రామ జన్మభూమి కేసు విషయంలో సుప్రీంకోర్టు ధర్మం?

ఈ కేసు సుప్రీం కోర్టుకి వెళ్లక తప్పదు. జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినేయ్డ్ అని ఓ తెగ ఆదుర్దాపడి హడావిడిగా కొంపలు మునిగినట్లు మిగతావన్నీ పక్కకు పడేసి రెండు మూడు ఏళ్ళలోనే సుప్రీం కోర్టు తీర్పు ఏమీ ఇవ్వఖ్ఖర్లా. ఈ కేసుని హైకోర్టు ఓ అరవై ఏళ్ళు నాంచింది కాబట్టీ సుప్రీంకోర్టు తన హోదాకు తగ్గకుండా తాపీగా ఓ వందేళ్ళయినా నానిస్తేనే దానికి గౌరవం వుంటుంది. అందాక ఈ విషయం మీద పెద్దగా ఎవరూ కొట్టుకోకుండా వుంటుంది. ఓ వందేళ్ళ తరువాత చూద్దాం రాముడెవరో, అల్లా ఎవరో!

ఇప్పుడంటే పై కోర్టు వుంది కదా అని అందరూ కాస్త ఓపిక పడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం కాబట్టి ఓడిపోయిన మతస్థులకి అప్పుడు బాగానే వళ్ళుమండవచ్చు. అందుకే సుప్రీంకోర్టుకి ఈ కేసు విషయంలో తొందరవద్దు - తాపీగా పనిచెయ్యాలి.

ఈ కేసు విషయమై BBC లో చక్కటి వ్యాసం వచ్చింది చూడండి
http://www.bbc.co.uk/blogs/thereporters/soutikbiswas/2010/09/ayodhya_verdict_a_happy_compromise.html

పాస్‌వర్డ్ గిల్లేసిన మేనల్లుడు!

మేము కెనడాలో వుంటున్నప్పుడు తొలిసారిగా యుఎస్ నుండి మా చిన్నక్కయ్య పెద్దకొడుకు సతీసమేతంగా వచ్చాడు. నా సిస్టం తీసుకొని మామయ్యా మీ పాస్‌వర్డ్ చెప్పండి అని అడిగాడు. అరేయ్ పాస్‌వర్డ్ పెట్టుకునేదే ఎవరికీ ఇవ్వకుండా వుండటానికి. నా దాంట్లో చాలా పెద్ద పెద్ద రహస్యాలు వుంటయ్ కానీ గెస్ట్ ఎక్కవుంట్ చూసుకో అన్నాను. రియల్లీ అనేసి గెస్టు ఎక్కవుంటులో ప్రివిలేజెస్ తక్కువగా వుంటాయి కదా, ఆంటీ పాస్‌వర్డ్ చెప్పండి అని అడిగాడు. మీ ఆంటీ పాస్‌వర్డ్ ఆమెకు తప్ప మరో నరమానవుడికి కూడా తెలియదు అని నాలుక చప్పరించాను. వాడు గ్రేట్ అనేసి పోనీ స్ని అన్నాడు. అది అరుస్తుంది కానీ పాస్‌వర్డ్ ఇవ్వదు, దాన్నొదిలేయ్ అన్నాను. మా వాడు సూపర్ అని అమ్మలు ఎక్కవుంటుకి పాస్‌వర్డ్ వుండదనుకుంటా అని క్లిక్ చేసి ఆగిపోయాడు. స్ని అయినా కూడా అరిచి వదిలేస్తుంది కానీ దాన్ని పాస్‌వర్డ్ అడిగావంటే కరిచినా కరుస్తుంది అని చెప్పి గేస్టు ఎక్కవుంటుతో ఎడ్జస్ట్ అయిపో అని తాపీగా అన్నాను. 
 
అబ్బో ఈ ఇంట్లో అందరూ సెక్యూరిటీ బాగా మైంటైన్ చేస్తున్నారే అని గెస్టు ఎక్కవుంటుకి వెళ్ళాడు. మరి ఎవరి ప్రైవసీ వాళ్ళకుండాలి కదా అని డైలాగ్ వేసాను. రియల్లీ అన్నాడు వాడు సిస్టంలో ఏదో చేస్తూ యథాపలంగా.  ఓ ఇరవై నిముషాల తరువాత "మామయ్యా మీ ఎక్కవుంటులో ఎవో చాలా పెద్దపెద్ద రహస్యాలు వున్నాయన్నారు. అంత పెద్ద రహస్యాలు ఏమీ లేవే" అన్నాడు చల్లగా. "హ?!" అని ఎం ఎస్ నారాయణ ఫేసు పెట్టాను. నా పాస్‌వర్డ్ బయటకి చెప్పేసాడు. కొంపదీసి నా పాస్‌వర్డ్ మా అవిడ వినేసిందేమోనని చుట్టూ చూసాను కానీ తనులేదు.
 
ఇంకేముంది విషయం అర్ధమయిపోయింది! నా సిస్టం ఎక్కవుంటుని హ్యాక్ చేసేసాడు! ఆస్ట్రేలియాలో తాను చదువుకుంటున్నప్పుడు చేసిన హ్యాకింగ్ ఘనకార్యాలు అంతకు క్రితం రాత్రి చెబుతుంటే లొట్టలు వేసుకొని విన్నాను కానీ ఇలా నాకే ఎఫెక్ట్ అవుతుందనుకోలేదు. సరే అయిందేదో అయ్యింది కానీ ఆంటీ ఎక్కవుంట్ కూడా హ్యాక్ చేసావా అని అడిగి తన సీక్రెట్లు ఏమయినా వుంటే తెలుసుకుందామనుకున్నాను కానీ వాడు ఇంకా హ్యాక్ చెయ్యకపోయివుంటే వాడికి లేనిపోని ఆలోచన ఇచ్చినవాడిని అవుతానేమోనని నోరు నొక్కేసుకున్నాను.  
 
