో కూడా ఉపలక్ష్యాలు నాకు వుండనే వున్నాయి. వాటిని కూడా కాస్తో కూస్తో సాధిస్తూనేవున్నాను.

నేను మీరు కాదూ - మీరు నేను కాదూ

మీ గురించేనండోయ్ నేను వ్రాస్తున్నది. మన మధ్య వున్నది బ్లాగానుబంధం. అయితే ఈ అనుబంధం కొన్ని కారణాల వల్ల పలుచనయిపోవచ్చూ లేదా చిక్కనయిపోనూవచ్చు. నేను కాస్తో కూస్తో బాగా వ్రాస్తూవుంటానని మీరు నా బ్లాగులు చదువుతూవుండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు మీకు నచ్చని విషయం ఏదో ఒకటి నేను వ్రాయకపోను. నామీద మీకు మండకపోదు. అలా నామీదా, నా వ్రాతల మీదా మీకు విరక్తి కలిగే అవకాశం వుంది. అందుకే అంటున్నాను - మీరు నేను కాదు - నేను మీరు కాదని.

ఉదాహరణకి మన స్నేహితులు వుంటారు. ఏదో ఒక విషయం అతనిలో మనకు నచ్చలేదని అతన్ని మనం దూరం చేసుకోము కదా. అతనిలో మనకు నచ్చని ఆంశాలు మరీ ఎక్కువయితే దూరం అవుతాము. అది ఓకే. అలాగే నా అభిప్రాయాలూ, మీ అభిప్రాయాలూ మరీ ఎక్కువగా కలవబోవు కాబట్టి ఆంశాల ప్రాతిపాదికన మీరు నన్ను నన్నుగా ఆమోదించండి.  మీకు నచ్చినట్లు నేను వ్రాయాలనో, మీకు నచ్చిందే నేను వ్రాయాలనో ఆశించకండి. నాకంటూ ఓక వ్యక్తిత్వం అంటూ వుంటుంది కదా. దానికంటూ నేను గౌరవం ఇవ్వాలి కదా. మన వ్యక్తిత్వాల మీద మనకు గౌరవం లేనప్పుడే ఇతరుల వ్యక్తిత్వాలకూ, అభిప్రాయాలకూ అమిత ప్రాధాన్యతను ఇచ్చి మిగతా వారందరి మెప్పు కోసమే వ్రాయాల్సివుంటుంది. నేనూ అలా వుండాలని ఆశించకండి.

ఇతర మీడియాలు వ్యాపారాలు కాబట్టి ఎలాగూ టీఅర్పీ రేటింగుల కోసమనో, ఎక్కువమంది చదవడం కోసమనో, ఎక్కువ లాభాల కోసమనో మెజారిటీ ప్రజలు మన్నించేవే వ్రాయాల్సి వస్తుంది, ప్రసారం చెయ్యాల్సి వస్తుంది. కనీసం బ్లాగుల్లో లాభార్జన చెయ్యలేము కనుక ఆ రేటింగుల కోసమంటూ మన వ్యక్తిత్వాలని కుదవబెట్టుకుంటూ వ్రాయాల్సిన అవసరంలేదు. ఇతర లాభాల కోసం ఇతరుల ఇష్టాలకు అనుగుణంగా ఇతరులు వ్రాస్తుండవచ్చు. కానీ నాకు ఏ ఇతర అవసరాలూ, లాభాలూ నా దృష్టిలో లేవు కనుక పూర్తిగా నా ఇష్ట ప్రకారమే వ్రాసుకుంటాను. మీ ఇష్ట ప్రకారం కాదు. అందువల్ల మీ ఇష్టాలూ, నా ఇష్టాలూ అన్ని వేళలా కలిసే అవకాశాలు వుండబోవు కనుక మనం   మనలోని   పరస్పర   విరుద్ధమయిన    అభిప్రాయాలను   గౌరవించుకుందాం. మనలో భిన్నాభిప్రాయాలుండవచ్చనే ఏకాభిప్రాయానికి వద్దాం. మనిద్దరికీ ఇష్టమయిన విషయాల్లో కలిసి పనిచేద్దాం, కష్టమయిన విషయాల్లోనూ కలిసిపనిచెయ్యకున్నా కూడా కలిసేవుందాం. ఏమంటారు? 

కల్తీ అయిపోతున్న బ్లాగులోకం

అగ్రిగేటర్లలో బ్లాగులు చూస్తుంటే నవ్వూ, నిస్పృహా వస్తున్నాయి. ఏం బ్లాగులో ఏంటో. కనపడే బ్లాగులల్లో సగం సినిమా వార్తలూ, రాజకీయ వార్తలూనూ. అక్కడెక్కడో ఎత్తుకొచ్చి ఆ కబుర్లన్నీ ఇక్కడ వదిలేస్తున్నారు. ఆ రెండూ కాకపోయినా దర్జాగా వేరే న్యూస్ పోర్టళ్ళ నుండీ, దినపత్రికల వెబ్సైట్ల నుండీ ఎత్తుకొచ్చి వేస్తున్న విశేషాలే వుంటున్నాయి.

