టీన్ డ్రైవింగ్

చిన్నప్పుడు చెయ్యి పట్టుకొని తప్పటడుగులు నడిపించాను. సైకిలు తొక్కే వయసు వచ్చాక తన సైకిలు వెంట పరుగెత్తుకు వెళుతూ తను క్రిందపడకుండా సైకిలు నేర్పించాను. అలాగే కారూ ఇంత తొందర్లోనే మా పెద్దమ్మాయికి నేర్పించాల్సివస్తుందని నేను అనుకోలేదు సుమీ. వాళ్ళ పాఠశాలలోనే కారు డ్రైవింగ్ నేర్పిస్తారంటే ఫీజ్ చెల్లించాను. ఈ సెమిస్టరులో కారు నేర్పుతారంటే నువ్వేమయినా కొత్త విషయాలు నేర్చుకుంటే నాకూ చెప్పమని చెప్పి సంతోషించాను. మొదటి క్లాసు కాగానే ఇంటికి కారు హోం వర్కుతో వస్తే వార్నీ అని ఆశ్చర్యపోయాను.

ఈ సెమిస్టరులో మా అమ్మాయికి 50 గంటల కారు హోం వర్క్ వుంటుందిట. ఎదో తల్లితండ్రులు కూడా పక్కన కూర్చోబెట్టుకొని నేర్పించాలంటే తను స్కూల్లో కారు నేర్చేసుకున్న తరువాత తాపీగా నేర్పిద్దాంలే అని కులాసాగా వున్నా. కాదట. ఒక వైపు స్కూల్లో నేర్పుతుంటే మరో వైపు మేము నెర్పాలిట. మేము మంచిగా నేర్పకపోతే మా అమ్మాయికి మంచి మార్కులు రావుట. మంచి గ్రేడ్స్ రాకఫొతే తనకి లైసెన్స్ వచ్చాక మాకు ఇన్సూరెన్స్ వాచిపొద్దిట. ఇంతకూ హోం వర్కు మా అమ్మాయికా నాకా అనేది అర్ధం కావడం లేదు.

ఇహ తప్పుద్దా అనుకుంటూ మొన్నే శిక్షణ మొదలెట్టాను. చక్కగా, బుద్ధిగా, ఆసక్తిగా వింటూ పోయింది. ఓ గంట అయ్యాక కారు లెసన్ ముగించాను. ఇంకా 49 గంటలు వున్నాయి. మా ఆవిడకీ కొన్ని వారాల క్రితమే కారు డ్రైవింగ్ నేర్పించాను. ఓ రెండు రోజులు చూసి నా సూచనలు తట్టుకోలేక నన్ను డంప్ చేసి తను ఒక్కతే డ్రైవ్ చేసుకువెళుతోంది. చూడబొతే మా పాప అలా నాకో నమస్కారం పెట్టే సూచనలు ఏమీ కనిపించడం లేదు. నా శిక్షణ సౌకర్యంగానే అనిపిస్తోంది తనకి.

తాను చిన్నప్పుడు వేసిన తప్పటడుగుల్లాగా కారు నడపడంలో బుల్లిబుల్లి తప్పులు తను చేస్తుంటే నేను సరిదిద్దుతూ తీసుకెళ్ళడం ముచ్చటగా వుంది. మా పాపకి కారు నడిపే వయసొచ్చిందా అని నాకు ఇంకా నమ్మశక్యం కాకుండానే వుంది.

7 comments:

  1. దీన్నే పుత్రికోత్సాహం అంటారేమో. కళ్ళముందే పిల్లలు ఎదుగుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది.

    ReplyDelete
  2. divorce aalochanalu maani ilaa enjoy cheyandi family tho...

    ReplyDelete
  3. @ మినర్వా
    నిజమేనండి. పిల్లలు పుట్టేంతవరకూ పిల్లల మీద అంత ఆపేక్ష వుంటుందంటే నమ్మలేం. ఆ తరువాత వారి ఎదుగుదల గమనిస్తూ వుండటం ఎంతో ముచ్చటగా వుంటుంది.

    @ వేణు
    :)

    @ మిర్చీ
    ప్రస్తుతానికి రాజీ దశ కొనసాగుతోంది. అది ఎలా వున్నా దేని దారి దానిదేలెండి.

    ReplyDelete
  4. good luck with that.
    టీనేజి పిల్లలకి డ్రైవింగ్ నేర్పించడానికి (పక్కన పేసింజరు సీట్లో కూచోని) చాలా గుండెధైర్యం ఉండాలి.

    ReplyDelete
  5. @ కొత్తపాళీ
    మా అమ్మాయి అయితే నేను చెప్పినట్లు డ్రైవింగ్ చేస్తోంది. మా ఆవిడయితే నేను ఒకటి చెబితే తను ఇంకొకటి చేస్తోందండీ బాబూ. ఇప్పుడు గుండెధైర్యం ఎక్కడ అవసరం అంటారూ? నాది డ్రైవింగులో ఓ పన్నెండేళ్ళ ఇండస్ట్రీ కాబట్టి నేను పక్కన కూర్చొనేసరికి నెర్వస్ అయిపోయి పొరపాట్లు చేస్తోందిట.

    ReplyDelete
  6. Sarath, good point. నా పాలసీలో అర్ధంగికి డ్రైవింగ్ నేర్పడం ప్రొహిబిటెడ్. అందుకని ఆ ఊసే ఎత్తలేదు.

    ReplyDelete