ఇండియా నుండి ద్రౌపది వచ్చేసిందండోయ్!

అపార్ధం చేసుకోకండి. నాయకి ద్రౌపది కాదు - నవలా ద్రౌపది వచ్చింది. వెబ్సైటు నుండి ఆర్డర్ చేస్తే నిన్ననే ఇండియా నుండి వచ్చింది. చాలా కష్టపడి ఆ ప్యాకేజీ విప్పానని మా ఆవిడ చెప్పింది. ఏంటీ ఈ నవల, దీనినంత అర్జంటుగా ఇండియా నుండి తెప్పించుకునీ చదవడం అవసరమా అని అడిగింది. ఈ నవలను అర్జంటుగా చదవకపోతే కొంపలంటుకుపోతాయి అన్న లెవల్లో సీనిచ్చా. అలా అయితే ఈ నవల ముందు నేనే చదువుతా అని ముందేసుకుంది.

రెండు నిమిషాలు చదివిందో లేదో క్రిష్నుడికి ద్రౌపది సఖి అంటాడేమిటీ అని ధర్మసంధం లేవనెత్తింది. వార్నీ రెండు నిమిషాలు ఆ నవల చదివావో లేదో కథ అంతవరకూ వచ్చిందీ అని బోలెడు ఆశ్చర్యపోయా. అలా అని ఊరుకుందా - ఊరుకోలేదు - మళ్ళీ రెట్టించి అదే సందేహాన్ని అడిగింది. నా గొంతులో పచ్చివెలగకాయ పడింది. అంటే గొప్పోళ్ళ వ్రాతలు అంత వీజీగా మనకు అర్ధం కావు - నవల అసాంతమూ చదవాలి - అప్పుడు కానీ మనకు లైటు వెలగదేమో అని సెలవిచ్చాను. నిజంగానే నవల అప్పుడే శ్రీక్రిష్ణుడూ, ద్రౌపదిల సఖ్యత దాకా వచ్చిందీ అని మళ్ళీ బోల్డు హాశ్చర్యపోయా. మా ఆవిడ పేజీలు అటూ ఇటూ తిప్పి ఇంకా కథ చదవడం మొదలెట్టలా - ఇదేదో ఉపోద్ఘాతమో, మరేదో వున్నట్లుంది - అందులో వుంది అని అంది. హర్రే - ఎవరో గానీ నవలలోని సస్పెన్స్ ముందే విప్పదీసేసారా అని మళ్ళీ హాశ్చర్యపోయా!

ఎనీ వేస్, ద్రౌపది వచ్చింది - ఇక ఇరగదీసెయ్యాలంతే. రాత్రే పరిచయాలూ గట్రా చదివేసి వార్మప్ అయ్యా. గొప్ప నవల కదా - గొప్ప గొప్పోళ్ళే పరిచయాలు వ్రాసేరు.

కొసమెరుపు: ఎంత తగలేసి ( మా ఆవిడ భాషలో) ఇండియా నుండి ఈ నవల తెప్పించావూ అని మా ఆవిడ ఎందుకో ఇంకా అడగలా. అడిగివుంటే ఒక సీను అయిపోయి మనస్సుకు కాస్త ప్రశాంతంగా వుండేదేమో. ఆ మధురక్షణాలు ఇవాళ వస్తాయేమోనని కాస్త ఇదిగానే వుంది.

Let us go back to basics!

రెండేళ్ళ క్రితం అనుకుంటాను మా ఇంట్లో ఓ ప్రస్థావన చేసేను - ఒక్క రోజు యంత్ర పరికరాలు కానీ, విద్యుత్తు కానీ, విద్యుత్ పరికరాలు కానీ, ఆధునిక వస్తువులు కానీ ఏమీ ఉపయోగించకుండా గడుపుదామని. మా ఆవిడ సహజంగానే తిరస్కరించింది. మా పెద్ద పాప క్లుప్తంగా నోప్ అంది - కరెంటు లేకపోతే తన ఇంటర్నెట్ ప్రపంచం కూలిపోతుంది కదా - అందుకే. హ్మ్. మా చిన్న పాప చాలా ఉత్సాహ పడింది. కానీ ఇంట్లో ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకోకపోవడంతో ఎటూ తేలలేదు.     

మరో రెండు రెండు రోజుల తరువాత నేను, అమ్మలు (చిన్న పాప) కలిసి ఇంట్లో మరోసారి ప్రస్థావించాము. ఈసారి మాఅవిడ మరింత ఖచ్చితంగా నో అంది. అలా అయితే ఏడుపుగొట్టు సీరియళ్ళు, సినిమాలు చూడలేదు కదా. వాటిని ఒఖ్ఖరోజయినా త్యాగం చేయడం ఇష్టం లేకపోయింది. మరీ ఎక్కువ ఒత్తిడి చేస్తే సినిమాలు, సీరియల్లు చూడనివ్వకుండా గృహహింస చేస్తున్నట్లు అవుతుందేమోనని వెనక్కు తగ్గాను. మా స్ని యథాప్రకారం నోప్ అంది కానీ తరువాత మళ్ళీ కన్విన్స్ చేస్తే వినవచ్చు.      

చిన్నది, నేను చాలా అసంతృప్తి పడిపోయాము. ఇంట్లో అందరూ అంగీకరిస్తే ఒక రోజు ఇలా చెయ్యాలనీ, అలా చేయ్యాలనీ, క్యాండిల్ లైటు వెలుగులో అందరం ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలనీ అలా అలా ఎన్నో ఊహలు కన్నాము.  కనీసం మనమన్నా అలా గడిపేద్దాం డాడీ అంటూ అప్పుడప్పుడు చిన్నది గుర్తుకుచేస్తున్నా ఇంట్లో అందరూ ఒప్పుకోకపోవడంతో నాకూ ఆసక్తి తగ్గి వాయిదా వేస్తూవచ్చాను.  

