జీవితం అంటే ఇదేనా, ఇంతేనా?

జీవితానికి ఓ అర్ధం, పరమార్ధం ఇవ్వాలని ఎంతోమంది మేధావులూ, తత్వవేత్తలూ శ్రమించారు కానీ ఆ వాదనలన్నీ చాలా వరకు చచ్చిన చేపని నీళ్ళల్లో వేస్తే అది మునుగుతుందా లేక తేలుతుందా అని చేపని ముందెట్టుకు కూర్చొని చేసే చర్చల్లా వుంటాయి. అలా కాకుండా కొంచెం ప్రాక్టికలుగా ఆలోచిద్దామేం.

నా ఇంటరు చివర్లోనో లేక డిగ్రీ మొదట్లోనో నాకు ఈరకమయిన సంశయాలు ఎక్కువయ్యాయి. చుట్టొ వున్న సమాజన్ని బాగా గమనించి అందరూ అనుకునే లేక చాలామంది జీవించే జీవితం ఇదేనని ఒక ముక్తాయింపుకి వచ్చేసాను. ఆ ఏముందీ, పెరగడం, చదవడం, పెళ్ళిచేసుకోవడం, పిల్లలని కనడం, సంపాదించడం అది చేతకాకపోతే సీరియళ్ళు చూస్తూ గడిపేయడం, పిల్లల్ని మనలాగే 'ప్రయోజకులుగా' పెంచడం, వారికి పెళ్ళిళ్ళు చేయడం, వారి పిల్లలకి అమెరికా వెళ్ళి బేబీ సిట్టింగు చెయ్యడం అంతే కదా ది గ్రేట్ జీవితం అంటేనూ?  సీరియళ్ళో లేక సంపాదనో మన ముందు వున్నాక ఇంకా వేరే పనులేముంటాయి మనకు? పనులంటే అనుభూతులు అనే అర్ధంలో వాడా లెండి. ఇంకా జీవిత గమనంలో అర్ధాలూ, అనుభూతులూ వెతుక్కుంటామా? పక్కోడు ఎంత సంపాదించాడూ, మనమూ ఎంత సంపాదించాలనే లెక్కలే కానీ ఎవరెంత జీవిస్తున్నారూ అనేది చూసుకుంటామా? లేదు లేదు. అలా చూస్తే మన ఇంట్లో వాళ్ళే మనల్ని వింతగానూ, దేనికీ పనికిరాని దద్దమ్మలుగానూ చూసెయ్యరూ?  

ఇలాక్కాదని ఆ గానుగెద్దు జీవితం మనకు వద్దని అచ్చమయిన జీవితం ప్రకృడి ఒడిలో, మనుష్యుల, మనస్సుల సమక్షంలో గడిపెయ్యాల్ని తీర్మానించుకున్నాను. ఆ తీర్మానాన్ని మా నాన్నగారికి తెలియపరిచాను. డిగ్రీ పూర్తిచేసాక నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో అన్నారు. మహానుభావులు - మా నాన్న గారు చచ్చి ఏ నాస్తిక స్వర్గంలో వున్నారో కానీ నా స్వేఛ్ఛకీ, అభిప్రాయాలకీ అంతగా అడ్డుచెప్పేవోరు కాదు. 

ఒఠ్ఠినే సన్నాసి అయిపోయి చెట్లు, పుట్టల వెంట తిరగడం కంటేనూ సాంఘిక సేవ చేస్తే మనస్సుకి తృప్తిగా వుంటుంది కదా అని అటువైపు ఆలోచించాను. సాంఘిక సేవ చేస్తూ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటే ఆ సేవకి చెడ్డపేరు వచ్చే అవకాశం వుంటుందని అప్పుడు బుద్ధిగా వుండాలి కాబట్టి ఈలోగా జీవితం ఫుల్లుగా ఎంజాయి చేసి వాటిమీద విరక్తి కలిగించుకోవాలనుకున్నాను. అలా ఎంతోమందితో సాన్నిహిత్యంగా గడివివేసి బాగానే తృప్తి చెందాను.