కట్ చేస్తే ఓ రెండేళ్ళ తరువాత న్యూజెర్సీలో వుంటున్న వాడింటికి వెళ్లాము. ఓ శుభసమయాన నేను ఒక్కడినే వున్నది చూసి "మామయ్యా, మీ పాస్‌వర్డ్ ఇంకా మార్చలేదేంటీ?"  అని చల్లగా నన్ను ఆరాతీసాడు. మళ్ళీ ఎం ఎస్ నారాయణ ఎక్స్‌ప్రెషన్ ఇద్దామనుకున్నాను కానీ ఈ సారికి కొంచెం ఎక్కువవుతుందేమోనని ఆగిపోయి "ఎందుకు బాబూ, నేను పాస్‌వర్డ్ మార్చనేల? నువ్వు హ్యాకు చెయ్యనేల? అంత శ్రమ ఎందుకులే అని మార్చుకోలేదు!" అని ఏడవలేక నవ్వాను. "మామయ్యా మీరు చాలా లాజికలుగా ఆలోచిస్తారు" అని మెచ్చుకొని "ఎలాగూ ఎవరయినా మీ పాస్‌వర్డ్ హ్యాక్ చేసేస్తారు కదా అని తేలికపాటి పాస్‌వర్డ్ పెట్టుకున్నారు కదా" అని కూడా సెలవిచ్చాడు. అప్పుడు మాత్రం ఎక్స్‌ప్రెషను ఇవ్వక తప్పలేదు.  మీ కంటే అమ్మలే నయం అనేసి స్నానం చెయ్యడానికి బాతురూముకి వెళ్ళాడు.        

పోల్: అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది?

పోల్: అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది?


పక్కనే వున్న పోల్ చూసి వోట్ వెయ్యండి. రిగ్గింగ్ చెయ్యకండి :)


1.హిందువులకు

2.ముస్లిములకు

3.నాస్తికులకు :)

మూడో ఆప్షన్ యొక్క అర్ధమేంటంటే అయోధ్య ఇటు ముస్లిములకూ చెందదూ, అటు హిందువులకూ చెందదూ, ఆ ప్రాంతాన్ని ఓ పాఠశాలగానో, లైబ్రరీగానో, లేదా మరో విధంగా సంఘానికి ఉపయోగపడేట్లుగా కోర్టు ఆదేశించవచ్చునేమోనని నా అత్యాశ!

నేను ఎవరో చెప్పండి చూద్దాం!

ఆ రోజు సంజన వాళ్ళ ఊరికి బయల్దేరుతున్నాం. సంజన నేను హైదరాబాదులొ దారిలో ఒక రెస్టారెంటు దగ్గర ఆగి దోశా, ఇడ్లీ తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాం. అప్పుడు వచ్చింది ఫోను. "నేను హైదరాబాద్ బ్లాగర్నండీ. మీ నంబర్ AP మీడియా రాము గారు ఇచ్చారు. నేనెవరో గుర్తు పట్టండి చూద్దాం!" అని ఒక మహిళ గలగలా ఉత్సాహంగా మాట్లాడారు. నేను నవ్వి నాకు గుర్తుకువచ్చిన హైదరాబాద్ లేడీ బ్లాగర్ పేరొకటి చెప్పాను. ఊహు కాదన్నారు. అయితే పేరు మాత్రం గుర్తుకు రావడం లేదు కానీ (తీరికలేని పనులు, నిద్రలేమి లాంటి కొన్ని కారణాల వల్ల నా బుర్రలో కొన్ని ఫ్యూజులు ఎగిరిపోయివున్నాయిలెండి. అందుకే ఆ బ్లాగర్ పేరు గుర్తుకు రాలేదు)  మా ఇంటి వైపే వుండే బ్లాగర్ కావచ్చు అన్నాను. ఊహు కాదు అని చెప్పి వారు వుండే ఏరియా చెప్పారు. అప్పుడు వెలిగింది నాకు. సుజాత, తెలుగు సుజాత అని చెప్పాను. అవునండీ అని గలగలా మాట్లాడారు.

తెలుగుకై నడకకి రావాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం రామూ గారికే కాకుండా అక్కడికి వచ్చి మా అందరికీ కూడా మీ దర్శనభాగ్యం కలిగించమని సరదాగా అన్నారు. ఆ కార్యక్రమం గురించి నాకు ఇప్పటికే తెలుసనీ, వీవెన్ ఈమెయిల్ ఇచ్చారనీ, తప్పక వస్తాననీ చెప్పాను. కలర్స్ స్వాతి కూడా వస్తున్నారని చెప్పారు. అయితే నేను తప్పక వస్తానని చెప్పాను. తెలుసు, తెలుసు మీరు తప్పక వస్తారు అని సరదాగా వారు అన్నారు.  కొద్ది సేపు మాట్లాడాక సంజనను వారికి పరిచయం చేసాను. కొద్దిసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. 

తెలుగు బాటలో: నేను వెళ్ళగానే ముందుకు వచ్చి పలకరించి తీసుకొనివెళ్ళి అక్కడున్న బ్లాగర్లకి పరిచయం చేసారు. నన్ను తాడేపల్లి గారి చేతుల్లో క్షేమంగా పెట్టివెళ్ళారు! వారి అమ్మాయి ఫోటొ వారి ప్రొఫయిల్ ఫోటొలో చూసి సుజాత గారు ఇంకాస్త ఎత్తుగా, ఇంకొంచెం బక్కగా వుంటారనుకున్నాను. అంటే వారు లావున్నారని కాదు.