ఇకనైనా ఒప్పుకోనివారిని వదిలేసి ఒక గదిలో అన్నా కరెంటు వెలుగు తీసివేసి సువాసనలు వెదజల్లే క్యాండిల్ లైటు వెలుగుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఆ తరువాత ఆ వెలుగులో చిన్న పిల్లల కథలు చదువుతూ కాలక్షేపం చేస్తాం లేదా ఏవయినా బోర్డ్ గేమ్స్ ఆడతాం.   అలా మూలాల్లోకి వెళ్ళిన మా రోజు ఎలా జరిగిందీ తెలియజేస్తాం. మీరూ మీ ఇంట్లో ఓ రోజు అలా బేసిక్స్ కి వెళ్ళి చూడకూడదూ? వీలయితే ఏడాదికి కనీసం ఒక రోజన్నా అలా గడిపితే మనం ఏం కోల్పోతూవస్తున్నామో వాటిని కనీసం స్పృశించవచ్చును.   

AP లాంటి కరెంట్ కట్ ప్రదేశాలలోని వారు అప్పుడప్పుడయినా బలవంతంగానయినా ఇలాంటి బేసిక్ జీవితాలు గడిపేస్తుంటారు కాబట్టి వారికి ఈ ప్రయోగాలు అక్కర్లేకపోవచ్చు! 

సివరాఖరి పెళ్ళి చూపులు - 1: అమ్మాయి నచ్చింది కానీ...


ఇది కాకుండా ఇంకా చూపులు ఏమయినా మిస్సయ్యానా అని బుర్రని బాగానే గాలించాను కానీ ఏమీ దొరకలేదు. అందుకే ఇక ఆఖరుది చెప్పేస్తున్నా. పూణేలో పీజీ చేస్తున్న రోజులవి. నాకో సంబంధం వచ్చిందంటూ మా ఫ్రెండు ఓ అమ్మాయి ఫోటో పంపించాడు. ఎత్తు నాకంటే తక్కువే అని తెలిపాడు. అమ్మాయి బావుంది. అమ్మాయిల్లో నాకు నచ్చాల్సిన ముఖ్యమయిన విషయం కూడా నచ్చింది. ఫేసుకన్నా ముఖ్యంగా అవి నచ్చాలి కానీ అవి చూడటం అంత వీజీ కాదు. ఏవో కాదులెండి - పాదాలు. ఫోటోలో పాదాలు చక్కగా కనపడుతున్నాయి - నాకు భలేగా నచ్చాయి.  ఇదివరకటి పెళ్ళి చూపుల్లో అమ్మాయి గనుక నచ్చివుంటే ఇబ్బందే అయివుండేది. ఆ తరువాత పాదాలు చూడాలి కాలెత్తు అని అడగలేముకదా.    

ఎలాగూ పూణే నుండి ఇంటికి రావడానికి కొంత సమయం వుంది కాబట్టి ఈలోగా ఆ అమ్మాయి గురించి రిసెర్చ్ చేయమని మా ఫ్రెండ్సుని ఉరమాయించాను.  రిపోర్ట్ నాకు తగ్గట్టుగానే వచ్చింది - సంతోషం. సెలవుల్లో సూర్యాపేటకు వెళ్ళాక అక్కడ వాళ్ళ అక్క ఇంట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేసారు.  ఆ అమ్మాయితో టీ ఇప్పించారు - అమ్మాయి చాలా బావుంది. సరే, ఇంతవరకూ ఓకే కానీ నా భావాల సంగతో? అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడాలి అని చెప్పాను. పక్కనే వున్న గదిలోకి పంపించారు.

హ్మ్. అది మధ్య గది. ముదు గదిలో మగవాళ్ళు, వెనుక గదిలో ఆడవాళ్ళు, మధ్యగదిలో మేము. తలుపులు మూసే పరిస్థితి కూడా లేదు. దానికితోడు వాళ్ళక్కయ్య కొడుకు మహా తుంటరి - మాటిమాటికీ మా దగ్గరకి వస్తూ అంతరాయం కలిగిస్తూవచ్చాడు. ఇంకా ఏం ప్రయివేటుగా మాట్లాడుతాం! నాకు చిరాకేసింది కానీ ఏం చేస్తాం? నేను చర్చించబోయే భావాలేమో అందరూ వినేవి కావు గదా. ఎలాగబ్బా అని క్రిందామీద పడి రామాయణ, భారతాల సహాయం తీసుకున్నాను. 

నేను రాముని వంటి వాడిని కాదనీను, కృష్ణుడి వంటి వాడిని అనీనూ, నాకు ద్రౌపది లాంటి భార్య కావలయును అనీనూ చెప్పుకువచ్చాను. అలాగే అంది శాంతంగా. నేను ఉలిక్కిపడి సరిగ్గా వినిపించలేదేమో అని మరో సారి కాస్త స్వరం పెంచి చెప్పాను. మళ్ళీ అలాగే అంది. ఈమెకు ఏమన్నా చెవుడా అని అనుమానం వచ్చి వేరే కొన్ని సాధారణ ప్రశ్నలు వేసి చెవుడేమీ లేదని నిర్ధారించుకున్నాను.  కొద్దిసేపు అయాక మళ్ళీ రాముడు - కృష్ణుడు - ద్రౌపది ఉదాహరణలు ఇస్తూ ఈ సారి ఎందుకయినా మంచిదని వాక్యనిర్మాణం మార్చి చెప్పాను. మళ్ళీ అలాగే అని స్పందన. నాకు చాలా సంతోషం వేసింది - నా కాబోయే భార్య నాకంటే అడ్వాన్సుడులా వున్నందుకు!   ఇంకా అడిగేదేముంటుంది. సంతోషంగా ఆ గదిలోనుండి బయటకు వచ్చాను.  

ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటానికి మా అమ్మా, అక్కయ్యలను పంపిస్తానని చెప్పి ఆ అమ్మాయి వారింటి నుండి వచ్చేసాము.  వారింటినుండి బయటకి వచ్చాక ఒక చిన్న సందేహం వచ్చింది. ఆ అనుమానం నెమ్మదిగా పెనుభూతమయ్యింది. తీర్చుకునేదెలా? అదేంటో తరువాతి భాగంలో చెబుతాను. ఇంటికి వెళ్ళి అమ్మనూ, అక్కయ్యనూ ఈ అమ్మాయిని చూడటానికి పంపించాను. వాళ్ళు చూసి వచ్చారు. వాళ్ళకూ ఈ సంబంధం, ఈ అమ్మాయీ బాగా నచ్చాయి. అయితే నా డవుట్ నాకే వుంది కాబట్టి ఎందుకయినా మంచిది అని నిర్ణయం వెంటనే తెలియజేయకుండా మళ్ళీ పూణే వెళ్ళిపోయాను. 

మరో ఎత్తు చూపులు


నా ఒకానొక కోడలిని ఎత్తు కారణంగా పెళ్ళికి తిరస్కరించానని చెప్పాను కదా. మళ్ళీ అలాంటిదే ఒకటి అయ్యింది. మా ఫ్రెండ్ వేణుకి తెలిసిన అమ్మాయి ఈమె. పేదవారు. సూర్యాపేటకు దగ్గర్లోనే ఒక పల్లెటూరు వాళ్ళది. ఈమె మాత్రం హైద్రాబాదులో ఏదో చిరుద్యోగం చేసుకుంటూ వుండేది. తండ్రి వీర తాగుబోతు. ఆ అమ్మాయి మీద రకరకాల పుకార్లు వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ రావడం లేదు. 

ఆ అమ్మాయితో ఇదివరకు నాకు కొద్దిగా పరిచయం వుంది. సూర్యాపేటలో ఒక సామాజిక సేవా సంస్థలొ ఆమె పనిచేస్తున్నప్పుడు కొద్దిరోజులు నేను కూడా స్వచ్చందంగా ఆ సంస్థలో పని చేసాను. అప్పుడు కలిసి పనిచేసాము. వాళ్ళు పేదవారయినా, తండ్రి తాగుబోతు అయినా, ఆమెకు ఇతరులతో పెళ్ళికి ముందు ప్రేమలున్నా, సంబంధాలున్నా అది మనకు సమస్య కాదు. ఆ అమ్మాయిని ఇదివరకే చూసాను కాబట్టి ఎలా వుంటుందో తెలుసు. గొప్ప అందగత్తె కాకపోయినా ఫరవాలేదు. నాకు నచ్చింది. కాకపోతే నాకంటే ఎత్తు ఏమో అన్న సంశయం.   

ఆమెతో మాట్లాడి అలాగే ఎత్తు విషయం చూడటానికని వాళ్ళ ఇంటికి పెళ్ళి చూపులకు వెళ్ళాను. చక్కగా మాట్లాడుకున్నాము. ఆమ్మాయీ, మర్యాదా, మన్ననా అన్నీ నచ్చాయి. నిలబడి ఎత్తు చూసుకున్నాము. హ్మ్. నాకంటే ఎత్తే! నాకు ఎటూ పాలుపోలేదు. నా నిర్ణయం మా ఫ్రెండు ద్వారా తెలియజేస్తానని చెప్పి బయటపడ్డాను.

నా దగ్గరి స్నేహితులతో చర్చించాను కానీ ఎటూ నిర్ణాయించుకోలేకపోయాను. ఆమెతో కొద్ది పరిచయం ఇదివరకే వుంది కనుక ఆ అమ్మాయి మంచిదని నాకు తెలుసు. ఆమెను పెళ్ళిచేసుకుంటే ఒక పేద కుటుంబానికి సహాయం చేసినట్లవుతుందనీ తెలుసు. ఎటూ నిర్ణయించుకోలేక నిర్ణయాన్ని కొద్ది రోజులువాయిదా వేసాను.

ఇలా పెళ్ళి చూపులు జరిగిన విషయం వాళ్ళ ఆఫీసులో తెలిసిందిట. ఈ సంబంధం అన్నా కుదురుతుందేమోనని ఆఫీసులోని ఆమె శ్రేయోభిలాషులు తరచుగా ఈమెను కనుక్కుంటుండేవారట. ఇంకా నిర్ణయం రాలేదని చెప్పేసరికి వారు ఈమె మీద జాలిపడేవారుట. ఈ విషయాలు ఆమె నా ఫ్రెండుకి చెప్పింది. అతని ద్వారా ఈమె సంగతులు తెలుస్తుండేవి.    

అనేక తర్జనభర్జనల మీదట ఆమెను తిరస్కరిస్తూ నిర్ణయించుకున్నాను. ఇప్పుడామె ఎక్కడ వుందో, ఏం చేస్తుందో తెలియదు. ఆ తరువాత ఆమె ఎప్పుడూ నాకు తటస్థపడలేదు. ఎత్తు కారణంగా మరో చక్కటి అమ్మాయిని దూరం చేసుకున్నానా అనిపిస్తుంది. అవసరం వున్నవారికి సహాయం చేస్తేనే ఆ సహాయానికి సార్ధకత వుంటుంది కదా.  అలాంటి సహాయం చెయ్యగలిగి కూడా... చెయ్యలేకపోయానే అన్నది గుర్తుకువస్తే మనస్సు చివుక్కుమంటుంది.  ప్చ్!

అవతార్ రెండో సారీ చూసేగా!