డిగ్రీ అయిపోయాక వెంటనే విజయవాడలో గ్రామీణాభివృద్ధి మీద ఒక ఏడాది రెసిడెన్షియల్ ట్రైనింగులో చేరాను. ఇహ అది పూర్తిచేసి సాంఘిక సేవలో ఇహ దూకేద్దామనుకుంటున్న రోజుల్లోనే... ఓ మరదలు నన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నానంటూ, నేను కూడా తనని చాలా కాలంగా ప్రేమిస్తున్నాననుకున్నానంటూ నాకు టెండర్ పెట్టింది. నేను నిన్ను ప్రేమించడం ఏంటీ, అందరితోనూ అలాగే ప్రేమతో వుంటానూ అన్నా వినిపించుకోక నన్ను ప్రేమ ముగ్గులోకి దింపింది.

మరి నా సోషల్ సర్వీసో అని దిగాలుగా అడిగాను. పిచ్చి కన్నా, ముందు నువ్వు నా సర్వీసు చేసుకో, ఆ తరువాత మనిద్దరం కలిసి సాంఘికసేవ చేద్దాం అని ముద్దు ముద్దుగా చెప్పింది - నేను బుద్ధిగా వినేసాను.  ఇంకెక్కడి సోషల్ సర్వీసూ? అప్పుడలా అంత తేలిగ్గా చవటని ఎందుకయ్యా నంటారూ? రెండు మూడేళ్ళ తరువాత మా మధ్య విభేదాలు వచ్చి గౌరవంగా విడిపోయాము కానీ నేను మళ్ళీ సర్వీసులోకి మాత్రం వెళ్ళలేకపోయాను. అక్కడే రాంగ్ స్టెప్ వేసేను. వెళ్ళివుంటే బావుండేది కానీ ఎందుకో గుర్తుకు లేదు కానీ అటువైపు వెళ్ళకుండా ఇటువైపు ఇలా చిక్కడిపోయాను.  ఇంకేముంది శరత్ సొషల్ సర్వీస్ కంచికెళ్ళింది. మీ అందరిలాగే నేనూ రొటీన్ జీవితంలోకి లాగబడ్దాను. చక్రం మొదలయ్యాక మనం ఆగమంటే ఆగుతుందా - పెళ్ళి, పిల్లలూ, సంపాదనా ఈతి బాధలూనూ.   ఎలాగూ యోగిని కాలేకపోయాను కదా అన్న కచ్చతో ఈ జీవితాన్ని భోగిగా జీవించాలనుకుని మాస్టర్ ప్లాన్ వేసా కానీ అక్కడ కూడా బోల్తా పడ్డా.    ఆ వివరాలు ఇదివరలో చెప్పాను - మీకు గుర్తుకువుండేవుంటుంది.

ఆ విధంగా నేను రొటీన్ లైఫ్ స్థిరపడ్డాను. మన సంగతి సరే కానీ మన పిల్లలూ మనలాగే నలుగురితో నారాయణ, పదిమందితో కలిసి గోవిందా అనాల్సిందేనా? గొప్ప గొప్ప చదువులు చదివి ప్రయోజకులు అయ్యి పెళ్ళి చేసుకొని పిల్లలని కని దేశాన్ని ఉద్ధరించాల్సిందేనా?  వారికి ప్రత్యామ్నాయ మార్గాలు నిర్దేశించే అధికారం మనకు లేకపోయినా కనీసం సూచించగలమా? వారి జీవితం కూడా ఇలాగే రొటీనుగా అంతం కావాల్సిదేనా? కనీసం వారినయినా జీవించనియ్యలేమా? మీరేమంటారూ?   

5 comments:

  1. నాస్తిక దేవుడు పెట్టిన పరీక్ష లో మీరు ఫేల్ అయ్యారు గురువు గారు... అమ్మాయి కావాలా సర్వీసు కావాలా అంటే మీరు అమ్మాయే కావాలన్నారు.

    ReplyDelete
  2. @ కాయ
    ఆ అమ్మాయి ప్రేమగా నన్ను (నా తలకాయని లెండి) నిమురుతూ గోముగా చెబుతూవుంటే ఏ దేవుడి పరీక్షలు అయినా దిగదుడుపే కాదూ?

