ఈ చిత్రం ఏమిటో, ఎవరిదో మీకు ఈపాటికి తెలిసేవుంటుంది...


తెలియకపోతే ఊహించండి. లేటెస్ట్ వార్తలు చూడండి. అయినా అర్ధం కాకపోతే అడగండి. నా అభిమాన నటిది ఈ చిత్రం! అందుకే బ్లాగులో వేసుకున్నా!

పానీపూరీ, డల్లాస్ నాగ్ లను టెక్సాస్ లో కలిసిన విధం బెట్టిదన...

నా బ్లాగు మిత్రులు నన్ను కలవడనికి వస్తున్నారని తెలిసిన ఇతర మిత్రులు ఈ విషయం పై ఆసక్తి ప్రదర్శించారు. పైగా ఇదివరకెప్పుడు చూడని స్నేహితులను కలవడం పై ఎలాంటి ఉత్సూత వుంటుందో వ్యాఖ్యానించారు. ఎప్పుడెప్పుడు బ్లాగ్మిత్రులు వస్తారా అని ఎదురుచూస్తూవుంటే అక్కడ వున్న ఇతర మిత్రులు సరదాగా కామెంట్లు వేసారు.  

పానీపూరి ని నేను బస చేస్తున్న ఇంటికే రమ్మని ఆహ్వానించాను. వారు ఇదివరకు నా ఫోటో కానీ, వీడియో కానీ చూడలేదట. నేను కూడా వారిని చూడటం ఇదే ప్రధమం. వారి కలం పేరు వున్నంత సరదాగా వారు అనిపించలేదు. వారి కలం పేరుకి, బ్లాగు వ్యక్తిత్వానికీ, నిజమయిన వ్యక్తిత్వానికి తేడా వుంది. నిజ జీవితంలో వారు కాస్త రిజర్వుడుగా, ఫార్మల్ గా అనిపించారు. ఫార్మల్ గా మా మధ్య సంభాషణ నడిచింది. వారి గురించి నేను, నా గురించి వారు ప్రాధమిక విషయాలు తెలుసుకున్నాం.    

మేము మాట్లాడుకుంటుండగానే మధ్యలో డల్లాస్ నాగ్ వచ్చారు. వారి పేరుకి తగ్గట్టె హుశారుగా వున్నారు. చలాకీగా మాట్లాడారు.  పానీపూరీ, నాగ్ ల పరిచయం కూడా అప్పుడే. ఇక ముగ్గురం బ్లాగర్లం కలిసాము కాబట్టి బ్లాగుల మీద, బ్లాగర్ల మీద, బ్లాగుల్లో సమకాలీన రాజకీయాల మీద అందరం సరదాగా ముచ్చటించుకున్నాం.   అయితే మా వాళ్లంతా అనుకోకుండా వేరే చోటికి వెళ్ళే ప్రొగ్రాం పెట్టేయడంతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాము. మా బ్లాగర్ల సమావేశాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. ఇహ చాలు, మీ సమావేశం ముగించి బయలుదేరండి అన్న నా హై కమాండ్ ఆజ్ఞ విని హడావిడిగా కబుర్లు ఆపాము. నాకు వేరే ప్రోగ్రాం లేకపోయివుంటే మా ముచ్చట్లు ఇంకా ఎంతకాలం సాగివుండేవో. తనివి తీరని ముచ్చట్లతో అలా ముగ్గురం అర్ధాంతరంగా వీడ్కోలు తీసుకున్నాం. మిగతా విషయాలు ఫోనులో మాట్లాడుకోవాలని అనుకున్నాం.  

మా బుల్లి (వీడియో) బ్లాగర్ అమ్మలు ని ఇద్దరికీ పరిచయం చేసాను కానీ తను బ్యుజీగా వుండటం వల్ల మమ్మల్ని అంతగా లెక్కచేయలేదు. నా మిగతా కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసాను.  కొంతమంది ఇతర మిత్రులని కూడా పరిచయం చేయగలిగాను. మా సమావేశానికి ఏర్పాట్లు చేసి, మా అవసరాలు కనుక్కున్న నా మిత్రుడు రెడ్డి (గారు) కి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.  సమయాతీతమవుతున్న హడావిడిలో మేము ఫోటోలు తీసుకోవడం మరచేపోయాము.  

పేరులోనేముందో లేదో కానీ రివర్సు వుండొచ్చు... జాగ్రత్త!

టొరొంటోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు టర్కిష్ కోలీగ్ వుండేవాడు. పిల్లలకు పేరు పెట్టేముందు ముందూ, వెనకా అన్నీ చూడాలనీ, లేకపోతే పిల్లలకు స్కూలులో ఇబ్బందులు ఎదురవుతాయనీ చెప్పాడు. పేరుని రివర్సు చేసి లేదా అటు తిప్పీ, ఇటు తిప్పీ పిల్లల స్నేహితులు ఆటపట్టిస్తారనీ చెప్పాడు.  వాళ్ళమ్మాయికి తెలియక ఒక పేరు పెట్టాడట. దానిని రివర్స్ చేసి బడిలో పిల్లలు వెక్కిరించేవారుట. ఆ విధంగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోయిందంట. కాలేజీలో కూడా అలా అవస్థల పాలయ్యిందంట.

