నా కళ్ళద్దాలెక్కడ?

మా ఆవిడకి సాధారణంగా దొరికిపోను కానీ నా కళ్ళద్దాలు కనపడకుండా పోయినప్పుడు మాత్రం దొరికిపోతుంటాను. ఏదన్నా ముఖ్యమయిన పని మీద బయటకి వెళ్ళాల్సివచ్చినప్పుడే నా స్పెక్ట్స్ కనిపించకుండా పోతాయి. వాటికోసం వెతుకుతూ ఇల్లంతా చిందులేసినా అవి నాకు దొరకవుగాక దొరకవు. అదేంటో మా ఆవిడ వెతికితే మాత్రం వీజీగా దొరుకుతాయి.

నా అద్దాలు తప్పిపోయినప్పుడు యథాశక్తిగా కాస్సేపు వెతుకుతాను. సరిగ్గా చూపు ఆనకనే కదా అద్దాలు పెట్టుకొనేది - ఆ ఆద్దాలే తప్పిపోతే నా నానా కష్టాలు మీ భగవంతునికే ఎరుక :(  వెతికి వెతికి ఇక లాభం లేదని మా ఆవిడకి నా మొర వెళ్ళబుచ్చుకుంటాను. ఈ భాగోతం మామూలే కదా అని తను చూస్తున్న సీరియల్ నుండి తల కూడా తిప్పదు. ఈ చెవిన విని ఆ చెవిన పారేస్తుంది. సీరియళ్ళ కోడళ్ళ కష్టాల ఆక్రందనలు చెవుల్లోకి ఎక్కుతాయి కానీ పతి దేవుని అద్దాల కష్టాలు ఎన్నటికి తలకెక్కాలీ? మా ఆవిడ ప్రస్తుతం స్పందించుటలేదు అని నిర్ధారణ అయిన తరువాత ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తుంటాను.

మొదటి ప్రత్యామ్నాయం - మా పెద్ద పాప. నా అద్దాలు వెతుకు స్నీ అని అరుస్తాను. అలాగే డాడీ అని గూగుల్లో 'శరత్ - స్పెక్ట్స్' అని వెతుకుతుంది. నో రిజల్ట్స్ డాడీ అని తను మళ్ళీ కేకేస్తుంది. ఇహ దానితో పని కాదని చెప్పి మా చిన్న గడుగ్గాయిని నా అద్దాలు వెతకమని బ్రతిమలాడుతాను. పాపం అది మూడులో వుంటే బాగానే కష్టపడి వెతుకుతుంది కానీ సాధారణంగా దానికి కూడా దొరకవు. ఇహ మూడు లేకపోతే హూ కేర్స్, వాటెవర్, ఐ డోంట్ కేర్ అనో అనేసి నన్ను దులిపేసుకుంటుంది. ఇక లాభం లేక, బిక్క మొఖం వేసుకొని మా ఆవిడ చెంత కూర్చొని బేల ముఖం వేసుకొని నా గోడును వెళ్ళబోసుకుంటాను.

ఎప్పుడూ జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటే ఏం పోయింది అని గయ్ మంటుంది. నేను సవినయంగా జాగ్రత్తగానే పెట్టుకున్నాను కానీ ఎక్కడ జాగ్రత్త చేసి పెట్టానో గుర్తుకు వచ్చి ఛావడం లేదు అని తెలియజేసుకుంటాను. నాకెప్పుడూ నీ అద్దాలు వెతకడమే పనా అని కూర్చున్నచోటునుండి కదలకుండా, సీరియల్ సీరియస్సుగా చూస్తూ అరుస్తుంది. నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తూ చేతులు నులుపుకుంటూ అలాగే బిక్క మొఖం కంటిన్యూ చేస్తుంటాను. అప్పుడు నా మీద జాలి కలిగి చూస్తున్న సినిమానో, సీరియల్లో త్యాగం చేసేసి నా అద్దాలు వెతకడానికి ఉపక్రమిస్తుంది.