    ReplyDelete
  3. నిజమే. లేవడం పనికెళ్ళడం రావడం తిందం తొంగోడం - ఈ వలయాన్ని మించి కాస్త ఆలోచించే మనిషికెవరికైనా ఉదయించే ప్రశ్నే ఇది.
    నేను మీకు పరిష్కారాలు సూచించనుగానీ నాకు పరిచ్యమైన ఒక వ్యక్తి గురించి చెబుతా.
    ఆయన మనకి ముందటి తరానికి చెందిన వారు. ఇలా అన్నారు - ఏముందీ, వయసొచ్చింది. వయసుతోటే సహజంగా కామం. దాన్ని క్రమబద్ధంగా తృప్తి పరుచుకోవడానికి పెళ్ళి. పెళ్ళి అనగానే సంసారం, పిల్లలు, బాధ్యతలు. నాకు ఇష్టమైన వ్యాపకాల్ని పక్కన పెట్టి కేవలం సంసారం కోసమే బతుకుని అంకితం చేశా - ఐతే ముందే నిర్ణయించుకున్నా - ఫలాని సంవత్సరానికల్లా నా బాధ్యతలు తీరిపోవాలి. ఆ తరవాత నాకిష్టమైన పనులు మాత్రమే చేస్తాను అని. అలాగే చెయ్యగలిగాను. సుమారు యాభై అయిదో యేట నా వ్యాపారాలన్నిటి నించీ బయటికి వచ్చేశాను. అప్పణ్ణించీ పూర్తిగా పఠనం - రచన - ఈ రెండే వ్యాపకాలు.
    ఆయన పోలవరపు కోటేశ్వర్రావుగారు. రాసింది కొద్ది సంవత్సరాలే అయినా, జీవితమంతా రాస్తుండిన కొందరికంటే మెచ్చదగిన సాహిత్య సృష్టి చేశారు రాశిలోనూ వాసిలోనూ. అంతర్జాతీయ ఖ్యాతి, అవార్డులూ ఆర్జించకపోయినా తను ఉన్న వూళ్ళో (విజయవాడే) ఎన్నదగిన పేరు తెచ్చుకున్నారు.

    ReplyDelete
  4. open standards లో రాసినందుకు ముందుగా ఒక Great అందుకోండి.
    సామాన్య జీవితం కన్నా కొద్దిగా తేడాగ(మార్పుగ) ప్రవరించాలన్నా, పనిచెయ్యాలన్నా..it needs lot of effort, not that easy, output అంత తొందరగ కనపడదు. కొత్త పాళీ గారు పరిచయం చేసిన వ్యక్తి style ఏదో బాగుంది.. :)

    ReplyDelete
  5. @ కొత్తపాళీ
    కెరీరుని సక్రమంగా ప్రణాళిక చేసుకొని, సహకారాలూ లభించి ఎంచక్కా 45 ఏళ్ళకే రిటైర్ అయ్యి తమకు నచ్చిన విధంగా జీవించినవారి విశేషాలు కొన్ని విన్నాను. మీరు ఉదహరించిన వారిలా 55 ఏళ్ళకు కాకపోయినా 65 ఏళ్ళకయినా బంధవిముక్తుడిని అవుతానేమో చూడాలి. చాలామంది విశ్రాంతి దినాలని కూడా అవిశ్రాంతంగా గడపేస్తుంటారు. అలా కాకుండా కనీసం అప్పుడయినా ఇతరులకు నచ్చే విధంగా కాకుండా మనకు నచ్చే విధంగా గడపగలమేమో చూసుకోవాలి.

    @ గిరీష్
    నిజమే. సహజంగా, సాధారణంగా, సింపుల్గా జీవించబోవడం అన్నది అసహజంగా, అసాధారణంగా, ప్రియంగా అవబోవడం ఆశ్చర్యకరమయిన విషయమే. కానీ మనలో సంకల్ప బలం వుంటే అవన్నీ దాటివెయ్యొచ్చులెండి.

    ReplyDelete