అతి తెలివి అమెరికా పోలీసులు

ఒక ఇంట్లోకి బందిపోటు దొంగలు ప్రవేశించారని పోలీసులకు తెలుస్తుంది. ఆ ఇంట్లో వారికి ఇద్దరు అందమయిన అమ్మాయిలు వున్నారని కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. అప్పుడు పోలీసులు ఏం చెయ్యాలని భావిస్తాం? ఒక కాలేజీలోకి ఒక గన్‌మాన్ ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్నాడని పోలీసులకు సమాచారం అందుతుంది. అప్పుడు సాధారణంగా పోలీసులు ఏం చేస్తారని భావిస్తామేం?

మామూలుగా అయితే పోలీసులు లోపలికి వెళ్ళి బందిపోట్లనీ, హంతకులనీ ఎదుర్కుంటారని భావిస్తాం. అబ్బే, మా దగ్గర అలా చేయడం సమర్ధత కాదు. ఆ బందిపోట్లకు కనపడకుండా ఆ ఇల్లు చుట్టూ పోలీసులని మోహరించి ఒక పెరిమీటర్ ఏర్పాటు చేస్తారు. ఓ బైనాక్యులర్ తీసుకొని ఇంటి బయట ఏం జరుగుతోందని గమనిస్తుంటారు. ఇంటి బయట ఏమీ హడావిడిలేదనుకోండి ఆ బందిపోట్లూ, ఆ ఇంటివాళ్ళూ, ఆ టెనేజీ అమ్మాయిలూ సరదాగా పేకాట ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటారని, అందువల్ల తొందరేమీ లేదని భావిస్తూ గంటలు, గంటలు చూయింగ్ నములుతూ, లోటెడు కప్పుల్లో కాఫీ తాగుతూ బయట చుట్టూ వున్న పోలీసులు కాలక్షేపం చేస్తారు.    

ఈలోగా ఆ దుండగులు తాపీగా, తీరిగ్గా ఆ ఇంటిపెద్దను చావబాది, ఎంచక్కా తల్లినీ, 17 ఏళ్ళ పెద్దమ్మాయినీ, 11 ఏళ్ళ చిన్నమ్మాయినీ రేప్ చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు బ్రతికివుంటే సాక్ష్యలు గట్రా వుంటాయి ఎలా అని ఆ దుండగులు సిగరెట్లు తాగుతూ ఆలోచిస్తారు.  ఇంట్లో వున్న కిరసనాయిలో, పెట్రోలో అప్పటికీ బ్రతికివున్న వారి ముగ్గురి మీదా చల్లి ఆ సిగరెట్లు నవ్వుకుంటూ వారిమీదికి విసిరేసి ఇంట్లో దొరికిన డబ్బులు, నగానట్రా తీసుకొని ఆ ఇంటివారి పోష్ కారులో బయటపడుతారు.  కొద్దిదూరం వెళ్ళాక పోలీసులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనపడుతారు కదా, ఇహ తప్పించుకోలేక ఆ పోలీసు కార్లకి తమ కారుని గుద్ది వెళ్ళాలనుకుంటారు. అప్పుడు స్పృహలోకి వచ్చిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చేసి గొప్ప ఘనకార్యం చేసామని చంకలు గుద్దుకుంటారు. ఇదండీ ఇక్కడి పోలీసుల ప్రతిభ.   

ఇహ ఏ దుండగుడో ఓ కాలేజీకి వెళ్ళి అక్కడి విద్యార్ధులని పిట్టలు కాల్చినట్లు కాలుస్తున్నాడంటే వెంటనె ఆ కాలేజీలోకి వెళ్ళి ఆ దుండగుడిని ఎదుర్కుంటే సమర్ధత ఎలా అవుద్దీ. ఎంచక్కా ఆ కాలేజీ చుట్టూ పెరిమీటర్ ఏర్పాటు చేసి తమకంటే పెద్ద పోలీసుల కోసం ఎదురుచూస్తుంటారు. మరి ఆ ఘనత వహించిన సెషల్ పోలీసులు పక్క సందులోనే వుండరు కదా, వాళ్ళు ఓ అరగంట తరువాత ఆయాసంగా వచ్చి లోపలికి వెళ్ళి ఆ దుండగుడిని కాల్చేస్తారు. ఈ లోగా మనవాడు ఎంచక్కా ఇంకో ఎనభయి మందిని కాల్చి చంపివుంటాడు.  

