మా ఆవిడ నొప్పులకి కైరోప్రాక్టర్ ట్రీట్మెంట్

చాలా ఏళ్ళుగా పలు నొప్పులతో మా ఆవిడ బాధపడుతూ రకరకాల డాక్టర్లని, ట్రీట్మెంట్లని, సర్జరీలని పలు దేశాల్లో ఆశ్రయించిందనీ లాభం లేకపోయిందనీ కొన్ని నెలల క్రితం ఒక టపాలో చెప్పుకువచ్చేను. ఆమెకు కుడి భాగం మాత్రమే దాదాపుగా పైనుండి కింది దాకా నొప్పి వుంటోంది. కొందరేమో టెండనీటిస్ అనీ కొందరేమో ఆర్థరైటిస్ అనీ కొందరేమో వెన్నుపూస సమస్య అనీ చెప్పారు.

ఇహ అలాక్కాదని మొన్న ఓ కైరోప్రాక్టరు (వెన్నుపూస నిపుణుడు) ని కలిసాము. ఎక్సురేలు తీసి వెన్నుపూసలో మెడ భాగం వుండాల్సిన దానికన్నా నిటారుగా వుందనీ, ఖాళీ ఎక్కువుందనీ చూపించేడు. అందువల్ల నెర్వ్ స్టెం వత్తుకుపోయి ఈ నొప్పులన్నీ వస్తుండవచ్చు అని తీర్మానించేడు. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటు వల్ల నెలలోనే కొంత ఫలితం అయినా కనపడవచ్చని సూచించాడు. ఈ రోజు నుండి చికిత్స మొదలవబోతోంది.

ఆ చికిత్స పూర్తిగా మాకు ఆరోగ్య భీమాలో కవర్ అవుతోంది కాబట్టి డబ్బు సమస్య లేదు. మీలో ఎవరయినా కైరోప్రాక్టిక్ చికిత్స తీసుకున్నారా? ఈ చికిత్స వల్ల ప్రయోజనాలు వుంటాయా? మీ అభిప్రాయాలూ, అనుభవాలూ ఏమిటి? ఇలాంటి చికిత్సకు వెళ్ళడం మొదటిసారి కాబట్టి ప్రయోజనకరమా కాదా అన్న సందేహాలు వస్తున్నాయి. 

కొన్నాళ్ళు ఇలా...చేసి చూస్తానేం

ప్రతీదాంట్లోనూ అప్పుడప్పుడూ, ఎప్పుడోఒకప్పుడూనూ వైరాగ్యం రావడం సహజమేననుకుంటాను. అలాగే బ్లాగర్లకీ, బ్లాగు కామెంటర్లకీ, రీడర్లకీ అలాగే (తాత్కాలిక) వైరాగ్యం అప్పుడో, ఇప్పుడో వస్తుందనుకుంటాను. అది మోతాదు ఎక్కువయ్యితే వాళ్ళు బ్లాగులనుండి దూరంగా పారిపోతుంటారు. నాక్కూడా అప్పుడప్పుడు వైరాగ్యం వస్తుంది కానీ మళ్ళీ ఓ బోల్టేసుకొని పదండి ముందుకు, తోసుకు, పూసుకు అని వచ్చేస్తుంటా.

నాకు కూడా పలు కారణాల వల్ల (తాత్కాలిక) శ్మశాన వైరాగ్యం బ్లాగుల్లో కలిగింది. అలాంటప్పుడు కొంతకాలం విరామం ఇచ్చి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో బ్లాగుల్లోకి దుమికేస్తుంటాను కానీ ఈసారి అలా కాకుండా మరోలా చెయ్యదలిచాను. ముక్కు దురదపెడితే మందేసుకోవాలి కానీ కోసుకొవడమేంటీ అనిపించింది. అందుకే కొద్దిరోజుల పాటు తెలుగు అగ్రిగేటర్లూ, బ్లాగులూ చూడకుండా నా బ్లాగు మాత్రమే వ్రాద్దామనుకుంటున్నాను. మహా అయితే నా 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు చూసుకుంటానేమో. ఎప్పుడన్నా ఎక్సెప్షన్స్ వుంటాయండోయ్. లేకపోతే ఏ బ్లాగులోనన్నా నేను కనపడితే ఇక్కడున్నారేంటీ అని మీరు నిలదీయగల్రు. చూద్దాం ఇలా ఎన్ని రోజులో.

ఎందుకూ ఈ విరక్తి అంటారా? ఆ ఏముందీ బ్లాగుల్లో ఎక్కువ భాగం ఎదవ గోలా, ఎదవ రాతలూ తప్పించీ. వైరాగ్యంలో అలాంటి మాటలే వచ్చేస్తాయి మరి :) ఎలాగూ మంచి బ్లాగులయితే నా సంకలినిలో వుంటాయి కదా. అవి చాలు నాకు ప్రస్థుతానికి. ఇంకేమన్నా మంచి బ్లాగులుంటే చెప్పండి - అందులో జత చేసుకొని చూసేసుకుంటా.

కెనడా కోర్టులో బురఖా వేసుకోవచ్చా?

ఇతరదేశాల సంగతీ, భారత్ లో సంగతీ నాకు తెలియదు కానీ కెనడా సుప్రీం కోర్టు ముందుకు ఈ విషయం వచ్చింది. చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. ఆ వార్తకు వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఈ ఆంశం మీద వివిధ కెనడియన్ల, ఇతరుల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు.

