గోరా గారితో నా పరిచయం

గోరా (గోపరాజు రామచంద్రరావు) గారి గురించి చాలామందికి తెలిసేవుండవచ్చు. వారు నాస్తికోద్యమ నాయకులు. అలా మీకు తెలియకపోయినా ఇంకో విషయం చెబితే మీకు ఈజీగా తెలుస్తుంది. డాక్టర్ సమరం నాన్నగారు.  నేను అయిదవ తరగతి చదువుతున్నప్పుడు మా ఊరి దగ్గరలో వున్న పెదనెమిల గ్రామానికి వారు వచ్చారు. వారి ముఖ్య అనుచరులు మరియు తెలంగాణాలో ముఖ్యమయిన నాస్తిక కార్యకర్తలలో ఒకరయిన మా నాన్నగారు నన్ను కూడా పెదనెమిల గ్రామానికి తీసుకువెళ్ళారు.   అకడే తొలిసారి గోరాగారిని చూడటం. వారు నాతో ఏమయినా మాట్లాడారా లేదా అన్నది నాకు గుర్తుకులేదు. వారితో పాటుగా మిగతా వారితో పాటుగా కలిసి ఆ పల్లెలో తిరిగాను. హరిజనవాడలో ఒక ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్ళు అడిగారు.    శుభ్రమయిన ఆ గ్లాసుని చూసి అంత శుభ్రంగా చాలామంది అగ్రవర్ణాల కుటుంబీకులు కూడా వుండరని మెచ్చుకోవడం గుర్తుకువుంది.  

ఆ తరువాత ఆగ్రామంలో నాస్తికశిక్షణా శిబిరం జరిగింది. గోరా గారితో పాటుగా మా నాన్నగారు కూడా ఉపన్యసించారు. ఇంకా కొంతమంది ప్రసంగించారు. నా చిన్నప్పటి సంగతులు కాబట్టి ఎక్కువ సంగతులు గుర్తుకులేవు. మన ఊరికి ఎప్పుడు గోరాగారు వస్తారని ఉత్సాహంగా మా నాన్నగారిని అడిగాను. ఒకసారి వచ్చారని, మా ఇంటికి కూడా వచ్చారని నాన్న చెప్పారు. మా ఇంటిలో మా నాన్నగారి పెద్ద గ్రంధాలయం చూసి గోరాగారు ముచ్చటపడ్డారని కూడా గుర్తుకుచేసుకున్నారు. 

ఆ తరువాత కొన్ని నెలలకే ఓ సాయంత్రం రేడియో న్యూస్ విని గోరాగారు ఒక సభలో ఉపన్యసిస్తూ అలాగే ఒరిగిపోయి మరణించారని నాన్నగారు విచారంగా చెప్పారు.  మిగతా నాస్తికులతో కలిసి గోరాగారిని చివరిసారిగా చూడటానికై నాన్నగారు హడావిడిగా విజయవాడకి ప్రయాణం అయి వెళ్ళారు.  

అలా గోరాగారిని పెదనెమిలలో చూడటమే మొదటిసారి, చివరిసారి అయ్యింది నాకు. నిరాడంబరమయిన, నిజాయితీపరమయిన, నిష్కల్మషమయిన వారి యొక్క వ్యక్తిత్వం నాకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తూనేవుంటుంది.   

గోరా గారి గురించి, వారి యొక్క నాస్తిక కేంద్రం, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది లింకులని క్లిక్ చేయండి.     

No comments:

Post a Comment