అక్కడానూ, నడకలోనూ వారు చాలాసేపు వున్నా ఆ కార్యక్రమాలలో తీరిక లేకుండా వున్నారు కాబట్టి మళ్ళీ వివరంగా మాట్లాడటానికి కుదరలేదు. తెలుగు బాటలో కొద్దిసేపు నా పక్కనే నడిచారు కానీ అప్పుడు స్లోగన్సు ఇస్తూ కర్తవ్య నిర్వహణలో వున్నాను కాబట్టి మాట్లాడలేకపోయాను. నడక అయిపోయిన తరువాత ఎవరో (వారు ఎవరో గుర్తులేదండీ) వారితో "శరత్ గారు కూడా నడక మొత్తం బ్యానర్ పట్టుకొని నడిచారు" అని వారితో ప్రశంసా పూర్వకంగా చెప్పారు. అది విని వారు అవునవును, నేనూ చూసాకదా అనో ఏదో అన్నారు. వారు అన్నది విని నా పక్కన నాగ కానీ, మా అల్లుడు రవి కానీ లేరని నిర్ధారించుకొని "అవునండీ, తెలుగు నడక అసాంతమూ బ్యానర్ పట్టుకుని నడిచాను కాబట్టి మరి నా ఫుటో చాలా ప్రముఖంగా రావాలి" అని కోరాను. "అలాగేనండీ తప్పకుండా, మీ ఫోటొ వెయ్యకపోతే ఎలాగా" అని నవ్వుతూ అన్నారు.
 
నడక అయిపోయాక పివి జ్ఞానస్థలి వద్ద నెమ్మదిగా వర్షం పడుతుంటే వెచ్చని టీ తాగుతూ అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకోవడం చక్కటి అనుభూతిగా మిగిలింది. ఆ కార్యక్రమం చివరన వెళుతూ వెళుతూ అందరం అక్కడే వున్న ఏదో రెస్టారెంటుకి వెళుతున్నామని చెప్పి అక్కడికి రమ్మన్నారు. మా కారు వచ్చాక వస్తామని చెప్పాను. మా కారు రావడం ఆలస్యమయ్యింది. మేము మా అక్కయ్య వాళ్ళ ఫార్మ్ హవుజుకి వెళ్ళాల్సిన సమయం దగ్గర పడటంతో వారికి ఫోను చేసి రెస్టారెంటుకి రాలేనని చెప్పాను.
 
ఇంతకూ ఆ బాటకి కలర్స్ స్వాతి రాలేదు :( నేను ఆ బాటకి తప్పకుండా రావాలని నాకు అలా ఎర చూపారో ఏమో తెలియదు! మరి కలర్స్ స్వాతి వస్తున్నదని తెలియకపోతే నేను ఆ బాటకి నిజ్జంగా వెళ్ళేవాడినే అంటారా?  

డాన్ శరత్

నిన్న మధ్యాహ్నం నా నస భరించలేక డాన్ శ్రీను సినిమా ముందు పడేసింది మా ఆవిడ. నోరుమూసుకొని సినిమా అసాంతమూ చూసాను. సినిమా ఫన్నీగా బాగానే వుందిగా. శ్రియ అందాలు కూడా బావున్నయ్. విమర్శకులు రివ్యూలల్లో ఏవో చాలా ఈకలు పీకేసినట్టున్నారు కానీ ఓ ఎంటర్టైన్మెంటు సినిమాకి ఇంతకంటే ఏం కావాలేంటీ?

సినిమా చూసాక డాన్ శ్రీను నాకు పూనాడు. మన వీరత్వం ఇంకెవరి మీద ప్రదర్శిస్తామేంటి? వికటాట్టహాసం చేసుకుంటూ మా ఆవిడ బుర్ర తినేసాను. అనవసరంగా ఈ సినిమా చూపించేనని మా ఆవిడ నాలుక్కరచుకుంది.

కంప్యూటర్లో నెట్ వేగం పెంచడం ఇలా

నా నెట్‌బుక్ ఈమధ్య అమ్మలు కూడా బాగానే వాడుతోంది. అందులో పిల్లల సినిమాలు చూస్తూవుంటుంది. ఆ సినిమాలు తొందరగా డవున్‌లోడ్ కాకపోతే నా నెట్‌బుక్కును అటూ ఇటూ బాదేస్తోంది :( అలా చేస్తే డవున్లోడ్ స్పీడ్ పెరుగుతోందిట! ఈ చిట్కా మీకు నచ్చితే వాడండేం.

ఇండియాలో ఈ ఇద్దరు బ్లాగర్లు కలిసినా మాట్లాడకూడదనుకున్నాను!

తెలుగు బాటకి వెళ్ళాను. నా బ్లాక్ లిస్టులోని బ్లాగర్లలో ఒకరు కనిపించారు కానీ తన పనుల్లో తాను వున్నాడు. కనీసం నా వైపైనా చూస్తాడా అనుకున్నాను కానీ లే, చూడలే. నన్ను చూసేవుంటాడు కానీ అలా చూడనట్లు నటిస్తున్నాడనుకుంటా. నేనూ అతగాడి మీది నుండి చూపులు మళ్ళించాను. కానీ పనులతో అటూఇటూ తిరుగుతూ నాకు కనపడుతూనే వున్నాడు. నేనేం చేసేదీ. నేను ఇక్కడికి వచ్చింది తెలియకుండా వుంటుందా? నేను ఇక్కడ అందరితో హడావిడిగా మాట్లాడుతూ వుంటే నేను వచ్చింది అర్ధం కాదా? సరే నాతో మాట్లాడనక్కరలేదు - కనీసం నా వైపు చూడటానికి కూడా విముఖత్వమేనా? నేను ఇతగాడిని నా బ్లాక్ లిస్టులో వేసి సరి అయిన పనే చేసాను అని సంతోషించాను.