కెనడాకి వలస వచ్చిన వారు ఆ దేశపు విలువలను పాటించాలా లేక తమ తమ వ్యక్తిగత మత స్వేఛ్ఛను పాటించాలా అన్నది ఇక్కడ ప్రశ్న. నేనయితే దేశాభిమానినే.

http://www.thestar.com/news/canada/article/955500--supreme-court-agrees-to-hear-case-of-woman-who-wanted-to-testify-in-niqab?bn=1

నేను పోగొట్టుకున్నదాంతో పోలిస్తే నీ పోగొట్టుకోవడం ఎంతా?

మా ఆవిడ కారు షాకు ఇస్తుందేమో అనుకుంటే ఖజానా షాకు ఇచ్చింది. మొన్న ఆదివారం అరోరాలోని షికాగో ప్రీమియల్ అవుట్లెట్స్ ప్లాజాకి వెళ్ళాం. కోచ్ వానిటీ బ్యాగు డీలులో చాలా చవకగా వస్తున్నదనీ $300 బ్యాగు $100 కే వస్తోందనీ హైవేమీది నుండి వెళ్ళాలి కాబట్టి హైవే మీద కారు ప్రాక్టీసు చేసినట్లు వుంటుందనీ తోడుగా నన్ను పట్టుకెళ్ళింది. మాతో పిల్లలు రాలేదు.   అంత బ్రాండెడ్ వానిటీ బ్యాగులు మనకు అవసరమా అని అడిగాను కానీ వద్దనలేదు. తన డబ్బులతో కొనుక్కుంటోంది కాబట్టి వద్దనే అధికారం నాకు అంతగా లేదు కదా.   మనం సంపాదించిన డబ్బులమీద వాళ్ళకు సర్వహక్కులు వుంటాయి కానీ వారి డబ్బుల మీద మనకు ఏమాత్రం హక్కు, అధికారం వుండవు కదా. అందుకే ఆమె డబ్బులతో ఆమె ఏం చేస్తుందనేది పెద్దగా పట్టించుకోను కానీ ఉపయోగకరమయిన వాటిని కొనుక్కోమని చెబుతుంటాను. నగలు, నట్రాలేవో కొనుక్కుంటూవుంటుంది.

అక్కడ తన (పాత) వానిటీ బ్యాగులోనుండి ఎవరో డబ్బులు, బంగారం కొట్టేసారు. ఎలా కొట్టేసారో, ఎక్కడ కొట్టేసారో తెలియదు గానీ అవి మాత్రం మాయం అయిపోయాయి. ఒకే ఒక్క అనుమానాస్పద విషయం ఆమె రెస్టురూములో వున్నప్పుడు జరిగిందంట.  ఆ గదిలో టాయిలెట్ సీటు మీద పేపర్ పరిచేందుకై  ఒకసారి వేరేవైపుకు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి కొక్కేనికి తగిలించిన బ్యాగు కిందపడివుందంట. అంతకుమించి ఏమీ ఆమెకు అర్ధం కావడం లేదు. బ్యాగు కోసిలేదు, తెరచిలేదు! ఆ దొంగ ఎవరో కానీ చాలా పద్ధతిగా తన కళని ప్రదర్శించినట్లుంది. ఏమాత్రం అనుమానం రాకుండా దోచుకుపోయారు. వాతావరణం కాస్త బాగుండటంతో ఆ రోజు అసలే  ఆ ప్లాజాకి జనాలు బాగా వచ్చారు. పావుగంట వరకు మాకు పార్కింగే దొరకలేదు. 

ఎన్ని డబ్బులు, ఎంత బంగారం పోయుంటుందో ఊహించండి చూద్దాం. ఏదో 50, 60  డాలర్లు, కొద్దిగా బంగారం పోయుంటుందనుకుంటున్నారా! నేనూ అలాగే అనుకున్నా. వెధవాయిని. డబ్బులు సుమారుగా $300 మరియు పలు ఆభరణాలు కలిపి చుట్టుపక్కల $2500 పోయాయి. ఆమె పోయిన ఆభరణాల లిస్టు చదువుతుంటే ఇవన్నీ ఇంట్లోనో, సేఫు డిపాజిట్ బాక్సులోనో పెట్టుకోక బ్యాగులో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావూ అని బోల్డంత ఆశ్చర్యపోయా. పదేళ్ళనుండి ఇలాగే పెట్టుకొని తిరుగుతున్నా, ఎవడన్నా దోచాడా అని నన్నే నిలదీసింది. అంటే పదేళ్ళనుండీ చేసిన పొరపాటునే చేస్తూవస్తున్నావన్నమన్నమాట అని బేర్ మన్నాను.  ఆమె బేబీ సిట్టింగు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కొన్ని ఇలా పొగొట్టుకుంది. అందులో నా సంపాదన మీద కొనుక్కున్నవి కూడా వుండొచ్చు కానీ నాకు ఆ బంగారం లెక్కలు తెలియదు లెండి.   

