నా న్యూ ఇయర్ టాయ్ వచ్చేసిందొచ్చేసిందోచ్!

అంటే ఏదో అడల్ట్ టాయ్ అనుకునేరు. అంతలేదు. ట్రెడ్‌మిల్. నిన్న వచ్చిన దగ్గరినుండీ అమ్మలూ, నేనూ పోటాపోటీగా దానిమీదే పడ్డాం. కొత్త ఉబ్బు కదా. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా అమ్మలు అయితే స్నాక్స్ గట్రా తింటూనే దానిమీద నడిచింది. ఆ తరువాత నేను లాక్కుని నడుస్తూ రోకు ద్వారా యూట్యూబులో ఒక సినిమా చూద్దామని ప్రయత్నించాను. ఎక్కడా? అందరూ నన్ను నాకు ఇష్టమయిన సినిమా చూస్తూ జాగింగ్ చెయ్యడానికి అనుమతిస్తేనా? కొన్ని సినిమాలు మా అమ్మలుకి నచ్చవు, కొన్ని మా ఆవిడకి నచ్చవు, కొన్ని నాకు నచ్చవు. అలా అందరికీ నచ్చే సినిమా ఎన్నుకునేసరికే ఓ అరగంటా మరియు ఓ వంద కాలరీలూ ఖర్చయ్యాయనుకోండి. కొత్తది కదా అందుకే నెమ్మదిగా నడిచాలెండి - నేను దానికి అలవాటు కావాలి కదా.

మొత్తమ్మీద బద్రి సినిమా చూస్తూ జాగింగ్ చేస్తూవుంటే కాలం, అలసట తెలియలేదనుకోండి. ఇదివరకు చూడలేదు ఆ సినిమాని. ఇలాగే గనుక నా వర్కవుట్ గనుక వర్కవుట్ అయితే నా ఆరోగ్య లక్ష్యాలని సాధించడానికి ఎంతోసేపు పట్టదు కానీ వేచి చూడాలి. ఇవాళ మధ్యాహ్నం బెల్ట్ సర్దుకుంటుంటే లూజ్ అనిపించింది. ఏంటా అనిపించి టైట్ చేసేసా. చూసారా ఒక్క రోజుకే ఒక్క బెల్టు రంధ్రం దాటివేసానూ. అయ్బాబోయ్ ఇలాగే కంటిన్యూ అయిపోతే తొందర్లోనే జీరో సైజుకు దగ్గర్లో వున్నానన్నమాటే. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా ఎప్పుడు జాగింగ్ చెయ్యాలా అని వుంది. ఇంటికివెళ్ళేసరికి అమ్మలు అది ఉపయోగిస్తూవుంటుంది. దాన్ని లాగేసి ఓ చక్కని సినిమా పెట్టుకొని చేస్తూపోవాలి.

సినిమాలు చూడటానికని ట్రెడ్‌మిల్ తెచ్చుకున్నావా లేక వ్యాయామానికా అని మా ఆవిడ నిన్న నన్ను ఇంటరాగేట్ చేసింది. మరీ నిజాలు చెబితే బావుండదు కదా అని సినిమాలు చూస్తూ వ్యాయామం చెయ్యడానికి అని సెలవిచ్చేసా. అలాగయితేనేం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. ఒక్క ట్రెడ్మిల్లుతో అటు సినిమాలూ, ఇటు వ్యాయామం. అదే మరి Win - Win టెక్నిక్ అంటే. నేను మీలో చాలా మందిలాగా, మా ఆవిడలాగా కోచ్ పొటాటోను కాదు కదా ... హి హీ.

1 comment:

  1. మనిషికి మనస్సుకీ ఆరోగ్యమూ,ఆహ్లాదమూ
    మీ న్యూఇయర్ టోయ్..బాగుంది..

    ReplyDelete