ఇతని సంగతి సరే ఇంతకీ మన లిస్టులో వున్న రెండవ బ్లాగరెక్కడా అని అప్పటినుండీ కళ్ళతో వెతుకుతూ వున్నా కానీ కనపడలేదు. వచ్చాడా, లేదా? వచ్చినా గుర్తుపట్టలేకపోతున్నానా? ఆ శాల్తీని ఎక్కడున్నా గుర్తుపట్టకుండా వుండటం అసాధ్యం! అంచేతా ఇంకా రాలేదన్నమాట. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు మిస్సు కాడే? ఎందుకు ఇంకా రాలేదబ్బా? నడక సమయనికి వస్తాడేమోలే అనుకున్నను.


తరువాత బ్యానర్లను అన్నింటినీ కలిపి ఒక వలయంలా నిలబడ్డాము. మొదటి బ్లాగరు కూడా బ్యానర్లు పట్టుకొని నాకు ఎదురుగా కొంత దూరంలో వున్నారు. పోనీ ఎదురుగ్గానే వున్నాగా - ఇప్పుడన్నా నా వైపు చూస్తాడా అంటే చూడడే. ఎంత మదం ఇతనికి! హుం! నేను శరత్ అని తెలవక పోతే క్యాజువలుగా అయినా నా వైపు చూడాలి కదా?

ఇతనితో నాకు పడకపోవడానికి కొద్దిగా చరిత్ర వుంది. అది తెలుసుకోవాలంటే కూడలిలో నా ధర్నా దగ్గరికి వెళ్ళాలి. అప్పట్లో నన్ను కూడలి నుండి వెలివెయ్యడంలో వీరి పాత్ర కూడా చాలా వుందని అనుమానం. వీవెన్ మీద ఇతని ప్రభావం ఎక్కువగా వుందని నా అనుమానం. అప్పట్లో వీరి నెట్ పత్రికను విమర్శిస్తూ వ్రాసినందుకో లేక గేలు అంటే విముఖత్వంతోనో అన్ను తెలుగు బ్లాగులోకానికి దూరం చెయ్యాలని కుట్ర పన్నారు అని నా అనుమానం. ఇతగాడంటే నాకు కంపరం. అప్పట్లో అధ్యక్షుల వారు అని వారు ఆ పదవి దిగిపోయేంతవరకు కూడా అవహేళన చేస్తుండేవాడిని. అయితే అవన్నీ తను పట్టించుకున్నాడో లేదో తెలియదు. అవును మరి నన్ను బ్లాగులోకంలోనుండి బయటకి వెళ్ళగొట్టేంత హోమోఫోబియా వున్నవారిని నేను గౌరవించాల్సిన అవసరం నాకేం వుంది? వీరెవరో ఇప్పుడు మీకు అర్ధం అయి వుండవచ్చు! కొంతకాలం తరువాత ఇంకా భేదాభిప్రాయాలు ఎందుకులే అని, తనతో మామూలుగానే వుందామని తన బ్లాగులో కొంత కాలం నేను కామెంట్లు వేస్తూ వచ్చాను కానీ నన్ను తను పట్టించుకున్న పాపాన తను పోలేదు. దాంతో ఇక ఆ బ్లాగుని లైట్ తీసుకున్నాను.

అలా బ్యానర్లు ఒక సర్కిల్లా పట్టుకొని అందరం నిలబడ్డి గుండ్రంగా తిరుగుతూ ఇక చాల్లే అని ఆగిపోయాము. అప్పుడు తన పక్కనున్న ఒక బ్లాగరు (వీరెవరో గుర్తుకులేదు) శరత్ వచ్చాడు చూసారా అనో ఏమో వారికి నన్ను చూపించడం గమనించాను. తను అలాగా అని ఆసక్తిగా నా వైపు చూస్తుండటం గమనించి ముఖం తిప్పేసుకునేనంతలోపుగానే...తను నాకేసి చూస్తూ పలకరింపుగా నవ్వాడు. తిప్పబోయిన నా తలని అలాగే ఓరగా వుంచి అది నిజం నవ్వా లేక తప్పనిసరి నవ్వా అన్నది గమనించాను. నిజం నవ్వే. నేనూ తల వారికెదురుగా తిప్పి నవ్వేసాను. మేమిద్దరమూ బ్యానర్లు పట్టుకొని దూరంగా వున్నాము కాబట్టి మాట్లాడుకోలేకపోయాము. తరువాత మాట్లాడదాం అన్నట్లుగా తలలు పంకించాము. వారెవరో మీకు ఇంకా అర్ధం కాకపోతే వారు చదువరి అని గమనించగలరు.