ఈ సంఘటన దాదాపు ఓ పదేళ్ళ క్రితం కొలరాడాలోని కొలంబైన్ స్కూలులో జరిగింది. తరువాత తాపీగా పోలీసులు నాలిక కొరుక్కొని వాళ్ళ విధానలు సమీక్షిస్తామన్నారు. సరేలే అలానన్నా ఈ దేశ పోలీసులు తమ విధానాలని సమీక్షించుకున్నారేమో అనుకున్నాను. అంతత్వరగా విధానాలు మారితే అమెరికా ఎందుకవుతుంది? ఎన్ని చర్చలు జరగాలీ, ఎన్ని మీటింగులు జరగాలీ. ఇండియాలోనేమో అలసత్వం, అవినీతి, లంచగొండితనం వల్ల పనులు లేటవుతే ఇక్కడేమో పనికిరాని మీటింగులూ, చర్చలూ, ప్రజాభిప్రాయ సేకరణలతో కాలం హరించుకుపోతుంది.

ఇక ఆ రేపులు,దహనాల సంగతి చూద్దాం. 2007లో ఇద్దరు మాజీ నేరస్థులకు డబ్బు ఇబ్బంది ఏర్పడి ఎవరినయినా దోచుకుందామని ఆలోచిస్తుంటే తల్లితండ్రులతో షాపింగు చేస్తున్న 11 ఏళ్ళ అమ్మాయి అందులో ఒకడికి నచ్చుతుంది. వారిని ఫాలో అయిపోయి వాళ్ళ ఇల్లు ఎక్కడ వుందో కనుక్కుంటారు. ఆ అర్ధరాత్రి వచ్చి కింద హాల్లో టివి చూస్తూ పడుకున్న తండ్రిని ఆ నిద్రలోనే బలంగా కర్రలాంటి దానితో బాదితే అతను అక్కడే స్పృహతప్పిపోతాడు. ఇద్దరూ పైన బెడ్ రూములలోకి వెళ్ళి తల్లినీ, అమ్మాయిలనీ మంచానికి కట్టేసి డబ్బుల కోసం ఇల్లంతా వెతుకుతారు కానీ ఎక్కువగా దొరకవు. దాంతో ప్లాన్ మార్చేస్తారు. తెల్లవారి బ్యాంకు సమయం అయేంతవరకూ వాళ్ళిద్దరూ బీర్లు తాగుతూ కాలక్షేపం చేసి తల్లిని తీసుకొని ఒకడు బ్యాంకుకి వెళ్ళి బయట నిలబడతాడు. తల్లి లోపటికి వెళ్ళి 15,000 డాలర్లు డ్రా చేస్తూ బయటవున్న దుండగుడికి అనుమానం రాకుండా టెల్లరుతో నెమ్మదిగా పరిస్థితి   వివరిస్తుంది. అదంతా కూడా సిసిటివిలో పడింది. ఆమె బ్యాంకు నుండి  బయటకి వెళ్ళే లోపుగానే   ఆ టెల్లర్ పోలీసులకి ఫోన్ చేసి పరిస్థితి తెలియజేస్తుంది.  వీళ్ళిద్దరూ బ్యాంకుకి వెళ్ళి వచ్చేలోపుగానే    ఇంట్లో వున్న వాడు అందులోని చిన్నమ్మాయిని బలాత్కారం చేసేస్తాడు. చిత్రం: బ్యాంక్ టెల్లరుకి తల్లి సమాచారం ఇస్తున్న దృశ్యం.

బ్యాంకు టెల్లరు ద్వారా విషయం తెలిసిన వెంటనే పోలీసులు వెళ్ళి ఇంటిచుట్టూ పెరిమీటర్ ఏర్పాటుచేసి ఆ ఇంటిని దూరం నుండి గమనిస్తుంటారు. ఇంటి బయట రేపులు గట్రా ఏమీ జరుగుతుండకపోవడంతో ఊపిరిపీల్చుకుని హాయిగా అలాగే కాలక్షేపం చేస్తుంటారు. ఈలొగా తాపీగా అ ఇద్దరూ ఆ ముగ్గురినీ పలు మార్లు రేపులు చేసి వారు బ్రతికివుండగానే పెట్రోలు చల్లి తగలబెట్టి బయటకి వచ్చి ఆ ఇంటివాళ్ళ కారులో వెళుతూ రెండు పోలీసు కార్లకి గుద్ది దొరికిపోతారు. ఈలోగా ఇల్లు మంటల్లో చిక్కుకుంటుంది. కింద వున్న తండ్రికి మెలకువ వచ్చి గాయాలతో, రక్తం కారుతుండగా పాక్కుంటూ, పాక్కుంటూ పక్కింటికి వెళ్ళి వారి సహాయం తీసుకుంటాడు.

