తెంగ్లిష్ వద్దు! ఇంగ్లిష్ ముద్దు!!

దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీసు కుక్కలు మొరిగినట్లుగా కొంతకాలం క్రితం జరిగిన తెలుగు బాట ముచ్చట్లు, ఇండియాలో జరిగిన తెలుగు బ్లాగర్ల ముచ్చట్లు మీతో వరుసగా పంచుకోబోతున్నాను.

అది తెలుగు బాటలో నడుస్తున్న వైనం. ఆ బాటలో పెద్దగా ఇతర ప్రజలెవరూ లేరు కనుక మా స్లో'గన్స్' మేమే వింటున్నాం. నేనూ ఓ బ్యానర్ పట్టుకొని నడిచాను. మా అల్లుడు రవి, బ్లాగర్ నాగ కూడా నా బ్యానర్తో చేతులు కలిపారు. నా బ్యానరులో ఇలా వుంటుంది "తెంగ్లిష్ వద్దు, తెలుగే ముద్దు". అయితే ఎవరో ఇతర స్లోగన్స్ ఇస్తూ మా బ్యానర్ మీద వున్న స్లోగన్ కూడా ఇచ్చారు. మిగతా వాటితో పాటు మా బ్యానర్ స్లోగన్నుకి కూడా అరవడంలో జత కలిపాను. అయితే ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది.

మనకు పొరపాట్లు చేయడం అన్నది సహజంగా వచ్చిన అలవాటు కాబట్టి ఎందుకో తెలియదు కానీ దానికి బదులుగా "తెంగ్లిష్ వద్దు, ఇంగ్లిష్ ముద్దు" అని అరిచేసాను. చుట్టూ వున్న వాళ్ళు ఘొల్లున నవ్వేసరికి నాలుక కరచుకున్నాను. సరే మరి కొంత నడిచాము. ఆ తరువాత మళ్ళీ అదే పొరపాటు చేసాను. నా పక్కన నడుస్తున్న ఒక బ్లాగరు (పేరు గుర్తుకులేదు) నా వైపు చురుగ్గా చూసారు. అంతే కదా, మొదటి సారి పొరపాటు చేస్తే పొరపాటు అని వదిలేస్తారు, తరువాత కూడా అలా చేయరు కదా. ఎందుకో గానీ అప్పుడు తెలుగు అన్న పదం పలకడం కష్టమయిపోయింది, ఇంగ్లీషు పదమీ వీజీగా నాలిక మీద తిరుగుతోంది.

ఇహ లాభం లేదని, మూడోసారీ పొరపాటు చేస్తే నాకు ముచ్చటగానే అనిపించవచ్చు కానీ ఈ-తెలుగు వారికి అంత ముచ్చటగా అనిపించక నన్ను ఆ బాట నుండి పక్కకు రమ్మనమని చెప్పి ఏదయినా ముచ్చట(?!) చెప్పే పరిస్థితి రావచ్చుననిపించింది. లేకపోతే తాడేపల్లి గారితో తెలుగు భాషా ప్రాశస్త్యం మీద ఓ గంట ఇంగ్లీషులో తెలుగు మీద పాఠం నాకు ఇప్పించే ప్రమాదం వుంది అని కూడా సిక్స్త్ సెన్స్ కుక్కలా పసిగట్టింది. అందుకని వళ్ళు, నాలుక దగ్గర పెట్టుకొని మనస్సులో ఎదురుగ్గా తాడేపల్లి గారిని నిలుపుకొని "తెంగ్లిష్ వద్దు, తెలుగే ముద్దు" అని డిక్టేషను నాకు నేనే చెప్పుకున్నాను. అది ఫలించి తరువాత ఆ పొరపాటు చెయ్యలేదు. అదీ ఫలించకపోతే ఆ స్లొగన్ వచ్చినప్పుడు వ్యూహాత్మక మౌనమయినా పాటిద్దామనుకున్నను కానీ అంత అవసరం రాలేదు.