ఆ ప్లాజా సెక్యూరిటీ వాడికి ఫిర్యాదు చేసాం. సిసి కెమెరాల్లో ఏమన్నా కనిపిస్తుందేమో చూడరా బాబూ అంటే కేఫిటేరియాలో నెలకొల్పిన వాళ్ళ టివిలు ఎత్తుకుపోకుండా గమనించడానికి మాత్రమే ఆ కెమెరాలు పెట్టామనీ, మిగతా ప్రదేశాలు అవి కవర్ చేయవనీ సెలవిచ్చాడు. ఇలా ఖజానాలు బ్యాగుల్లో పెట్టుకురావద్దని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు కానీ మా ఆవిడకి తెలియదురోయ్ అని బావురుమన్నాను. ఇలాంటి దొంగతనాలు మీ ప్లాజాలొ జరుగుతంటాయట్రా అని అడిగాను. ఆహా భేషుగ్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పాడు. అతని సలహా మీద పోలీసు స్టేషనుకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాము.  అమ్మా, ఇదండీ అంగతి. మీరు షాపింగుకి వెళ్ళినప్పుడు నగానట్రా బ్యాగుల్లో వేసుకొని వూరేగకుండా ఇంట్లోనో, బ్యాంకులోనో దాచుకోండి తల్లీ. మా ఆవిడ వానిటీ బ్యాగు ఒక మహాసముద్రం కాబట్టి ఆమె బ్యాగు జోలికి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల అందులో నగానట్రాలు కూడా వుంటాయని నాకు మొన్నటిదాకా తెలీలా.  తెలిసివుంటే తను విన్నా వినకపోయినా నా బాధ్యతగా నేను హెచ్చరించి వుండేవాడిని. 

మరి మనకు బ్యాంకు సేఫ్ డిపాజిట్ బాక్సు ఎందుకూ, ఎంచక్కా అందులోవి అన్నీ కూడా బ్యాగులో పెట్టుకురాకపోయావా అని మా ఆవిడని విసుక్కున్నాను. మా ఆవిడని ఊరడించాలో, తిట్టాలో అర్ధం కాక మధ్యస్థంగా హితబోధలు చేస్తూ గులిగాను. మా ఆవిడ నిన్న మధ్యాహ్నం అంతా ఏడ్చుకుంటూ, ఆహారం తీసుకోకుండానే వుందని ఇంటికి వెళ్ళాక తెలిసింది. బాధ పడ్డంత వరకు చాల్లే, అంతా ఒకసారే బాధపడితే మరి ముందు ముందు సందర్భాల్లో ఎలా అని ఊరడించాను. నేను పోగొట్టుకున్న వాటితో పోలిస్తే నువ్వు పోగొట్టుకున్నది ఎంత అని జోకులేసాను. శనివారం రాత్రి బావగారూ, బాగున్నారా సినిమా చూసాము లెండి. అందులో కోట డైలాగు అది. అందులో తన కొడుకు శ్రీహరితో ఆ డైలాగు పదేపదే అంటుంటాడు. బాధలో, లాసులో వున్నా కాబట్టి వచ్చేవారం న్యూయార్క్ ట్రిప్పుకి రానంది. సంపాదన ఎలాగయితే జీవితంలో భాగమో అలాగే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లూ, పోగొట్టుకోవడాలూ జీవితంలో భాగమేనని చెప్పేసి నచ్చచెప్పాను.

నేను ఓ జీవితమే పోగొట్టుకున్నాను. దానితో పోలిస్తే మా ఆవిడ పోగొట్టుకున్నది ఎంత లెండి. లైట్ :)

ఏదో ఒక రోజు

మా ఆవిడ చాలా చక్కగా కారు డ్రైవింగ్ నేర్చేసుకుంది. కారు తోలడంలో నేను చెప్పే టెక్నిక్కులు, మెళకువలు విని మీకెంత అనుభవం వుందండీ అని ఆశ్చర్యపోతూ ప్రశంసిస్తూవుంటుంది. మీరే లేకపోతే ఇంత త్వరగా కారు నేర్చుకునేదానినా అంటూ వుంటుంది. నేను ఏదయినా పొరపాటు చేస్తున్నావు అని చెబితే తను ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకుంటుంది. తను అలా చెప్పినట్టు చెయ్యడం వల్ల ఆమెకు డ్రైవింగ్ నేర్పుతుంటే ఇంకా నేర్పబుద్ధి అవుతోంది. ఏనాడు ఈ డ్రైవింగ్ పాఠాలకు ముహూర్తం పెట్టానో కానీ అప్పటినుండీ క్లాసులు చాలా చక్కగా సాగుతూ వస్తున్నాయి. ముహూర్తబలం మరీ. ఈసారి లాంగ్ డ్రైవుకి వెళ్ళినప్పుడు వెనక సీట్లో పడకేసి శుబ్బరంగా గురకెయ్యొచ్చు.

సర్లెండి. పైదంతా కల కాదు గానీ అందరూ ఎలాగయితే తమ కుటుంబ కబుర్లు వ్రాస్తారో అలా వ్రాసి చూసానన్నమాట. బావుందా? ఇక శరత్ బ్లాగింగులోకి వెళదాం.

మా ఆవిడ డ్రైవింగ్ చూస్తుంటే నాకు ఒణికిపోతోంది. పోనీ చెబితే వింటుందా నేను అలా చెప్పడం తన మానవ హక్కుల భంగం అనేలా చూస్తుంది. పోనీ కారు కీస్ తీసుకొని పెట్టుకుందామంటే ఆకాశంలోని సగం స్త్రీల హక్కుల భంగం అని ఇంట్లో రభస తప్పదు. అలా అని వదిలేస్తే ఏనాడో ఒహనాడు ఏదో ఒక ప్రమాదం జరుగకపోదు అనిపిస్తోంది. ఇంకా నయ్యం, వీలయినంతవరకు తానొక్కతేనో లేక తన స్నేహితురాళ్ళతోనో వెళుతూవుంటుంది, నన్ను వీలయినంత వరకు ఎవాయిడ్ చెస్తుంది. నేను పక్కనుంటే నెర్వస్ అవుతుందిట. చూసారా, నేనంటే మా ఆవిడకి ఎంత భయ్యమో!   కారు కీస్ లాగేసుకొని రోజూ తన తిట్లు తినేకంటేనూ ఏదో ఒక ఆ రోజు, ఎప్పుడొస్తుందో తెలియని ఆ రోజు కోసం ఎదురుచూడ్డమే  బెటర్ లా వుంది. ఆ రోజు మా కారు ఏ గోడకో, చెట్టుకో గుద్దేస్తే జరిగే ఖర్చులను ప్రత్యేక భరించడం కోసం ఒక భవిష్య నిధిని పోగేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాను. నెలానెలా అందులో పడెస్తే ఏనాడో, ఒకనాడు ఉపయోగానికి రాకపోదు.  ఎందుకూ ఇవన్నీ మాకు చెప్పడం అంటారా? మరి ఎవడికి చెప్పుకోను నా ఎమోషన్స్ అన్నీ? 

