సోమవారం 30 మార్చి 2009

వచ్చేసానొచ్చేసానోచ్!

కెనడా కబుర్లు:

ఓ పదిరోజులు కెనడాకి సెలవులకని వెళ్ళొస్తానని నేను అన్నది గుర్తుకువుండే వుంటుంది. కొన్ని కబుర్లు ఇవండీ. కొంతమంది బంధుమిత్రులను కలుసుకున్నాం - మరికొంత మందిని కలుసుకోలేకపోయాం.

ఇదివరలో మేము గడిపిన టొరొంటో డవుంటవున్ చూద్దామ అనుకున్నాం కానీ కుదరలేదు. కొత్తగా కట్టిన స్వామీ నారాయణ గుడి చూసాము (నేను నాస్తికుడినే అయినా మా ఆవిడకి కార్ డ్రైవరుగా ఇలాంటి గుడుల దర్శన భాగ్యం లభిస్తూవుంటుంది!). గుడి బావుంది - విశాలంగా - పాలరాతితో. ప్రతి పాలరాతి స్తంభం వద్దా 'తాకరాదు ' అని బోర్డులు. తాకాలనే కొరికను అధిగమించడం కష్టమయ్యింది.


నయాగరా జలపాతాలు మరోసారి చూసాం. అలాంటి ఆహ్లాదకరమయిన ప్రదేశాలలో వెచ్చని ప్రియురాలు ప్రక్కన వుంటే బావుంటుంది కాదూ. ప్చ్.

ఆర్ధిక మాంద్యం ప్రభావం అక్కడ కూడా బాగానే వుంది. నేను కలుసుకున్నవారిలో కొంత మంది ఉద్యోగాలు పోయి క్రిందా మీదా పడుతున్నారు.

యు ఎస్ లో స్టేటస్ మీద వుండి వుద్యోగ భద్రత లేనివారికి ఒక చిన్న శుభవార్త. కెనడాలోని ఆల్బర్టా ప్రొవిన్స్(రాష్ట్రం) అటువంటి వారికొసం ఒక ప్రత్యేక వలస విధానం ఏర్పాటుచేసిందంట. ఆ పద్ధతిలో త్వరగా కెనడాకి వలస వెళ్ళవచ్చు. అక్కడ ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతికేయవచ్చు - కాకపోతే ఆ రాష్ట్రంలో చలి ఎక్కువ.

శుక్రవారం 20 మార్చి 2009

కెనడాకెళ్ళొస్తా

పిల్లలకు స్ప్రింగ్ బ్రేక్. కెనడా నా స్వదేశం కాబట్టి అక్కడ కొన్ని పనులు వున్నాయి. అవి చక్కపెట్టుకొని అక్కడి మిత్రులని, మిత్రురాళ్ళని కలిసిరావడానికి కుటుంబసమేతంగా రేపు బయలుదేరి వెళుతున్నాను. కెనడాలొ టొరొంటో, సయింట్ క్యాథరిన్స్ మరియు నయాగరా ఫాల్స్ సిటీలకు మేము వెళతాము. కెనడాలో ఎవరయినా బ్లాగర్లు వున్నారో లేదో తెలియదు. నేను పేర్కొన్న ప్రదేశాలల్లో ఎవరయినా బ్లాగర్లు వుంటే మనం కలవవచ్చు. ఆసక్తి వుంటే sarathn@hotmail.com కి ఈమెయిల్ చేయండి.

ప్రయాణాలల్లో వుంటూ పెద్దగా బ్లాగగలననుకోను. ఒక పదిరోజులవరకు నా ధారావాహికలు ఏం జరుగుతోంది, ఉరి లు సశేషంగా వుంటాయి.
ఏం జరుగుతోంది చదువుతున్న వారికి: ఆ కుటుంబానికి కనిపించినదేమిటో సీరియల్ లో వున్న క్లూల ద్వారా ఊహిస్తూవుండండి.
ఉరి చదువుతున్నవారికి: అతగాడు ఇంతకీ ఉరి వేసుకుంటాడా లేదా?

