జీవన వైరుధ్యాలు

(మరో సైటు నుండి పునః ప్రచురణ)

నేను నార్త్ అమెరికాకి వచ్చి 13 ఏళ్ళు అవుతోంది. వచ్చినప్పటినుండీ మన ఇండియా జీవన శైలికీ, ఇక్కడి జీవన శైలికీ మధ్య వున్న తేడాలను ఆసక్తిగా గమనిస్తూనేవున్నాను. అందరికీ తెలిసిన విభిన్నతే కాకుండా ఇంకా ఏమయినా వైరుధ్యాలు వున్నాయా అని పరిశీలిస్తూనేవున్నాను. నేను గమనించిన వాటిల్లో ముఖ్యమయినది స్వేఛ్ఛ. ఈ పాశ్చాత్య దేశాలు స్వేఛ్ఛకి పేరు పెట్టినవి. మరి ఇంతటి స్వేఛ్ఛాసమాజల్లో కూడానూ నాకు ఏదో అసౌకర్యం అనిపిస్తూనేవుంది. అదేంటబ్బా అని తరచి చూసాను. ఇక్కడి సమాజాలు స్వేఛ్ఛా సమాజాలే కానీ భారత దేశంలో మనం అనుభవించినప్పటి స్వేఛ్ఛ కాదు. అదెలాగో చూద్దాం.

ఇండియాలో అయితే చిన్న చిన్న స్వేఛ్ఛలు బోలెడన్ని వుంటాయి. నడిరోడ్డు మీద స్వేఛ్ఛగా ఉమ్మి వేయగలం, మిత్రులతో కలిసి తాగుతూ కారులో వెళ్లగలం, పక్కింటికి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కబుర్లు చెప్పగలం అలా అలా. భారత దేశంలో ఎన్ని చట్టాలు వున్నా పాటిని సరిగ్గా పాటించే నాధుడు కానీ, పట్టించుకునే నాధుడు కానీ వుండక అందరికీ ఇష్టారాజ్యంగా వుంటుంది. కానీ ఈ దేశాల్లోని ప్రజలు చట్టబద్దులై ప్రవర్తిస్తారు. వారి మెతకదనాన్ని అలుసుగా తీసుకొని ఇక్కడి శాసనకర్తలు టన్నులకు టన్నులుగా చట్టాలు చేసి దేశం మీద వదులుతారు. ఇక్కడ రక్షణ, ప్రైవసీ విషయాల మీద ఆదుర్దా ఎక్కువ. ఎక్కడో జరిగిన చిన్న విషయాలకు కూడా మీడియా ఫోకస్ ఎక్కువయ్యి ఎక్కువగా ఆదుర్దాపడుతుంటారు. అందువల్ల జాగ్రత్తలు ఎక్కువయ్యి స్వేఛ్ఛ విషయంలో రాజీపడుతూ తమలోతాము కుచించుకుపోతూవున్నారు.

ఉదాహరణకు పిల్లలకు పాఠశాలల్లొ స్వేఛ్ఛగా ఆడుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ప్లేగ్రవుండులో ఆడుకోవడానికి ఓ పాతిక నియమనిబంధనలు వుంటాయి. ఒకరిని సరదాగా కూడా తొయ్యకూడదు, ఒకరిమీద మంచు గడ్డలు విసరకూడదు… అలా ఎన్నెన్నో నిబంధనలు. ఎక్కడో అరా కొరా ఎవరికో అలా చేసినందువల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగివుంటాయి. అంతే, ఇహ ఆ విషయాల్లో ఓ నియమం ఏర్పాటు చేసి పడేస్తారు. పిల్లలు అన్న తరువాత సరదాగా తోసుకోవడం, తన్నుకోవడం వుంటాయనుకుంటాము. కానీ ఇక్కడ చేతులు వెనక్కు కట్టేసుకొని ఆడుకోవాలా అని ఆ నియమాలు అన్నీ చదివితే అనిపిస్తుంది. ఇలా ప్రతీ విషయానికీ ఎన్నో నియమ నిబంధనలు వుంటాయి. వాటినన్నింటినీ చదువుతుంటే ఏదో ఊపిరి సలపని భావన, అసౌకర్యం మనలో కలుగుతుంది. ఏదో కోల్పోతున్నామన్న బావన. ఎవరో మనని తాళ్ళతో బంధిస్తున్న భావన. అలా మనం కోల్పోతున్నది మన స్వేఛ్చ అని అర్ధం అవుతుంది.

అలా అని ఇక్కడ స్వేఛ్ఛ లేదా? వుంది, బోలెడంత వుంది. కానీ అదంతా చట్టబద్దమయిన స్వేఛ్ఛ. ఎన్నో చట్టాలనే బంధనాల మధ్య మన స్వేఛ్ఛని మనం వెతుక్కోవాలి. ఇక్కడివాళ్ళు చిన్నప్పటినుండీ ఆ చట్టాల్లొనే పెరిగారు కాబట్టి వీరికి భారత దేశంలో వున్న స్వేఛ్ఛ వీరికి తెలియదు. ఆ ఫ్రీడం వీళ్లకి అర్ధం కాదు. అందుకే ఈ దేశాలు మరిన్ని చట్టాలు రుద్దినా, మరిన్ని బంధనాలు వేసినా పెద్దగా వ్యతిరేకించకుండా అలవాటుపడిపోతారు. రక్షణ కోసం అంటే చాలు అన్నింటికీ తల ఊపుతారు, తల ఒగ్గుతారు.