ఇహపోతే మా పెద్దమ్మాయి ఎంచక్కా, బుద్ధిగా చెప్పినట్లు వింటూ కారు నేర్చుకుంటోంది. ఈ వారాంతం హైవేమీద కారు డ్రైవింగ్ నేర్పబోతున్నాను.

విగ్రహాలకి కూడా రిజర్వేషన్లు వర్తింపచెయ్యాలి!

భారత ప్రజానీకానికి రిజర్వేషన్లు మొదట ప్రతిపాదించింది అబేద్కరో లేక మరెవ్వరో నాకు గుర్తుకులేదు కానీ వారు ఒక ఘోరమయిన పొరపాటు చేసారు. ప్రజలతో పాటు విగ్రహాలకీ రిజర్వేషన్లు వర్తింపజెయ్యాలనే ప్రాధమిక పరిజ్ఞానం వారికి లేక ఆ విషయలో పొరపాటు చేసారు. వారు చరిత్రకి సమాధానం అనగా సారీ చెప్పాలి. రిజర్వేషన్లు లేనందువల్లనే కదా నిన్న హైదరబాదులో అంత ఘోరం జరిగిందీ? రాష్ట్ర రాజధానిలో మూడు ప్రాంతాల వారి విగ్రహాలను ఆయా ప్రాంతాల దామాషా ప్రకారం పెట్టివుంటే కనీసం ఒక ప్రాంతం వారి శాతం విగ్రహాలయినా అనగా 42% విగ్రహాలయినా కనీసం ఈసారి మిగిలివుండేవి కదా!

ఇప్పుడు పాత విగ్రహాల స్థానే కొత్త విగ్రహాలు పెడతామని ముఖ్యమత్రి గారు సెలవిచ్చారుట. ఎవరి విగ్రహాలు పెడతారు? భవిశ్యత్ చరిత్ర చేత ప్రశ్నించబడకుండా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. స్త్రీల విగ్రహాలని తగిన శాతంలో పెట్టకపోతే ముందు ముందు స్త్రీ వాదులు పురుష విగ్రహాలతో ఓ ఆట ఆడుకునే ప్రమాదం వుంది. అందుకే ఆకాశంలో వారు సగం కాబట్టి విగ్రహాల్లో కూడా వారు సగం వుండాలి. ఏ రాణి రుద్రమదేవి విగ్రహం ఒక్కటో పెడితే సరిపోదు. కవయిత్రి మొల్లలాంటి విగ్రహాలూ పెట్టెయ్యాలి. మొత్తం వంద విగ్రహాలు పెడితే శాతాల్లో వాటిని కొలవడానికి తేలికగా   వుంటుంది.   అలా అందులో కనీసం 50 విగ్రహాలు స్త్రీలవి పెట్టాలి.
     
అలాగే బిసీలూ, దళితులూ వారి వారి శాతాల్లొ విగ్రహాలకి సమన్యాయం జరగాలి. ఉపకులాలకి ఎంత శాతం అన్న వాదనలు వున్నాయి కదా. వివాదాస్పద శాతాల మేరకు ఖాళీ గద్దెలు కట్టి వుంచాలి. మిగతా విగ్రహాలు భర్తీ చెయ్యాలి. ఈలోగా విగ్రహాల శాతాల పంపకం మీద కోర్టుల్లో కేసులూ పడవచ్చు. మంచిదే. వారి తీర్పులు విగ్రహాల శ్రేయస్సు కోసం ఉపయొగపడుతాయి. ప్రభుత్వం ఆ శాతాలని తేల్చడానికి కమిటీలు కూడా వెయ్యొచ్చు. మైనారిటీ కమీషనులాగా, బిసి కమీషనులాగా విగ్రహ కమీషను కూడా ముందే వేసి పెట్టుకుంటే మంచిది.  

ఆ కమీషను పరిధిలోకి రాష్ట్రం మొత్తమ్మీద వున్న విగ్రహాలను తీసుకురావాలి. ఏ విగ్రహం పెట్టినా అనుమతులూ గట్రా వుండాలి. విగ్రహాలకు సాధారణ భద్రత సరిపోదు కాబట్టి, ఏ విగ్రహానికి ఏమయినా అది శాంతి భద్రతల సమస్య కాబట్టి వాటికి ప్రత్యేక రక్షణదళం వుండాలి. వాటికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి. పోనీ అన్నింటికి కాకపోయినా ప్రముఖుల విగ్రహాలకు ఆ స్థాయిలో భద్రత వుండాలి. అనుక్షణం వారు విగ్రహాలని కంటికి రెప్పలా కాపాడాలి. విగ్రహాల పొలిటికల్ పవరుని బట్టి తదితర విగ్రాహాలకి జెడ్ ప్లస్ కాకపోయినా సముచిత స్థాయిలో తగిన మరియు ప్రత్యేకమయిన భద్రత కల్పించాలి. విగ్రహాలను ఎవరయినా అవమానించకుండా వాటికి రిజర్వేషన్లతో పాటుగా మానవ హక్కులూ వర్తింపజెయ్యాలి. అప్పుడు ఎక్కడ ఏ విగ్రహాన్ని ఎవడు పీకినా మానవహక్కుల సంఘం వారు జోక్యం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. ఎలాగూ వారికి పెద్దగా పనేమీలేక పోచుకోలు తీర్పులు ఇస్తున్నారు కదా. విగ్రహాల బాధ్యత కూడా పెడితే పండగ చేసుకుంటారు.