మరి తాడేపల్లి గారి పైన అంతగా భయభక్తులు ఎందుకు ఏర్పడ్డాంటే నేను తెలుగు బాటకు వెళ్ళగానే మొదటగా నేను బుక్కయ్యింది వారికే మరి. తెలుగు బాటలో ఎవరయినా చూస్తే మేధావిలా కనపడాలనో ఏమో తాడేపల్లి గారు గెడ్దం బాగా పెంచేసారు;) ఫోటోలొ చూసిన దానికన్నా బాగా బక్కగా అయినట్లున్నారు. మొత్తం మీద తమ భావజాలం గురించి ఆలోచిస్తూ, తెలుగు ఉన్నతి గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ తమ పైన తాము అంతగా శ్రద్ధ చూపడం లేదని వారిని చూసిన ఎవరికయినా అనిపించకమానదు.  

తెలుగు బాటకి సుజాత గారు ఆహ్వానించి తోడ్కొని వెళ్ళారనుకోండి కానీ అది కాకుండా మొదటగా కాస్సేపు మాట్లాడింది తాడేపల్లి గారితోనే. దానిని మాట్లాడటం అంటారా? వినడం అంటారు! ఏంటి సార్ నెమ్మది నెమ్మదిగా మా ఉద్యమ భావజాలంలోకి వస్తున్నట్లున్నారు అని పొరపాటున ఒక ప్రశ్న వేసానో లేదో ఇక నన్ను వారు మాట్లాడనిస్తే కదా. ఆ భావాలు ఇప్పటివి కావండీ, చాలా పురాతన కాలం నుండీ నేను ఆలోచిస్తున్నవే అంటూ అనర్ఘళంగా చెప్పుకువచ్చారు. నేను అలాగా అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను కానీ వారు గమనించలేదు.  ఏ ఎక్స్‌ప్రెషన్ అంటే అదే సినిమాల్లో ఓ కమెడియన్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటాడు చూడండి. అలా అన్నమాట. ఏమిటో ఆ కమెడియన్ పేరు ఎప్పుడూ గుర్తుండి చావదు. పోనీ బయటినుండి మా ఆవిడ లైఫ్ లైన్ ఫోను చేసి  తీసుకుందునా? పేరు చెప్పకుండా ఎందుకు, ఏమిటీ, ఆ పేరు అర్జంటుగా ఎవరికి అని యక్షప్రశ్నలు వేసిగానీ చెప్పదు! అయినా ప్రయత్నించి చూసెద. మీరు కాస్సేపు పక్కకు తప్పుకోండి మరి.  

ఎం ఎస్ నారాయణ. ముందు పేరు చెప్పి తరువాత ప్రశ్నలు అడిగి అడిగింది.  హి హీ. విషయం పక్క సైడుకి వెళ్ళింది చాలు గానీ ఇహ అసలు విషయానికి వద్దాం.  

అలా వారు చెబుతున్నవన్నీ అమాయకంగా అలాగా, అలాగా అంటూ వింటూ వస్తున్నానా - అలాగా, అలాగా అంటారు, మీరు మాట్టాడరేంటండీ అని గద్దించారు. ఏంటీ మాట్టాడేదీ, నన్నసలు మాటాడనిస్తే కదా! ఆ తరువాత మా మధ్యకి ఎవరో రావడంతో నెమ్మదిగా జారుకున్నాను. ఇహ మళ్ళీ వారికి నేను దొరక్కుండా జాగ్రత్తగా మెసలుకున్నాను.

బ్లాగుల్లో మామధ్య కొంత శత్రుత్వం వున్నా అవేమీ మనస్సులో పెట్టుకోకుండా నిండు మనస్సుతో తాడేపల్లి గారు నన్ను ఆహ్వానించారు. వారు నాతో చాలా చక్కగా మాట్లాడారు. వారు ఎంతో చక్కగా, హాస్యంగా, అనర్ఘళంగా మాట్లాడుతూవుంటారు. బ్లాగుల్లో కాస్త దుడుకుగా, నిష్కర్షగా అనిపిస్తారు కానీ మంచి స్నేహశీలి. వారితో ఇంకా చాలా సేపు మాట్లాడాలని, వారి తేట తెలుగు పదాల వాగ్ధాటి వింటూ అచ్చెరొవొందుతూ పోవాలని అనుకున్నాను కానీ సమయం చిక్కలేదు. ఈసారి మళ్ళెప్పుడయినా ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా తీరికగా కలుస్తాను. ఈ సారి నా ఇండియా ట్రిప్ ని ధన్యం చేసిన వారిలో వారొకరు. వారు గుర్తొచ్చినప్పుడల్లా అరమరికలు లేని వారి స్నేహం ఎప్పుడూ గుర్తుకువస్తుంటుంది. కాసేపే మాట్లాడినా ఇతరుల మీద మంచి ముద్ర వేయగలరు వారు. 