బుధవారం 18 మార్చి 2009

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 3

"ఈ తెల్లోలంతా ఇంతే. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దగా చేస్తారు. లైట్ తీస్కో" అంది హారిక
"వాటెవర్" అని ఓ డైలాగ్ వేసి ఎంచక్కా తన సిస్టంలో ముఖం దూర్చేసాడు మా వాడు.
మా పాప టేప్ తీసుకొని తలుపు దగ్గరికి వెళ్ళి అతికిస్తూనేవుంది.
"అంతేనంటావా" అన్నాను మా ఆవిడతో నా మనసులోని అలజడి బయటపడకుండా. పోలీసులు అటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వున్నారు అంటే ఏదో ఉపద్రవం జరగలేదేమో - ఇది బాగానే వుంది కానీ ఆ ఉపద్రవం ఇకముందు జరగబోతోందా? నా ఉద్దేశ్యమే నిజమయితే...! బ్లైండ్స్ తెరచి మరో సారి రోడ్డును పరీక్షగా చూసాను. నా అనుమానం నిజమయ్యింది. అప్పుడున్నంత పోలీసు ఫోర్స్ ఇప్పుడు లేదు. కొంత ఫోర్స్ తమ వాహనాలు ఎక్కి నిష్క్రమిస్తున్నాయి.

సమయం మధ్యాహ్నం 12:30 దాటింది. నా అనుమానం నిజమౌతున్నదా లేక కర్ఫ్యూ ఎత్తేస్తున్నారా? 57 ఛానల్ పెట్టి చూసాను. అవే హెచ్చరికలు వస్తున్నాయి. కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లుగా ఏమీలేదు. అంటే? నా నుదిటిన చిరు చెమట్లు పట్టాయి. హారిక వైపు చూసాను. ఎంచక్కా తన సిస్టంలో హిందీ సీరియల్ చూస్తోంది. మా పాప మాత్రం శ్రద్ధగా తలుపుకి టేప్ అతికిస్తోంది.
తన వైపు నేను సాలోచనగా చూస్తున్నది గమనించి "కిటికీలకు టేప్ అతికించు డాడీ. లేకపోతే డేంజర్ కదా" అంది.
"అవునమ్మా" అన్నాను తలపంకిస్తూ
"ఎందుకూ. ఏమొద్దు. కర్ఫ్యూ ఒక గంటలో తీయకపోతారా" హారిక అంది తలేత్తకుండానే.
నా అనుమానం ఆమెకు చెప్పకుండానే "ఎందుకయినా మంచిది. అతికిద్దాం" అన్నాను
"ఏమన్నా అతికించుకోండి"
బాబు వైపు చూసాను. వాడిని సహాయానికి రమ్మనమని చెప్పి వాడితో వాదన పెట్టుకోవడం కంటే పాపతో కలిసి నేనే ఈ పని చేసుకుంటేపోలా అనుకుని ఆ పనిలో పడ్డాను. బయటనుండి ఏమీ గాలి ప్రవేశించకుండా పది నిముషాల్లో తలుపుకి టేప్ అతికించాను. టేప్ ఎక్కువలేదు. అన్ని కిటికీలకు సరిపోతుందా?

12:45 PM. కిటికీ చుట్టూ కూడా డక్ట్ టేప్ అతికిస్తూ ఆసక్తి కొద్దీ కొద్దిగా బ్లయిండ్స్ తెరచి చూసాను. పోలీసులు ఎవరూ దగ్గర్లో లేరు. దూరంగా ఇద్దరు మాత్రం వున్నారు. ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళని పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాను!