ఈమధ్య బ్లాగుల్లో అవతార్ గురించి నెగటివ్ ట్రెండ్ మొదలయ్యింది. అవతారుకి అదేదే బెస్ట్ సినిమా, కథ అవార్డులు రావడంతోనే అదంటే అసహ్యం మొదలయ్యింది కొందరికి! అవతార్ ఒక్కసారి చూసామంటేనే అదోలా చూస్తున్నారు జనాలు.  ఇక రెండోసారి నేను చూసానంటే నన్ను ఇంకా ఎలా చూస్తారో, ఎలా అంచనా వేస్తారో ఈ జనాలు :( 

రౌడీ ఈసినిమా చూసి అడవులు పట్టిపోయారుట - తన తోకని దేనికి తగిలించాలా అని వెతుకుతూ అలా అలా అంతర్ధానం అయ్యారుట. మళ్ళీ వారిని ఈ జనజీవన స్రవంతిలో కలపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా విశ్వసనీయమయిన భోగట్టా. ఇంకో బ్లాగరూ 'ఇదేం అవతారం మహా ప్రభో' అని వ్రాసారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రెండో సారి సినిమా చూసానంటే  కామెంట్స్ అనే రాళ్ళ ద్వారా జనాలు నన్ను కొడుతారేమోనని భయంగానే వుంది :(

తొందరపడకండి, నా మీద రాళ్లలాంటి కామెంట్స్ విసరకండి. నేను ఎందుకు ఆ సినిమా రెండో సారి చూసానో, ఎందుకు అలా చూడాల్సివచ్చిందో ఈ దీనుడి దీనగాధని అర్ధం చేసుకోండి. అబ్బో, నీ సంగతి మాకు తెలియదా నవి హీరోయిన్ను చూడటానికి వెళ్ళావంటారు కదూ. హి హీ, కొంత నిజమే, కాదన్ను.

ఇంతకుముందు ఐమాక్స్ లో చూసా కదా ఇప్పుడు రియల్ 3D లో చూస్తే ఎలా వుంటుందా అని చూడటానికి కూడా వెళ్ళాను కానీ అదే ప్రధాన కారణం కాదు.  సినిమాను మరోసారి అనుభవించడానికి వెళ్ళాను కానీ అదీ ప్రధాన కారణం కాదు. మరెందుకు? ఇందుకు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఆఫీసులో వున్నా, ఇంట్లో వున్నా ఓ ఇరవై నిమిషాలు కునుకు తీస్తాను. ఆఫీసులో అయితే గది తలుపు వేసుకొని కునుకు తీయడమో లేక కళ్ళు తెరచి వుంచే  కంప్యూటర్ కేసి చూస్తూ పవర్ న్యాప్ తీయడమో చేస్తుంటాను.

మొదటిసారి అవతార్ సినిమాకు మ్యాట్నీ షోకి వెళ్ళాము. కొద్దిసేపయ్యాక నిద్ర విపరీతంగా ముందుకువచ్చింది. హాయిగా ఓ ఇరవై నిమిషాలు కునుకు లాగించాను. ఆ సినిమా జోరులో వుండి మా ఆవిడ గానీ, పిల్లలు కానీ నా నిద్రని గమనించలేదులెండి. అలా గప్‌చుప్ గా లాగించాను కానీ ఆ ఇరవై నిమిషాలూ ఆ చిత్రరాజాన్ని మిస్సయ్యాను కదా అన్న అపరాధభావన నన్ను దహించివేస్తూ వచ్చింది. ఇక తాళలేక మా పిల్లలని వెంటేసుకొని  గత వారం మళ్ళీ సినిమాకి వెళ్ళాను.  మళ్ళీ మ్యాట్నీకే వెళ్ళాం అనుకోండి కానీ ఈ సారి జాగ్రత్తగా వ్యూహ రచన చేసాను. ఇంతకుముందు నిద్రపోయినప్పటి సన్నివేశాలు జరిగిపోయేదాకా ఆగి అప్పుడు ఎంచక్కా కునుకులోకి వెళ్ళాను. అలా మొత్తం మీద సినిమా మొత్తం కవర్ చేసేనన్నమాట. సెబ్బాశ్!

ఇంటికి వచ్చాక ఆనందం ఆపుకోలేక మా ఆవిడకి అసలు రహస్యం - అనగా ఈ సినిమా ఎందుకు రెండో సారి చూడాల్సివచ్చిందీ చెప్పాను. నా వైపు అదోలా చూసింది. మీరెలా చూస్తున్నారు ఇప్పుడు నా వైపు?  

అవతార్ సినిమా గురించి మా చిన్న పాప కామెంట్: మోదటి పది నిమిషాలే 3D. తరువాత అంతా రిప్ఆఫ్ (లాగే వుంది)!  (IMax or Real 3D)

అయిననూ చూసి తీరవలె...


హమ్మ, హమ్మ ఎంత కుట్ర, హెంత కుట్ర! బ్లాగులోకంలో నాకు తసమదీయులు వున్నారని తెలుసుగానీ ఇంతమంది తసమదీయులు వున్నారనిన్నూ, ఇంతలా నా మీద కుట్రలు చేస్తారనిన్నూ ఊహించలేకపోయాను. గత టపాలో 'అదుర్స్' అనే చిత్రరాజమును చూస్తే బాగుండేదేమో అన్న కోరికను కొద్దిగా బయటపెట్టాను. అంతే నా శ్రేయోభిలాషుల ముసుగులో నా శత్రువులు అంతా చేరి నన్ను ఆ చిత్రాన్ని చూడొద్దు చూడొద్దు అనే ఒహటే రకరకాల వర్ణనలతో భయపెట్టారు. 

