మంగళవారం 24 నవంబర్ 2009

అతడు 'కూడలి'ని జయించాడు!


టైటిల్ బ్యాక్ గ్రవుండ్: ‘అతడు అడవిని జయించాడు’  పేరిట కేశవరెడ్డి గారు నవల వ్రాసారు.


ఇక అసలు విషయానికి వద్దాం. తెలుగు బ్లాగులంటే కూడలి, కూడలి అంటే తెలుగు బ్లాగులన్న చందంగా వుంది కదా పరిస్థితి. జల్లెడ, హారం లాంటి ఇతర సంకలినులు వున్నా ఈనాడు దినపత్రిక లాగా కూడలి ఒక వ్యసనం లాగా వుండేది. వేరే సంకలినులు ముట్టుకోబుద్ధి కాకపోయేది.   కూడలి, జల్లెడ సంకలినులలో కొంత తేడా వున్నా విధానపరంగా ఒకేలా వుంటాయి. అందువల్ల నాకు ఆ రెండింటి మధ్య పెద్ద తేడాగా అనిపించదు.

ఈమధ్య హారం ఎగ్రిగేటర్లో వైవిధ్యత కనపడుతోంది. దీనిని నిర్వహిస్తున్నది భాస్కర్ రామిరెడ్డి గారు. కూడలి, జల్లెడలలో రాలేని బ్లాగులూ, అక్కడ తొలగించబడ్ద బ్లాగులూ, ఆ బ్లాగుల విధానాలలో ఇమడలేని బ్లాగులూ హారంలో ఆశ్రయం పొందుతూవుండటంతో ఇక్కడ వైవిధ్యం కనపడుతోంది. AtoZ Dreams, చిత్తూర్ మురుగేషన్, కాగడాలతో పాటుగా నా రసజ్ఞ బ్లాగు కూడా (ప్రస్తుతానికి అయితే) అందులో వస్తోంది.  'ఓన్లీ ఫర్ ప్రవీణ్' బ్లాగు హారంలో నయితే వస్తోంది కానీ ఇతర వాటిల్లో వస్తోందో లేదో నాకు తెలియదు.

కూడలి వ్యసనంలోనుండి బయటపడటానికై సరదాగా కొన్నెళ్ళ క్రితం ఒకలా డిసైడ్ చేసా. కొన్ని నెలలన్నా కూడలి, జల్లెడలను చూడకూడదు అని.    అందుకే కొన్ని నెలలుగా హారం ను మాత్రమే చూస్తూ వస్తున్నాను. నా రెండు బ్లాగులూ హారంలో వస్తుంటాయి కనుక మిగతా వాటికంటే అదంటే కాస్త మక్కువ ఎక్కువయ్యింది.    మళ్ళీ కూడలి, జల్లెడలను చూడనని కాదు గానీ కొంతకాలం ఇలా. నువ్వు చూడకపోయినంత మాత్రాన వాటికొచ్చిన కష్టం, నష్టం ఏమీ లేదు అంటున్నారా?  నిజమే.   

కూడలి, జల్లెడలు సాంప్రదాయకపు స్త్రీ లాంటివి అయితే హారం ఆధునిక మహిళ వంటిది. ఎవరికి నచ్చేది వారికి నచ్చుతుంది. కొందరికి అన్నీ నచ్చుతాయి. నాలాంటివారు నచ్చినా నచ్చకపోయినా అన్నీ చూస్తుండవచ్చు.  మనక్కావాల్సింది బ్లాగులు పెరగడంతొ బాటుగా అగ్రిగేటర్లు పెరగడం కదా. అందువల్ల బ్లాగుల్లో వెరయిటీ పెరిగి మనకు నచ్చేవి ఎక్కువగా లభ్యం అవుతాయి.   

సాహసంతో, వైవిధ్యంతో లిబరల్ గా హారం ను నిర్వహిస్తున్న భాస్కర్ రామిరెడ్డి గారికి పబ్లిక్ గా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

సోమవారం 23 నవంబర్ 2009

కబుర్లు - ఛత్, మరీ ఇంత ప్రశాంతతనా!?