అంతటితో ఈ శరత్ కష్టాలు తీరతాయని అనుకుంటున్నారా? అబ్బే లేదు. ఇది అంతం కాదిది ఆరంభం మాత్రమే. నా బలహీన క్షణాలు మా ఆవిడకి తెలుసు కదా. అలా అలా అలవోకగా అద్దాలు వెతుకుతూ ఎన్ని రోజులుగానో నా మీద పేర్చుకున్న ఆగ్రహం, విసుగు, కోపం లాంటివి వుంటే అవన్నీ తాపీగా నామీద తీర్చేసుకుంటుంది. మామూలుగా నయితే నేను ఇంట్లో కూడా ఎవరినీ మాట మాట్లాడనీయకుండా నా తొడ కొడుతూ వుంటాను కదా. ఇప్పుడయితే ఏమని అన్నా కుక్కిన పేనులాగా పడివుంటాను. ఇదే అదనుగా నా మీద మాటలతో తీర్చుకోవాల్సిన ప్రతీకారాలన్నీ తీర్చేసుకుంటుంది. ఎప్పటెప్పటి విషయాలో ఆడాళ్లకి భలేగా గుర్తుంటాయి. అవన్నీ ఇదే అదనుగా ప్రశ్నిస్తుంది. నేను ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఆమె నా అద్దాలు వెతకదు కదా. అందుకే ఆ వాగ్బాణాలు మౌనంగా భరిస్తూ మనస్సులో బుసలు కొడుతూవుంటాను. అనువు కానప్పుడు అధికులమనరాదు కదా!  

అదేంటోనండి - నా కళ్ళద్దాలు మా ఆవిడకి వీజీగా దొరికేస్తుంటాయి. ఇక్కడే వున్నాయి కదా - సరిగ్గా వెతుక్కొని చావడం రాదు. ఈ సారి నుండయినా జాగ్రత్తగా పెట్టుకో - మరో సారి అద్దాలు వెతికేది లేదు అంటూ వార్నింగు సుభాషితాలు పలుకుతూ అద్దాలు నా చేతికి ఇస్తుంది. ఆమెకు కనపడిన చోటే ఎన్నో సార్లు నేను వెతికినా నాకు అవి కనపడవు ఎందుకో మరి.

కార్డ్‌లెస్ ఫోను దొరకకపోతే దానికి బేస్ నుండి పేజ్ చేయవచ్చు కదా. అలాగే ఈ అద్దాలు తప్పిపోతే దొరకడానికి అలాంటి పేజింగ్ సిస్టం ఎవరయినా కనిపెడితే ఎంత బాగుండును. నా కష్టాలు కొన్ని అయినా తీరేవి కదా.

26 comments:

  1. నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తూ చేతులు నులుపుకుంటూ అలాగే బిక్క మొఖం కంటిన్యూ చేస్తుంటాను.


    ఈ సీను లో మిమ్మల్ని ఊహించుకుంటుంటే కెవ్వ్ :)

    ReplyDelete
  2. హ హ హ మా ఇంట్లో కూడా ప్రతీసారీ ఇదే తంతు....అయితే ఒక్క కళ్ళజోడు విషయమే కాదు, ప్రతీ విషయంలోనూ మా నాన్నగారు ఇలాగే చేతులు నులుపుకుంటూ నిల్చుంటారు, మా అమ్మ తన కసి తీర్చుకుంటూ ఉంటుంది.

    ReplyDelete
  3. ఐతే మీరు ఇంట్లో ఎక్కువగా పులి(కళ్ళజోడు కనపడనప్పుడు తప్ప) బయట పిల్లా?

    [పులి తొడగొడుతుంది, పిల్లి గిల్లుతుంది)

    ReplyDelete
  4. అసలు మీ మీద " పేర్చుకున్న ఆగ్రహం, విసుగు, కోపం లాంటివి" తీర్చువడానికి ఆవిడే తీసి దాచేస్తున్నారేమో... అందుకే ఎవరు వెతికినా కనపడవ్.. ఆవిడకే కనపడతాయ్... అదికూడా మీ మీద పేరుకుపొయిన ఆగ్రహం, విసుగు, కోపం లాంటివి తీర్చుకొవడం అయిపొయాకే... :-))

    ReplyDelete
  5. sharath-spects:no results :))
    >>ఎవరినీ మాట మాట్లాడనీయకుండా నా తొడ కొడుతూ వుంటాను...
    I can't stop laughing imagining this scene...

    ReplyDelete
  6. నిజమేనండీ ఎప్పటి విషయాలో బాలే గుర్తు వుంటాయి ఆడాళ్ళ కి...ఇలాంటప్పుడు మొత్తం గా దులిపేస్తూంటారు..నేను మాత్రం selective deafness అన్న సూత్రాన్ని పాటిస్తూ వుంటా...అందుకేనేమో ఆ టైమ్ లో నాకేమీ వినబడవు...