నేను ఎక్కడ Jr. NTR స్టెప్పులకు పడిపోతానో లేక మా బ్రాహ్మి కామెడీకి పరవశించిపోతానో లేక షీలా అందాలను మైమరచిపోతానో అని ఈ అందరి కుట్ర, దగా. పోనీ వద్దులెండి అని అందరూ మామూలుగా చెప్పారా? లేదు, రకరకాలుగా ఆ సినిమాను వెగటుగా వర్ణించి చెప్పారు. హమ్మ హమ్మ ఇంతమంది నా మీద కుట్ర చేసి ఆ సినిమా చూడవద్దంటున్నారూ అంటే ఆ సినిమా తప్పకుండా గొప్పదయ్యే వుంటుంది.  అలా అని నేనేదో Jr. NTR వీరాభిమానిని అనుకునేరు - అస్సలు కాదు. అలా అని షీలాకు వీరాభిమానిని కాదు గానీ ఆమె కాస్త నచ్చుతుంది. ఇదివరలో ఈ చిత్రరాజాన్ని చూడాలని పెద్దగా వుండేది కాదు కానీ మీరందరూ కట్టగట్టుకొని వద్దంటున్నారు కాబట్టి నాలో ఆ సినిమా చూసి తరించాలనే పట్టుదల పెరిగింది. నేను ఆ సినిమా చూడాల్సిందే, నన్నాపకండి, నన్నాపకండి.  

పాపం పవన్ ఒక్కడే నా నిజమయిన శ్రెయోభిలాషి. అతనొక్కడే ఆ సినిమా ధైర్యంగా చూసెయ్యమని నైతిక ధైర్యం ఇచ్చేడు.  అతగాడిని చూసి నేర్చుకోండి అందరూనూ. ప్రోత్సాహం అంటే అలా వుండాలి! నామీద ఎంత కోపం వున్నా ఇలా ఓ చక్కటి చిత్రాన్ని నాకు దూరం చేయాలని మీకు ఎలా అనిపించిదీ అని నిలదీసి ప్రశ్నిస్తున్నా! మీకే కనుక హృదయం వుంటే నన్ను ఈ సినిమా చూడమని వెంఠనే ప్రోత్సహిస్తారు.   

మీరెంత నిరుత్సాహపరచినా నేను ఆ సినిమా చూడటం ఆగను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను! చూసి మీ కుట్రలన్నింటినీ భగ్నం చేయకపోతే నా పేరు శరత్తే కాదు. రండి, ఎవరు నా హితులో లేక శత్రువులో ఇప్పుడే తేలిపోవాలి. మీరు ఎటువైపు అనేది ఇప్పుడే, ఇక్కడే తక్షణం నిర్ణయించుకోండి. ఎవరయితే అదుర్స్ చూడవద్దంటున్నారో వారిని తసమదీయుల లిస్టులోకి వెళతారు. అనగా బ్లాకు లిస్టన్నమాట. అనగా నల్లకాగితం మీద తెల్లగా మీ పేర్లన్నీ వ్రాసి పెట్టుకుంటానన్నమాట. 

అవునూ మాయాబజార్ సినిమా చూసి చాలాకాలమయ్యింది. తసమదీయులు అంటే ప్రత్యర్ధి వర్గం వారే కదా?

పెల్లెటూరి కోడలితో పెళ్ళి ప్రయత్నాలు


ఈ అమ్మాయి పేరు మంజరి అనుకుందాము. మంజరి మా కజిన్ చిన్న బిడ్డ. బావుంటుంది, మర్యాద, మన్నన, మంచితనం. నాకు బాగా దగ్గరి చుట్టాలమ్మాయే కావడంతో ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. వారి కుటుంబం కూడా చాలా చక్కనిది. తనకు తండ్రి చిన్నప్పుడే పోయారు. అక్క పేదరికంతో పిల్లలని ఎలాగోలా నెట్టుకువస్తోంది. ఈ అమ్మాయిని పెళ్ళి చెసుకోవడం ద్వారా వాళ్ళ కుటుంబానికీ కొంత అండగా వుండవచ్చు అనుకున్నాను. మనకు కట్నాల పట్టింపులు ఏమీ లేవు కాబట్టి అలా కూడా వారి సమస్య తీర్చినట్లుంటుంది.

ఊరికి వెళ్ళినప్పుడల్లా వారింటికి వెళ్ళి తప్పక గడుతుండేవాడిని. ఆ ఇంట్లోని పిల్లలూ, పెద్దలూ నన్ను బాగా ఆప్యాయంగా చూసుకుంటారు. మా అందరి మధ్య మంచి అనుబంధం వుంది. వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా వారి ఇంటిలో ఒక సభ్యుడిగా కలిసిపోయేవాడిని. నా చిన్న కోడలు మంజరితో సహా పెద్ద కోడలు, అల్లుడు కూడా వాళ్ళ చిన్నప్పటినుండీ నాతో ఆడుతూ, పాడుతూ తిరిగిన వారే. వాళ్ళింటికి వెళితే నన్ను ఇక వదలనే వదలరు. బ్యాక్ గ్రవుండ్ అంతా బావుంది - భేష్ కదూ.      

...కానీ వారి నుండి పెళ్ళి ప్రస్థావన మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. మరి స్థాయి, హోదా, ఆస్థి గట్రాలలో అంతరాల వల్ల ధైర్యం చేయలేదా మరేదన్నానా అనేది నాకు తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికని నా క్లోజ్ ఫ్రెండ్ వేణుని వురమాయించాను. అతను మా ఊరెళ్ళి మా కజిన్ కుటుంబంతో మాట్లాడి వ్యవహారం అంతా దాదాపుగా చక్కబెట్టుకొని వచ్చాడు. భేష్. ఇంకా బావుంది. వాళ్ళకీ నేను బాగా ఇష్టమే కానీ పెళ్ళి గురించి అడగడానికి మొహమాటపడుతున్నారంట. సో, అన్ని సమస్యలు తీరాయి. కాదు - ఇంకో సమస్య, ముఖ్యమయిన సమస్య వుంది.   

