వద్దులే - మళ్ళీ భయపెట్టడం ఎందుకులే - నెమ్మదిగా వాళ్ళే తెలుసుకుంటారు అనుకున్నాను. చేసేదేముంది ఏది అయితే అది కానిమ్మంటూ పడక గదిలోనికి వెళ్ళాను. అక్కడి కిటికీ నుండి మా కమ్యూనిటీలో గస్తీ కాస్తున్న సైన్యాన్ని చూసాను.
జరిగేదేదో ఇంకెక్కడయినా జరుగొచ్చుకదా. మాకు దగ్గర్లోనే జరగాలా? ఏమన్నా అయితే ఏమవుతుంది? ప్రాణాలు పోతాయా లేక విషరోగాలు అంటుకుంటాయా లేక అవయవాలు చచ్చుపడిపోతాయా? విరాగి సూచించినట్లు గ్రహాంతర వాసుల ప్రమేయం ఏమయినా వుందా. గ్రహాంతర వాసుల సమాచారం సైన్యం గుట్టుగా దాస్తోంది అని ఎన్ని కట్టుకథలు విన్నా నేను అయితే ఆ విషయాన్ని నమ్మడం లేదు. ఇప్పుడూ కనీసం ఆ కోణంలో ఆలోచించాలంటే ఇబ్బందిగా వుంది కానీ ఎమీ అర్ధం కాని ఈ పరిస్థితి చూస్తుంటే ఏమో అనిపిస్తోంది.
నా టపాకి ఇంకా ఏమయినా వ్యాఖ్యలు వచ్చాయేమోనని చూసాను. విరాగి ప్రతి వ్యాఖ్య చేసేడు. గ్రహాంతరవాసులు దిగే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నాడు. పరిస్థితి మొత్తం సైన్యం చేతిలో వుండటం, తీసుకుంటున్న జాగ్రత్తలు, అన్ని విషయాలను రహస్యంగా వుంచడం చూస్తుంటే గ్రహాంతర వాసుల విషయం లోనే అనుమానం అంటున్నాడు. ఏలియన్స్ దిగుతున్న సమాచారం ఎలాగోలా సైన్యానికి అందివుండవచ్చని అతని గాఢాభిప్రాయం. దిగుతున్న గ్రహాంతర వాసులు తమతొ పాటు తెలిసీ తెలియక ఏం రోగాలు, ఏ సూక్ష్మ క్రిములు పట్టుకువస్తాయో తెలియదు కాబట్టి ఆ ప్రమాదాలు అవగతం అయ్యేంతవరకు ప్రభుత్వం వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నదేమో. అందుకే ప్రజలని ఇండ్లలోనే వుండి అన్ని మూసేసుకొని జాగ్రత్తగా వుండమని ఆదేశించినదేమో!
హుం. ఈ వాదన నమ్మశక్యంగా లేదు. కానీ ప్రభుత్వం పాటిస్తున్న ఈ నిగూఢత చూస్తుంటే ఈ కోణం సబబే అనిపిస్తోంది. ఇది కాకపోతే సైన్యం రహస్యంగా చేపట్టిన ఏ ప్రాజెక్టో, పరీక్షో విఫలమయ్యివుండవచ్చు. అది రసాయన పరీక్షో లేక జీవాయుధాల పరీక్షో అయివుండవచ్చు. అదీ కాకపోతే అంతకంటే ఘోరంగా ఆ పరీక్షలేవో మామీదనే చేస్తుందేమో. ప్రభుత్వం లాటరీ తీస్తే మా కమ్యూనిటీ పేరు వచ్చిందో లేక ఏ కారణాల వల్ల నన్నా మా కమ్యూనిటీ ఈ పరీక్షలకు సరి అయింది అనుకున్నదేమో ప్రభుత్వం. ఛ. పిచ్చి ఆలోచనలు కాకపోతే ప్రబుత్వం స్వంత ప్రజల మీద అంత అఘాయిత్యం చేస్తుందా?