ఈ మధ్య ఓ రెండు నెలలు బ్లాగు వ్రాయడం ఆపాను కదా. అబ్బో ఎంత ప్రశాంతంగా వుండేదో మనస్సుకి. మరీ ప్రశాంతత ఒత్తొత్తుగా అయిపోయి బోర్ కొట్టి, చిరాకేసి కూడా మళ్ళీ బ్లాగింగ్ మొదలెట్టాను.
-----------------------------------------
మా అమ్మగారి మార్గం: నా చిన్నప్పుడు మా అమ్మగారు ఆస్తిక శిక్షణా తరగతులకూ, మా నాన్నగారు నాస్తిక గుడులకూ నన్ను తిప్పుతూ నాతో బంతి ఆట ఆడుకునేవారు. ఎవరిదో ఒకరి కోర్టులో సెటిల్ కాకపోతే నా జీవితం బంతిలాగే పొర్లుతూ వుంటుందని లైటు వెలిగి మా నాన్న గారి కోర్టులో సెటిలయ్యా.  

మా అమ్మగారు ఇదివరలో కాస్త సూర్యకాంతం టైపు: ఆమె గయ్యాళి తనం తీరడానికి ఎదుట కనీసం ఎవరో ఒకరో వుంటే మిగతావారు బ్రతికి బట్ట కట్టేయొచ్చు. దాదాపుగా పన్నేండేళ్ళనుండి సహజ మార్గం అనే ఆధ్యాత్మిక మార్గం పట్టింది. అప్పటినుండీ ఆమెలో చాలావరకు ప్రశాంతత పెరిగింది. పదేళ్ళ క్రితమే మా నాన్నగారు పైకి పోవడమూ, మేమెవరమూ అందుబాటులో లేకపోవడమూ కూడా ఆ ప్రశాంతతకి కారణం అయ్యుండొచ్చు. రోజుకి చాలాసార్లు, చాలా సేపు ధ్యానంలో గడుపుతూ వుంటుంది. ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు సంతోషంగా కొన్ని విశేషాలు చెప్పింది. మా పెద్ద అక్కయ్య, బావయ్య, పెద్ద కోడలూ, భర్తా కూడా సహజ మార్గంలో చేరారంట. చిన్నక్కయ్య కొంత సమయం తీసుకొని చేరతా అందిట. 'మరి నువ్వు ఎప్పుడు చేరతావు బాబూ' అని అమ్మ అడిగింది. చేరితే గీరితే నేను మున్ముందు మార్తాండజీ స్థాపించబోయే బైరాగుల మఠంలో చేరతానని చెప్పాను. మార్తాండజీ ఎవరు అని అడిగింది. మీ గురూజీ కంటే చాలా గొప్పవారని చెప్పాను.  

మొత్తమ్మీద వృద్ధాప్యంలో మా అమ్మగారికి చక్కటి వ్యాపకం దొరికింది. మా నాన్నగారు (నిజమయిన) స్వాతంత్ర్య యోధులు కాబట్టి వారి డిపెండెంటుగా ఫ్రీ రైల్వే పాసు వుంది కాబట్టి ఎంచక్క మరొక సహాయకురాలిని తీసుకొని  ఆ మార్గం సభలకూ, సమావేశాలకూ దేశమంతా చక్కర్లు కొడుతూ వస్తోంది.  ఆ ఫ్రీ పాస్ తో ఒక సహాయకురాలితో సహా రైలులొ మొదటి తరగతిలో ఉచితంగా దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు.  ఆమెకు తోడుగా ఇప్పుడు మా ఇతర కుటుంబ సభ్యులూ వుంటుండటంతో తను క్షేమంగా వుందో లేదో అని నేను ఇక్కడనుండి పడే ఆదుర్దా కొంత తగ్గింది. మా అమ్మగారు మా చెంతనే వుండటానికి ఒక చిన్న సమస్య వుంది. మా ఇంట్లో ఇంకో గయ్యాళి వుంది. అఫ్కోర్స్ - ఇద్దరు గయ్యాళులూ పోట్లాడుకుంటూ వున్నప్పుడు నేను చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ టివి నో, బ్రవుజింగో చేస్తుండంలో చాలా మజా చేస్తుంటానుకోండి. ఈ సారి ఆ సీన్ వచ్చినప్పుడు లైవ్ బ్లాగింగ్ చేస్తానుండండి. మరి సహజమార్గంలో చేరిన తరువాత ప్రశాంతత వచ్చిందన్నావు కదా అన్న ధర్మసందేహం మీకు వస్తుందని నాకు బాగా తెలుసు. మరో గయ్యాళి మా అమ్మగారికి తటస్థించినప్పుడు మాత్రం తాను బ్యాక్ గ్రవుండులో వుంచేసిన కళను ముందుకి తీసుకువస్తూవుంటుంది అనే విషయం ఇక్కడ మీరు గమనించాల్సివుంది! 
---------------------------------------------------------
వ్యాఖ్యలు:ఇంతకుముందు టపాకి శిశిర అని ఒకరు స్పందించారు. పేరు నచ్చింది. ఎందుకంటే మా చిన్న పాప పేరు అదే కాబట్టి. మాకు బాబు పుడితే నాకు వున్న రుతువు పేరు లాగా అబ్బాయికి శిశిర్ అని పెడదామనుకున్నాం. అమ్మాయి పుట్టింది కాబట్టి పేరుకి లింగ మార్పిడి చేసేశాం.

