సివరాఖరి పెళ్ళి చూపులు - 1: అమ్మాయి నచ్చింది కానీ...


ఇది కాకుండా ఇంకా చూపులు ఏమయినా మిస్సయ్యానా అని బుర్రని బాగానే గాలించాను కానీ ఏమీ దొరకలేదు. అందుకే ఇక ఆఖరుది చెప్పేస్తున్నా. పూణేలో పీజీ చేస్తున్న రోజులవి. నాకో సంబంధం వచ్చిందంటూ మా ఫ్రెండు ఓ అమ్మాయి ఫోటో పంపించాడు. ఎత్తు నాకంటే తక్కువే అని తెలిపాడు. అమ్మాయి బావుంది. అమ్మాయిల్లో నాకు నచ్చాల్సిన ముఖ్యమయిన విషయం కూడా నచ్చింది. ఫేసుకన్నా ముఖ్యంగా అవి నచ్చాలి కానీ అవి చూడటం అంత వీజీ కాదు. ఏవో కాదులెండి - పాదాలు. ఫోటోలో పాదాలు చక్కగా కనపడుతున్నాయి - నాకు భలేగా నచ్చాయి.  ఇదివరకటి పెళ్ళి చూపుల్లో అమ్మాయి గనుక నచ్చివుంటే ఇబ్బందే అయివుండేది. ఆ తరువాత పాదాలు చూడాలి కాలెత్తు అని అడగలేముకదా.    

ఎలాగూ పూణే నుండి ఇంటికి రావడానికి కొంత సమయం వుంది కాబట్టి ఈలోగా ఆ అమ్మాయి గురించి రిసెర్చ్ చేయమని మా ఫ్రెండ్సుని ఉరమాయించాను.  రిపోర్ట్ నాకు తగ్గట్టుగానే వచ్చింది - సంతోషం. సెలవుల్లో సూర్యాపేటకు వెళ్ళాక అక్కడ వాళ్ళ అక్క ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు.  ఆ అమ్మాయితో టీ ఇప్పించారు - అమ్మాయి చాలా బావుంది. సరే, ఇంతవరకూ ఓకే కానీ నా భావాల సంగతో? అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడాలి అని చెప్పాను. పక్కనే వున్న గదిలోకి పంపించారు.

హ్మ్. అది మధ్య గది. ముదు గదిలో మగవాళ్ళు, వెనుక గదిలో ఆడవాళ్ళు, మధ్యగదిలో మేము. తలుపులు మూసే పరిస్థితి కూడా లేదు. దానికితోడు వాళ్ళక్కయ్య కొడుకు మహా తుంటరి - మాటిమాటికీ మా దగ్గరకి వస్తూ అంతరాయం కలిగిస్తూవచ్చాడు. ఇంకా ఏం ప్రయివేటుగా మాట్లాడుతాం! నాకు చిరాకేసింది కానీ ఏం చేస్తాం? నేను చర్చించబోయే భావాలేమో అందరూ వినేవి కావు గదా. ఎలాగబ్బా అని క్రిందామీద పడి రామాయణ, భారతాల సహాయం తీసుకున్నాను. 

నేను రాముని వంటి వాడిని కాదనీను, కృష్ణుడి వంటి వాడిని అనీనూ, నాకు ద్రౌపది లాంటి భార్య కావలయును అనీనూ చెప్పుకువచ్చాను. అలాగే అంది శాంతంగా. నేను ఉలిక్కిపడి సరిగ్గా వినిపించలేదేమో అని మరో సారి కాస్త స్వరం పెంచి చెప్పాను. మళ్ళీ అలాగే అంది. ఈమెకు ఏమన్నా చెవుడా అని అనుమానం వచ్చి వేరే కొన్ని సాధారణ ప్రశ్నలు వేసి చెవుడేమీ లేదని నిర్ధారించుకున్నాను.  కొద్దిసేపు అయాక మళ్ళీ రాముడు - కృష్ణుడు - ద్రౌపది ఉదాహరణలు ఇస్తూ ఈ సారి ఎందుకయినా మంచిదని వాక్యనిర్మాణం మార్చి చెప్పాను. మళ్ళీ అలాగే అని స్పందన. నాకు చాలా సంతోషం వేసింది - నా కాబోయే భార్య నాకంటే అడ్వాన్సుడులా వున్నందుకు!   ఇంకా అడిగేదేముంటుంది. సంతోషంగా ఆ గదిలోనుండి బయటకు వచ్చాను.  

ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటానికి మా అమ్మా, అక్కయ్యలను పంపిస్తానని చెప్పి ఆ అమ్మాయి వారింటి నుండి వచ్చేసాము.  వారింటినుండి బయటకి వచ్చాక ఒక చిన్న సందేహం వచ్చింది. ఆ అనుమానం నెమ్మదిగా పెనుభూతమయ్యింది. తీర్చుకునేదెలా? అదేంటో తరువాతి భాగంలో చెబుతాను. ఇంటికి వెళ్ళి అమ్మనూ, అక్కయ్యనూ ఈ అమ్మాయిని చూడటానికి పంపించాను. వాళ్ళు చూసి వచ్చారు. వాళ్ళకూ ఈ సంబంధం, ఈ అమ్మాయీ బాగా నచ్చాయి. అయితే నా డవుట్ నాకే వుంది కాబట్టి ఎందుకయినా మంచిది అని నిర్ణయం వెంటనే తెలియజేయకుండా మళ్ళీ పూణే వెళ్ళిపోయాను. 

8 comments:

  1. biting nails........

    ReplyDelete
  2. ఈ సీరియల్ సీక్రెట్స్ ఏవిటండి బాబోయ్....ఆ తరువాత ఏం జరిగిందో???

    ReplyDelete
  3. అమ్మయికి చెవుడు అనేనా మీ డవుటు

    ReplyDelete
  4. నిఎంకమ్మ పెళ్ళాం ద్రౌపతి లాగ ఉండాలా
    అమ్మ ద్రౌపతిని నేనేం తప్పు పట్టనులెండి
    ఇపుడు నాకు భారతం వినిపించొద్దు
    మీ ఉద్దేశ్యం ఓపెన్ మైండ్ అని అర్ధమిందిలే ఫై డైలోగ్
    ఆ అమ్మాయి అని ఉండాలే!

    ReplyDelete
  5. సీత అనబోయి ద్రౌపతి అని ఉంటారు :) :)

    ReplyDelete
  6. ద్రౌపతా?...ఏంది నాయనా నీ యవ్వారం...ఇంతకీనువ్వు ఎవర్ని పెళ్ళి చేస్కున్నట్టేటి?...

    ReplyDelete
  7. @ అశోక్
    :)

    @ అజ్ఞాత, ప్రేరణ
    అంత సస్పెన్స్ ఏమీ లేదండీ

    @ శ్రీనివాస్
    మీరు నా టపా పూర్తిగా చదవకుండానే కామెంటారని అర్ధమయ్యింది :) చెవుడు లేదని ఈ టపాలోనే ధ్రువపరచుకున్నాగా!

    @ మనోశ్రీ
    అవునండీ. సరిగ్గా అర్ధం చేసుకున్నారు.

    @ పరిమళం
    కాదండీ. ద్రౌపది అనే అన్నాను. నా గురించి మీకు ఇంకా అర్ధం కాలేదా :))

    @ రాజ్
    ఏంటీ మీరు బ్లాగులకి కొత్తనా? నా గురించి మీకు తెలియదులా వుంది. నా రసజ్ఞ బ్లాగు చదవండి.

    ReplyDelete