    ReplyDelete
  7. Miru ee idea patent cheyyinchandi.. ee technology intavaraku ledanukunta.

    mi pillala response 'No results, whatever' matram superu..

    ReplyDelete
  8. మరో spare కళ్ళజోడు సెట్ చేయించుకొని మీ breefcase లో పెట్టుకోండి
    తొడకోడుతూ మీ ఇంట్లో అందరిమీదా అరిచేయండి రెండో కళ్ళజోడు సంగతి చెప్పకుండా
    జై పులి భూమి జై జై పులి తొడభూమి

    ReplyDelete
  9. @ఖలీల్
    పప్పులో కాలేశారు. అప్పుడు శరత్ బ్రీఫ్ కేస్ వెతుక్కోవాలి :-)

    ReplyDelete
  10. Passive RFID tag తో తప్పిపోయిన మీ కళ్లజోడును Track చెయ్యవచ్చు. పూర్తి సమాచారం కోసం చూడండి.
    http://en.wikipedia.org/wiki/Radio-frequency_identification#Product_tracking

    ReplyDelete
  11. మీ కళ్ళజొడులొ ఒక మైక్రొ రెసీవర్ పెట్టుకొండి.. ఆ రిసీవర్ అవుట్పుట్కి ఒక LED అమర్చి అలా"గే" అదే అవుట్పుట్ ఒక చిన్న బీపర్ కి తగిలించండి.. ఇవన్నీ వర్క్ అవ్వడానికి ఒక చిన్న బాటరి, పవర్ సప్ప్లయ్ కూడా కావాలి మరి.. అదీ తగిలించండి.. ఆ బాటరీ చార్జ్ చెయ్యడానికి ఒక చార్జర్ కూడా తగిలించండి.. ( ఆ కళ్ళజొడు మొయ్యడానికి మీకు అధిక శక్తి కావలి కాబట్టి కాస్త బలవర్ధకమయిన ఆహారం తినాలి మరి)

    అలాగే మీ ఇంట్లొ ఒక సీక్రెట్ ట్రాన్స్మిటర్ పెట్టుకొండి.. మీ కళ్ళజొడు మిస్స్ అయినప్పుడు మీరు ఆ ట్రాన్స్మిటర్ ఆన్ చెస్తే, దాంట్లొనుండి కంటికి కనిపించని ఇంఫ్రారెడ్ తరంగాలు రిసీవర్ ని చేరుకుని, ఆ LED బల్బుని వెలిగించి, బీపర్ లొ నుండి శబ్ధం చేస్తుంది. అలాగే ఆ ట్రాన్స్మిటర్ కి ఒక ఎథర్నెట్ కనెక్షన్ ఇచ్చుకుంటే మీ అమ్మాయి గూగుల్ లొ " శరత్ : స్పెక్స్ " అని కొట్టినప్పుడల్లా ఆ కళ్ళజొడుకి అమర్చిన LED వెలగటం , ఆ బీపెర్ బీప్ బీప్ అనడం జరుగుతుంది.. ఇంకా...

    సర్లెండి ఇది చాలు మీకు...

    ( ఈ ప్రరిజ్ఞానం అంతా మీ బావ సైన్సు బ్లాగు చదవడం వల్ల నాకు వచ్చింది.)

    ReplyDelete
  12. చిన్న సమస్యే కానీ చాలా పెద్ద సమస్యేనండి :) బాగా చెప్పారు.

    కళ్ళద్దాలే కాదు, దువ్వెనా, కర్చీఫూ, పర్సూ అన్నీ వెతికి ఇవ్వాల్సిందె మా వారికి. పైగా ఇవన్నీ వెతకటానికి ఒక "search party ని full time employees గా ఇంట్లో పెట్టుకుందామా అని మా పిల్లల జోకులు!

    ఇంతా చేసి వెతికి తన వస్తువులు దొరికింతరువాత నేనే తనని ఏడిపించటానికి తన వస్తువులు దాచేస్తున్నానని నా మీదే తప్పు నెడతారు!!!
    శారద

    ReplyDelete
  13. దీనికి పరిష్కారం

    1) అద్దాలు పట్టుకోడానికి ఒక మనిషిని పెట్టుకోవడం. ఒకవేళ అతను / ఆమెకు మతిమరుపు ఉంటే వారు ఇంకోరిని పెట్టుకోవచ్చు.