ఏమో ఎవరు చెప్పొచ్చారు? దేశ భద్రత కోసం, ఎక్కువ మంది ప్రజలను కాపాడటం కోసం తక్కువమంది ప్రజలని త్యాగం చేసినా చేస్తుంది ఈ ప్రభుత్వం. గత్యంతరంలేక మరో విపత్తుని నిలువరించడం కోసం మా ఏరియాని ఒక యూనిట్టుగా తీసుకొని ప్రయోగిస్తున్నదేమో, పరీక్షిస్తున్నదేమో. ప్రభుత్వ దాపరికం వల్ల అన్నీ అనుమానాలే. ఛత్.
ముందు గదిలోకి తొంగి చూసాను. హారిక, పిల్లలు ఈ ఆలోచనలు, ఆందోళనలు ఏమీ లేకుండా హాయిగా వున్నారు. నాకున్న విజ్ఞానమే నన్ను ఇబ్బంది పెడుతూవుంది!
ఒకవేళ అలాంటి పరీక్షలే చేస్తే ఏమవుతుంది? ఈ ప్రాంతం వారందరూ పోతారా? లేదా అందరికీ రోగాలు వస్తాయా? రోగ లక్షణాలు ఎలా వుంటాయి? కళ్ళు మండుతాయా? కళ్ళు మండుతూనేవున్నాయి. గొంతు మండుతుందా. గొంతు మండుతూనేవుంది. శరీరం నిస్త్రాణగా అవుతుందా. ఉన్నపళంగా కూలబడిపోయాను. ఇదేంటి? నేను ఎలా అలోచిస్తున్నానో అలానే జరుగుతున్నదేమిటి? చెవుల్లో హోరు! ఏదో అవుతోంది. నాకేదో అవుతోంది. గొంతు మండుతోంది. బాధతో గట్టిగా రుద్దుకున్నాను. అరుద్దామనుకుంటే అరుపు నోట్లోంచి రావడంలేదు. హారికా అని పిలుద్దామనుకున్నా నోరు పెగలడంలేదు. పాప, రణిల్ గుర్తుకువచ్చారు. ముందుగదిలో వాళ్ల పరిస్థితీ, హారిక పరిస్థితీ ఇలాగే వుందా?
ఎలాగయినా ముందుగదిలోకి వెళ్ళాలి. నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. శక్తి నిర్వీర్యమయిపొతూవున్నా ఎలాగోలా కూడదీసుకుని కొద్దిగా జరిగాను. జరిగాననుకున్నాను కానీ అంగుళం కూదా జరగలేకపోయానని అర్ధం అయిపోయింది. గుండెలో నొప్పి. ఇక లాభం లేదు. మనస్సు మొద్దుగా అయిపొతూవుంది. భగభగమండుతున్న కళ్లను బలవంతగా లేపి చుట్టూ చూసాను. దగ్గర్లో ఫోన్ కనపపడ్దది. కనీసం 911 అత్యవసర సర్వీసుకి అయినా ఫోన్ చేయాలి. కనీసం వాళ్ళు నా కుటుంబాన్ని అయినా కాపాడుతుండొచ్చు. పళ్ళబిగువున చేతులు కదిల్చి ఫోన్ అందుకున్నాను. సంతోషంగా అనిపించింది. నేను మరణించినా ఫర్వాలేదు - నాకుటుంబం అన్నా బ్రతికి బట్టకట్టాలి. కనీసం రణిల్, పాప అయినా.. కనీసం పాప అయినా...
ఎలాగోలా శక్తి కూడదీసుకొని 911 నొక్కితే చాలు. పోలీసులు, ఫైర్ వాళ్ళు, నర్సులూ వస్తారు. వాళ్ళే అన్నీ చూసుకుంటారు - నా కుటుంబాన్ని కాపాడుతారు. ప్రాణాలు ఇంకెన్ని క్షణాలో వుండవని తెలుస్తూనే వుంది. ఎలాగయినా ఫోనులో 911 అంకెలు నొక్కాలి. శక్తి రావడం లేదు. ఒక్కసారి నా కుటుంబాన్ని మనసునిండా తలుచుకున్నాను - ఎప్పుడూ చిరునవ్వులు నవ్వే మా పాప ముఖాన్ని తలచుకున్నాను. వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. మండుతున్న గుండెలోకి బలంగా గాలి తీసుకున్నాను. వణుకుతున్న చేతులను అదిమిపెట్టుకుంటూ అంకెలని వత్తసాగాను.
9..1......
(ఉపసంహారం వచ్చే భాగంలో )