కోచ్ పొటాటో...

... అని ఎవరిని అంటారో మీకు తెలిసేవుంటుంది. పనీ పాటా లేకుండా అస్తమానమూ లేదా తమ జీవితంలో ఎక్కువ సమయం టివి, ఇంటర్నెట్టు, వీడియోలు, 'బ్లాగుల' మీద కూర్చునేవారిని అలా అంటారు. నేను మరీ అలాంటివాడిని కాకపోయినా అడపాదడపా టివినో, సినిమానో చూస్తూ సమయం వృధాచేస్తున్న సందర్భాలు చాలానే వున్నయ్. ఇలా జీవితం వృధా చెయ్యకుండా టివిలు, సినిమాలు, బ్లాగులు చూడటం ఎలాగా అని మనస్సును కొద్దిగా మధించాను. అందుకే నూతన సంవత్సరం సందర్భంగా అమెజాను సైటు ద్వారా ఓ ట్రెడ్‌మిల్ ఆర్దర్ చేసాను. దాని వెల $315. రవాణా ఖర్చు లేదు. ఓ అయిదారు రోజుల్లో వచ్చేస్తుంది.

అబ్బో శానా గొప్ప పని చేసేరు... మాకూ వుంది లేబ్బా ఓ ట్రెడ్మిల్లు...మా బేసుమెంటులో అని... అనుకుంటున్నారు కదూ. తప్పులేదు. నేనూ ఇదివరకు ఒకటి కొని వాడకపోయేసరికి అది జస్ట్ షో పీస్ లాగా అయిపోయేసరికి ఇహ లాభం లేదని అమ్మేసాను. అంతేకాదు నాకు ఇదివరలో మల్టి జిమ్ము కూడా వుండేది. ఇంటికి వచ్చిన వారు అందరూ అటు దాన్ని చూసి ఇటు నా కండలు చూస్తుండేసరికి సిగ్గేసి అదీ వదిలించుకున్నాను.

ఇప్పుడు అలా కాదు. గత కొన్ని నెలలుగా చక్కగా జిమ్ములో గంటల కొద్దీ ట్రెడ్మిల్ మీద పరుగు చేస్తూనేవున్నాను. నా విజయ రహస్యం? ఎంచక్కా నెట్ఫ్లిక్స్ లో సినిమానో, యూట్యూబులో వీడియో పాటలో, యప్‌టివి లో తెలుగు ఛానల్సో చూసుకుంటూ పరుగెత్తడం. అలాంటప్పుడు ఇండియాలో ఏ బాబుగారో, రావుగారో ఆమరణ దీక్ష మొదలెట్టారనుకోండి - ఆ టెన్షను వల్ల ఇక్కడ మనం ఎంత పరుగెత్తినా సమయం, అలసట తెలియవు అన్నమాట. అసలే ఇక జనవరి 6 నుండి APలో రియాలిటీ షోలే షోలు కాబట్టి తెలుగు ఛానల్స్ చూస్తూ జాగ్ చేస్తూవుంటే నా సామి రంగా అటు పుణ్యమూ, ఇటు పురుషార్ధమూ కలిసివస్తాయన్నమాట. అదండీ సంగతి. AP రియాలిటీ షోల సమయానికి నా ట్రెడ్మిల్ వచ్చేస్తుందన్నమాట.

2011 జనవరి ఫస్టు వస్తున్న సందర్భంగా ఒక మిత్రుడి ఇంట్లో గడిపాము. అప్పుడు నా మిత్రులకి ఇలా ట్రెడ్‌మిల్ ఆర్డర్ చేసిన సంగతి చెప్పాను. అప్పుడు ఆ మిత్రుడు నా ట్రెడ్‌మిల్ క్షేమంగా, భద్రంగా బేసుమెంటులో పడివుందండీ అని చెప్పాడు. అలా క్రిందపడేస్తే అలాగే వుంటుందని చెప్పాను. లివింగ్ రూములోనికి తీసుకువచ్చి ఇంట్లో వారందరితో మాట్లాడుతూ, పోట్లాడుతూ, సినిమాలు చూస్తూ, వీడియోలు చూస్తూ, వచ్చిన మిత్రులతో మాట్లాడుతూంటే సరదాగా పరుగెత్తగలం అని చెప్పాను. అంతే కానీ సాలిటరీ కన్‌ఫైన్‌మెంటులాగా బేసుమెంటులోకి వెళ్ళి ఒంటరిగా, ఏకాంతంగా, ఏదో తప్పనిసరి తద్దినం లాగా, ఇష్టంగా కాకుండా కష్టంగా చేస్తున్నట్లయితే అది అలాగే పూజకి మాత్రమే పనికివస్తుందని సెలవిచ్చాను. మరి నేను చెప్పినట్లుగా అతగాడు చేస్తాడో లేదో తెలియదు గానీ ఇలా మీకు చెప్పడం వల్ల నేను అయినా అలా చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది నా ఉద్దేశ్యం.     

ఎలాగూ ట్రెడ్మిల్ ఆర్డర్ చేసేనని చెప్పేసి జిమ్ము కూడా క్యాన్సిల్ చేసాను. ఇంకో నెల తరువాత సభ్యత్వం ముగిసిపోతుంది. జిమ్ము జిమ్ము అని వెళ్ళడమే కానీ పరుగు తప్ప మరేమీ చెయ్యలేకపోతున్నాను. బరువులూ అవీ ఎత్తాలనుకుంటే జిమ్ములో సిస్టం ముందట పెట్టుకొని అది చూస్తూ చెయ్యడం జరిగేపని కాదనిపించింది. ఓసోస్, ఈమాత్రం పరుగు కోసం జిమ్ముకు వెళ్ళడం అవసరమా అనిపించింది. పైగా ఓ ముప్పావు గంట పరుగు కోసం జిమ్ముకు వెళ్ళడం, రావడం, దుస్తులు విడిచి జిమ్ము బట్టలు వేసుకోవడం, మళ్ళీ అవి విడవడం, ఆఫీసువి వేసుకోవడం ఇంత సమయం వృధా అనిపించింది. ఆ చేసే పరుగేదో ఇంట్లోనే పరుగెత్తితే ఆ సమయం కుటుంబ సభ్యులతో గడిపినట్లూ వుంటుంది కాదూ. ఇంట్లోనే అయితే ఇంకా ఎక్కువసార్లూ, ఎక్కువసేపూ పరుగెత్తగలం అనేది నా అభిప్రాయం.

1 comment: