ఓ మిత్రుని మరణం

నిజానికి రాజు మా మేనల్లుని మిత్రుడు కానీ వాళ్లింట్లో, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరుగానే వుంటుండేవాడు. మాకు దూరపు బంధువు కూడానూ. నేను ఈ దేశాలకి వచ్చాక క్రమంగా స్నేహాం సన్నగిల్లినా ఆ ఆదరాభిమానాలు అలాగే వుండేవి. ఓ వారం క్రితం గొంతు క్యాన్సర్తో పోయేడు. కొన్నాళ్ళు బొంబాయిలో ఉద్యోగం చేసాడు. అక్కడ అలవాటు పడ్డాడుట - గుట్కాకి. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ సోకినట్లు తెలిసి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నా ఫలితంలేకపోయింది. ఇహ అది నయం కాని వ్యాధి అని అర్ధమయ్యాక ఇక ఖర్చులు పెట్టకుండా వైద్యం మానేసాడు. ఎందుకంటే డబ్బులు మిగిలితే తాను పోతే మిగిలిపోయే భార్యకీ, ఎదిగిన కూతుర్లకూ అయినా పనికివస్తాయి అనేది అతని ఆలోచనగా వుండింది.

ఇప్పుడు ఆ కుటుంబం కష్టాల్లో పడినట్లే. ఇంటర్ మరియు పది చదివే ఇద్దరు కూతుర్లు, ఇంటర్ మాత్రమే చదివిన భార్యా వున్నారు. అతని భార్యది మంచి మనస్థత్వం. ప్రేమ పెళ్ళి వారిది (ఒకే కులం). స్నేహితులు తలో కొంత సహాయం చేస్తున్నారు. అతను బ్రతికి వున్నప్పుడే నేనూ సహాయం చేద్దామనుకున్నా కుదరలేదు. ఇప్పుడయినా సహాయం చెయ్యాలి. అప్పట్లొ అతని ఉద్యోగం కోసం నేను కూడా ధన సహాయం చేస్తే అందులో చక్కగా స్థిరపడ్డాడు. ఆ ఉద్యోగం కోసమే బాంబేలో వుంటూ గుట్కా బారిన పడ్డాడు. త్వరలో పోతాడని తెలిసి కూతుర్ల బాధ్యతలు దగ్గరి బంధువులకు ఇచ్చేసాడు. తాను పోయిన తరువాత తన భార్య ఒక చిన్న ఉద్యోగంలో చేరేలా ఏర్పాటు చేసాడు.

అప్పట్లో నాకు మా పెళ్ళి సంబంధం సూచించింది కూడా అతనే. మా పెళ్ళయ్యాక కొన్నేళ్ళ తరువాత దంపతులం మేమిద్దరమూ ఏకగ్రీవంగా అందుగ్గానూ అతగాడిని తిట్టుకున్నామన్నది వేరే విషయం. అతని ఫ్రెండు ఒకతను వన్ వేలో అప్పట్లో మా ఆవిడ కాని మా ఆవిడని ప్రేమిస్తుండేవాడుట. అలా తెలిసింది ఈమె రాజుకి. ఆ ప్రేమ జరిగేపని కాదని అర్ధమయ్యి ఆ అమ్మాయిని రాజు నాకు పెళ్ళి సంబంధంగా సూచించాడు.  అమ్మాయితో పరిచయం లేకపోయినా అటువైపు వారు పరిచయం వుండటంతో వారితో మాట్లాడి పెళ్ళి చూపులు ఏర్పాటు చేయించాడు.

7 comments:

  1. నా ప్రగాఢ సానుభూతి

    ReplyDelete
  2. @ పతోడు

    ధన్యవాదాలు.

    అందరికీ,

    ఇలాంటి సందర్భాల్లో అందరికీ సహజంగానే సానుభూతి కలుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా వెల్లడించనక్కరలేదు. ఏదయినా ప్రత్యేకంగా వ్యాఖ్యానించాలనుకుంటే కామెంట్ చెయ్యండి.

    ReplyDelete
  3. ఈ కాన్సర్ కి వైద్య౦ ఎప్పుడు కనిపెడతారో కాని, బ్రతికి ఉ౦డగానే ఆ మనిషినీ, దగ్గరివారిని నరకయాతన పెడుతు౦ది .
    ఇక విషయ౦ పేషె౦ట్ కి చెప్పకు౦డా దాచి బాధపడేవారి కష్ట౦ మాటల్లో చెప్పలేనిది.