కొంతసేపయిన తరువాత మా ఇద్దరికీ కాస్సేపు మాట్లాడుకోవడానికి సమయం దొరికింది. మాతో పాటు నాగ మరియు మా అల్లుడు రవి వున్నారు. చదువరి గారు చక్కగా, ఆప్యాయంగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసారు. వారి కంఠస్వరం చాలా బావుంది. మృదువుగా, సరళంగా అనిపించింది. వారి టోన్ బావుండటం వల్ల వారి మాటలు వింటూ వుంటే వినసొంపుగా అనిపించింది. అలా ఇద్దరం కాస్సేపు చక్కగా కబుర్లు పెట్టుకున్నాం. ఫోటోలో కంటే బక్కగా కనపడుతున్నారు అని ఆరా తీసారు. నేను ఇప్పుడే బావున్నానని మావాళ్ళంతా అంటున్నారని నవ్వుతూ చెప్పాను. మా చుట్టూ అక్కడ ఇంకొందరు కూడా వున్నట్లున్నారు కానీ ఎవరెవరు వున్నారో గుర్తుకులేదు.

ఆ రెండో బ్లాగర్ రాలేదా అని చదువరి గారిని ఆరా తీసాను. "అతను వస్తే ఇక్కడెందుకు వుంటాడు? వెళ్ళి ఆ టివి కెమెరాల ముందు (కనపడేలా) వుంటాడు కానీ!" అని ఎవరో జోకితే సన్నగా నవ్వుకున్నాం. చదువరి గారు "అవునూ తను ఎందుకు రాలేదబ్బా" అని సెల్ ఫోను తీసి ఫోను చేసారు కానీ కాల్ వెళ్ళలేదు.  "బీహారో, ఏదో రాష్ట్రానికి తరచుగా వెళుతుంటారుగా, అక్కడికి వెళ్ళినట్లున్నారు, అందుకే కాల్ పోవడంలేదు" అని వారు అన్నారు.    

ఆ తరువాత మళ్ళీ చదువరిగారితో మాట్లాడే అవకాశం రాలేదు. నడకలో కొంతసేపు వారు మా పక్కనే నడిచారు కానీ మేమంతా స్లోగన్స్ ఇవ్వాల్సివున్న కారణంగా మాట్లాడలేకపోయాను. చదువరి గారు నాతో మాట్లాడతారనే అనుకోలేదు. అలాంటిది ఆప్యాయంగా, ఆదరణతో మాట్లాడేసరికి నాకు చాలా సంతోషం వేసింది. నా బ్లాకు లిస్టులోంచి చదువరి గారి పేరు కొట్టివేసాను. నా బ్లాకు లిస్టు నిరంతర స్రవంతి లాంటిది. కొన్ని పేర్లు ఎక్కుతూ వుంటాయి, కొన్ని పేర్లు పోతూ వుంటాయి. సగటు మనిషిని నేను. నాకూ రాగద్వేషాలుంటాయి మరి!

అల్లరి నరేశ్ నటన చూస్తే మీకు నవ్వు వస్తుందా?

నాకయితే రాదు. కమెడియన్ అంటే అతన్ని చూడగానే లేదా అతడిని తలచుకోగానే మన మదిలో నవ్వులు పూయాలి. నాకయితే ఈ నరేశ్ కమెడియనుగా అనిపించడు. ఏదో సుడి వుండి (సరదాకు అంటున్నాను) సినిమాలు కాస్తోకూస్తో హిట్టవుతూ బండి లాగించేస్తున్నాడు. అతని నటన అయితే బాగానే విమర్శకుల ప్రశంసలు పొందుతూనేవుంది. ఈమధ్యే ఒక సమీక్షలో చూసాను. అల్లరి నరేశ్ మంచి టైమింగ్ వున్న కామెడీ హీరో అని వ్రాసారు.

నేనయితే ఇతని సినిమాలు చూస్తున్నప్పుడు, ఇతని నటన చూస్తున్నప్పుడు చంకల్లో చక్కిలిగింతలు పెట్టుకుంటూ చూస్తుంటాను. మరి మిగతావారందరికీ ఈ నరేశ్ కామెడీ హీరోలా ఎలా అనిపిస్తున్నాడో నాకర్ధం కాకుండా వుంది. ఏంటీ, అల్లరి నరేశ్ నటన కామెడీగా వుండదంటున్నావా అని మీరు నన్ను విచిత్రంగా చూడటం లేదు కదా!

మీదీ నాలాంటి అభిప్రాయమేనా లేక అతను నిజంగా తన నటనతో నవ్వులు పూయిస్తాడా? కామెడీ చాలా బాగా చేస్తాడు అని సినిమా చూస్తున్నప్పుడు నా మనస్సుకి ఎంత సర్దిచెబుదామన్నా విని చావదు - పైగా మొరాయిస్తుంది. హ్మ్.

తెంగ్లిష్ వద్దు! ఇంగ్లిష్ ముద్దు!!

దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీసు కుక్కలు మొరిగినట్లుగా కొంతకాలం క్రితం జరిగిన తెలుగు బాట ముచ్చట్లు, ఇండియాలో జరిగిన తెలుగు బ్లాగర్ల ముచ్చట్లు మీతో వరుసగా పంచుకోబోతున్నాను.

అది తెలుగు బాటలో నడుస్తున్న వైనం. ఆ బాటలో పెద్దగా ఇతర ప్రజలెవరూ లేరు కనుక మా స్లో'గన్స్' మేమే వింటున్నాం. నేనూ ఓ బ్యానర్ పట్టుకొని నడిచాను. మా అల్లుడు రవి, బ్లాగర్ నాగ కూడా నా బ్యానర్తో చేతులు కలిపారు. నా బ్యానరులో ఇలా వుంటుంది "తెంగ్లిష్ వద్దు, తెలుగే ముద్దు". అయితే ఎవరో ఇతర స్లోగన్స్ ఇస్తూ మా బ్యానర్ మీద వున్న స్లోగన్ కూడా ఇచ్చారు. మిగతా వాటితో పాటు మా బ్యానర్ స్లోగన్నుకి కూడా అరవడంలో జత కలిపాను. అయితే ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది.