ఏమిటా పేరు అని మరో కోలీగు అడగనే అడిగేసాడు. వద్దులే బావుండదులే అన్నాడు మా టర్కిష్ కోలీగ్. ఫర్వాలేదులే, మనమే కదా వున్నాం, చెప్పు, చెప్పు అని ఆ కోలీగ్ ప్రోత్సహించాడు. సరే అని అప్పుడు చెప్పాడు మా టర్కిష్ కోలీగ్ తన కూతురి పేరు.  SUNA

మా పెద్దమ్మాయి ఇండియాలోనే పుట్టింది కాబట్టి అక్కడే పేరు పెట్టాము కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ ఇంతవరకు ఎదురుకాలేదు.    మా రెండో అమ్మాయి టొరొంటోలో పుట్టింది.  పేరు పెట్టేటప్పుడు మా కోలీగ్ చెప్పిన విషయాలు దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా పెట్టాము. ఇప్పటి వరకయితే ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.

పై ఫోటోలొని పేరు మీకు అర్ధమయ్యిందా? బల్బ్ వెలిగిందా లేదా :))   

తిరుపతికి ఇకపై స్కిన్ టైట్ వస్త్రాలు నిషిద్ధం - కాని సిబ్బంది పనులు మాత్రం అసహ్యం

అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. 

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/4/latest/4new26

అందులో ఇలా వుంది...

...అయితే ఒకవైపు టి.టి.డి. పాలకమండలి ఈ రకమైన మార్గ దర్శక సూత్రాలను భక్తులకు నిర్దేశిస్తుంటే, ఆలయంలో దర్శనంకోసం వరుసలో నిల్చునే భక్తులను నియంత్రించే మిషతో సిబ్బంది మాత్రం మహిళాభక్తుల పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. దేవుని దర్శించుకోవడానికి పిల్లా జెల్లలతో వచ్చే మహిళా భక్తులను ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి, అది కూడా కావాలని చేతులు వేసి మంచీ మర్యాదా లేకుండా దురుసుగా ప్రవర్తించే భద్రతా సిబ్బంది చేష్టలు చెప్పనలవి కాదు. మరి ఇటువంటి సంఘటనలపై చర్యలు ఏవని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా శుక్రవారంనాడే చిత్తూరు జిల్లానుంచి పాపను ఎత్తుకుని దైవ దర్శనానికి వచ్చిన ఒక మహిళను ఒక స్కౌట్ నడుంపై గిల్లిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఎంతో మనోవేదనకు గురైన ఆ మహిళ ఇదేం పద్ధతి అని ప్రశ్నించినా తగిన సమాధానం ఆలయ పెద్దలనుంచి రాలేదు. ఆమె చివరికి కన్నీళ్లపర్యంతమై కలియుగ దైవాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగింది. 

ఈ వార్త చూసాక నాకొక విషయం గుర్తుకువచ్చింది. ఓ మూడేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఆస్తికురాలయిన నా భార్య కోరిక మేరకు ఆమెకు తోడుగా నాస్తికుడిని అయిన నేను కూడా తిరుపతి, తిరుమల దర్శించుకున్నాను. ఆలయాల్లో వుండే మంచి విషయాలనూ, మోసాలనూ గమనిస్తూ వెళ్ళాను. తిరుమల గుడిలో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులను అదుపుచేసే ఆలయ పోలీసు ఒకరు అవసరం లేకున్నా మా ఆవిడ భుజం మీద చేతులు వేసి నొక్కుతూ ముందుకు తోసాడు. ఆమె నెమ్మదిగా నడుస్తున్నా, నిలబడే వున్నా ఏమో అనుకోవచ్చు.  కానీ ముందు వున్నవారితో కలిసి వడివడిగా నడుస్తూనే వున్నా కూడా కావాలని ఆ పోలీసు గుడిలో ప్రవర్తించిన పద్ధతిని జీర్ణించుకోలేకపోయాను. మా ఆవిడ అసహనం వ్యక్తపరచి ముందుకు సాగిపోయింది. అతను ఏమీ ఎరుగనట్లే ముఖం తిప్పుకున్నాడు. తిరుమల గుడిలో సంస్కృతి ఇదే నేమోనని మిన్నకుండిపోయాను. ఎవరికయినా ఆ విషయం ఫిర్యాదు చేద్దామనుకున్నా కానీ ఆస్తికులకు లేని దురద నాస్తికుడిని అయిన నాకెందుకులే అని దులిపేసుకున్నాను.  ఒక సారి అనుభవం అయ్యింది కాబట్టి ఈ సారి ఏ గుడికి అయినా ఇండియాలో తోడుగా వెళ్ళాల్సివస్తే అప్రమత్తంగా వుంటాను.