అందుచేత ప్రభుత్వం కొత్త విగ్రహాలు కట్టించేలోపే, పెట్టించేలోపే వివిధ వర్గాలూ తమ తమ శాతం విగ్రహాల కొసం ఆందోళనలూ, రాస్తారోకోలూ, బలిదానాలూ చెయ్యాలి. మంచి తరుణం మించిన రాదు. ఇప్పుడు మీ కులం, మతం, వర్గం, ప్రాతం, లింగం విగ్రహాలు పెట్టుకోలేకపోతే మళ్ళీ ఇంతచక్కని అవకాశం తొందర్లో రాదు. మళ్ళీ వళ్ళు మండి ఎప్పుడన్నా విగ్రహాలు కూలగొడితే తప్ప ఇలాంటి సువర్ణావకాశం ఇప్పట్లో రాదు కాబట్టి అందరూ త్వరపడండి. ఆందోళనలు చేపట్టండి.

అలాగే పనిలో పనిగా మా ఎల్జీబిటీ విగ్రహాలు పెట్టాలి. మేము ఎక్కువమందిమి లేము కాబట్టి ఒక్క శాతంతో సరిపుచ్చుకుంటాము. విగ్రహానికి తగిన వ్యక్తి ఎవరున్నారు చెప్మా! నేను తప్ప ఎవరూ నాకు గుర్తుకురావడం లేదు. అందుకే లైంగిక హక్కుల వారి శాతం మీద నా విగ్రహాన్ని ట్యాంకుబండు మీద పెట్టాలని డిమాండు చేస్తున్నాను అధ్యక్షా. నా విగ్రహాన్ని పెట్టకపోతే నిరసనగా ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ట్యాంక్బండు మీద తిష్ట వేసి ఆత్మబలిదానం అయినా ఇచ్చుకుంటాను. అప్పుడు అక్కడ నా సమాధి అయినా కట్టేసెయ్యండి మరి. జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్.

అరవండెహె. 

పతోడు

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా క్లాసుమేటు ఒకతన్ని అందరూ పతోడు అనేవారు. అతను ఏదయినా చెప్పేటప్పుడు ప్రతీవాడూ అని చెప్పకుండా పతోడు అని చెప్పేవాడు. అందుకే అతనికి పతోడు అని పేరు పెట్టేసారు.

ఇహ పోతే బ్లాగుల్లో

- పతోడూ నీతిమంతుడే

- పతోడూ ఎదుటివాడికి నీతులు చెప్పేవోడే

- పతోడూ పరెఫెక్టే

- పతోడి కుటుంబ సభ్యులు కూడా పర్ఫెక్టే

- పతోడి మతం, కులం, మతం, వర్గం కూడా పరెఫెక్టే

- పతోడూ ఏనుగే

- విమర్శించే పతోడూ వూరకుక్కే


ఇంకా చాలా పతోళ్ళు వున్నారు కానీ ఎందుకు లెండి అసలే చాలామందిమి (విగ్రహ) బాధల్లో వున్నాం కదా.

తింటే ఆయాసం - తినకపోతే నీరసం

నిత్య జీవితంలో నాకున్న అతి పెద్ద ఛాలెంజి వ్యాయామం. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం మాటేమో కానీ నాకు అదే పెద్ద ఒత్తిడి అయిపోయింది. రోజూ అన్నింటికీ ముహూర్త బలం బాగానే వుంటుంది కానీ దానికి మాత్రం సమయం అచ్చిరాదు. చేద్దాంలే చేద్దాంలే అని వాయిదా వేస్తూ అలా అలా కాలాతీతమవుతూవుంటుంది. ఏదయినా కడుపులో పడెసామనుకోండి - తిన్నాం కాబట్టి ఆయాసంగా వుంటుంది. అరిగాక చెయ్యొచ్చులే అనుకుంటే అరిగాక నీరసంగా వుంటుంది. మళ్ళీ ఏదయినా బొజ్జలో పడెయ్యాలనే అనిపిస్తుంది కానీ ససేమిరా ట్రెడ్మిల్ ఎక్కబుద్ది కాదు.  ఆకలి కావడానికీ, కాకపోవడానికీ మధ్య సరిగ్గా టైమింగ్ చూసుకొని చెయ్యాలి వ్యాయామం కానీ మనమేమన్నా రాజులమా? సమయానికి ఏదో ఒహ పని ముందేసుకొనో, మీద బడో వుంటుంది కదా. ఇంట్లో రాణిగారి ఆజ్ఞలూ పాటిస్తూవుండాలి కదా.