ఇలాంటి బ్లాగులని సంకలినిలు ఏరిపారేస్తే బావుంటుందంటాను. మీరేమంటారు? ఎత్తుకొచ్చి ఏసే వార్తలు, కబుర్లు భావ ప్రకటన క్రిందికి రావు కాబట్టి నిక్షేపంగా అలాంటి బ్లాగులకి కత్తెర వేయడం మంచిది.  అగ్రిగేటర్ల నిర్వాహకులూ, దయచేసి మా విన్నపాన్ని ఆలకించండి. కాస్త అసలు, సిసలయిన బ్లాగులని మీ సైట్లలో చూడనివ్వండి.

నా మిగతా భావాలతో, అభిప్రాయాలతో సంబంధం లేకుండా నా సూచన నచ్చిన వారందరూ వ్యాఖ్యల ద్వారా బలపరిస్తే ఈ విషయం సంకలినులు నిర్వాహకుల చెవినెక్కడానికి అవకాశం వుంటుంది. నేను తప్ప మీరెవరూ ఈ విషయం పట్టించుకోకపోతే లైట్. 

బోర్ కొడుతోంది...బోర్ కొడుతోంది...ఏం చెయ్యాలి...ఏం చెయ్యాలి?

... అని నిన్నంతా ఆలోచించి కొన్ని చర్యలు చేపట్టాను. ఏంటో లైఫంతా రొటీనుగా సాగుతున్నట్లనిపించింది. అలా ఎక్కువ రోజులు అనిపిస్తే కష్టమే. పొద్దునే లేవగానే స్ప్రింగులా లేచి ఉత్సాహంగా జీవన గమనంలోకి ఉరకాలనిపించకపోతే మన బ్యాటరీలు ఫుల్లుగా లేనట్లే. కొంతమంది నిరర్ధకులు అలాగే జీవితం అనే బండిని లాగిస్తుంటారనుకోండి. వారికి మార్పు అన్నా, చేర్పు అన్నా అసహ్యం. మంచో చెడో వున్న స్థ్తితి వున్నట్లుగానే వుండాలనుకునే జీవఛ్ఛవాలు వాళ్ళు. మార్పు కోసం మనం కృషి చేసినప్పుడు అన్నిట్లో, అన్ని వేళలా మనం విజయం సాధించకపోవచ్చు, సాధించలేకపోవచ్చు. కానీ ఆ కృషిలో ఎంత ఆనందం అనుభవిస్తాం? ఏదయినా ఒక విషయాన్ని సరిదిద్దేపనిలో ఎంత ఆనందం మనకు దొరుకుతుందీ? ఎందుకీ హైరానా, హయిగా ఎడ్జస్టు కాలేక అని కొందరనుకుంటారు కానీ చెప్పా కదా జీవఛ్ఛవాలకీ, జీవితాలకీ తేడా తెలియని నిరర్ధక వాదులు వారందరూనూ.

ఈ టాపిక్కులో ఎక్కడినుండి ఎక్కడికో వెళుతున్నట్లున్నాను. అయినా సరే, కానివ్వండి. ఓకే. మీరు ఉదయమే లేస్తారు. మీకు ఏమని అనిపిస్తుంది. ఛీ, నా ఎదవ జీవితం అని మీ జీవితాన్ని, మిమ్మలని తిట్టుకుంటారా లేక హుశారుగా నవ్వుతూ, తుళ్ళుతూ పనులు చేసుకుంటారా? లేకపోతే ధర్మరాజంత స్థితప్రజ్ఞుడిగా మొఖంలో ఏ భావాలూ లేకుండా అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా, ఈ పాడుపొట్టకు కాస్త అన్నమే పడవేయురా అని కలికాల తత్వాలతో మెట్టవేదాంతం ఆలాపిస్తుంటారా? మొదటిదే నిజమైతే మన పరిస్థితుల్లో ఎక్కడో ఏదో లోపం వున్నట్లే. అది మీకు తెలిసిందే. అది మనం సవరించుకోనన్నా సవరించుకోవాలి లేకపోతే మనమన్నా సర్దుకోవాలి. ఆ రెండు కుదరకపోతే వాస్తవ పరిస్థితులను అంగీకరించడమయినా చెయ్యాలి.

వ్యక్తిత్వ వికాస బోధకుల్లా నేనేమీ నా పరిస్థితులని దాచేసి ప్రవచించబోవడం లేదు. అప్పుడప్పుడు ఆ పర్సనాలిటీ ప్రీచర్సును చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వారంతా ఎల్లప్పుడూ పరిపూర్ణులన్నట్లుగానే వ్రాస్తుంటారు. నేనేదో ప్రతి రోజూ స్ప్రింగులా పక్కమీదినుండి పెందరాళే లెస్తాను అని కాదు. మనుషులకి వుండేట్లుగానే నాకూ సమస్యలున్నాయి. నా బాటరీలలో చార్జ్ తక్కువయ్యిందని నాకు తెలుసు. నా మనస్సు ఫుల్లు చార్జీలో లెదంటే ఎక్కడో రీఛార్జింగులో తేడా వున్నట్లూ తెలుసు. ఆ తేడా ఏమిటో కూడా నాకు తెలుసు. దాన్ని రిపైర్ ఎలా చెయ్యొచ్చో కూడా తెలుసు. అయితే పలు కారణాల వల్ల ఆ రిపేర్లు ఆలస్యం అవుతుంటాయి. ఈ లోగా ప్రతిరోజూ మనం దాటేస్తూనే వుండక తప్పదు కదా.  అందువల్ల నేనూ అప్పుడప్పుడయినా లేవగనే దందగమారి జీవితం అని విసుక్కుంటూ కాళ్ళీడ్చుకుంటూ పనికి వెళ్ళే సందర్భాలు కద్దు. అయితే జీవితంలోని మోనాటనీని తప్పించి జీవితంలోకి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకై ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనేవుంటాను. పలు విషయాల్లో అందుకు అనుగుణంగా మార్పు, చేర్పులు చేస్తూనేవుంటాను. మరి మీరు? 