కొన్నిట్లో నావి రాడికల్ భావాలు. అవి నాకు ముఖ్యం. వాటితో ఆ అమ్మాయి ఏకీభవించాలి కదా. ఆమెతో చక్కటి స్నేహం వున్నా ఈ టాపిక్ మా మధ్య ఎప్పుడూ రాలేదు. అమ్మాయి ఎంత చక్కటిదయినా నా భావాలతో ఏకీభవించలేకపోతే ప్రయోజనం లేదు. అందుకే మంజరితో ఏకాంతంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అయితే పరిష్కరించుకోవాల్సిన సమస్య ఇంకొకటి వుంది. అది ఎత్తు.

అవును. ఎత్తు. నేను కాస్త పొట్టి. అమ్మాయి నాకంటే ఎత్తు వుంటే నాకు ఇష్టం వుండదు. ఆ రోజుల్లో మా ఫ్రెండు వేణునే కాకుండా ఇంకొక దగ్గరి బంధువు కూడా తమ కంటే ఎత్తయిన పెళ్ళాన్ని చేసుకొని పడుతున్న అష్టకష్టాలు నాకు తెలుసు. ఎత్తు వున్న భార్యను గమనించకుండా ఎటన్నా నడిచివెళుతున్నపుడు తమ భార్యలని మూడు అడుగుల దూరంలో నడవమని ఆదేశించేవారు వాళ్ళు! ఎత్తు వున్న పెళ్ళాంతో వచ్చే కష్టాలు పగవాడిక్కూడా వద్దని నాకు మా ఫ్రెండు వేణు ఎప్పుడూ సినిమా స్కోప్లో చెబుతుండేవాడు (అప్పుడు ఐమాక్స్ లు లేవు మరి).  తన జీవితం ఎలా అయిపోయినా తన మిత్రుడి - అనగా ఈ శరత్తు జీవితం అయినా సరి అయిన ఎత్తులో వుండాలని మా వేణు కంకణం కట్టుకొని ఒక టేప్ పట్టుకొని తిరుగుతుండేవాడు.  

 అన్నిరోజులు ఆ అమ్మాయితో స్నేహంగా వున్నా ఈమధ్య తాను ఎత్తుపెరిగిందేమో అని సంశయం. ఆమె దాదాపుగా నా ఎత్తో, నాకంటే ఎత్తో వుండే సూచనలు వున్నాయి. నా ఎత్తు అయితే ఎలాగోలా కష్టకష్టంగా అడ్జస్ట్ చేసుకొవచ్చు కానీ నాకంటే ఎత్తయితే? బాప్ రే బాప్.. వద్దు వద్దు. మరి ఎత్తు సంగతి ఏం చేద్దాం అని వేణుని అడిగాను. నేను వున్నా కదా అని నన్ను మేము వుంటున్న సూర్యాపేట నుండి మా స్వంత ఊరు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక మిత్రుని ఇంట్లో నన్ను కూర్చోబెట్టి టేప్ తీసుకొని మంజరి ఇంటికి వెళ్ళాడు. 

మా ఫ్రెండు ఇంట్లో కూర్చొని వున్న నాకు తెగ సస్పెన్స్. ఎత్తు సరిపోతుందో లేదో అని. అక్కడున్న మా ఫ్రెండు వెంకట్ రెడ్డితో దీని గురించే చర్చలు. కొద్ది సేపు అయాక ముఖం వేళాడేసుకొని వచ్చాడు వేణు. విషయం అర్ధమయ్యింది. నాకంటే దాదాపు రెండు అంగుళాలు ఎక్కువ ఆ అమ్మాయి. దీర్ఘంగా నిట్టూర్పు విడిచాను.  హ్మ్మ్

ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనుకుంటాను - చక్కటి అమ్మాయిని మిస్సయ్యానని. ప్చ్!    ఆ తరువాత ఆ అమ్మాయికి ఒక పేద అబ్బాయితో పెళ్ళి అయ్యింది. కొంతకాలం నుండి కొద్దిగా జీవితంలో పైకి వచ్చినట్లున్నారు. నా గురించి ఆ అమ్మాయి మనస్సులో ఏం వుండేదో ఎప్పుడూ కనుక్కోలేకపోయానే అనిపిస్తుంటుంది. ఎందుకో చాలా స్నేహితంగానే వున్నా కూడా ఆమె మనస్సులోకి తొంగిచూడలేకపోయాను. ఒకవేళ చూసివుంటే - ఒకవేళ అమ్మాయికీ నా మీద అనురాగం వుండివుంటే ... ఎత్తుని త్యాగం చేసేవాడినేమో!...ఏమో? ఏంటో కొన్ని కొన్ని బంధాలు ఇలాగే అస్పష్టంగా మిగిలిపోతుంటాయి - ఎందుకిలాగా? అర్ధం కాదు. అదీ జీవితాల్లో ఒక భాగం కాబోలు.

పల్లెలో పెళ్ళిచూపులు


ఆఫీసులో పనిలేదు, పండగ కాబటి తెలుగు పేపర్లు అప్ద్‌డేట్ కావడం లేదు. బోర్ గా వుంది అందుకే కాలక్షేపానికి నా ఒక పెళ్ళి చూపుల ముచ్చట్లు వ్రాస్తున్నాను.    

మా క్లోజ్ ఫ్రెండ్ చెప్పగా ఒకరి ఇంటికి పెళ్ళిచూపులకని వెళ్ళాను. మా ఫ్రెండుకి తెలిసిన ఒక సారు బంధువుల అమ్మాయి అట. ఒక పల్లెటూరు అది. నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి మా ఫ్రెండ్ ఇంటివారితో మాట్లాడటానికని లోపలికి వెళ్ళాడు. మనకు పెళ్ళి చూపులు చూడటం పెద్దగా అలవాటు లేదు కదా కాస్త ఉద్విగ్నంగానే వుంది.   