నా ఉలికిపాటును ఎవరయినా గమనించారా అని ఇంట్లో చుట్టూ చూసాను. ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. మా పాప కూడా కిటికీలోనుండి చూసింది కానీ విషయం గమనించలేదు. నా ఊపిరి బరువెక్కినట్లు నాకు తెలుస్తూనే వుంది. విషయం ఇంట్లోవారికి చెప్పాలా వద్దా? చెబితే హడలిపోతారేమో. చెప్పకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోరేమో. ఎలాగూ తెల్సిసేదేకదా.ఇప్పుడే చెబితే పోలా.
ఆలోచిస్తూనే మా వాడిమీద కేకలేసాను - హారిక మీద అరవలేక. "తలకాయ వుందా నీకు. చిన్నపిల్ల చెల్లె హెల్ప్ చేస్తోంది. నీకు మాత్రం ఎప్పుడూ సిస్టం కావాలి"
తల ఎత్తి చూసాడు బాబు
"రా ఇటు. వచ్చి టేప్ వెనుకగది కిటికీలకు అతికించు"
"సరిపోదేమో" అన్నాడు కూల్ గా.
నిజమే. సరిపోదు. గొంతులో ఏదో అడ్డం పడ్డ ఫీలింగ్.
"నీకెప్పుడూ కంగారే డాడీ. ఇప్పుడేమయ్యిందని? నేనూ, మమ్మీ ఎంత కూల్గా వుంటున్నామో చూడు"
అసలే టెన్షనుతో వున్న నాకు వాడి మాటలతో అరికాలి మంట నెత్తికి ఎక్కినట్లయ్యింది.
"ఇటు వచ్చి చూడురా వెధవా. రా" అని అరిచాను.
నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చాడు. చూసాడు. భుజాలు ఎగరేసాడు.
నాకు వళ్ళు మండింది. "అద్దాలు పెట్టుకొని చూసి తగలడు" అని సహనం కోల్పోయి అరిచాను.
"ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడి ఏమయ్యిందని. రోజురోజుకీ నీకు ఓపిక తక్కువ - కోపం ఎక్కువ అవుతోంది" హారిక గయ్ మంది.
ఆమెకు వినపడకుండా పళ్ళు నూరాను. వినపడితే మొదలవుతుంది ఎదవ గోల.
ఈలోగా వాడు అద్దాలు పెట్టుకొని వచ్చి పరీక్షగా చూసి "O M G" అన్నాడు.
వాడు అలా అన్నాడంటే అదేదొ కొంపలు మునిగేవ్యవహారమేనని ఖంగారుగా కిటికీ దగ్గరికి వచ్చింది హారిక. ముందు మామూలుగా చూసింది. ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు. "నాకేం కనిపించ... ఓరి నాయనో" అని అక్కడే కూలబడింది. "ఇప్పుడు ఏమవుతుంది మనకు? ఆ ఇంగ్లిష్ సినిమాలోలా అవుతుందా మన గతి!". ఆమె కళ్ళనుండి జలజలా నీళ్ళు.

మా పాప తన పని తాను చేస్తోంది. కిటికీ చుట్టూ అందినంతమేరకు టేప్ అతికిస్తోంది.

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 2

గమనిక: తెలుగు బ్లాగావరణంలో ధారావాహికలకు/కొత్త నవలలకు అంతగా ఆదరణ లేదని తెలుసు. అయినా సరే ఇదివరకటి అలవాటుకొద్దీ వ్రాస్తున్నాను/వ్రాసుకుంటున్నాను.

రోడ్డు ఎక్కాను. ఆ తరువాత డండీ రోడ్డుకు మీదకి వచ్చాను. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదలుతోంది. పోలీసు కార్లు మాత్రం సైరన్లు మ్రోగించుకుంటూ ఎలాగోలా హడావిడిగా వెళుతున్నాయి. మిగతా కార్లలోని వ్యక్తుల వైపు పరికించిచూసాను. అందరి ముఖాల్లోనూ ఆందోళన. సరి అయినంత సమాచారం అందకుండా వుండటం కూడా మరింత టెన్షన్ కలగజేస్తోంది అనుకున్నాను. రేడియో గుర్తుకువచ్చింది. 780 పెట్టాను. ప్రకటనలు. ప్చ్. అది తప్ప నాకు మరో వార్తా చానల్ తెలియదు. వేరే ఛానల్స్ ప్రయత్నించాను కానీ అన్నీ సంగీతం, ఇతరాలు దొరికాయి.

ట్రాఫిక్ ఆగిపోయింది. సమయం పదకొండున్నర. ఇంకా అరగంటే టైం వుంది కర్ఫ్యూకి. రేదియోలో వార్తలు. చెవులు రిక్కించాను. ఎ ఐ జి బ్యాకు బోనస్సుల గురించిన గొడవ గురించి. ఆ గొడవ సరే - ఇక్కడ జరుగుతున్న గొడవ సంగతి ఏమిటి? తరువాత చెబుతారేమో. ఊహూ. చెప్పడం లేదు!