సమస్యలు, బాధలు, ఎగుడుదిగుళ్ళు అన్నవి సహజం. అయితే విషయం ఏమిటంటే చాలామంది మార్చుకొతగ్గ పరిస్థితులకు కూడా రాజీ పడి కూర్చుంటారు. పోరాడితే పోయేది మానసిక ప్రశాంతతే అని సర్దుకుకూర్చుంటారు. అలా ప్రశాంతత పోతుందనుకుంటారే కానీ ఆ పొరాడే క్రమంలో, పరిస్థితులను సరిదిద్దే క్రమంలో, ఈ ఛాలెంజీలని ఎదుర్కొనే క్రమంలో ఎంత ఆనందం, తృప్తీ పొందుకుంటామో అలాంటివారికి అర్ధం కాదు. 

నిజమే. కొన్ని కొన్ని మన జీవిత కాలంలో మార్చుకోలేము. అలాంటి వాటిని అంగీకరించాల్సిందే. ఉధాహరణకి నా విషయమే తీసుకుంటే నేను కాస్త పొట్టి. కానీ నాకు అసలు ఆ విషయమే గుర్తుకు వుండదు - ఎవరయినా గుర్తు చేస్తే తప్ప. ఎందుకంటే నా ఎత్తుని నేను మార్చుకోలేను - అందువల్ల ఆ వాస్తవాన్ని నేను అంగీకరించేసాను. ఇక నా ఎత్తు నన్ను చేసేదేముందీ? అలా అని అన్ని విషయాల్లో రాజీ పడతానా? లేదు. పోరాడుతూనే వుంటాను.

నేను ఒక కంప్యూటర్ కళాకారుడిని.   నేను చేసే ప్రోగ్రామింగ్ సరిగ్గా వచ్చేంతవరకూ రకరకాల ప్రయోగాలు చేస్తూనేవుంటాను - పరీక్షిస్తూనేవుంటాను. ఒకటి రెండు ప్రయత్నాలు చేసి ఊరకే కూర్చోను. నాక్కావాల్సిన ఫలితం వచ్చేదాకా శ్రమిస్తూనేవుంటాను. ఆ శ్రమలో ఆనందం పొందుతాను. విజయం వరించగానే సంబరపడతాను. అలా ఒక్కో విజయం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని, మరింత ఆనందాన్ని సృష్టించుకుంటూ, సృజించుకుంటూ వెళుతూనే వుంటుంది.  ఎవరు ఎక్కువ ఉత్సాహంగా వుంటారు? ఎవరు ఎక్కువ ఆనందంగా వుంటారు? మెట్ట వేదాంతం, సొట్ట సైకాలజీ వల్లిస్తూ ఊరకే సర్దుబాట్లు చేసుకొని కూర్చునేవారా లేక నిరంతరం ప్రయత్నించి విజయాన్ని కైవసం చేసుకునేవారా? సమాధానం మీకు తెలుసు.

మన జీవిత గమనంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే వుంటాయి. వాటికి తిట్టుకుంటూ సర్దుబాట్లు చేస్కుంటూపోతున్నామా లేక సమస్యా పరిష్కారానికై శ్రమిస్తూపోతున్నామా అన్నది చూసుకోవాలి. నాకు అలాంటి సవాళ్ళు వున్నప్పుడు, ఎదురయినప్పుడు మరీ నవుతూ, తుళ్ళుతూ వుంటానని చెప్పలేను కానీ ఒకవైపు తిట్టుకుంటూనే మరో వైపు కృషిచేస్తూనేవుంటాను.  నేను ఆశావహుడిని. ఆశ నన్ను నడిపిస్తూనే వుంటుంది. ప్రయత్నిస్తూనేవుంటాను వుంటాను. ఆ ప్రయత్నాల్లో ఆనందిస్తూనే వుంటాను.  నా బ్యాటరీలు రీచార్జ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూవుంటాను.  ఆ క్రమంలో కిందామీదా పడుతూనేవుంటాను. అందులోనే ఆనందం పొందుతుంటాను. ఆ విజయమే కనుక నను వరించినప్పుడు బ్రహ్మానందం  పొందుతుంటాను. అలా నేను జీవిస్తూనేవుంటాను. 