    2) ఏదైనా ఒక విషయాన్ని తిరిగి తప్పకుండా గుర్తుచేయమని మన మెదడుకు స్పష్టంగా చెబితే గుర్తు పెట్టికుంటుందట. ఆ పనికి ముందు మనం మెదడూ ఈ అద్దాలు ఇక్కడ పెడుతున్నాను. తిరిగి నేను అడిగినపుడు గుర్తు చెయ్ అని మనసులో అనుకోవలి. ( మీరు తొడ ( మాత్రమే ) కొట్టి పక్కింటి వాళ్ళకు వినిపించేలా అన్నా అభ్యంతరం లేదు )

    ReplyDelete
  14. అసలీ గొడవంతా ఎందుకండీ కళ్ళ జోడుకు ఓ తాడు తగిలించేయండి. వాడుతున్నప్పుడు కళ్ళకి, వాడనప్పుడు మంగళ సూత్రంలా, ఐడి కార్డులా మెళ్ళో పడుంటుంది.

    ReplyDelete
  15. హహ్హహ్హ.. బాగున్నాయి మీ కష్టాలు :-)
    మా ఇంటిలో ముగ్గిరికి కళ్ళద్దాలే ! ఇప్పటికి అయితే అమ్మ నాన్నగార్లకి వెతికి ఇవ్వడమే కాబట్టి పరవాలేదు. రేప్పొద్దున నాకు మీ పరిస్థితి వస్తే.. ఒహ్ మై గాడ్ :-(

    ReplyDelete
  16. why cant you start "BABASA"Bharya Badhita bloggers Sangham??

    ReplyDelete
  17. మీ వ్యూహాత్మక మౌనం మీకు బాగా ఉపయోగపడుతుందనుకుంటా!:-))

    ఇలాంటి సమస్య నాకు చెక్ బుక్, బీరువా తాళాల విషయంలో ఎదురవుతూ ఉంటుంది.



    అయినా మీకో విషయం తెలిసే ఉండాలి. మనం దేనికోసమన్నా వెదుకుతుంటే అంతకు ముందు కనిపించకుండా పోయినదేదో దొరుకుతుంది. అందుకని నేను బీరువా తాళాలు కనపడకపోతే దువ్వెన కోసమో రిమోట్ కోసమో వెదుకుతా! అప్పుడు తాళాలు చచ్చినట్టు దొరుకుతాయి!

    ReplyDelete
  18. నాదెప్పుడూ తిట్టే స్తానం లో వుంటుంది కాబట్టీ చాలా మజా వచ్చింది మీ మొహం పిల్లల మాటలు మీ ఆవిడ మొహం ఇంకా తిట్లు తలచుకుని. ;-)

    సుజాత : నీ ఐడియా సూపర్.. ఈ సారి అలా ప్రయత్నిస్తే సరి నా ఆఫీస్ ఐడీ కార్డ్ కనపడనప్పుడూ.

    మంచుపల్లకి గారు మీ సలహా కూడా సూపర్.

    ReplyDelete
  19. Hillarious శరత్ గారు.హాయిగా నవ్వుకున్నా మీ కష్టాలు చూసి.కార్లో ఓ సెట్టు పడెయ్యండి,,కారు వెతుక్కోరు కదా కొంపదీసి? మీ పెద్దమ్మాయి రియాక్షన్ అయితే సూపరు.


    మీ చిన్నది ఇంకా టీనేజి లోకి రాలేదు కాబట్టి ఏదయినా తాయిలం ఆశ చూపించచ్చు కదా?మీ ఆవిడ విసిరే వాగ్బాణాల టపా ఎప్పుడు మరి?

    ReplyDelete
  20. @ వెంకట్
    నా అవస్థలు మీకు తమాషా గా వున్నాయటండీ!

    @ సౌమ్య
    మీ అమ్మగారి నుండి ఆ కళలన్నీ బాగా నేర్చుకోండి - ముందు ముందు బాగా పనికివస్తుంది :)

    @ తార
    మనం ఎక్కడయినా పులులమే. కాకపోతె కోరల్లేని పులిని. ఇండియాలో మనకు వున్న బిరుదు 'పులి రాజా '

    @ మంచు
    మీరన్నట్లే అందులో కుట్రలేమయినా వున్నయేమోనని నాకు కూడా డౌటే సుమీ!

