ఓ విమాన ప్రయాణ ప్రమోదం :))

కొన్నేళ్ళ క్రితం కెనడాలోని టొరొంటో నుండి (నిజానికి అక్కడినుండి కాదు గానీ సింప్లిసిటీ కోసం అలా వ్రాస్తున్నా) యు ఎస్ లోని ఫ్లోరిడాకి విమాన ప్రయాణం చేసాము. ఏదో అప్పుడప్పుడు తప్ప ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసే అవసరం మాకు వుండేది కాదు. అందుకే ఆ ప్రయాణానికి గాను టికెట్లు తీసుకునేముందు మా పిల్లలని అడిగాను - నాన్ స్టాప్ కావాలా, సింగిల్ స్టాప్ కావాలా లేక మల్టి స్టాప్ కావాలా అని. ఎన్నిసార్లు విమానం ఎక్కిదిగితే పిల్లలు ఒహవేళ అంత సంతోషపడతారేమో అని అలా అడిగా. పెద్దమ్మాయి కాస్సేపు ఆలోచించి మల్టి స్టాప్ కావాలంది. చిన్నది అప్పుడు మరీ చిన్నది కాబట్టి స్వంత బుర్ర ఉపయోగించకుండా అక్క చెప్పిన దానికి బుర్ర ఊపేసింది.

హింకేం, మనకూ మల్టి స్టాపులంటే ఆనందమాయే. టిక్కెట్టు ఒక్కోదానికి ఓ పది డాలర్లు ఎక్కువయినా సరే మధ్యలో రెండు స్టాపులు చూసుకొని మరీ బుక్ చేసి పడేసా. అదేంటో కానీ సాధారణంగా మల్టి స్టాపులకు ధర తక్కువుంటుంది కానీ ఆ రోజు వాటికే కొద్దిగా ఎక్కువ రేటు ఏడ్చింది. అయినా సరే పిల్లలు ( వారి పేరు చెప్పుకొని నేనూనూ) సంతోషపడుతారని చెప్పి అలా డిసైడ్ చేసేసా.   

ఇహ మా ప్రయాణంలోని పదనిసలు గురించి ఏం చెప్పమంటారు మహాశయా. అసలే ఇక్కడ ఇండియాలో ఆర్టిసీ బస్సుల్లా సరి అయిన వేళకి వస్తాయాయే. ఆపై మధ్యలో రెండు సార్లు విమానాలు మారాలాయే. కనెక్టింగ్ ఫైట్లు వేళకి అందుకోవద్దూ, అవి తప్పితే మళ్ళీ ఫైట్లు వుండొద్దూ. మా ఆవిడా, పిల్లలూ నా బుర్ర వాచిపోయేలా గులిగేసారు. అలా అలా ఫ్లోరిడా వెళ్ళేప్పుడు బుర్ర ఎర్రగా అయిపోయింది. నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కాలేదు. అన్ని అడిగే సక్రమంగా ప్రణాళిక వేసా కదా ఇలా బొక్క బోర్లా పడిందేంటీ? పైగా ప్రతి టెక్కెట్టుకీ పది డాలర్ల బొక్క కూడా పెట్టుకున్నా కదా!   

ఇలాక్కాదని మా పిల్లల్ని పిలిచి మీరే కదా ప్రయాణం మధ్యలో పలు సార్లు ఆగాలని కోరిందీ అని కయ్ మన్నాను. మనం ఫ్లోరిడాకి వెళుతున్నామని అనుకోలేదు - మనం ఇండియాకు వెళుతున్నాం అనుకున్నా అంది మా పెద్దమ్మాయి తాపీగా! అలా అని తమ పొరపాటే కదా అని తిరిగివచ్చేటప్పుడయినా నన్ను మన్నించారా? అబ్బే, మళ్లీ నన్ను ఇరగదీసారంతే. ఓ నాలుగ్గంటల ప్రయాణం నానా విధాలుగా సాగి, దేశమంతా సగం తిరిగేసి, ఇరగేసి  ఓ పద్నాలుగు గంటలయ్యింది మరీ. ఎవరి పొరపాటయితేనేం లెండి. చికాకు చికాకే కదా. అది తీర్చుకోవడానికి ఓ బకరా దొరకాలి కదా.

4 comments:

  1. ఓస్‌ అంతేనా .. నేనింకా విమానం ప్రయాణం ప్రమోదం అంటే, దీనెకాల ప్రమోదవనం కమ్యూనిస్టుల కుట్రుందేమో అనుకున్నా

    ReplyDelete
  2. @ పతోడు
    మీరు ప్రతీసారీ ప్రమాదం గురించి కానీ ప్రమోదం గురించి కానీ ఆలోచిస్తారల్లే వుందే :)

    ReplyDelete
  3. Pramodam ante nenu inka edo edo oohinchesukunna. Mee maga muchchatlu emayyayi?
    Sid

    ReplyDelete
  4. @ సిద్
    చాల్రోజులయ్యింది మిమ్మల్ని చూసి. ఏళ్ళు గడుస్తున్నా కొద్దీ నా యొక్క బై శాతాల్లో గే శాతం తగ్గుతోందనుకుంటా. అందుకే ఆ రచనల మీద ఆసక్తి తగ్గింది. ఇప్పుడిక సీరియస్సుగా నా స్వ పుస్తకం ప్రింట్ చేసే పనుల్లో వున్నాను. ఆ విషయమై ముద్రణలో సహకరించడానికి సిబి రావు గారు ముందుకువచ్చేరు. వారికి నా పుస్తకం పంపించాను. ఎప్పుడూ బ్లాగుల్లోనే వ్రాస్తుంటే ఎక్కువమంది చదువరులకు అందుబాటులో వుండదు కదా. మనం వ్రాసేది తక్కువయినా మన భావాలు ఎక్కువమందికి చేరాలి. అలా చేరినప్పుడే మిగతా మనలాంటివారూ నన్ను చూసి ఇవాళ కాకపోతే రేపు బయటపడటానికి అవకాశం వుంటుంది.

    ReplyDelete