ఉదయం అయిదు గంటలకు లేచి ఓ రెండు రోజులు చేసా కానీ ఎందువల్లనన్నా నిద్రా భంగం అయితే ఆ అయిదు గంటల కార్యకరమం కూడా డుమ్మా కొడుతోంది. అందుకే ఈమధ్య షెడ్యూలు మార్చేసా.  ఇంటికెల్లగానే శుబ్బరంగా తినేసి, ఇంట్లో పనులు చేసేసి, ఫుడ్డు అరిగాక నీరసం రాకముందే ఏ తొమ్మిదిగంటలకో బెడ్డేక్కేబదులు ట్రెడ్‌మిల్లు ఎక్కేస్తున్నా - ఓ చక్కని సినిమా పెట్టేసుకొని చూసేసుకుంటూ. ఈ ఆనందం ఎంతకాలమో అదీ చూద్దాం. 

మిగతా కబుర్లు ఏమయినా వుంటే కామెంట్సుగా వ్రాస్తానేం.

ఈ సుందరాంగి ఎవరో ఊహించండి చూద్దాంబుద్ధుని విగ్రహం కూడా ఎత్తేసి హుస్సేన్ సాగర్లో విసిరేద్దాం

ట్యాంకుబండ్ మీద విగ్రహాలు కూలగొట్టారు. గ్రేట్. అభినందనలు. మంచిపని చేసారు. సంతోషం. బుద్ధ విగ్రహాన్ని మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? బుద్ధుడు సమైక్యాంధ్రా వాడు కాకపోవచ్చు కానీ దాన్ని ప్రతిష్టించిన రామారావు సమైక్యాంధ్రుడే కదా. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ, మిగతా ఫిల్మ్ స్టుడియోలూ, తెలంగాణా వారివి కాని ఇతర నిర్మాణాలూ, సంస్థలూ అన్నీ కూల్చేస్తే తొందరగా తెలంగాణా వస్తుంది. తాలిబాన్లు అవన్నీ తేలిగ్గా కూలగొట్టడానికి వీలుగా అందరం ఏవేవి కూలగొడితే బావుంటుందో లిస్ట్ ఇచ్చేద్దాం. తెలంగాణా వచ్చాక హాయిగా ఏలుకోవచ్చు - ఓ స్మశానాన్ని. అప్పుడొస్తారు పర్యాటకులూనూ, అప్పుడొస్తాయి పెట్టుబడులూనూ.

మీడియాకి తగిన శాస్తి జరిగింది. ఇంకా జరగాలి. అలాగే కేకేకీ, యాష్కీకి తగిన శాస్తి జరిగింది.

జీవితపు ఛిద్రపటం

చాలా ఏళ్ళ క్రింద ఒక వాక్యం చదివాను. బాగా గుర్తుండిపోయాయా పదాలు. నెగెటివ్గా మన జీవితం గురించి ఆలోచిస్తే ఆ వాక్యం నిజమే కదా అనిపిస్తుంది.

"మన జీవితంలోని ఓ పావు భాగం మన తల్లితండ్రుల వల్ల, ఓ పావు భాగం మన వల్ల, మరో పావు భాగం మన భార్య/భర్త వల్ల, మిగిలిన పావు భాగం మన పిల్లల వల్ల నాశనం అవుతుంది"

అలా అని చెప్పేసి జీవితం అందరికీ వంద శాతమూ ఛిద్రం అయిపోదు లెండి. ఎవరో ఒకరు లేదా చివరికి మనమీద మనమన్నా దయతలచి ఆయా వాటాల్లోంచి కొంత శాతమయినా నాశనం చెయ్యకుండా వదిలిపెడతారే అదే మనకి మిగిలిన జీవనం.  అందులోంచే అన్నీ ఏరుకోవాల్సి వుంటుంది, చూసుకోవాల్సి వుంటుంది, జీవితం ధన్యమయ్యిందని సంతోషపడవలసి వుంటుంది.   పాజిటివ్ థింకింగ్ అంటే అదే మరి :)

పట్టాలు పీకి పందిరెయ్యాలి మరియు ఈరోజు కబుర్లు


(కబుర్లు ఎప్పటికప్పుడు కామెంటుగా కూడా వేస్తుంటాను)

తెలంగాణా వాదులు పల్లెలన్నీ పట్టాల మీదికి వచ్చి పడుకోవాలని ఏదో ఆరాటం/పోరాటం చేసారు కదా. అలా 12 గంటలు, 13 గంటలు చెయ్యకుండా ఆ పల్లెల్లోంచి పోయే పట్టాలన్నీ పీకేసి పందిరేసుకున్నారనుకోండి - అప్పుడు ఉద్యమం ఇంకా ఘాటుగా వుండదూ?

తెలంగాణా ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ అదీ జీతాలు తీసుకుంటూనే చేస్తున్నారు కదా. బావుంది. నా అభిప్రాయం ఏంటంటే అది ప్రైవేటు ఉద్యోగులు కూడా చెయ్యాలి. ఎలాగ అంటే మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బు డిపాజిట్ చెయ్యాలనుకోండి - రసీదు మీకు, డబ్బులు ఉద్యోగులకి. అలాగే డబ్బు బ్యాంకు నుండి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఫార్మ్ మీరు ఫిలప్ చేస్తారు - డబ్బు వాళ్ళ జేబుల్లోకి. అలాగే మీరు భోజనం చేద్దామని ఏ రెస్టారెంటుకో వెళ్ళారనుకొండి. బిల్లు, ఖాళీ ప్లేటు మీకు - డబ్బులు అక్కడ పనిచేసేవారికి. ఇలాంటి సహాయ నిరాకరణ ఎలా వుంటుందంటారు?  అప్పుడు మీరు ఏం చేస్తారు?