ఒక్కసారి మీరు కూడా రేపు ఉదయం నిద్ర లేచినప్పుడు మీ బ్యాటరీలు ఫుల్లు ఛార్జింగులో వున్నాయా లేవా అన్నది సరిచూసుకోండి. మిమ్మల్నీ, మీ జీవితాన్నీ మీరు తిట్టేసుకున్నారనుకోండి - ఎక్కడో, ఎందుకో మీ జీవితం సరిగ్గా రిఛార్జ్ అవడం లేదన్నమాటే కదా. అయినా సరే సర్దుకొని మూసుక్కూర్చుంటారా లేక సరదాగా ఆ సవాళ్ళని సరిచేస్తారా అన్నది మీరు తేల్చుకోండి. సర్దుకొని పోవడం తేలికే. అవును మనుషులు మురుగు కాలువల ఒడ్డున మురికిపేటల్లోనూ జీవిస్తుంటారు, బంజారా హిల్స్ లోనూ జీవిస్తుంటారు - ఆ మధ్యలో కూడా జీవిస్తుంటారు. ఎలాంటి జీవితం అయినా ఒక్కటే కదా అనుకున్నప్పుడు ఇహ ఇంకా ఈ టపా చదవడం కూడా వ్యర్ధమే. దయచేసి మూసివెయ్యండి మరి.

ఇక నా సంగతంటారా, నిన్న బోరుకొట్టింది అని చెప్పా కదా. కొన్ని స్వల్పమయిన మార్పు చేసాను. అవేంటో మరోసారి చెబుతానులెండి. మనలో ఉత్సాహం రావడానికి, నింపడానికి ఓ బ్రహ్మాండమే బ్రద్దలయేంత విరీతాలు జరుగనఖ్ఖరలేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చక్కని ఫలితాలను ఇస్తాయి. నా లైఫ్ కెమిస్ట్రీలో రసాయనాలను కొద్దిగా అటూఇటూ మార్చిచూసాను. ప్రస్థుతానికయితే ఆ మిశ్రమం పనిచేస్తున్నట్లుగానే వుంది. ఇంకా చూద్దాం. పనిచెయ్యకపోతే ఆ మిశ్రమన్ని మళ్ళీ మార్చేద్దాం.  

కెనడా కబుర్లు - మంచినీళ్ళ బిందెలు

అప్పుడప్పుడూ నేను కెనడాకి వచ్చి వున్న రోజుల గురించి వ్రాస్తాను కానీ అవి కాలక్రమంలో వుండకపోవచ్చు. మొదటిసారి కెనడాకి వచ్చినప్పుడు వచ్చి నన్ను తోడ్కొని వెళతాడు అని చెప్పిన మిత్రుని యొక్క మిత్రుడు విమానాశ్రయానికి రావడం ఎగ్గొట్టడంతో చేసేది లేక ఒక హాస్టల్ లాంటి దాంట్లో కొద్దిరోజుల కోసం సెటిల్ అయ్యాను.
 
మనం దేశం ఎల్లలు దాటి రావడం అదే మొదటిసారి కాబట్టి ప్రతి ఒక్కటీ వింతగా గమనిస్తుండేవాడిని. అలాగే నేను మనిషినే కాబట్టి నాకు ఆకలి దప్పులయ్యేవి కూడానూ. ఆ హాస్టల్లో ఫుడ్డు వుండదు. బయటకి వెళ్ళి తినేవాడిని. అయితే దప్పిక కూడా అప్పుడప్పుడవుతూ వుంటుంది కదా. మంచినీళ్ళ కోసం చుట్టూ చూసేవాడిని. ఊహు కనపడేవి కావు. మంచినీళ్ళ బిందెలు కానీ, కుండలు కానీ ఆ హాస్టల్లో లేకపోవడం ఆశ్చర్యం అనిపించింది. మరి వీళ్ళకి దప్పిక కాదా? ఎలా తమ దాహార్తిని తీర్చుకుంటారు? రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు శీతల పానీయాలో, ఉష్ణ పానీయాలొ లాగిస్తారు సరే. ఇంట్లో సంగతేంటీ? 
 
చేసే పనేమీ లేదు కాబట్టి కెనడియన్స్ ఎలా దాహార్తిని తీర్చుకుంటారు అనేది రెసెర్చ్ చెయ్యడం మొదలు పెట్టాను. అందుకోసం ఆ హాస్టల్లో వున్నవారిని కనిపెట్టడం మొదలెట్టాను. అబ్బే ఒక్కరూ మంచి నీళ్ల గ్లాసుతో మంచినీళ్ళు తాగుతున్న దాఖలాలు కనపడలేదు. అందరూ పొడుగాటి కప్పుల్లోనో, ప్లాస్టిక్కు బాటిళ్ళలోనో ఏవో ద్రావకాలు తాగుతున్నారు గానీ గ్లాసెత్తడం లేదు. హార్నీ, తెల్లోళ్ళు మామూలు మనుషులు కాదు సుమా - వీళ్ళు మంచి నీళ్ళు కూడా ముట్టరు అని నా రిసెర్చులో తీర్మానించేసాను.  అయినా ఛండాలంగా, పురాతన కాలంలో లాగా రోజూ మంచినీళ్ళు తాగడం ఏంటీ ఇక్కడికి వచ్చాక కూడా - మరీ మోటుగా వుండదూ అని నేను కూడా కూల్ డ్రింక్స్ తాగడం మొదలెట్టాను. 
 