శాస్త్ర, విజ్ఞాన బ్లాగులూ, ప్రింట్ మీడియాలో ప్రముఖులయిన బ్లాగులూ ఎవరూ పెద్దగా చదవడం లేదంటూ ఒక అజ్ఞాత బ్లాగ్ ప్రజల మీద కినుక వహించారు. నిజమే - అలాంటివి నేనూ పెద్దగా చదవను. ఎందుకంటే వాటిమీద ఆసక్తి వుంటే బ్లాగులే చదవక్కరలేదు. గూగుల్ చేస్తే బోలెడంత సమాచారం వస్తుంది కదా. బ్లాగుల్లో పెద్దగా సమాచారం కోసం చూడను - వ్యక్తిగత అనుభవాలతో మిళితమయిన విజ్ఞానాన్నీ, సమాచారాన్నీ, విశ్లేషణలనీ, అనుభూతులనీ తెలుసుకోవాలని వుంటుంది. మరి మీకు?

ఉదాహరణకు నేను కొంతకాలం హిప్నటిజం చేసేవాడిని. దానిమీద వ్రాయొచ్చు. కేవలం దానిమీద విజ్ఞానాన్ని వ్రాస్తూ పోవడం అంత ఉపయోగకరం కాదు. దానిమీద సమాచారం నెట్ లో బోలెడంత వుంటుంది. నా హిప్నటిజం అనుభవాలతో రంగరించి ఆ సమాచారం ఇస్తే బావుంటుంది. ఎందుకంటే ఒకరి అనుభవం వారు తెలపందే నెట్ లో దొరకదు కాబట్టి.

శుక్రవారం 20 నవంబర్ 2009

బ్లా.బ్లా..బ్లా...బ్లాగుల్లో నా తొలిరోజులు


దాదాపుగా రెండు ఏళ్ళ క్రితం నేనూ వున్నానంటూ బయల్దేరి నా బ్లాగింపు మొదలెట్టి బ్లాగు సాంప్రదాయ పూర్వకంగా కూడలిలో కలిపి...ఆ విషయం మరిచేపోయాను. టెస్టింగ్ కోసమని కొన్ని పోస్టులు వేసాను. ఆహ్వానం అంటూ ఓ రెండు, మూడు  కామెంట్లు వచ్చాయి. అందులో ఒకటి జ్యోతి గారిదనుకుంటా. అబ్బో మన బ్లాగు చూడటమే కాకుండా ప్రోత్సాహం కూడానా ఇక వీరి పని పట్టాలి అనుకుని మన పైత్యపు భావాలు కొన్ని వెల్లగక్కుకున్నాను. మళ్ళీ కామెంట్లు వస్తే ఒట్టు. తిట్లను కూడా కామెంట్లు అనుకుంటే అవి వచ్చినట్టే. నా వ్రాతలు చూసి కిక్కు సినిమాలో రవితేజను చూసి జయప్రకాశ్ రెడ్డి అనుకున్నట్లుగా లేదా ఈ రోజుల్లో మార్తాండని చూసి చాలా మంది అనుకుంటున్నట్లుగా 'ఎవడబ్బా వీడు' అని చాలామంది బుర్రలు గోక్కునే వుంటారు. 