    @ అజ్ఞాత
    :)

    ReplyDelete
  21. @ నాగార్జున
    హైటెక్ పిల్లలు మరి. ఏం చేస్తాం :))

    @ KVSV
    వ్యూహాత్మక చెవుడు ఈ సందర్భాల్లో పని చేయదండీ. అవసరం మనది కదా. తగినట్లుగా స్పందించకపోతే మొరాయిస్తారు.

    @ అజ్ఞాత
    అవునండి. పేటేంట్ చేయాల్సిదే. లేకపోతే ఏ పవనో నా ఐడియాలని అమ్ముకుంటాడు. ఇంకొన్ని మంచి ఆలోచనలూ వున్నాయి. నెమ్మదిగా చెబుతా.

    @ జిబ్రాన్
    ఎలాగూ రెండో కళ్ళజోడు వుంటుందని తెలిసిపోతుంది కాబట్టి మరోసారి ఎవరూ వెతకరు :(

    @ అజ్ఞాత
    సరిగ్గా ఊహించారు :))

    ReplyDelete
  22. @ సి బి రావ్
    మీరు చెప్పిన టెక్నాలజీనో కాదో గానీ మా పిల్లికి కూడా అలాంటిది వుంది. దాని చర్మం లోపల ఒక చిప్ పెట్టి కట్టేసారు. తప్పిపోతే దొరుకుతుంది.

    @ మంచు
    మా బావ ఇంత అడ్వాన్సుడు సైన్స్ కూడా వ్రాస్తున్నాడా. వాళ్ళ అక్కకి శ్రమ లేకుండా నాకో పరికరం తయారుచేసి ఇస్తే బావుండును!

    @ శారద
    మీకది చిన్న సమస్య - మాకది పెద్ద సమస్య. అద్దాలు పెట్టుకోకపోతే పక్కింటావిడ ఎవరో మా ఆవిడ ఎవరో గుర్తు పట్టడం కష్టం కదండీ.

    @ జీవని
    1. అందుకే అంటుంటాను మా ఆవిడతో. ఈ సారి ఇండియా నుండి ఓ పని మనిషిని అరణంగా పట్రమ్మని. తనయితే అన్ని పనులకూ ఉపయోగపడుతుంది. ఆమెకూ మతిమరుపు వుంటే ఇంకా మంచిదే.
    2. అలా గుర్తుచేయమని చెప్పాలని గుర్తుంచుకోవడం ఎలాగా?

    ReplyDelete
  23. @ శంకర్
    అలా మెడకు వేసుకొని పడుకుంటే పగిలిపోయే ప్రమాదం వుంది. మీకిక్కడ స్పెక్ట్స్ కి అయ్యే ఖర్చు తెలియదనుకుంటాను. $200 - $300 అవుతుంది మరి!

    @ క్రిష్ణ
    ఏంటీ మీకింకా పెళ్ళి కాలేదా! ఇది అన్యాయం. వెంఠనే చేస్కోండి.

    మీరూ రౌడీ ఏం తెరవెనుక ఒప్పందం చేసుకున్నారేంటీ? ఇద్దరూ బ్లాగుల్లోకి ఎక్కువగా రావడం లేదు! బ్లాగుల్లో మరీ ప్రశాంతంగా... బావోలేదు.

    @ అజ్ఞాత
    మీ ఆలోచన బావుంది. భా బా బ్లా స. అలాగే చేద్దాం.

    ReplyDelete
  24. @ సుజాత
    హ హ. మీ రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ బావుందే! ఆమాత్రమూ శ్రమ పడకుండా వెదకబోయిన తీగ ఎప్పుడూ కాలికే తగిలితే ఎంత బావుండును.

    @ భావన
    అంతే లెండి - తిట్టేవారికి తిట్టించుకునేవారంటే ఎంతయినా చులకనే :)

    @ రిషి
    హమ్మా, ఆశ... దోశ, మా ఆవిడ చివాట్లు వ్రాస్తే చదివి ఆనందిద్దామనే!

    ReplyDelete
  25. This Post must be in Swapnaraagaleena. Not here. You are a very good writer. Good Post :)

    ReplyDelete
  26. @ అజ్ఞాత
    మీ ప్రశంసకి ధన్యవాదాలు. నాక్కూడా అలాగే అనిపించింది. దీనితో పాటుగా ఇంకొక టపా ఇందులో కాకుండా స్వప్నలో వ్రాసివుంటే బావుండేదని. ఈసారి నుండి జాగ్రత్తపడుతాను.

    ReplyDelete