కొత్త కారు కష్టాలు

నిన్న మా ఆవిడ నన్ను బాగా తిట్టేసింది. తిట్టదా మరి? కారు తెచ్చిన రోజే కారు తాళాలు ఒక సెట్ పోగొట్టాను మరీ. ఇన్ని ఏళ్ళుగా ద్విచక్రం నడిపినా, చతుర్చక్రం (4 వీలర్) నడిపినా ఎన్నడూ వాటి తాళాలు పోగొట్టుకోలేదు - ఇలా ఎవరితో తిట్లు తినలేదు. కారు తెచ్చిన రోజు రాత్రి తాళాలు జాగ్రత్తగా ప్యాంటు జేబులోనే పెట్టుకున్నాను. కారు డీలరు దగ్గరి నుండి సరాసరి ఇంటికి తెచ్చేసి కారు పార్క్ చెసి నాలుగడుగులు వేసి చూసుకున్నానో లేదో ఒక సెట్ మాయం. ఇంకో సెట్ వుంది లెండి. ఆ రోజు రాత్రీ, మర్నాడు నా వింటరు జాకెటూ, ప్యాంటూ, పార్కింగ్ లాటూ, కారు అంతా అందరం కలిసి క్షుణ్ణంగా గాలించాం కానీ అవి దొరికితేకదా. నిన్న డీలరు దగ్గరికి వెళ్ళి కూడా అడిగాను - వాళ్ళకేమయినా దొరికాయేమోనని. ఊహు. కొత్తవి ఎలెక్ట్రానికువి చేయించాలంటే $150 అవుతాయిట. అందుకే మా ఆవిడ తిట్టేసింది - అంతగా సోయి లేదా అని. నేను మరో సారి బుర్ర గోక్కొని తిట్టడానికి ఆమెకు మరో విషయం గుర్తుకు రానందుకు సంతోషించాలో లేక తిట్లు పడుతున్నందుకు బాధపడాలో అర్ధం కాక అలా నిలబడిపోయా.

ఆమె అలా అంతగా తిడుతున్నా నేను రెచ్చిపోకుండా సర్దిచెప్పుతుండటం చూసి ఆమె ఒకింత ఆశ్చర్యపడింది కూడానూ. $150 ఖర్చు పెట్టి కొత్త కీస్ చేయించాక ఆ కీస్ దొరుకుతాయని అప్పుడు ముచ్చటగా మూడు తాళంచెవిలు అవుతాయనీ  ఆ మూడో కీ  మా పెద్దమ్మాయికి ఉపయోగపడుతుందనీ విశదీకరించాను. దానికి తాను సంతోషించకపోగా మళ్ళీ తిట్టేసింది. ఎందుకంటారూ?

నేను అంత బుద్ధిగా అనగా తిరిగి రెచ్చిపోకుండా ఎందుకు తిట్లు తిన్నానో చెబుతా వినండి. ఈ విషయం మా ఆవిడకి గుర్తు చేయమని హామీ ఇవ్వాలి మీరు. ఓకే. అలా తాళాలు పోగొట్టుకున్నాక అదే రోజు రాత్రి మాకు దగ్గర్లోని ఓ ఇంటికి చిన్న గేట్ టుగెదరుకి వెళ్ళి వచ్చాము. మరునాడు మధ్యాహ్నం మాల్ కి కొత్త కారులో వెళదాం అని సిద్ధం అవుతుండగా మా చిన్న పాప మా కొత్త కారులో ఓ కంతను కనిపెట్టింది! వెనుక సిగ్నల్ లైట్ కవర్ పగిలి కాస్త రంధ్రం పడింది. మా ఆవిడ ఆ రంధ్రాన్వేషణ వినకుండా కవర్ చేయాలని యథాశక్తి ప్రయత్నించాను కానీ మా ఆవిడ అప్పటికి వినేసింది. అడిగేసింది - ఊరుకుంటుందా? నన్ను కడిగేసింది. అది ఎప్పుడు అలా అయ్యిందో నాకే అర్ధం కావడంలేదు. ఇంకా అనితకు ఏం చెప్పను? డీలర్ దగ్గరే రాత్రి సమయం కాబట్టి సరిగ్గా చూసుకోలేదో లేక  ముందు రోజు వేరే వారి ఇంటికి వెళుతున్నప్పుడు మా పార్కింగ్ లాటులో వున్న స్నో బ్యాంకుకి గుద్దేసానో నాకు అర్ధం కాలేదు. ఏది చెప్పినా తిట్లు ఖాయమే కాబట్టి ఏమీ చెప్పలేదు. మౌనంగా భరించాను. తప్పుద్దా మరి? అది ఆమె కారు అని చెప్పి నేను అలా కంతలు పెట్టుకుంటూ కూర్చుంటే ఊరుకుంటుందేమిటీ?

