తింటే ఆయాసం - తినకపోతే నీరసం

నిత్య జీవితంలో నాకున్న అతి పెద్ద ఛాలెంజి వ్యాయామం. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం మాటేమో కానీ నాకు అదే పెద్ద ఒత్తిడి అయిపోయింది. రోజూ అన్నింటికీ ముహూర్త బలం బాగానే వుంటుంది కానీ దానికి మాత్రం సమయం అచ్చిరాదు. చేద్దాంలే చేద్దాంలే అని వాయిదా వేస్తూ అలా అలా కాలాతీతమవుతూవుంటుంది. ఏదయినా కడుపులో పడెసామనుకోండి - తిన్నాం కాబట్టి ఆయాసంగా వుంటుంది. అరిగాక చెయ్యొచ్చులే అనుకుంటే అరిగాక నీరసంగా వుంటుంది. మళ్ళీ ఏదయినా బొజ్జలో పడెయ్యాలనే అనిపిస్తుంది కానీ ససేమిరా ట్రెడ్మిల్ ఎక్కబుద్ది కాదు.  ఆకలి కావడానికీ, కాకపోవడానికీ మధ్య సరిగ్గా టైమింగ్ చూసుకొని చెయ్యాలి వ్యాయామం కానీ మనమేమన్నా రాజులమా? సమయానికి ఏదో ఒహ పని ముందేసుకొనో, మీద బడో వుంటుంది కదా. ఇంట్లో రాణిగారి ఆజ్ఞలూ పాటిస్తూవుండాలి కదా.

ఉదయం అయిదు గంటలకు లేచి ఓ రెండు రోజులు చేసా కానీ ఎందువల్లనన్నా నిద్రా భంగం అయితే ఆ అయిదు గంటల కార్యకరమం కూడా డుమ్మా కొడుతోంది. అందుకే ఈమధ్య షెడ్యూలు మార్చేసా.  ఇంటికెల్లగానే శుబ్బరంగా తినేసి, ఇంట్లో పనులు చేసేసి, ఫుడ్డు అరిగాక నీరసం రాకముందే ఏ తొమ్మిదిగంటలకో బెడ్డేక్కేబదులు ట్రెడ్‌మిల్లు ఎక్కేస్తున్నా - ఓ చక్కని సినిమా పెట్టేసుకొని చూసేసుకుంటూ. ఈ ఆనందం ఎంతకాలమో అదీ చూద్దాం. 

మిగతా కబుర్లు ఏమయినా వుంటే కామెంట్సుగా వ్రాస్తానేం.

4 comments:

  1. nobody has mood to read this kind of posts now..
    watch telugu TV or read newspapers sir....

    ReplyDelete
  2. హహ హా.. నువ్వు తింటే ఎంత.. పంటే ఎంత.. అంటున్నడు గురువు గారు..

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    తెలుగు టివి కొద్దిగా మాత్రమే చూసే, కొద్దిగా మాత్రమే చూడగలిగే అదృష్టవంతుడిని నేను. నిన్న కొద్దిగా చూసాను - ఏముంది రొటీన్ ఖండనలు, మండనలు. ఆంధ్రజ్యోతి ఛానల్ కొద్దిసేపు చూసాను - విగ్రహాలు పగలగొడుతున్న వారి ముఖాలు కనిపించకుండా జాగ్రత్తగా చూపించారు. అదే ఏ పోలీసయినా విధ్వంసక వాదినయినా పగలగొడ్తున్నట్లయితే మాత్రం పదేపదే చూపిస్తారు. నిన్న మీడియాకి తగిన శాస్తి బాగానే జరిగింది. ఉద్యమాలు ఉన్మాదంగా అయ్యేవి వాళ్లిస్తున్న అనవసరపు, అతి ప్రచారాల వల్లే.

    ReplyDelete
  4. @ అజ్ఞాత
    అందుకేగా నిన్న మణిచందన-2 పోస్టు వెయ్యనిది.

    ReplyDelete