దేశీ పిల్లల బాల్యావస్థ!

గమనిక: మా ఒక మిత్రుడు ఒక వెబ్ మ్యాగజైన్ నిర్మిస్తున్నారు. అందులో నేను కూడా వ్రాస్తున్నాను. అది బీటా దశలోకి వచ్చాక లింక్ ఇస్తాను. ఈ టపా ఆ సైటులోనుండి పునః ప్రచురణ

ఒక్కో దేశ సంస్కృతి భిన్నంగా వుంటుంది. ఇండియా నుండి US కు వచ్చి ఇండియా కళ్ళతోనే, ఇండియా బుర్రతోనే ఆలోచిస్తే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలాంటి వాటిల్లో పిల్లలు ఆడుకునే విషయం ఒకటి. ఇండియాలో పిల్లలు పక్కింటికి ఇష్టం వచ్చినప్పుడల్లా వెళ్ళి హాయిగా ఆడుకుంటారు. యు ఎస్ లాంటి దేశాల్లో అలా కాదు. ఒకరింటికి మన పిల్లలని పంపించాలంటే ముందు మనం అనుమతి ఇవ్వాలి. తరువాత వాళ్ళ ఇంటికి రావడానికి ఆ ఇంటి పెద్దలు అనుమతి ఇవ్వాలి. పక్కింటికి వెళ్ళాలన్నా ఇదే తతంగం. ఎందుకు అంటే రక్షణ, ప్రైవసీ అంటారు.

మన పిల్లలు ఇతరుల ఇంటికి వెళ్ళి ఆడుకోవడానికి మనం భేషుగ్గా అనుమతి ఇస్తుండొచ్చు సరే కానీ అవతలి వారు అంత తేలిగ్గా అంగీకరించొద్దూ? పలు కారణాల వల్ల వారు మన పిల్లల విజ్ఞప్తిని తిరస్కరిస్తుంటారు. కొన్ని సార్లు మాత్రమే అంగీకరిస్తుంటారు. ఇహ చేసేదేమీలేక మన పిల్లలని మనమే ఆడిపించడమో లేదా నోరు మూసుకొని టివి లాంటివి చూడమనో చెప్పాలి. ఇలా స్వేఛ్ఛగా ఇతరులతో ఎక్కువగా ఆడుకునే వీలు లేకపోవడం వల్ల కూడా ఇక్కడి పిల్లలు టివి, ఇంటర్నెట్టూ, వీడియో ఆటలకి అంకితమవుతున్నారు. ఇక్కడి పిల్లలు ఇక్కడే పెరిగారు కాబట్టి వారికి ఇండియాలో ఆడుకోవడంలో వున్నంత స్వేఛ్ఛ తెలియదు కాబట్టి ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ మనలాంటి రెండు దేశాల సంస్కృతి చూసినవారికి ఇక్కడి పిల్లలు ఏం కోల్పోతున్నారో అర్ధం అవుతుంటుంది. కనీసం మన పిల్లలయినా అలాంటి ఇబ్బంది పడకుండా చూడాలనుకుంటాము కానీ అవతలి వారు సిద్ధంగా వుండొద్దూ?

ఇలా ఎప్పుడుబడితే అప్పుడు ఆడుకోవడానికి పిల్లలు అందుబాటులో లేకపోవడంతో మా పాప కాస్త ఒంటరితనం పొందేది. పెద్దవాళ్లం మనం ఎంత కాలం ఆడిపించినా తోటివారితో ఆడినంత ఆనందం పిల్లలకి రాదు కదా. అందుకే ఇహ లాభం లేదని తనకి తోడుగా వుంటుందని మరో పాపని కన్నాము. కానీ వారి మధ్య వయస్సు తేడా వల్ల ఇద్దరూ అంతగా ఆడుకోలేకపోతుంటారు. ఇప్పుడిక చిన్న పాప ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చిన్న పాపకి తీరికవున్నప్పుడల్లా తన స్నేహితురాళ్ళకి ఫోను చేసి మా ఇంటికి వచ్చి ఆడుకుంటావా లేక మీ ఇంటికి వచ్చి ఆడుకోనా అని విజ్ఞప్తులు చేస్తూనే వుంటుంది కానీ ఎక్కువసార్లు ఆశాభంగాలే ఎదురవుతుంటాయి. మాతో నయినా ఆడుకోవాలి అని చూస్తుంటుంది కానీ తనకు తీరిక వున్నంత మాకు తీరిక వుండదు కదా. ఇండియాలో అయితే పక్కింటి పిల్లలే కాకుండా తాతయ్యలో, నానమ్మలో అలా ఎంతో మందితో ఆడుకునే అవకాశం వుంటుంది కానీ ఇక్కడ మన దేశీ పిల్లలకి అలా కుదరదు కదా. ఇహ బోర్ కొట్టి ఏ వీడియో గేములో ఆడుకుంటారు. అలా వారిలో ఏక్టివిటీ తగ్గిపోతుంది. మరి ఈ దేశాల్లో ఇహ ఊబకాయం సమస్య వుందంటే వుండదా? కొన్ని సార్లు బోర్ కొట్టి చేసేదేమీలేక తినడం మీద పడుతారు. అందువల్ల కూడా లావు సమస్యలు లావుగా లావుగా వస్తుంటాయి.

అందుకే నాకు తెలిసిన కొత్త దంపతులకు ఒక సలహా ఇస్తుంటాను. పిల్లలని వెంటవెంటనే కనేసెయ్యమని చెబుతుంటాను. అందువల్ల పిల్లల వయస్సు మధ్య తేడా లేక కనీసం వాళ్ళకు వాళ్ళు అయినా ఆడుకోవడానికి అవకాశం వుంటుంది. మనం కూడా వీలయినంతగా వారితో సమయం గడుపుతూ వారు ఎక్కువ సేపు ఇనేక్టివ్ గా వుండకుండా చూడాలి. వారిని ఎల్లప్పుడూ చురుకుగా వుంచేందుకు వీలయినంతంగా ప్రయత్నిస్తూవుండాలి. పిల్లలు టివి, వీడియో, ఇంటర్నెట్టు లాంటివి రోజుకి రెండు గంటల కంటే ఎక్కువ చూడటం మంచిది కాదనీ, అంతకంటే ఎక్కువగా బద్దకంగా గడిపితే వారిలో పలు వ్యక్తిత్వ సమస్యలు వస్తుంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. వారి సూచనలు మనం గమనంలోకి తీసుకోవాలి.

4 comments:

 1. >> ప్పుడిక చిన్న పాప ఆడుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

  ఇప్పుడు ఇంకొక పాపను కనేస్తే సరి. సమస్య తీరిపోద్ది. ఏమంటారు ;-)

  ReplyDelete
 2. @@@@@భాస్కర రామి రెడ్డి

  :))))))))))))

  ReplyDelete
 3. పిల్లలని వెంటవెంటనే కనేసెయ్యమని చెబుతుంటాను.
  good suggestion.

  ReplyDelete
 4. H1 and adoption process (adopt from India preferably) mida mikemanna awareness unda? If you do please share it.

  ReplyDelete