సరే అని కాస్త ఛేంజ్ కోసమని మా చిన్న పాప ఫోటో వేసుకున్నాను. క్యూట్ గా వుందని ఒకటి రెండు కామెంట్లు వచ్చాయి. ఎంతయినా ఇది మన బ్లాగు మన ఇష్టమే కదా అనుకుని మా దంపతుల ఫోటో వేసేసాను. నెటిజెన్ నుండి అనుకుంటా 'మీ ఆవిడ అనుమతి తీసుకున్నారా ' అని క్వెషన్ వచ్చింది. నా బుర్ర తిరిగిపోయింది. నా బ్లాగులో మా ఫోటో వేసుకోవడం కోసం కూడా అనుమతులు కావాలా అని సందేహం వచ్చింది. మా ఆవిడ యాహూ ఫోటోస్ లోనూ, ఫ్లికర్ లోనూ మా అందరి ఫోటోలు ఎక్కిస్తుంది. ఎన్నడయినా నా పర్మిషన్ అడిగిందా అని బుర్ర గోక్కున్నాను. లే. మా ఆవిడను అడిగాను 'నా అనుమతి లేకుండా నా ఫోటోలు ఆ సైట్లలో ఎందుకు పెట్టావూ? ' అని. నన్నో విచిత్ర జంతువు ను చూసినట్లు ఎగాదిగా చూసింది. ఆమె నన్ను అలా చూడటం తరచుగా జరుగుతుంటుంది లెండి.     

ఆ కామెంటుకి ' అవసరమా?' అని స్పందించాను. ఎవరినుండో మరో వ్యాఖ్య వచ్చింది కొంతకాలానికి. 'ఫోటో వెయ్యడమే కాకుండా మళ్ళీ అనుమతి అవసరమా అని అడుగుతావురా ' అని. ఇదేదో తకరారుగా వుందని ఎందుకయినా మంచిదని ఆ ఫోటో తీసివేసాను.

మొదట్లో కొద్ది రోజులు నా బ్లాగు వున్నట్లు ఎవరికి తెలుస్తుందిలె, ఎవరు చూస్తారులే అబ్బా అనుకుని ఏదో కాలక్షేపానికి ఏవో వ్రాసుకుంటే, ఫోటోలు వేసుకుంటే ఇంతమంది ఇలా ఎలా తిడుతున్నారబ్బా అని విస్మయం చెందాను. కొద్ది రోజుల తరువాత కూడలి ఎందుకో చూస్తే నా టపా కనపడి ఉలిక్కిపడ్డాను. ఇదన్న మాట సంగతీ అని అర్ధమయ్యి అప్పటినుండి విజృంభించాను... కానీ ఏం లాభం?

అలా అలా అప్పటిదాకా మన బ్లాగ్ అంటే ఏమయినా వ్రాసుకోవచ్చనీ, ఏమయినా వేసుకోవచ్చని అనుకుంటున్న నా కళ్ళు త్వరగానే తెరచుకున్నాయి. హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది.  మన ఆనందాలే వెల్లడించుకోవాలి గానీ మన బలహీనతలు, కష్టాల ఊసు ఎత్తవద్దనీ, ఎవరి మనోభావాలూ గాయపడకుండా కాలక్షేపం బఠాణ్ణీలాగున బ్లాగుతూ వుండాలని బోధపడింది.  బ్లాగుబన్ (బ్లాగు తాలిబాన్) ల గురించి కూడా బోధపడింది. మిగతా నా బ్లాగు చరిత్ర మీలో చాలా మందికి తెలిసిందే. 

మరి బ్లాగుల్లో మన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకునే స్వేఛ్ఛ, మార్గం లేదా? వుంది. అది 'స్వయంతృప్తి' లాంటిది!    అలాంటి తుత్తి బ్లాగు నాకొకటి వుంది.