అప్పుడు టీ తీసుకొని నవ్వుతూ అమ్మాయి గదిలోకి వచ్చింది. ఆమె నవ్వు నచ్చింది, అందం నచ్చింది. ఆమె ఇచ్చిన టీ తీసుకుంటూ నేనూ నవ్వాను. ఆమే నవ్వింది - నేనూ నవ్వాను. ఇక కూర్చుంటుందేమో అనుకున్నాను కానీ తుర్రుమంది. హర్రె. అమ్మాయి నచ్చింది కానీ ఆమె భావాలు, అభిప్రాయాలూ గట్రా ఏమీ కనుక్కోలేకపోయనే, ఎలాగబ్బా. అలా వెకిలి నవ్వులు నవ్వకుండా గంభీరంగా అమెను కూర్చొమ్మని అడగాల్సివుండె అని చింతిస్తూ వుండగానే మా ఫ్రెండ్ వచ్చాడు.

నేను చిద్విలాసంతో అతని వైపు చూసాను. నేను ఎందుకు అలా చూస్తున్నానో అతనికి అర్ధం కాలేదు గానీ "పద అమ్మాయిని చూద్దువు గానీ" అన్నాడు
"అమ్మాయిని నేను అప్పుడే చూసేగా" అన్నాను మందహాసం చేస్తూ
"హ? ఎప్పుడు చూసావు?"
"టీ ఇచ్చింది కదా నాకు"
"నీ మొఖం. ఆమె ఆ అమ్మాయి కాదు. ఈ సారు బిడ్డ"
నేను గతుక్కుమన్నాను. "హర్రే అవునా. ఎవరో ఒకరు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. సెటిల్ చేయ్యి"  
"ఇప్పుడే ఆ అమ్మాయికి పెళ్ళంటే వాళ్ళ నాన్న తంతాడు. ఆ అమ్మాయి చదివేది తొమ్మిదవ తరగతే" అని అసలు అమ్మాయిని చూపించడానికి నన్ను లాక్కెళ్ళాడు నా ఫ్రెండు.

ఆ అసలు అమ్మాయి నాకు బొత్తిగా నచ్చలేదు. ఆ సారు బిడ్డే నచ్చిందనీ, ఎలాగయినా ఆ సారుని ఒప్పించమని, పెళ్ళీడు వచ్చాకనే పెళ్ళి చేసుకుంటానని  మా ఫ్రెండుని బాగా బ్రతిమలాడాను.
"నీకు ఇంకా మంచి మంచి అమ్మాయిలని చూస్తా కానీ ఆ అమ్మాయి గురించి వదిలిపెట్టు" అని నన్ను ఊరడించాడు.

చేసేదేముంది. గొణుక్కుంటూ ఆ ఊరి నుండి బయటపడ్డాను.

వైశ్య - వేశ్య



నా చిన్నప్పుడు ఆరోతరగతిలోనో, ఏదో తరగతిలోనో రఘుపతి వెంకటరత్నం నాయుడు గురించి తెలుగులో ఒక పాఠం వుండేది. అందులో ...నాయుడు గారు వైశ్యావృత్తిని రూపుమాపడానికి ఎంతగనో కృషిచేసెను అని వుంది. అది చదివాక నాకు చాలా విచారంగా అనిపించింది. ఆయనగారి కృషే గనుక విజయవంతం అయ్యుంటే నాకు చాలా
చిక్కొచ్చేది. కోమటోల్ల దుకాణాలు నడవకుంటే చాక్లెట్లు, బిస్కట్లూ, బలపాలూ ఎక్కడ కొనుక్కోవాలి. అదీగాక అలా దుకాణాల మీదనే బ్రతుకు వెళ్ళదీస్తున్న మా క్లోజ్ ఫ్రెండ్ సురేందర్ వాళ్ళ ఇల్లు ఏమయిపోవాలి. నాయుడు గారు చేసింది నాకేమీ నచ్చలా. 

చిరాగ్గా మా అన్నయ్యను అడిగాను - నాయుడుగారికి వైశ్యులంటే ఎందుకంత మంట అని. మా అన్నయ్యకు అర్ధం కాక నా పుస్తకం తీసుకొని చదివి బాగా నవ్వి అతను రూపుమాపడానికి ప్రయత్నించింది వైశ్యావృత్తి కాదనీ వేశ్యా వృత్తి అనీ చెప్పాడు. 
వేశ్యావృత్తి?! అదేంటి? నేనెక్కడా వినలేదే అని మా అన్నయ్యని అడిగాను. 

మళ్ళీ ఫక్కున నవ్వి అటూ ఇటూ చూసి నెమ్మదిగా చెప్పాడు - 'లం...'  అని! దాంట్లో మాత్రం తప్పేంటో అని మనస్సులో సన్నగా గొణుక్కున్నట్టున్నాను.

అక్కడే ఆగిన హేతువాదులు


నేను మొదటినుండీ హేతువాదినీ, నాస్తికుడినీ, మానవతావాదినీని. కానీ తోటి వాదులు ఏదయినా పోస్టు వ్రాస్తే చదవబుద్ది కూడా కాదు. ఒక కారణం చిన్నప్పటి నుండి అలాంటి వాదాల్లో మునిగితేలినందువల్ల కొత్త సంగతులు ఏమీ కనిపించకపోవడం. అన్నీ తెలిసిన విషయాలే వుండటం. అందుకే ఇన్నయ్య గారి బ్లాగు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్ప చదవను. 