అలా కెనడాకి వచ్చిన రెండు రోజులు బాగానే గడిచింది. మూడో రోజు నుండీ వంట్లో మంట మొదలయ్యింది. వంట్లో సెగలు వెలువడుతున్నట్లుగా అనిపించసాగింది. ఏంటా ఇసయం అని మళ్ళీ దానిమీదా పరిశోధన ప్రారంభించా. నా వంటికి మంచినీళ్ళు కావాలని తేల్చేసా? ఇప్పుడు దానికి మంచినీళ్ళు ఎక్కడ తెచ్చిచ్చేదీ? అసలు మంచి నీళ్ళంటూ కనపడితే కదా. ఎక్కడ వెతికినా బిందెలూ లేవు, కుండలు లేవు. మంచినీళ్ళని ఎవరినయినా కనుక్కుందామంటే మోటుగా వుంటుందేమోనని సంశయం. ఎలాగోలా సాయంత్రం వరకు తర్కిస్తూ గడిపా కానీ నా బాడీ బాయిల్ అవుతున్నట్లు అనిపించి ఇక లాభం లేదని రిసెప్షనిస్టుని మంచినీళ్ళు ఎక్కడ అని అడిగాను. 
 
కిచెన్లో అన్నాడు. కిచెనెక్కడ అని అడిగాను. బేస్మెంట్లో అని చెప్పాడు. అందులోకి వెళ్ళి వెతికితే కిచెన్ కనిపించింది కానీ కుండలు మాత్రం కనిపించలా. విసుక్కుంటూ వచ్చి కిచెనులో మంచి నీళ్ళెక్కడా అని నిలదీసినట్లే అడిగాను. ట్యాప్ దగ్గర పట్టుకో అన్నాడు. హ?! అతను భుజాలు ఎగరేసి కిచెన్ సింకు దగ్గర వున్న ట్యాప్ లోంచి పట్టుకొని తాగమన్నాడు.  వార్నీ కలికాలం కాకపోతే ట్యాప్ లోంచి నీళ్ళు పట్టుకొని తాగడం ఏంట్రా - ఏ బిందెలోనుండో, కుండ లోనుండో పట్టుకొని తాగాలి కానీ అని వాడిని తిట్టుకొని వెళ్ళి మంచినీళ్ళు తాగి ఆవిర్లు ఆపుకున్నాను. అప్పుడర్ధమయ్యింది వీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ తాగుతారో.
 
ఇన్నాళ్ళకి కూడా ఎప్పుడన్నా హోటళ్ళల్లో బస చేసినప్పుడు అదే సమస్య మా ఆవిడకి ఎదురవుతూ వుంటుంది. మామూలుగా మంచినీళ్ళు కావాలంటే రెస్ట్ రూములో వుండే సింకు దగ్గర వుండే ట్యాప్ లో నీళ్ళే గతి. ఆమె విసుక్కుంటూ వెండింగ్ మెషినులోంచో లేక కారు లోంచో వాటర్ బాటిల్స్ తెచ్చుకొని తాగుతుంది. నాకయితే అంత ఓపిక, అభ్యంతరాలూ వుండవు. లాగిచ్చేస్తానంతే.

రెండు ప్రయోగాలు ఒకేసారి చెయ్యకూడదు

కొన్నేళ్ళ క్రితం నేను ఇండియాకి వచ్చినప్పుడు మా బంధువుల ఇంట్లోని కంప్యూటరు చాలా వరకు వైరసులతో ఇంఫెక్ట్ అయ్యిందని గమనించాను. వారి అనుమతితో వారి సిస్టం క్లీన్ చేసాను. సరే ఒక సాఫ్టువేరుతో ప్రయత్నించి నేను ఆగాలా. ఊహు. మనకు ఆనందం ఎక్కువయ్యి ఆ సిస్టం ను మరింత పరిశుద్ధం చెయ్యాలనుకొని అత్యుత్సాహంతో నాకున్న పరిజ్ఞానం అంతా ఉపయొగించి ఇంకో రెండు విధాలుగా కూడా ప్రయత్నించి అంతా పరిశుద్ధం చేసాను. ఆ తరువాత చిద్విలాసం చేస్తూ సిస్టం రిస్టార్ట్ చేసాను. ఏమయ్యింది? ఏమీ కాలేదు. అరే, హేమీ కాలేదంటే నమ్మరే. అసలుకి ఆ సిస్టం స్టార్టే కాలేదూ! ఆ తరువాత వారు కంప్యూటర్ రిపైర్ మ్యానుని పిలిపించి బాగుచేసుకున్నారనుకోండి.

పై సంఘటణతో నాకు బాగా తెలిసివచ్చినదేమంటే ఒకటి కంటే ఎక్కువ ప్రయోగాలు ఒకేసారి చెయ్యొద్దని. అదే విషయం నాకు నిన్న కూడా అర్ధమయ్యింది. ఈమధ్య డైటింగ్ చేస్తున్నాను కదా. నిన్న సాయంత్రానికి ఆకలి కాస్త ఎక్కువయ్యింది. రాత్రి త్వరగా నిద్ర పట్టక మిడ్ నైట్ మరో స్నాక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ అర్ధరాత్రి ఆకలి ఏంటని మా ఆవిడ గులుగుళ్ళూ వినాల్సి వచ్చింది. నా తిండితో తనకు నిద్రాభంగం అయ్యిందిట లెండి. సాయంతం చూసుకుంటే బరువు 53 కి పైగానే వుంది. ఆ తరువాత మళ్ళీ ఆ 150 కేలరీల స్నాకూ. ఇహ పొద్దున్నే బరువు తగ్గినట్లే అని గులుక్కుంటూ పడుకున్నా. పొద్దున లేచి చూసుకుంటే బరువు తేడా లేకుండా దాదాపు నిన్నటి అంతే వుంది.