గత పన్నెండేళ్ళుగా డెంటిస్టులు సుతిమెత్తగా నన్ను తిడుతూనేవున్నారు - డెంటల్ ఫ్లాస్ రోజూ రెండు సార్లయినా చేస్తూవుండమని. పళ్ళు తోమడమే మహా ఎక్కువ ఆ పైన ఫ్లాసింగొకటా అన్చెప్పి వారి మాటలు ఎన్నడూ సరిగ్గా వినిపించుకున్న పాపాన పోలేదు. ఈ మధ్య దంత క్షయంతో డబ్బు క్షయం అవుతోందని బెదిరిపోయి మొదలెట్టా. సింకు ముందట నిలబడి చేస్తూ వుంటే సమయం వృధా అవుతోందని, బోరింగుగా వుందని ఒక డిస్పోజబుల్ గ్లాసులో నీళ్ళు తెచ్చుకొని నోటికింద పెట్టుకొని ఫ్లాసింగ్ చేస్తూ టివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. ఆ పుణ్య కార్యక్రమం ఏదో బాతురూములో చేసుకోవచ్చు కదా అని మా ఆవిడా, అమ్మలూ సన్నగా గులుగుతున్నా, గొణుగుతున్నా ఆ ఆనందంలో వినిపించుకోవడమే లేదు నేను. ఇప్పుడు ఫ్లాసింగ్ అలవాటయ్యి అది ఏనాడయినా చెసుకోకపోతే ఎదోలా అనిపిస్తోంది నాకు. భేశ్, మంచి అభివృద్దే! 

ఆ మధ్యొక సారి ఇలాగే డెంటల్ ఫ్లాసింగు మీద ఓ టపా వ్రాసి అలాగే పనిలో పనిగా నా బ్లాగులు చదువుతూ మెంటల్ ఫ్లాసింగ్ చేసుకొమ్మని సలహా ఇచ్చాను. నా సలహా జోకా సీరియస్సా అని అడిగారెవరో. ఏం చెప్పమంటారూ?

జీవన వైరుధ్యాలు

(మరో సైటు నుండి పునః ప్రచురణ)

నేను నార్త్ అమెరికాకి వచ్చి 13 ఏళ్ళు అవుతోంది. వచ్చినప్పటినుండీ మన ఇండియా జీవన శైలికీ, ఇక్కడి జీవన శైలికీ మధ్య వున్న తేడాలను ఆసక్తిగా గమనిస్తూనేవున్నాను. అందరికీ తెలిసిన విభిన్నతే కాకుండా ఇంకా ఏమయినా వైరుధ్యాలు వున్నాయా అని పరిశీలిస్తూనేవున్నాను. నేను గమనించిన వాటిల్లో ముఖ్యమయినది స్వేఛ్ఛ. ఈ పాశ్చాత్య దేశాలు స్వేఛ్ఛకి పేరు పెట్టినవి. మరి ఇంతటి స్వేఛ్ఛాసమాజల్లో కూడానూ నాకు ఏదో అసౌకర్యం అనిపిస్తూనేవుంది. అదేంటబ్బా అని తరచి చూసాను. ఇక్కడి సమాజాలు స్వేఛ్ఛా సమాజాలే కానీ భారత దేశంలో మనం అనుభవించినప్పటి స్వేఛ్ఛ కాదు. అదెలాగో చూద్దాం.

ఇండియాలో అయితే చిన్న చిన్న స్వేఛ్ఛలు బోలెడన్ని వుంటాయి. నడిరోడ్డు మీద స్వేఛ్ఛగా ఉమ్మి వేయగలం, మిత్రులతో కలిసి తాగుతూ కారులో వెళ్లగలం, పక్కింటికి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కబుర్లు చెప్పగలం అలా అలా. భారత దేశంలో ఎన్ని చట్టాలు వున్నా పాటిని సరిగ్గా పాటించే నాధుడు కానీ, పట్టించుకునే నాధుడు కానీ వుండక అందరికీ ఇష్టారాజ్యంగా వుంటుంది. కానీ ఈ దేశాల్లోని ప్రజలు చట్టబద్దులై ప్రవర్తిస్తారు. వారి మెతకదనాన్ని అలుసుగా తీసుకొని ఇక్కడి శాసనకర్తలు టన్నులకు టన్నులుగా చట్టాలు చేసి దేశం మీద వదులుతారు. ఇక్కడ రక్షణ, ప్రైవసీ విషయాల మీద ఆదుర్దా ఎక్కువ. ఎక్కడో జరిగిన చిన్న విషయాలకు కూడా మీడియా ఫోకస్ ఎక్కువయ్యి ఎక్కువగా ఆదుర్దాపడుతుంటారు. అందువల్ల జాగ్రత్తలు ఎక్కువయ్యి స్వేఛ్ఛ విషయంలో రాజీపడుతూ తమలోతాము కుచించుకుపోతూవున్నారు.

ఉదాహరణకు పిల్లలకు పాఠశాలల్లొ స్వేఛ్ఛగా ఆడుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ప్లేగ్రవుండులో ఆడుకోవడానికి ఓ పాతిక నియమనిబంధనలు వుంటాయి. ఒకరిని సరదాగా కూడా తొయ్యకూడదు, ఒకరిమీద మంచు గడ్డలు విసరకూడదు… అలా ఎన్నెన్నో నిబంధనలు. ఎక్కడో అరా కొరా ఎవరికో అలా చేసినందువల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగివుంటాయి. అంతే, ఇహ ఆ విషయాల్లో ఓ నియమం ఏర్పాటు చేసి పడేస్తారు. పిల్లలు అన్న తరువాత సరదాగా తోసుకోవడం, తన్నుకోవడం వుంటాయనుకుంటాము. కానీ ఇక్కడ చేతులు వెనక్కు కట్టేసుకొని ఆడుకోవాలా అని ఆ నియమాలు అన్నీ చదివితే అనిపిస్తుంది. ఇలా ప్రతీ విషయానికీ ఎన్నో నియమ నిబంధనలు వుంటాయి. వాటినన్నింటినీ చదువుతుంటే ఏదో ఊపిరి సలపని భావన, అసౌకర్యం మనలో కలుగుతుంది. ఏదో కోల్పోతున్నామన్న బావన. ఎవరో మనని తాళ్ళతో బంధిస్తున్న భావన. అలా మనం కోల్పోతున్నది మన స్వేఛ్చ అని అర్ధం అవుతుంది.