మరో విషయం ఏమిటంటే ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారితో కలిసి ఈ భావాలలో తిరిగినప్పటి విషయాలకూ, ఇప్పుడు వాదులందరూ వ్రాసే విషయాలకూ పెద్దగా ఏమీ తేడాలేక అన్ని విషయాలు పాత చింతకాయ పచ్చడిలా అయిపోవడం. ఇంకా అవే జ్యోతిష్యుల మీది సవాళ్ళూ, గ్రహణాల మీద విసుర్లు, బాబాల బండారాలు. వీటినుండి చాలామని హేతువాదులు ఎదిగినట్లు నాకు అనిపించదు. మతవాదులూ, సామాన్యులు కూడా ఇదే విషయమై హేతువాదులని విమర్శించడం, హేళన చేయడం బ్లాగుల్లో కూడా చూసాను. ఆ విమర్శలని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. 

ఆ మూఢనమ్మకాలూ, బాబాల గిమ్మిక్కులూ ఇప్పటికీ లేవా అంటే వున్నాయి కానీ వాటికి మించిన సమస్యలు, పట్టించుకోవాల్సిన విషయాలూ వున్నాయి, వచ్చాయి. అలా కాకుండా అరిగిపోయిన రికార్డులా పాడిందే పాటరా పాసు పళ్ళ దాసరీ అని చెప్పిన విషాయాలే పాత పద్ధతిలో చెప్పి రోత పుట్టిస్తే ఎవరికయినా చిరాకు తప్పదు. అందుకే ఏ ఇన్నయ్యగారి బ్లాగులోనో తప్ప వేరే హేతువాదులు, హేట్ వాదులు వ్రాసిన వ్రాతలకి పెద్దగా ఆదరణ లభించిందని నేను అనుకోను.

కొత్త విషయాలు అంటే ఏమిటి? పరిశీలిస్తే చాలా విషయాలు వుంటాయి. ఉదాహరణకు నేను పాల్గొంటున్న LGBT విషయమే చూద్దాం. అలాంటివి ఈ మానవతావాదులు ఎందుకు పట్టించుకోరో అర్ధం కాదు. స్వలింగ సంపర్కం గురించి అప్పట్లో కోర్టు తీర్పు వచ్చింది - అలాంటివి అందిపుచ్చుకోవాలి. కెనడా, యు ఎస్ లో వున్న హెతువాదులు చాలావరకు ఇలాంటి కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. గే, లెస్బియన్  ప్రైడ్  పేరేడులల్లో కూడా సంఘీభావం తెలుపుతూ పాల్గొంటుంటారు.    

తెలంగాణా వేర్పాటు విషయమి హేతువాదుల స్టాండ్ ఏమిటి? చాలామంది అందుకుంటున్నదేమిటంటే మిగతా హక్కుల సంఘాల వారి లాగానే హేతువాదులు కూడా వేర్పాటుకి మద్దతు ఇస్తున్నారని. నిజమేనా? ఇన్నయ్యగారి లాంటి మేధావులు, నాస్తిక కేంద్రం వారూ, తదితరులు ఇలాంటి ప్రాముఖ్యమయిన విషయాలపై తమ స్టాండ్ ఏమిటో చెబితే బావుంటుంది కదా. 

ఇలా అని నాకు తెలిసిన నాస్తిక కేంద్రం వారికి పైన ప్రస్థావించిన విషయాలపై ఈలేఖ అయినా వ్రాసానా లేదు. ఇన్నయ్య గారితో ఈమెయిల్ పరిచయం వుంది - వారి అభిప్రాయం కోసం వ్రాసానా? C B రావు గారితో పరిచయం వుంది - అడిగానా?  లేదు. ఎందుకు? బద్దకం. ఇలా బ్లాగు పోస్టులు వ్రాయడమే వీజీ అనిపిస్తుంది నాకు.  అయితే కొన్ని విషయాలపై వ్రాసాను లెండి. స్వలింగ సంపర్కం గురించి మీ స్టాండ్ ఏమిటో తెలియజేయమని సమరం గారికీ, ఇన్నయ్య గారికీ వ్రాసాను. సమరం గారినుండి రిప్లయ్ రాలేదు. దానిమీది నా పుస్తకం చూసిన తరువాత అభిప్రాయం తెలియజేస్తానని ఇన్నయ్య గారు తెలిపారు.

నేను పనిచేస్తున్న ఆంశాలలోనే హేతువాదులందరూ అనుకరించాలని కాదు నేను అంటూంట. దేశకాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త ఆంశాలని కూడా తమ అజెండాలలో పెట్టుకొని ఉద్యమించాలి. అప్పుడే ప్రజలలో ఆసక్తి, ఆదరణ వుంటుంది. నా చిన్నప్పుడు నాస్తిక, హేతువాద ఉద్యమాలు, భావ జాలం విస్తృతంగా అగుపించేవి. ఇప్పుడు కేవలం వారి వారి సభలూ, సమావేశాలు తప్ప ఏమీ హడావిడి కనిపించదు - అడపాదడపా వార్తల్లో చిన్న అయిటెంగా తప్ప.     


కొన్ని కొన్ని హేతువాద సంస్థలు మాత్రం కాస్త చురుగ్గా వుంటున్నాయి. జన చైతన్య/విజ్ఞాన సమితి (పేరు సరిగ్గా గుర్తుకు లేదు) లాంటివి కాస్తో కూస్తో సమకాలీన ఆంశాలపై ఉద్యమిస్తూ ప్రజలమీద ప్రభావం చూపగలుగుతున్నాయి. అయితే అవి కూడా కొన్ని ఆంశాల వరకే పరిమితం అవడం చూస్తున్నాను.   హేతువాదులు కేవలం హేట్ వాదులుగా మిగిలిపోకుండా వున్నప్పుడే వారు చెప్పేవి ప్రజలకు కొద్దిగానయినా ఎక్కుతాయి.