తేడా ఎక్కడొచ్చింది అని పరిశీలించుకున్నా. ఈమధ్య ఆకలి తగ్గడం మరియు తదితర కారణాల కోసమని ఒక డైటరీ సప్లిమెంట్ తీసుకుంటున్నా. అది గాబా అని అమినో ఏసిడ్. అయితే ఇంకా దానికంటే మంచిది దానికి ప్రి కర్సర్ అయిన ఎల్-గ్లుటమైన్ అనే ఎమినో ఏసిడుకి స్విచ్ అవుతూ వస్తున్నాను. ఈ గ్లుటమైన్ ఇంకా కిక్కు ఇవ్వకపోయినదువల్లనూ ఆ గాబా ఉపసంహరణ లక్షణాల వల్లనూ మనలో ఆకలి ఎక్కువయ్యింది, నిద్ర తక్కువయ్యింది. ఒక వైపు స్ట్రిక్ట్ డైటింగు చేస్తూ మరో వైపు మందులు మారుస్తుంటే ఫలితాలు ఇలాగే ఏడుస్తయి మరి. సరే, జరిగిందేదో జరిగిందని గ్లుటమైన్ కే కట్టుబడివున్నాను. ఇంకో ఒకటి రెండు రోజుల్లో అది నాకు పూర్తిగా పనిచెయ్యడం ప్రారంభిస్తుండవచ్చు. 

ఆహార వ్యసనం కానీ, సిగరెట్ వ్యసనం కానీ, తాగుడు వ్యసనం కానీ లేదా ఏ ఇతర వ్యసనం కానీ వున్న వారు ఎంచక్కా ఈ క్రింది డైటరీ సప్లిమెంట్లు వాడి చూడవచ్చు. వాటితో ఇంకా బహుళ ప్రయోజనాలు వున్నాయి. ఆహార నియంత్రణ చెయ్యాలనుకునేవారికి ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఆకలి తగ్గిస్తాయి.  ఆసక్తి వున్న వారు ఆ పదాలను ఉపయోగించి నెట్టులో పరిశోధించి వాటిగురించి వివరాలు తెలుసుకోండి.  నాకు గాబా అయితే చక్కగా పనిచేసింది. దానికంటే కూడా గ్లుటమైన్ ఇంకా మంచిది, చక్కగా పని చేస్తుంది అంటారు. నేను వాడి చూస్తున్నాను. వాడబట్టి మూడురోజులే అవుతోంది కాబట్టి ఇప్పుడే దాని గురించి నేను చెప్పలేను.  ఇవి మందుల దుకాణాల్లో దొరకకపోతే న్యూట్రిషన్ షాపుల్లో చాలావరకు లభిస్తాయి. ఈ సప్లిమెంట్స్ ఇండియాలో అందుబాటులో వున్నాయో లేదో నాకు తెలియదు.

L-Glutamine, GABA

సప్లిమెంట్స్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఇంకో ముచ్చట. మీలో ఎవరికయినా, మీకు తెలిసిన వారికి ఎవరికయినా ఆర్థిరైటిస్ (కీళ్ళ నొప్పులు) వుంటే నాకు చక్కని డైటరీ సప్లిమెంట్లు తెలుసు. మా పెద బావ తన ఫార్మసిస్ట్ కొడుకు సలహాతో అవి వాడితే ఆ తీవ్రమయిన నొప్పులు 99% కనుమరుగు అయ్యాయి. ఇప్పుడు ఏ నొప్పులు లేకుండా ఎంచక్కా వుంటున్నారు. అన్ని సప్లిమెంట్లు అందరికీ పనిచేస్తాయని చెప్పలేము కాబట్టి అవి వాడి చూడండి.  

Glucosamine, Chondroitin

తాగూ...నేనొద్దన్నానా?

ఇవాళ ఓ అజ్ఞాత మందు బాబు నన్ను మందు మీద టపా వెయ్యమని కోరితే ఈ విషయాలు గుర్తుకువచ్చాయి. ఇది వారు కోరిన టపా కాదులెండి. మా ఆవిడ నన్ను కొన్ని విషయాల్లో భలే ప్రోత్సహిస్తుంది. కాకపోతే అవేమన్నా నాకేమన్నా పనికి వచ్చే విషయాలా కదా అనేది నా అనుమానం. చుట్టాలో, పక్కాలో వచ్చినప్పుడు అతిధి మర్యాద కోసం మందు తెచ్చిపెడతాను. వారు మొహమాటానికి పోయి మొత్తం తాగెయ్యరు కాబట్టి కొంతయినా ఉండిపోతుంది. అదలా మిగిలేపోతుంది. అది గుర్తుంచుకొని గుటాకాయాస్వాహా చెయ్యడానికి నేనేమో మందు ప్రియుడిని కాకపోతిని. ఏదో ఇతరులకు కంపెనీ ఇవ్వడం కోసం కొద్దిగా పుచ్చుకోవడం తప్పించి నాకు అసలు అంతగా తాగాలనే సోయే వుండదు. అలా వారాలు, నెలలూ మరో అతిధికోసం ఎదురుచూస్తూ ఆ మందు అలాగే వుండిపోతుంది. నాకు ఇంట్లో మందు మిగిలివున్న సంగతే గుర్తుకువుండదు.