అయితే ఈ దేశాల్లో గొప్పదనం లేదా? వుంది. జీవన ప్రమాణాలు చాలా బావుంటాయి. ఆ ప్రమాణాల కొసం తమ యొక్క చిన్న చిన్న వెసులుబాట్లు ఎన్నో వెనకబడుతున్నాయి అన్నది వీరికి అంతగా బోధపడదు. మనలాంటి వారం రెండు జీవనశైలులను చూసిన వారికే, తెలిసినవారికే ఆ తేడా అర్ధం అవుతుంది. భారతీయులు అంతగా జీవన ప్రమాణాలని కోల్పోతూవున్నారని ఈ దేశాల్లో కొంతకాలం నివసిస్తే తప్ప మనకు అర్ధం కాదు. అలాగే ఇక్కడి వారు కొంతకాలం భారత్ లో వుంటే తప్ప ఇక్కడివారు ఏం కోల్పోతున్నారో వారు అర్ధం చేసుకోలేరు.

అలా అని తెలుసుకున్నంత మాత్రాన అలా కావాలంటారని కాదు. ఇకడి నుండి భారత్ కు సందర్శనానికి వెళ్ళిన దేశీ పిల్లలు అక్కడ వున్నంత సేపు ఎంతో చక్కగా, స్వేఛ్ఛగా పలు మందితో ఆటపాటలతో గడిపినా కూడా మళ్ళీ వెనక్కు వచ్చాక పెద్దగా ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం నేను గమనించాను. అలాగే పెద్దలకు కూడా తమకు అలవాటులేని ఆ చిన్న చిన్న స్వాతంత్యాలు వారిలో అభద్రతా భావాన్నీ కలిగించి అవన్నీ ఇబ్బందిగా అనిపించవచ్చు. తమకు అలవాటులేని జీవన శైలి పట్ల బెరుకుతో వైముఖ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

ఈ విషయాలన్నింటినీ ఒక విషయంతో పోలిక చేస్తుంటాను. ఇక్కడి వారు ఎవరయినా ఇండియాకూ ఇక్కడికి తేడా చెప్పమంటే ఈ పోలికతో వివరిస్తుంటాను. ఈ దేశాల్లో చిన్న చిన్న వెసులుబాట్లు తక్కువ, జీవన ప్రమాణాలు ఎక్కువ. అందుకే ఈ దేశాల్లోని జీవనాన్ని బంగారు పంజరంలోని చిలకలాగా భావిస్తుంటాను. అలాగే ఇండియాలో వ్యక్తికి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువ, చట్టపు కట్టుబాట్లు, నియమ నిబంధనలు తక్కువ కాబట్టి స్వేఛ్ఛగా ఎగిరే పక్షిలాగా ఉపమానం ఇస్తాను. అయితే అక్కడి జీవన ప్రమాణాలు తక్కువ కాబట్టి పంజరంలోని పక్షి అంత భద్రంగా స్వేఛ్ఛగా ఎగిరే పక్షి జీవించలేదు. అసౌకర్యంగా వున్నా కూడా పంజరంలోని పక్షే ఎక్కువకాలం జీవిస్తుంది. మరి మీరు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు? ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? మన చుట్టూ ఓ పంజరం అల్లుకొని వుందన్న వాస్తవం మనకు బోధపడితేగానీ మన ఆలోచనల్లో కదలిక రాదు. ఇండియాలో నివసించాలా లేక విదేశాల్లో నివసించాలా అన్న సందేహం వచ్చినప్పుడు మనం ఈ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉపయోగకరంగా వుంటుంది అంతే కానీ ఈ ఒక్క కారణాన్నో లేక ఏ ఒక్క కారణాన్నో పరిగణలోకి తీసుకొని అలాంటి విషయాలని తేలిగ్గా తేల్చేయలేము కదా.

6 comments:

 1. ఏంటి బాసు... ఈ మద్యలో పూర్తిగా నల్లపూస అయిపోయారు తమరు

  ReplyDelete
 2. స్టాండర్డ్స్ గురువు గారు,, ఇద్దరికి అంగీకారం ఐతే ఏదైనా చేస్కొవచ్చు అనే స్టాండర్డ్స్.. తోసుకోవడం అంటే, కావాలని తోసేస్తే తప్పే కానీ, ఇద్దరూ మాంచి దోస్తు లైతే మాత్రమే ఆ పని చేస్తారు కదా.. ఊరికే తోసేస్తే రూల్ బుక్ తీయాల్సిందే కదా...

  మీరు ఊరికే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు..

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  అసలే ఈమధ్య నేను (బ్లాగుల్లో) పోయానంటున్నారట కదా. అప్పుడప్పుడు అలా అలా విశ్రాంతి తీసుకుంటూ మౌనంగా అన్నీ గమనిస్తుండటం నాకు బావుంటుంది.

  @ కాయ
  మన కాలు ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ లాగ కాబట్టి అప్పుడప్పుడూ అలా కొట్టుకోక తప్పదు మరీ.

  ReplyDelete
 4. మీరు బాగా రాశారు .. అంటే తర్కాన్ని బాగా సమర్ధవంతంగా పేర్చారు. ఐనా ఏంటో ఒక సమాధానంలేని గుబులుగా అనిపించింది ఇది చదువుతుంటే. బహుశా మనలాంటి ప్రాణులకి అది సహజమేనేమో.

  ReplyDelete
 5. చాలా చక్కని విశ్లేషణ..మంచి కోణాన్ని స్పృశించారు.

  ReplyDelete
 6. @ కొత్తపాళీ, సౌమ్య
  ధన్యవాదాలు

  ReplyDelete