నేను చాలా జాగ్రాత్తగా కారు నడుపుతాను. ఇదివరలో ఎన్నడూ ఏక్సిడెంట్లు చెయ్యలేదు, దేనికీ గుద్దలేదు. స్నోలో మాత్రం ఓ రెండు సార్లు కారు జారింది. ఆ నేరం నాది కాదు ప్రకృతిది లెండి. ఇంతటి క్లీన్ హిస్టరీ వున్న నేను ఇలా కొత్త కారు మొదటి రోజే గుద్దెయ్యడం ఏంటో నాకు అర్ధం కాలేదు. అందుకే నిన్న డీలర్ దగ్గరికి వెళ్ళి దబాయించాను - కారు సరిగ్గా చూసుకోలేదని. వాడు నన్ను తిరిగి దబాయించి అలా ఎన్నడూ అలా చూసుకోకుండా కారు అమ్మం అనీ ఆ ఘనకార్యం నాదే అయివుంటుందనీ సెలవిచ్చాడు. పైగా కారు కొన్న రోజే కీస్ పోగొట్టుకోవడమూ, కారు గుద్దెయ్యడమూనా అని నిర్ఘాంతపోయాడు కూడానూ. ఏం చేస్తాం, ఆ పని నేనే చేసేనేమోనని కన్విన్స్ అయిపోయాను. రిపెయిరుకి ఇచ్చాను. కనీసం $70 ఖర్చు అవుతుందిట. మొత్తం ఆ యూనిట్ తీసి పెట్టాల్సి వస్తే మాత్రం ఎక్కువే అవుతుందిట. హ్మ్. 

అయితే నిన్న రాత్రి మా ఆవిడ పోయిన కారు తాళాల గురించి నన్ను తిడుతుంటే నేను ఎందుకు ఎక్కువగా నోరు మెదపలేదంటే కారు సిగ్నల్ గ్లాస్ పగిలిన విషయం అప్పుడు ఆమెకు గుర్తుకు రానందుకు. అలా గుర్తుకు వచ్చివుంటే నాకు డబుల్ కోటింగ్ పడివుండేది కదా! అందుకన్నమాట.

కొసమెరుపు ఏంటంటే నా కారు తాళాలు దొరికాయని ఇవాళ మా డీలర్ ఫోన్ చేసి చెప్పాడు. కారు తాళాల ఆ సెట్టు కారులో కూర్చునే నా ప్యాంటు జేబులో పెట్టుకున్నాను కానీ కారు డోరు సరిగ్గా పడిందో లేదో అన్న సందేహంతో ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లున్నాను. అప్పుడు జారిపోయి వుంటాయవి. ఇప్పుడే కారు మెకానిక్ ఫోన్ చేసాడు. టైల్ లైట్ గ్లాస్ బిల్లు $80.

3 comments:

 1. "మాయావిడ మాయావిడ" అని కొత్త కొత్త post లు చూస్తుంటే "పెళ్ళయిన బ్రహ్మచారిని", "నిర్ణయించేసుకున్నాను" లాటి post లు time pass కి వేసారని రూడీ అయ్యిందిలెండి. అయినా ఆ serious post లు అంత నమ్మేట్లుగా కూడా లేవు. ఏమయితేనేం అంతా శుభప్రదంగా వుంటే ఇంకేమి కావాలి. మీయావిడని blog లో ఏకేయటం ఇక ఆపెయ్యండి గురూగోరు.

  ReplyDelete
 2. hamma..bhale oorinchi oorichi raserandi meeru. alane avutundi andi kotta car ki adi common. na car parking lo petti lopalaki raagane evado left side mottam scratches pettesadu. 1500 avvindi.
  adi cheyinchukuni vastunte daarilo oka kurradi yield lo left side traffic ni chustunna nannu speed ga vachhi bumper kottesindi. malli polo mani repair ki poyanu. emi cheppamantaru. 4 rojulu annam sahinchaledu. keys kada parledu lendi. mee wife to cheppandi ee sangati she will realise how small this damage is.
  All the best !!!

  ReplyDelete
 3. idantha mee nasthika nammakala phalitham. kotta kaaru konangane dagarlo unna gudiki teesukelli hanumanthula variki, karuki puja cheyinchukuni unte emee ayyedi kadhu!

  ReplyDelete