గురువారం 19 నవంబర్ 2009

పులి రాజు

విజయవాడ V K కంప్యూటర్స్ లో విద్యార్ధిగానూ, బోధకుడిగానూ పనిచేస్తున్న పద్దెనిమిది ఏళ్ళ క్రితం రోజులవి. ఒక రోజు దినపత్రికలో విజయవాడలో 'పులి రాజు' అనే వ్యక్తి చేసిన ఘనకార్యాల గురించి కథనం వచ్చింది. అతని చేష్టలూ, నా భావాలూ ఒకే రకం కావడంతో అక్కడి మిత్రులూ, స్టాఫూ ఆడ, మగా అందరూ నాకు పులి రాజు అని పేరు పెట్టేసారు. క్రమంగా అక్కడి పరిస్థితి ఎలా అయ్యిందంటే అందరూ నా అసలు పేరు పక్కన పెట్టి పులి రాజు అని సంబోధించడం మొదలెట్టారు.   

కట్ చేస్తే కొన్ని ఏళ్ళయ్యాక పూనేలో పి జి చేయడానికి వచ్చాను. అక్కడి మిత్రులకి ఎలాగో నా నిక్ నేం తెలిసిపోయి పులి పులి అనడం మొదలెట్టారు. మా మిత్రులు అలా పిలుస్తున్నందుకు కొద్ది రోజులు ఛాతి విరుచుకొని తిరిగినా తరువాత అలా వాళ్ళు పిలవడం వెనుక వున్న మరో ద్వందార్ధం తెలిసిపోయి వుడుక్కున్నాను.
  
అందరూ నన్ను పులి పులి అని ఎందుకు అంటున్నారో అర్ధం కాని తోటి తెలుగు విద్యార్ధిని (క్లోజ్ ఫ్రెండ్ లెండి) నన్ను అడగనే అడిగింది 'ఎందుకు నిన్ను అలా పిలుస్తున్నారూ ' అని. మింగలేక కక్కలేక ఎలాగోలా వాళ్ళు పిలుస్తున్న అర్ధం చెప్పేసాను. తానూ పులి పులి అని పిలవడం ప్రారంభించింది. "మరి నువ్వేమన్నా ఓవెన్ ఫ్రెష్ నా?" అని సరదాగా ద్వందార్ధంలో తిరిగి వెక్కిరించాను. అంతటితో ఆమె నన్ను అలా పిలవడం మానివేసింది. 

కట్ చేస్తే పన్నెండేళ్ళ క్రితం కెనడా వచ్చేసాను. ఆ తరువాత ఒక ఏడాదికి విజయవాడ నుండి యు ఎస్ కి ఒక మిత్రుడు వచ్చేసాడు. కెనడాలోని మా గదికి ఫోన్ చేసాడు. మా రూమ్మేట్స్ "ఎవరు కావాలండీ" అని అడిగారు. 
"పులి .. పులి రాజు వున్నాడా" అని అడిగాడు.
నా కెనడా రూం మేట్స్ కి నా ఘనచరిత్ర అంతగా తెలియదు కాబట్టి నాకు అలాంటి పేరు ఒకటి వుందని తెలియక కంగారు పడ్డారు. "పులి రాజా? అలాంటి వారెవరూ ఇక్కడ లేరే!" అని సమాధానం ఇచ్చారు. 
నా విజయవాడ మిత్రుడికి నా అసలు పేరు అస్సలు గుర్తుకురాక ఖంగారు పడ్డాడు. "అదేనండి పులి.. పులిరాజు.." అంటూ నసిగాడు.
మా మిత్రులకి ఎందుకో సందేహం వచ్చి "శరతా?" అని అడిగారు.
"ఆ. ఆ. అవును. అవును"

అప్పుడు నేను గదిలో లేను. నేను వచ్చాక నా రూం మేట్స్ పొర్లి పొర్లి నవ్వుతూ ఈ విషయం చెప్పారు.

కట్ చేస్తే కొన్ని ఏళ్ళ తరువాత ఇండియా చూడటానికి వచ్చాను. ఈలోగా ఎయిడ్స్ ప్రకటనల పుణ్యమా అని పులి రాజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాడు. నాకు పులి రాజు అన్న పేరు వుంది అని తెలుసున్న బంధుమిత్రులంతా "పులి రాజుకి ఎయిడ్స్ వచ్చిందా?" అని అడగసాగారు. దానితో నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఆ తరువాత మళ్ళీ ఎవరికీ నాకు అలాంటి నిక్ నేం వుందని చెప్పుకోలేదు. మళ్ళీ మీకే చెప్పడం. ష్. ష్.. ష్...!     

