రేపు మాకు దాదాపుగా రెండడుగుల మంచు

ఇవాళ మధ్యాహ్నం నుండి రేపు మధ్యాహ్నం వరకు అడుగున్నర నుండి రెండు అడుగుల మేర మంచు కురవవచ్చు అని చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుండీ మంచు తుపాను మొదలవుతోంది. ఇతర చాలా రాష్ట్రాలలో కూడా ఈ తుఫాను పడుతోంది.  నలభై ఏళ్ళ క్రిందట ఎప్పుడో షికాగోలో దాదాపు రెండు అడుల మంచు కురిసిందంట. మళ్ళీ ఇప్పుడు అంతగానీ లేదా 1999 జనవరిలో కురిసినంత 18 ఇంచుల మంచు అయినా కురుస్తుందని చెబుతున్నారు. రేప్పొద్దున పరిస్థితిని బట్టి మా ఆఫీసుకి సెలవు ఇవ్వాలొ వద్దో చూస్తారుట. దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లో నయితే రెండు ఇంచుల మంచు కురిసినా ఆఫీసులకి సెలవులు ఇస్తారు కానీ మా దగ్గర మాత్రం రెండు అడుగుల స్నో అన్నా సరే ఆలోచిస్తూనేవున్నారు.

మనాళ్ళు చాలామంది ఇంత స్నోని అసహ్యంచుకుంటారు కానీ నాకయితే మంచు అంటే మహా ఇష్టం. మంచు పడుతున్నా, మంచు తుఫానులో తిరుగాడాలన్నా, ఇళ్ళమీద, చెట్ల మీద పడి జాలువారుతూ ఘనీభవించిన మంచు శిల్పాలని చూడాలన్నా నాకెంతో ముచ్చటేస్తుంది. మంచుతో కప్పేసిన ప్రదేశాలను పండు వెన్నెలలో చూడటం అన్నది గొప్ప అనుభూతిని ఇస్తుంది. తెల్లటి మంచు అంతా ఆ వెన్నెల్లో మెరసిపోతూ ఏ దేవతలయినా దిగివచ్చారేమో అన్నంత అవలోకనను మనకు కలిగిస్తుంది. మా ఇంటి కిటికీల గుండా ఎదుటవున్న మంచుతో ఘనీభవించిన సరస్సును, చుట్టూ మంచుతో కప్పుకున్న చెట్లనూ, ఆ పైన పడుతున్న హిమవర్షాన్నీ చూస్తూ నన్ను నేను మైమరచిపొతాను. అప్పుడప్పుడు అమ్మలూ, నేనూ ఎంచక్కా దుప్పటికప్పుకొని తను ప్రకృతిని వర్ణిస్తూ పాటలు పాడుతుండగా కలిసి ప్రకృతి సౌందర్యారాధను చేస్తూవుంటాం. అప్పుడప్పుడు వేడి వేడి చాకోలెట్ మాష్‌మెల్లోస్ పాలు తయారు చేసుకొని తాగుతూ చల్లటి చలిలో చక్కటి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూవుంటాం.

అసలే చలిగా వున్న రోజుల్లో మంచు కరుగుతూ వుంటే, దానికి తోడు గాలి తోడయితే ఆ చలిని భరించడం దుర్భరంగానే వుంటుందనుకోండి కానీ అలాంటి కొన్ని సందర్భాలు మినహా హిమపాతం అంటే నాకు చక్కని ఇష్టం. అందుకే మరీ చల్లగా లేకపోతే అమ్మలుని స్నోలో ఆడుకొమ్మని ప్రోత్సహిస్తూ నేనూ ఆడేస్తుంటాను. తను స్నో మ్యాన్, స్నో ఏంజిల్ లాంటివి మంచుతో, మంచులో చేస్తూవుంటుంది. మంచు పెళ్ళలు నామీద విసిరేస్తూ నన్ను తరుముతూ వుంటుంది.

ఇండియాలో మన ప్రదేశాలలో వేసవి కాలం ఎలా దుర్భరంగా వుంటుందో అలాగే మా ప్రాంతంలో చలి కాలం అంత దుర్భరంగానే వుంటుంది. అయితే వేసవిలో కన్నుల పండుగగా చూడటానికీ, అనుభూతి చెందటానికి ఏమీ వుండదు. కానీ ఇక్కడి శీతాకాలంలో కురిసే మంచు నేను పైన పెర్కొన్న విధంగా ప్రకృతి సౌందర్యారాధకులకు గిలిగింతలు పెడుతుంది. మనకు ఆ మనస్సే వుండాలి కానీ ఈ ప్రకృతిలో మైమరచిపొవచ్చు. అయితే చలిని అస్తమానం తిట్టుకోకుండా మంచును మెచ్చుకొగలిగే రస హృదయం మనాళ్లలో కొద్దిగానే కనిపిస్తోంది. ప్చ్.  

5 comments:

  1. >>>మనాళ్ళు చాలామంది ఇంత స్నోని అసహ్యంచుకుంటారు కానీ నాకయితే మంచు అంటే మహా ఇష్టం. మంచు పడుతున్నా, మంచు తుఫానులో తిరుగాడాలన్నా, ఇళ్ళమీద, చెట్ల మీద పడి జాలువారుతూ ఘనీభవించిన మంచు శిల్పాలని చూడాలన్నా నాకెంతో ముచ్చటేస్తుంది.
    ----------------------------
    నిజమే శరత్.. అప్పుడప్పుడూ అయితే ఆనందంగానే వుంటుంది. రెండురోజులకొకసారి పడుతుంటే మనం ఘనీభవించుకు పోతాము :)

    ReplyDelete
  2. @భా రా రే
    అవును. ఈ సారి మీకు మంచు ఎక్కువయినట్లుందే.

    వాతావరణం బాగోలేనందువల్ల 3 గంటల నుండే ఆఫీసు వదలవచ్చని ఇప్పుడే చెప్పారు. ఇహ ఇంటికి బయల్దేరాలి.

    ReplyDelete
  3. konni photos tesi pettandi sir, memu aswadistam kada...

    ReplyDelete
  4. wow మీ వర్ణన చాలా బావుంది

    ReplyDelete
  5. @నాకయితే మంచు అంటే మహా ఇష్టం. మంచు పడుతున్నా, మంచు తుఫానులో తిరుగాడాలన్నా, ఇళ్ళమీద, చెట్ల మీద పడి జాలువారుతూ ఘనీభవించిన మంచు శిల్పాలని చూడాలన్నా నాకెంతో ముచ్చటేస్తుంది. మంచుతో కప్పేసిన ప్రదేశాలను పండు వెన్నెలలో చూడటం అన్నది గొప్ప అనుభూతిని ఇస్తుంది....... ..నిజమేనండీ ఆ వాతావరణం ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి కదా ...

    ReplyDelete