అయితే మా ఆవిడ అప్పుడప్పుడూ మందు మిగిలేవున్న విషయం గుర్తు చేసి తాగొచ్చుకదా అని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోత్సాహమే మరో విషయంలో వుంటే ఎంత బాగుండూ అని మరో వైపు నేను మనస్సులో ఏడుస్తుంటాను. అబ్బే నాకంత ఆసక్తి లేదు అని అంటూవుంటాను. పర్లేదూ, తాగూ అంటుంది. నేను ఆడవారి మెంటాలిటీ గురించి ఆలోచిస్తూ ఆమె వైపు అలా చూస్తుంటాను. ఏంటోనండీ ఈ ఆడవాళ్ళు. కొద్దిగా మందు ప్రియులం అయితే చాలు - గజ తాగుబోతులా చూస్తారు. తాగకపోతేనేమో మా ఆవిడ లాంటి వారు గుర్తుచేసి మరీ ప్రోత్సహిస్తారు. అంతగా ఇష్టం లేనప్పుడు కష్టపడి అది లాగించడం ఇప్పుడంత అవసరం అంటావా అని నేనంటే కొద్దిగా తాగితే ఏమవుతుంది అంటుంది. ఆమె మాట తీసివెయ్యడం ఇష్టం లేక అప్పటికి తాగి పెట్టినా మందు ఇంట్లో వున్న విషయం మళ్ళీ గుర్తుకువుండదు.

 రోజూ ఓ పెగ్గు రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేమో, తాగుదాములే అనుకుంటుంటా కానీ అసలు సమయానికి అది నాకు గుర్తుకు వుండనే వుండదు. అలా ఇంట్లో ఇప్పుడు కొన్ని వైన్ బాటిళ్ళూ, ఓ సగం విస్కీ బాటిలూ ఎన్నాళ్ళ నుండో అలా పడేవున్నాయి. మనకున్న ఆసక్తులూ, అలవాట్లూ చాలకనా అని కూడా మందుని పెద్దగా నా మనస్సు ముందుకు రానివ్వను. 
 
ఎవరింటికి అయినా వెళ్ళినప్పుడు కూడానూ మిగతావారందరూ మందు బాగానే తీసుకున్నారు కదా. నువ్వూ తీసుకోకపోయావా ఇంకా అంటుంది మా ఆవిడ. ఇంకా తాగీ, అది ఎక్కీ, నేను ఏదేదో వాగీ మళ్ళీ నీతో అవన్నీ ఎందుకు మాట్లాడావంటూ మాటలు పడాలి, ఎందుకులే అని అంటాను నేను. తాగూ...వద్దన్నానా అంటుంది మళ్ళీ కానీ వద్దులెండి. మళ్లీ ఈ ఆడాళ్ళే సన్నాయి నొక్కులు నొక్కుతారు - తాగామంటే అంతగా తాగమన్నానా అని. ఓ రెండు, మూడు పెగ్గులు దాటితే ఎంత తాగామన్నది మనకు లెక్క తెలుస్తుందేమిటీ?

మీకు ఇష్టమయిన కూరలు ఏంటి?

నాకు ఇష్టమయిన కూరలు ప్రాధాన్యతా పరంగా వరుసగా:

చేపల పులుసు
చేమగడ్డ పులుసు
బెండకాయ పులుసు

అవునండీ నాది పులుసు పార్టీ. వేపుడు పార్టీ కాదు. మా ఆవిడ వేపుళ్ళ పార్టీ. అలాగే నాది చేపల పార్టీ. మా ఇంట్లో మిగతావారిది అందరిదీ కోడి పార్టీ. మా ఇంట్లో ఇహ నా మైనారిటీ పార్టీ బ్రతుకు ఎలా వుంటుందో మీరు ఊహించుకోవచ్చు :) అడుగడుగునా వివక్షత. ముద్ద ముద్దకీ అన్యాయం. ఎప్పుడో కానీ నా జిహ్వ చాపల్యం తీరని వైనం. అదేమని నిలదీస్తే పిల్లలు చేపల కూర ఇష్టపడరూ, పులుసు ఇష్టపడరూ  అని సమర్ధింపులు. వద్దు మొర్రో అంటున్నా ప్రేమతో కోడికూర నా నోట్లో కుక్కేసే నా పెళ్ళాం.  వా... నా కూర కష్టాలు ఎన్ననీ, ఏమని చెప్పుకోనూ...?

అందుకే మా ఆవిడ ఎప్పుడన్నా పుట్టింటికి అనగా పుట్టిన దేశానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంచక్కా నాకు ఇష్టమయిన కూరలు, నాకు ఇష్టమయిన విధంగా చేసుకొని తింటాను. ఇదేమన్నా ఇండియానా ప్రతి పండక్కీ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళడానికీ? అందుకే నా స్వయంపాకావకాశం ఎన్నాళ్లకో, ఎన్నేళ్ళకో గానీ నన్ను వరించదు.  మరి నా వంటలు ఇతరులకు ఇష్టంగా వుంటయా అనే విషయం సందేహాస్పదమే మరియు హాస్యాస్పదమే! మా ఆవిడ మా ఇంట్లో వుండగా మాత్రం నా వంటలు నేను వండుకోవడానికి అస్సలు సాహసించను. కొంపదీసి నా వంటలు ఇంట్లో వారందరికీ నచ్చేస్తే? ఇంకేమన్నా వుందా! అఫీసు నుండి ఇంటికి రాగానే మా ఆవిడ నన్ను వంట పనిలో పెట్టదూ! అందుకే రిస్కెందుకని చెప్పి ఆ మాత్రం సాహసం కూడా చెయ్యను. కష్టమో, నిష్టూరమో వండింది వేసుకు తింటా. అసలే ఇష్టం లేని కూరలు తింటున్నా కూడా బరువు తగ్గడం తక్కువవుతోంది. ఇంకా ఇష్టమయిన కూరలు తింటే ఇంకేమన్నా వుందా? 