    ReplyDelete
  4. మీరేంటండోయ్ ? రాం గోపాల్ వర్మ లాగా తయారయ్యారు ? 'మీ స్నేహితుడిది స్వయంకృతం' ! లేదా 'మీ స్నేహితుడి ముందు చూపు కు మెచ్చుకోవాలి!' అని వ్యాఖ్యానిస్తే ప్రత్యేకంగా వ్యాఖ్యానించినట్టా ?

    ReplyDelete
  5. @ Sujata
    కాపీ పేస్టు శుభాకాంక్షలూ, సంతాపాలతో బ్లాగు స్పేస్ అనగా అగ్రిగేటర్ల కామెంట్స్ స్పేస్ వృధా చెయ్యడం నాకు ఇష్టం వుండవండీ. కొందరు బ్లాగర్ల పుట్టినరోజులూ, పండగలూ, పబ్బాలూ వచ్చినప్పుడు కామెంట్స్ సెక్షన్లు చూడాలాంటేనే చిరాకు అనిపిస్తుంది - అందువల్లే.

    @ మౌళి
    నిజమే.

    ReplyDelete
  6. ఒక స్నేహితుడి మరణం గురించి రాస్తూ కూడా.. ఒకప్పుడు మీ ఆవిడకాని ఆవిడని ఏవరో ప్రేమించారంటూ.. ఆ ప్రేమ వ్యవహారం జరిగేపని కాదంటూ ఒక గతానుభవాన్ని, ప్రస్తుత విషయాన్ని ముడి పెట్టి రాయడం మీకే చెల్లింది. :)

    స్నేహితుడి స్వయంకృతాపరాధం కాదు కాని, తన బార్యని తను లేకుండా జీవించడానికి ఏర్పాట్లు చేయడం అనేది అదేదో నవలలో చదివాను. ఇదిగో ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను. కాని ఇది నిజం ఎదో ఒక జబ్బు వస్తే అని కాదు , ప్రతి బార్యా, భర్త ఈ విషయంలో తయారుగానే ఉండాలన్నది నా అభిప్రాయం, "నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు" అనే ప్రేమ వేరు.. మరణం తప్పదు కాబట్టి ఇద్దరిలో ఏ ఒకరు ముందు పోయినా కుటుంబం కష్టపడకుండా చేయడమనేది ప్రతి బార్య/భర్త ఆలోచించి ఆచరించవలసిన విషయం. మీ స్నేహితునికి నా సానుభూతితో పాటు మౌన అభినందన నివాళి.

    ReplyDelete
  7. @ రమణి
    అది ఆ అబ్బాయి వన్ వే ప్రేమ కాబట్టే ప్రస్థావించాను :) టు వే అయితే అది (అప్పటి) ఆ అమ్మాయి ప్రైవసీకి సంబధించిన విషయం కాబట్టి చెప్పకపోయేవాడిని. ఎలాంటి వే అయినా నాకు చెప్పడానికి అభ్యంతరాలు ఏమీ వుండవు గానీ మా ఆవిడకి వుంటుంది కదా. మా ఆవిడ మిగతా ఆడాల్లందరిలాగా మహా పతివ్రత అయిపాయే.

    కుటుంబం కష్టపడకుండా చెయ్యడం అంటే సంపాదించి పెట్టి పోవడమే కదండీ. నిజమే. అందులో కొంచెం వీకు నేను కానీ ఆ పనిలోనే వున్నాను. యెప్. మీరన్నట్లు మనం పోయాక మన కుటుంబం కనీస మాత్రం అయినా సుఖంగా బ్రతికే ఏర్పాట్లు చేసుకోవాలి. మా రాజు డబ్బులు తన చికిత్స కోసం అనవసరంగా ఖర్చు పెట్టించకుండా కుటుంబం కోసం మిగిలించాడు. స్వయంకృతాపరాధంతో జబ్బు కొనితెచ్చుకున్నా కూడా ఇలాంటి ఏర్పాట్లతో ఆ తప్పుని ఎంతోకొంత సవరించుకుని పోయేడు.

    ReplyDelete