అలా అని ఇక్కడ స్వేఛ్ఛ లేదా? వుంది, బోలెడంత వుంది. కానీ అదంతా చట్టబద్దమయిన స్వేఛ్ఛ. ఎన్నో చట్టాలనే బంధనాల మధ్య మన స్వేఛ్ఛని మనం వెతుక్కోవాలి. ఇక్కడివాళ్ళు చిన్నప్పటినుండీ ఆ చట్టాల్లొనే పెరిగారు కాబట్టి వీరికి భారత దేశంలో వున్న స్వేఛ్ఛ వీరికి తెలియదు. ఆ ఫ్రీడం వీళ్లకి అర్ధం కాదు. అందుకే ఈ దేశాలు మరిన్ని చట్టాలు రుద్దినా, మరిన్ని బంధనాలు వేసినా పెద్దగా వ్యతిరేకించకుండా అలవాటుపడిపోతారు. రక్షణ కోసం అంటే చాలు అన్నింటికీ తల ఊపుతారు, తల ఒగ్గుతారు.

అయితే ఈ దేశాల్లో గొప్పదనం లేదా? వుంది. జీవన ప్రమాణాలు చాలా బావుంటాయి. ఆ ప్రమాణాల కొసం తమ యొక్క చిన్న చిన్న వెసులుబాట్లు ఎన్నో వెనకబడుతున్నాయి అన్నది వీరికి అంతగా బోధపడదు. మనలాంటి వారం రెండు జీవనశైలులను చూసిన వారికే, తెలిసినవారికే ఆ తేడా అర్ధం అవుతుంది. భారతీయులు అంతగా జీవన ప్రమాణాలని కోల్పోతూవున్నారని ఈ దేశాల్లో కొంతకాలం నివసిస్తే తప్ప మనకు అర్ధం కాదు. అలాగే ఇక్కడి వారు కొంతకాలం భారత్ లో వుంటే తప్ప ఇక్కడివారు ఏం కోల్పోతున్నారో వారు అర్ధం చేసుకోలేరు.

అలా అని తెలుసుకున్నంత మాత్రాన అలా కావాలంటారని కాదు. ఇకడి నుండి భారత్ కు సందర్శనానికి వెళ్ళిన దేశీ పిల్లలు అక్కడ వున్నంత సేపు ఎంతో చక్కగా, స్వేఛ్ఛగా పలు మందితో ఆటపాటలతో గడిపినా కూడా మళ్ళీ వెనక్కు వచ్చాక పెద్దగా ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం నేను గమనించాను. అలాగే పెద్దలకు కూడా తమకు అలవాటులేని ఆ చిన్న చిన్న స్వాతంత్యాలు వారిలో అభద్రతా భావాన్నీ కలిగించి అవన్నీ ఇబ్బందిగా అనిపించవచ్చు. తమకు అలవాటులేని జీవన శైలి పట్ల బెరుకుతో వైముఖ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.

ఈ విషయాలన్నింటినీ ఒక విషయంతో పోలిక చేస్తుంటాను. ఇక్కడి వారు ఎవరయినా ఇండియాకూ ఇక్కడికి తేడా చెప్పమంటే ఈ పోలికతో వివరిస్తుంటాను. ఈ దేశాల్లో చిన్న చిన్న వెసులుబాట్లు తక్కువ, జీవన ప్రమాణాలు ఎక్కువ. అందుకే ఈ దేశాల్లోని జీవనాన్ని బంగారు పంజరంలోని చిలకలాగా భావిస్తుంటాను. అలాగే ఇండియాలో వ్యక్తికి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువ, చట్టపు కట్టుబాట్లు, నియమ నిబంధనలు తక్కువ కాబట్టి స్వేఛ్ఛగా ఎగిరే పక్షిలాగా ఉపమానం ఇస్తాను. అయితే అక్కడి జీవన ప్రమాణాలు తక్కువ కాబట్టి పంజరంలోని పక్షి అంత భద్రంగా స్వేఛ్ఛగా ఎగిరే పక్షి జీవించలేదు. అసౌకర్యంగా వున్నా కూడా పంజరంలోని పక్షే ఎక్కువకాలం జీవిస్తుంది. మరి మీరు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు? ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? మన చుట్టూ ఓ పంజరం అల్లుకొని వుందన్న వాస్తవం మనకు బోధపడితేగానీ మన ఆలోచనల్లో కదలిక రాదు. ఇండియాలో నివసించాలా లేక విదేశాల్లో నివసించాలా అన్న సందేహం వచ్చినప్పుడు మనం ఈ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉపయోగకరంగా వుంటుంది అంతే కానీ ఈ ఒక్క కారణాన్నో లేక ఏ ఒక్క కారణాన్నో పరిగణలోకి తీసుకొని అలాంటి విషయాలని తేలిగ్గా తేల్చేయలేము కదా.