వారిద్దరి మీద విచారణ జరిగి గతవారమే ఒకనికి శిక్షపడింది. మరొకడిని ఇంకా విచారిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం పై తండ్రి కోర్టులో కేసు వేస్తున్నాడు కానీ ఇప్పటికీ సిగ్గు లేకుండా తాము సరిగానే వ్యవరించామని ఆ పోలీసు పెద్దలు సమర్ధించుకుంటున్నారు.

గమనిక: అందరు అమెరికా పోలీసులూ ఇలాంటివారే అన్నది నా ఉద్దేశ్యం కాదు. ఈ సంఘటణల్లోని పోలీసులు మాత్రం అతితెలివితో ప్రవర్తించారనేది నా అభిప్రాయం.

7 comments:

 1. కాస్త ఫాంట్ సైజు పెంచుదురు ,మీ సోమ్మేమీ పోదు గాని .

  ReplyDelete
 2. మీ బావ కంటే తెలివైన వాళ్ళా మీ పోలీసులు

  ReplyDelete
 3. తొమ్మిదీ పదకొండు తర్వాతో పెట్రోల్ బంక్ నడుపుకునే సర్దార్జీని కాల్చి చంపిన జాత్యహంకార అమెరికన్లని వెంటనే పట్టుకోటమే కాక ఆరు నెలలు తిరిగేలోపే యావజ్జీవిత శిక్ష విధించిన వైనాన్నీ ప్రస్తావించుంటే మీ వ్యాసానికి నిండుదనం వచ్చుండేది. 1984 సంఘటన దరిమిలా ఢిల్లీలోనూ మరిన్ని చోట్లా బలైపోయిన సర్దార్జీలకి మన దేశంలో ఇంకా జరగని న్యాయంతో దీన్ని పోల్చి చూడండి. అమెరికన్ పోలీసు వ్యవస్థలో లోపాల్లేవనలేం. లోపాల్లేనిదెక్కడ? ఐతే ఇక్కడ జవాబుదారీతనం ఉంది. మనకి లేనిదదే.

  ReplyDelete
 4. నాకు మొన్న ఎదురుగా వచ్చేవాడు తిరిగి వచ్చి మరీ టికెట్ వేసాడు .. అయినా కొండ కొస పై కొద్దిగా కాప్ కార్ లక్షణం కనపడగానే ఎనభై నుండి టాకీ మని అసలు స్పీడు యాభై ఐదు కి పడ్డా .. అయినా ఎదురుగా వచ్చేవాడు .. ఏం వేస్తాడు లే అనుకున్నా.. నేను కొండకి ఇటు వైపు కి వచ్చేలోగా తిరిగి వచ్చి 73 టికెట్ వేసాడు.. ఇప్పుడెం చేయాలి.. రేపే విచారణ .. ఏమైనా సలహా ఉందా అన్నాయ్ ...

  తప్పు కి శిక్ష అనుభవించు అనకుండా 200 సేవ్ చేసే ఉపాయం ఉంటే చెప్పాలి

  ReplyDelete
 5. @ అజ్ఞాత
  పెంచాను
  @ అజ్ఞాత
  :)
  @ ఆబ్రకదబ్ర
  పాశ్చాత్య దేశాల పోలీసుల సమర్ధత గురించి అందరికీ తెలుసు కాబట్టి అది విషయం/వార్త కాదు. ఆ సమర్ధత అతి అయితేనే ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. అయితే నేను అన్నది అందరు పోలీసుల గురించి కాదు, ఆ సంఘటణల్లోని పోలీసుల విషయమే అని అర్ధమయే విషయమే అయినా అది ఎక్స్‌ప్లిసిట్ గా పేర్కొనకపోవడం నా పొరపాటు.

  ReplyDelete
 6. @ కాయ
  ఇలాంటి కేసులు డీల్ చేసే పెరా లీగలు వాళ్ళు కెనడాలో అయితే వుంటారు. US సంగతి నాకు తెలియదు. వాళ్ళు మీ తరఫున వెళ్ళి వాదిస్తారు. కేసు గెలిస్తే మీ ఫైనులో సగం వారికి చెల్లించాలి. ఓడిపోతే వారికేమీ ఇవాల్సిన అవసరం వుండదు. మీ ఫైను మీరు చెల్లించాల్సివుంటుంది.

  ReplyDelete
 7. Police Lu ekkadaina okkate annamaata. Dongalu padda aarnellaku

  ReplyDelete