మనకు పొరపాట్లు చేయడం అన్నది సహజంగా వచ్చిన అలవాటు కాబట్టి ఎందుకో తెలియదు కానీ దానికి బదులుగా "తెంగ్లిష్ వద్దు, ఇంగ్లిష్ ముద్దు" అని అరిచేసాను. చుట్టూ వున్న వాళ్ళు ఘొల్లున నవ్వేసరికి నాలుక కరచుకున్నాను. సరే మరి కొంత నడిచాము. ఆ తరువాత మళ్ళీ అదే పొరపాటు చేసాను. నా పక్కన నడుస్తున్న ఒక బ్లాగరు (పేరు గుర్తుకులేదు) నా వైపు చురుగ్గా చూసారు. అంతే కదా, మొదటి సారి పొరపాటు చేస్తే పొరపాటు అని వదిలేస్తారు, తరువాత కూడా అలా చేయరు కదా. ఎందుకో గానీ అప్పుడు తెలుగు అన్న పదం పలకడం కష్టమయిపోయింది, ఇంగ్లీషు పదమీ వీజీగా నాలిక మీద తిరుగుతోంది.

ఇహ లాభం లేదని, మూడోసారీ పొరపాటు చేస్తే నాకు ముచ్చటగానే అనిపించవచ్చు కానీ ఈ-తెలుగు వారికి అంత ముచ్చటగా అనిపించక నన్ను ఆ బాట నుండి పక్కకు రమ్మనమని చెప్పి ఏదయినా ముచ్చట(?!) చెప్పే పరిస్థితి రావచ్చుననిపించింది. లేకపోతే తాడేపల్లి గారితో తెలుగు భాషా ప్రాశస్త్యం మీద ఓ గంట ఇంగ్లీషులో తెలుగు మీద పాఠం నాకు ఇప్పించే ప్రమాదం వుంది అని కూడా సిక్స్త్ సెన్స్ కుక్కలా పసిగట్టింది. అందుకని వళ్ళు, నాలుక దగ్గర పెట్టుకొని మనస్సులో ఎదురుగ్గా తాడేపల్లి గారిని నిలుపుకొని "తెంగ్లిష్ వద్దు, తెలుగే ముద్దు" అని డిక్టేషను నాకు నేనే చెప్పుకున్నాను. అది ఫలించి తరువాత ఆ పొరపాటు చెయ్యలేదు. అదీ ఫలించకపోతే ఆ స్లొగన్ వచ్చినప్పుడు వ్యూహాత్మక మౌనమయినా పాటిద్దామనుకున్నను కానీ అంత అవసరం రాలేదు.

మరి తాడేపల్లి గారి పైన అంతగా భయభక్తులు ఎందుకు ఏర్పడ్డాంటే నేను తెలుగు బాటకు వెళ్ళగానే మొదటగా నేను బుక్కయ్యింది వారికే మరి. తెలుగు బాటలో ఎవరయినా చూస్తే మేధావిలా కనపడాలనో ఏమో తాడేపల్లి గారు గెడ్దం బాగా పెంచేసారు;) ఫోటోలొ చూసిన దానికన్నా బాగా బక్కగా అయినట్లున్నారు. మొత్తం మీద తమ భావజాలం గురించి ఆలోచిస్తూ, తెలుగు ఉన్నతి గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ తమ పైన తాము అంతగా శ్రద్ధ చూపడం లేదని వారిని చూసిన ఎవరికయినా అనిపించకమానదు.  

తెలుగు బాటకి సుజాత గారు ఆహ్వానించి తోడ్కొని వెళ్ళారనుకోండి కానీ అది కాకుండా మొదటగా కాస్సేపు మాట్లాడింది తాడేపల్లి గారితోనే. దానిని మాట్లాడటం అంటారా? వినడం అంటారు! ఏంటి సార్ నెమ్మది నెమ్మదిగా మా ఉద్యమ భావజాలంలోకి వస్తున్నట్లున్నారు అని పొరపాటున ఒక ప్రశ్న వేసానో లేదో ఇక నన్ను వారు మాట్లాడనిస్తే కదా. ఆ భావాలు ఇప్పటివి కావండీ, చాలా పురాతన కాలం నుండీ నేను ఆలోచిస్తున్నవే అంటూ అనర్ఘళంగా చెప్పుకువచ్చారు. నేను అలాగా అంటూ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను కానీ వారు గమనించలేదు.  ఏ ఎక్స్‌ప్రెషన్ అంటే అదే సినిమాల్లో ఓ కమెడియన్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటాడు చూడండి. అలా అన్నమాట. ఏమిటో ఆ కమెడియన్ పేరు ఎప్పుడూ గుర్తుండి చావదు. పోనీ బయటినుండి మా ఆవిడ లైఫ్ లైన్ ఫోను చేసి  తీసుకుందునా? పేరు చెప్పకుండా ఎందుకు, ఏమిటీ, ఆ పేరు అర్జంటుగా ఎవరికి అని యక్షప్రశ్నలు వేసిగానీ చెప్పదు! అయినా ప్రయత్నించి చూసెద. మీరు కాస్సేపు పక్కకు తప్పుకోండి మరి.  

ఎం ఎస్ నారాయణ. ముందు పేరు చెప్పి తరువాత ప్రశ్నలు అడిగి అడిగింది.  హి హీ. విషయం పక్క సైడుకి వెళ్ళింది చాలు గానీ ఇహ అసలు విషయానికి వద్దాం.  