బుధవారం 18 నవంబర్ 2009

ఎందువలన అంటే...ఇందువలన...

ఈమధ్య నా బ్లాగులో వ్రాయడం లేదని ఆలి, నెలబాలుడు, మరికొంత మంది మిత్రులు కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వివరణ. 

ఆఫీసులో: నాకు ఇంట్లో తీరిక వుండదు - ఆఫీసులో తీరిక వుండకపోవడం అంటూ వుండదు. రోజుకి సరాసరి అయిదు నిమిషాల పనితో, నా ఆఫీసు గదిలో గోళ్ళు లేదా ఇంటర్నెట్ గోక్కుంటూ కూర్చుంటాను.   ఆఫీసు పాలిట్రిక్స్ చేయడానికి + ఎంజాయ్ చేయడానికి దేశీ లెవరూ మా ఆఫీసులో లేరు మరియు మిగతావాళ్ళందరూ చాలా మంచాళ్ళు! నా టెక్నాలజీలో పనిచేసేది నేనొక్కడినే కావడంతో ఇతర వుద్యోగులతో ఇంటరాక్షన్ పెద్దగా అవసరం లేక నాది సాలిటరీ కన్ఫయిన్మెంట్ అనిపిస్తూవుంటుంది.  అఫీసులో కూర్చుని బ్లాగులు చదవడం అయితే ఓక్కె గానీ మరీ బ్లాగులు వ్రాయడం అన్నది బావుండదేమో అన్న నైతిక (?) సందేహం వచ్చి ఆపేసాను. అసలు విషయం ఏమిటంటే గబుక్కున మా మేనేజర్ వచ్చి చూస్తే నా బ్లాగింపు కనపడ్డం బావుండదు కదా అని.

ఇంట్లో: నా ల్యాప్టాప్ (బాగుపడలేనంతగా) ఖరాబు అయ్యింది. ఇంకో ల్యాప్టాప్ మా పెద్దమ్మాయి ఎవరికీ ఇవ్వదు. మరింకో లాప్టాప్ మాయింట్లో వాళ్ళని బ్రతిమలాడితే కొద్దిసేపు నాకు పడేస్తారు. ఆ కొద్ది సేపట్లో ఏం బ్లాగగలం? ఆ సిస్టం ను మా ఆవిడ, చిన్న పాప, మా మాంగోరు వన్ బై వన్ ఉపయోగిస్తుంటారు - నేను అడిగితే చిరాకు పడతారు :( అలా నాకు కంప్యూటర్ గతిలేక నాలోని బ్లాగాగ్నిని ఇప్పటివరకూ శాంతపరుస్తూ వస్తున్నాను.

ఇహ లాభం లేదని మొన్ననే ఓ నెట్ బుక్ + మొబయిల్ బ్రాడ్ బ్యాండ్ ఆర్డర్ చేసాను.  కొరియర్ లో ఇవాళ రావాల్సి వుంది. దానిని మా ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వొద్దని కంకణం కట్టుకున్నాను! ఇక రేపటి నుండి మళ్ళీ నా బ్లాగింగ్ దడదడ లాడిస్తానేమో. ఈ బ్లాగు ఏమో గానీ నా ఇంకో బ్లాగు వుంది చూసారూ - అందులో చాలా వ్రాయాల్సి వుంది. ఓ బుక్కు మొదలెట్టాను కదా అది ముగించవలసి వుంది.

అజ్ఞాతంగా: బహిరంగంగా బ్లాగింగు చేయడం నాకు సౌకర్యంగా లేదు. ఏదయినా వ్రాయవలసి వస్తే ఎవరినీ నొప్పించకుండా. మన వ్యక్తిగత విషయాలు, భావాలూ ప్రకటించుకోకుండా చాణుక్య నీతితొ వ్రాయాల్సి వస్తోంది. అజ్ఞాతంగా వ్రాసే వారి స్వేఛ్ఛ చూస్తే నాకు అసూయ కలుగుతోంది. త్వరలో అజ్ఞాతంగా కూడా ఓ బ్లాగు మొదలెడతానేమో. నా శైలిని బట్టి ఎవరయినా కనిపెట్టినా గమ్మున వుండండేం!