8 comments:

 1. Nice Summary. తెలుగు నడకకి రాలేకపోయిన లోటు మాలాంటి వాళ్ళకి మీ టపా వల్ల తీరుతుంది :-)

  ReplyDelete
 2. @ వీకెండ్ పొలిటీషియన్
  "Summary"

  ఇంకా విశేషాలు అప్పుడే అయిపోలేదండీ. తెలుగు బాట గురించీ, తెలుగు బాటలో కలిసిన ప్రముఖ బ్లాగర్లు, హైదరాబాదులో కలిసిన ప్రముఖ బ్లాగర్లు అందరి గురించీ ముందో వెనకో విపులంగా వ్రాయబోతున్నాను.

  ReplyDelete
 3. నిజం. బ్లాగు రాతలు, వ్యాఖ్యల రాతల్లో కనిపించేది ఆ మనిషియొక్క ఒక్క పార్శ్వం మాత్రమే.
  నా సర్టిఫికేటు ఆయనకి అవసరం లేదుగానీ, గిరీశం చెప్పినట్టు - తాడేపల్లి గారితో మాట్లాడ్డవే ఒక ఎడ్యుకేషన్, మనకి వినే ఓపిక ఉంటే.
  పంచుకున్నందుకు మీకు నెనర్లు.

  ReplyDelete
 4. తాడేపల్లి గారు ఏదైనా చెప్పారంటే అప్పటికప్పుడు ఒప్పుకుని తీరాలనిపిస్తుంది.(కొద్దో గొప్పో మనకు ఆ విషయం పట్ల మనకు వ్యతిరేకత ఉన్నా సరే) అందుకే అక్కడికి వచ్చిన వారిని ఆహ్వానించి తాడేపల్లి గారి వద్దకు పంపాము.వ్యూహాత్మకంగా :-))

  తాడేపల్లి గారితో మాట్లాడ్డమే ఒక ఎడ్యుకేషన్ అనే విషయాన్ని ఒప్పుకోవలసిందే!

  బ్లాగర్లు ఎదురెదురుగా ఉండి వాదించుకోం కాబట్టి అవతలి వారి "టోన్" మనకు అర్థం అయ్యే అవకాశం లేదు కాబట్టి, భేదాభిప్రాయాలు ఉండటం సహజం! దానికి శతృత్వమనే పెద్ద పేరు అక్కర్లేదు. శతృత్వం ఉండాలంటే బ్లాగుల్లో భేదాభిప్రాయాలనే చిన్న కారణం సరిపోదు.

  ReplyDelete
 5. @ కొత్తపాళీ
  వారి గురించి చక్కటి విషయాలు చెప్పారు.

  @ సుజాత
  హమ్మా. అయితే మీ వ్యూహాలు మీకు వున్నాయన్నమాట :))

  నిజమే. మీరన్నట్లు అది శత్రుత్వం కాదు, భేదాభిప్రాయాలంతే. పరస్పరం కలిసి మాట్లాడుకుంటే బ్లాగులోకంలో ఇన్ని చిటపటలు వుండవేమో అనిపిస్తుంది. అందుకే ఇలాంటి కలయికలు అప్పుడప్పుడయినా వుండాలి.

  ReplyDelete
 6. mmm india ki vachinapudu telugu baata ganakaryam kuda chesarannamata

  ReplyDelete
 7. ఫేస్ బుక్ లో అమ్మాయిల వ్యక్తిత్వంపై అసభ్య రాతలు రాయడంతోపాటు మరికొంతమందితో కలిసి అశ్లీలమైన చర్చలు సాగించిన తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారిపై మీకు చాలా గౌరవ భావం ఉన్నట్లు కనిపిస్తుందేంటి సార్? మేధావి ముసుగు వేసుకున్న గోముఖ వ్యాఘ్రంలాంటి తాడేపల్లికి కాస్త దూరంగా మసలుకోండి సార్.

  ReplyDelete
 8. బ్లాగుల్లో దుడుకుగా మాట్లాడి, చేతికందేంత దూరంగామాత్రమే ఉన్నప్పుడు సౌమ్యంగా మాట్లాడటమూ వ్యూహాత్మకమేమో తెలుసుకోలేకపోయారా.

  ReplyDelete