అలా వారు చెబుతున్నవన్నీ అమాయకంగా అలాగా, అలాగా అంటూ వింటూ వస్తున్నానా - అలాగా, అలాగా అంటారు, మీరు మాట్టాడరేంటండీ అని గద్దించారు. ఏంటీ మాట్టాడేదీ, నన్నసలు మాటాడనిస్తే కదా! ఆ తరువాత మా మధ్యకి ఎవరో రావడంతో నెమ్మదిగా జారుకున్నాను. ఇహ మళ్ళీ వారికి నేను దొరక్కుండా జాగ్రత్తగా మెసలుకున్నాను.

బ్లాగుల్లో మామధ్య కొంత శత్రుత్వం వున్నా అవేమీ మనస్సులో పెట్టుకోకుండా నిండు మనస్సుతో తాడేపల్లి గారు నన్ను ఆహ్వానించారు. వారు నాతో చాలా చక్కగా మాట్లాడారు. వారు ఎంతో చక్కగా, హాస్యంగా, అనర్ఘళంగా మాట్లాడుతూవుంటారు. బ్లాగుల్లో కాస్త దుడుకుగా, నిష్కర్షగా అనిపిస్తారు కానీ మంచి స్నేహశీలి. వారితో ఇంకా చాలా సేపు మాట్లాడాలని, వారి తేట తెలుగు పదాల వాగ్ధాటి వింటూ అచ్చెరొవొందుతూ పోవాలని అనుకున్నాను కానీ సమయం చిక్కలేదు. ఈసారి మళ్ళెప్పుడయినా ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా తీరికగా కలుస్తాను. ఈ సారి నా ఇండియా ట్రిప్ ని ధన్యం చేసిన వారిలో వారొకరు. వారు గుర్తొచ్చినప్పుడల్లా అరమరికలు లేని వారి స్నేహం ఎప్పుడూ గుర్తుకువస్తుంటుంది. కాసేపే మాట్లాడినా ఇతరుల మీద మంచి ముద్ర వేయగలరు వారు. 

ఇప్పుడే అందిన వార్త!

యు ఎస్ కస్టమ్స్ వాళ్ళు మా అమ్మలుని లోనికి రానిచ్చారుట, మా ఆవిడను ఇండియా పంపిస్తా అన్నారుట!

నేనిప్పుడు బాధపడాలా, సంతోషించాలా?

ఫరవాలేదులెండి. డబ్బులు సమర్పించుకుంటే లోనికి రానిస్తామంటున్నారు ఆఫీసర్లు. అంటే లంచం అనుకునేరు. కాదు, ఫైను అట. ఎంతనుకున్నారు $545 మాత్రమే. వా :(( అసలే ఇండియాకు అందరమూ వెళ్ళొచ్చి అసలే దివాళా తీసి వున్నాం. మూలిగేనక్కమీద ఈ తాటిపండు ఒకటా! హే ఆస్థిక భగవాన్, హేమిటీ నాకీ సినిమా కష్టాలు!?

ఏంటో అన్ని రూల్స్. మోకాలుకీ బోడిగుండుకీ లంకె వేస్తారు. కెనడా నుండి వస్తే ఒక రూలట, ఇండియా నుండి వస్తే ఒక రూలట. వాళ్ళతో ఏమని వాదించగలం? నాతో ఆఫీసరు ఫోనులో మాట్లాడాడు లెండి. శుబ్బరంగా మా ఆవిడని వెనక్కి పంపించమని చెబుదామనుకున్నా కానీ మళ్ళీ ఆ ఆనందం పట్టలేక నేను ఈ బ్లాగులో కక్కుకొని విషయం తెలిసి మీరందరూ తలంటుతారనే భయంతో వోక్కే, ఫైను కట్టేస్తామన్నాము. ఎంత వాదించినా రెండే ఆప్షన్లు అంటాడు ఆ ఆఫీసరు. ఒకటి ఫైను కట్టి లోపలికి రావడం, రెండు మా ఆవిడని ఇండియా తిరిగి పంపించడం. కెనడానుండి శుబ్బరంగా రానిచ్చారు కదా మహాశయా అంటే సింపుల్గా డజంట్ మాటర్ అంటాడు. TN డిపెండెంట్ వీసా, టూరిస్టు వీసాకు మధ్య సమస్యలెండి. మా ఆవిడ కూడా కెనడియన్ సిటిజెన్షిప్పు తీసుకుంటే ఈ సమస్యలు వచ్చివుండేవి కావు. కెనడానుండి యు ఎస్ కి అసలు వీసానే అక్కరలేదు. అయితే ఇంకా కెనడా సిటిజెన్షిప్పు ఎందుకు తీసుకోలేదని నన్ను మాత్రం అడక్కండి.

గమనిక: మా ఆవిడ మీద నా సరదా వ్రాతలన్నీ చూసి మా ఆవిడేదో గంప గయ్యాళి అనుకునేరు. అలాంటిదేమీ లేదు కానీ సగటు భర్త కష్టాలే నావి కూడా.

ఈ రోజునుండీ నా స్వేఛ్ఛకి సంకెళ్ళు!