నా సంగతి సరే. మీకు ఇష్టమయిన కూరల లిస్టు చదువుదురూ. 

ప్రతి రోజూ బరువు చూసుకునేవారే బరువు తగ్గుతారు

కొద్దిరోజులు నా బరువు పోస్టుల బరువు మీమీద వేస్తున్నాను. కాస్త భరించండి. నా 50 కిలోల లక్ష్యం సాధించేదాకా నా ఫోకస్ మారకుండా వుండేందుకై, ఆత్మ విమర్శ చేసుకుంటూ నా లోపాల్ని సవరించుకునేందుకై నా టపాలు నాకు ఉపయోగపడతాయి. అలాగే మీరు సూచనలు, సలహాలు, ప్రోత్సాహాలు ఇస్తుంటే ఇంకా ఉపయోగకరంగా వుంటుంది. ఎంకరేజ్ చెయ్యండర్రా. బాబుగారూ , మీరు తప్పకుండా బరువు తగ్గుతారు బాబుగారు అని ఉత్సాహపరచండర్రా. అలా అని నేనేదో నా బరువు గురించి మహా వర్రీ అయిఫొతున్నా అని అనుకోకండి. నా బరువు కంట్రోల్లోనే వుంది. కాకపోతే దాన్ని మరింత కంట్రోల్ చెయ్యాలనే ఉత్సాహం అంతే.

నిన్న ఉదయం చూసుకుంటే 53 వున్నాను. ఇవాళ ఉదయం చూసుకున్నా 53 వున్నాను. తేడా లేదు - తగ్గలేదు. అవును - నిన్న కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసాను. ఉదయం లంచ్ పట్టుకెళ్ళడం మరచి నందువల్ల పాండా ఎక్స్‌ప్రెస్ నుండి లంచ్ తెచ్చుకున్నాను. పాండా బవుల్ లో సగం కూరగాయలు, సగం అన్నం తెచ్చుకున్నా. వాటిలో నిమ్మకాయ పచ్చడి కలుపుకొని బవుల్ మొత్తం లాగించా. మొత్తం లాగించెయ్యకురా, ఎదవా అని నా మనస్సు మొత్తుకుంటున్నా నిమ్మకాయ పచ్చడి రుచికి మరిగి మనస్సు మూసుకున్నా. పాండా వారు నిమ్మకాయ చట్నీ కూడా ఇస్తారనుకునేరు. అంత సీన్ లేదు. ఆ పచ్చడి ఎప్పుడో ఇంటి నుండి కొంత తెచ్చి ఆఫీసులో పెట్టుకున్నాను. 

సాయంత్రం ఇంటికి వెళ్ళాక మాండరిన్ ఆరంజెస్ నుష్టుగా లాగించాను. ఆరోగ్యకరమయిన ఆహారమే కదా అని నన్ను నేను సమర్ధించుకుంటూ పొట్ట నింపేసాను. జంక్ ఫుడ్డు కన్నా, వరి అన్నం కన్నా వాటిల్లో క్యాలరీలు తక్కువే కానీ కూరగాయల కంటే పళ్ళలో క్యాలరీలు ఎక్కువే. క్యాలరీలు తగ్గించాలనుకున్నప్పుడు మంచి ఆహారమయినా సరే మితంగానే తినాలి. మరీ కడుపు నింపాలనుకుంటే కూరగాయలో లేక ఆ సలాడో తినడం వల్ల ఎక్కువ నష్టం జరగదు. 

మా ఆవిడ హెల్త్ చెకప్ కి నేనూ తోడుగా వెళ్ళి ఆమె సమస్యలు చర్చించాల్సి వచ్చినందున సాయంత్రం ట్రెడ్మిల్ మీద పరుగెత్తడానికి సమయం చిక్కలేదు. అందువల్ల కూడా నిన్న చిక్కలేకపోయాను. హ్మ్. మరి ఇవాళన్నా తగు జాగ్రత్తలు తీసుకొని తగ్గాలిక. అందుకే నిన్నటి పొరపాట్లు ఇలా మీముందు విశ్లేషించుకుంటున్నాను. మనల్ని మనం సరి చేసుకోవాలంటే ముందు మనం చేస్తున్న పొరపాటు అవగతం కావాలి కదా. ఈ వారం 52 కిలోల మైలు రాయి దాటాల్సి వుంది. మరి ఆ చిరు లక్ష్యాన్ని చేరుకోగలనంటారా?

సమయం పది గంటలు దాటింది. ఇప్పటివరకు ఓ అరకప్పు పాలు తప్ప ఇంకేమీ తీసుకోలేదు. కడుపులో ఎలుకలు పెరుగెడుతున్నాయి. వెళ్ళి ఓ టీ అయినా తెచ్చుకుంటా మరి.