గత మూడు నెలలుగా అస్ఖలిత(?!) బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ (పెళ్ళాం ఊరెళ్ళింది కాబట్టి) అపరిమిత స్వేఛ్ఛను అనుభవిస్తున్న నాకు ఇవాల్టి నుండీ ఆ స్వేఛ్ఛ దూరం కాబోతున్నది. స్వేఛ్ఛ అంటే ఏదో ఇక్కడ రాచకార్యాలు వెలగబెట్టానని కాదులెండి. ఎక్కడ దురదపెట్టినప్పుడు అక్కడ తటపటాయింపు లేకుండా గోక్కోవడం లాంటివి నా దృష్టిలో స్వేఛ్ఛ క్రిందికి వస్తాయి. మిగతా స్వేఛ్ఛలు మీరూహించుకోండేం - ఇక్కడ చెబితే బావుండదు. అవేకాకుండా మన ఇష్టం వచ్చినప్పుడు, మనకు ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చినన్నిసార్లు పండటం, తినడం, నెట్టు చూసినా అడిగేవారులేకపోవడమే అసలయిన విశ్రాంతి కాదూ. అంతటి విశ్రాంతి మళ్ళీ ఎప్పుడో.  మా వాళ్ళు వచ్చినాక కూడా అలాగే వుంటానంటే ఊరుకుంటారా? ఎద్దుని గనుక ముల్లుగర్రతో పొడిచినట్లు పొడవరూ! 

అదేంటీ ఇండియా వెళ్ళినప్పుడు అంతా కలిసే వున్నారుగా అని సందేహపడకండి. పెళ్ళి ఏర్పాటలో తలమునకలవుతూ మా ఆవిడ వాళ్ళ అక్కయ్య ఇంట్లోనే వుండిపోయింది. నేను మా (అమ్మ గారి) ఇంట్లో వుండిపోయి ఇండియాలో కూడా ఎంచక్కా స్వేఛ్ఛ అనుభవించేసా. 

అదేంటీ మీరందరూ కొన్ని వారాల క్రిందటే యు ఎస్ కు వచ్చేసారు కదా అని హాశ్చర్యపోకండి. అప్పుడు వచ్చింది మా పెద్దమ్మాయీ, నేనూను. మా పెద్దమ్మాయి అంతర్ముఖి కాబట్టి తాను ఇంట్లో వున్నా లేనట్టే. తాను నిశ్శబ్దంగా, అలికిడి లేకుండా, ఇంట్లో వున్నా లేనట్టుగానే వుంటుంది కాబట్టి తనతో నా విశ్రాంతికి వచ్చిన సమస్యేమీలేదు. ఆరోగ్య పరీక్షలు, డెంటలు సర్జెరీలు పూర్తిచేసుకోవడం కోసం మా ఆవిడ ఇండియాలోనే వుండిపోయింది.  మా వాళ్ళు ఇద్దరూ అనగా మా అమ్మలు మరియు మా ఆవిడానూ చేతుల్లో సంకెళ్ళు పట్టుకొని ఇంకొద్ది నిమిషాల్లో  ల్యాండ్ అవబోతున్నారు :(     నన్ను ఓదార్చండి మరి!

:)) :((

ఈమధ్య కొన్ని టపాలలో, వ్యాఖ్యలలో సరిగ్గా ఇలాంటి వాక్యాలే కాకపోయినా ఇలాంటి వాడకం చూసి ప్చ్ అనుకోకుండా వుండలేకపోయాను. పోనీ అ వాక్యాలు ఏమయినా హాస్యానికి వ్రాసారా అంటే లేదు. అలవాటు చొప్పున స్మైలీలు సమయం సందర్భం లేకుండా ఎడాపెడా వాడేస్తున్నారు. క్షమించమన్నప్పుడు, హృదయాన్ని కదిలించినప్పుడు, బాధపడ్డప్పుడూ నవ్వెందుకు వస్తుందో నాకర్ధం కాదు.


నన్ను క్షమించండి :))

మీ టపా నా హృదయాన్ని కదిలించింది :))

నేను చాలా బాధపడ్డాను :))


ఇంకా నయ్యం. క్రింది విధంగా వ్రాయలేదు వాళ్ళు.

నన్ను క్షమించండి LOL

మీ బాధలు చూసి నా హృదయం ద్రవించింది ROFL

నా మనస్సుకి తీరని గాయం అయ్యింది LOOOOOOOOOOOOOOOOOOOOOOL

పెళ్ళి రిసెప్షనులో గెంతులాడిన గీతిక

ఆ మధ్య ఆట ప్రొగ్రాములో గీతిక మరియు ఇతర చిన్నపిల్లల డ్యాన్సుల గురించి ఏవో వివాదాలు వచ్చాయి కదా. ఇండియాలో మా బంధువుల అమ్మాయి పెళ్ళి రెసెప్షనుకి వెళ్ళాను. అది చాలా గ్రాండ్ గా జరిగింది. ఒక వైపు రిసెప్షను జరుగుతుండగా మరో వైపు సాంస్కృతిక కార్యకరమాలు ఏర్పాటు చేసారు. మాటివి, ఇతర టివి ఆర్టిస్టులూ, ఏంకర్లూ, మిమిక్రీ ఆర్టిస్టులూ గట్రా వచ్చారు. వారితో పాటే గీతిక కూడా వచ్చింది. జానపద గీతాలకి నృత్యం చేసింది. రిసెప్షనుకి వచ్చిన ఆహూతులు మిగతా అన్ని కార్యక్రమాలకంటే గీతిక డ్యాన్సులనే ఎక్కువగా చూసారు. నేను కూడా 'నలుగురితో నారాయణా, పది మందితో గోవిందా' అన్న సామెతల ప్రకారం ఆ పాప డ్యాన్సులను చూసి ఆనందించాను కానీ...ఆ గీతిక డ్యాన్సులు ఏమయినా చైల్డ్ లేబరు క్రిందికి వస్తాయేమోనని నా మనస్సు గొణుగుతూనేవుంది. ఆ పాప మాత్రం ఆనందంగా, హుశారుగా గంతులు వేసింది మరి.