ఫైర్ ఇంజిన్లు వెళుతున్నాయి. ఈ ట్రాఫికులో కష్టకష్టంగా వెళుతున్నాయి. నా పక్కనున్న వీధిలో దూరంగా చూసాను. ట్రాఫిక్ వెళ్లకుండా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుకు దృష్టి సారించాను. అరడజను పోలీసులు వుండి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సమయం పదకొండూ నలభై. పోలీసుల శ్రమ వల్ల ట్రాఫిక్ కొద్దిగా వెళుతోంది. వెళ్ళి బాబుని తీసుకువచ్చే సమయం లేదు. ఏం చేయాలి? కొద్దిగా ముందుకు వెళ్లగలిగాను ఆలోచిస్తూనే. పోలీస్ కార్లు కర్ఫ్యూ ప్రకటన చేస్తూ అందరినీ త్వరగా ఇంటికి వెళ్ళాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.

11:45. లాభంలేదు. 12 లోపుగా వెనక్కి రాలేను. కూడళ్ళల్లో పోలీసులు పొజిషన్ తీసుకుంటున్నారు. బాబుని ఇక వెనక్కి తీసుకురాలేనని అర్ధమయ్యి యూ టర్న్ తీసుకొని వెనక్కు వచ్చాను. బాబు తన స్నేహితుని ఇంటిదగ్గర క్షేమంగానే వుంటాడు కానీ ఇంటిదగ్గర నా అవసరం బాగా వుంటుంది. అందుకే వెనక్కి మళ్ళాను. అదే విషయం బాబుకి చెబుదామని ఫోన్ చేయబోయేంతలో ఇంటిదగ్గర నుండి ఫోన్ వచ్చింది.

"బాబు వచ్చేసాడు" అని చెపంది మా ఆవిడ.
"ఎలా?" అన్నాను విస్మయంతో
"నడుచుకుంటూ"
"నడుచుకుంటూ?"
"అవును. ఈ వార్త వినగానే అడ్డదారిలో పార్కులోనుండి నడుచుకుంటూ వచ్చాడట"
బాబు ఇంటికి క్షేమంగా రావడం సంతోషకరంగా అనిపించింది. ఇబ్బందుల్లో వున్నప్పుడు అందరం ఒక దగ్గరే వుంటేనే బాగనిపిస్తుంది.

రోడ్ల మీద మామూలు జనం తక్కువయ్యి గవర్నమెంట్ వాహనాలు, పోలీసు వాహనాలు ఎక్కువ అవడం గమనించాను. కొన్ని వాహనాలు బారికేడ్లు తీసుకువెళుతున్నాయి. అక్కడక్కడ ఫైర్ ఇంజిన్లు నిలిచి వున్నాయి. ఇంకో అయిదు నిమిషాల్లో కర్ఫ్యూ.

ఇంటికి చేరుకున్నాను. హడావిడిగా లోపటికి వెళ్ళాను. ముందు వార్తలు చూడాలి. ఏం జరుగుతోందో, కర్ఫ్యూ ఎందులో తెలుసుకోవాలి.

లోపల హారిక (మా ఆవిడ) ఎంచక్కా హిందీ సినిమా చూస్తోంది.
వళ్ళు మండినా నిగ్రహించుకొని సాధ్యమయినంత శాంతంగా అడిగాను "ఏం సినిమా?"
"వెన్సుడే" తలతిప్పకుండానే చెప్పింది.
"న్యూస్ విన్నావా?"
"రాలేదు"
"ఏం రాలేదు?"
"మీరు చెప్పిన న్యూస్ ఎక్కడా రాలేదు! కర్ఫ్యూ ఎని ఎక్కడా చెప్పడం లేదు"
"నిజమా!"
సి ఎన్ ఎన్ పెట్టి చూసాను. నమ్మలేక. ఊహూ వార్త లేదు. మిగతా ఛానల్స్ పెట్టి చూసాను. ఎక్కడా ఈ వార్త కవర్ కావడం లేదు.
"ఈ కర్ఫ్యూ వార్త నిజమేనా?" హారిక అడిగింది.
"ఒక్క సారి డండీ రోడ్డు చూడు ఇంట్లోంచి"
బ్లైండ్స్ తొలగించి చూసింది. "నిజమే. పోలీసులు, ఫైర్ వున్నారు. కార్లు లేవు" అంది.
రణిల్, పాప కూడా ఉత్సాహంగా వచ్చి బ్లైండ్స్ తెరివబోయారు.
"తెరవద్దు. కొద్దిగా పక్కకు అని చూడండి అంతే" హెచ్చరించాను.

ఒకసారి పోలీసుల ప్రకటన గుర్తుకుతెచ్చుకున్నాను. అందులో లోకల్ ఛానల్ చూడమని వుంది. వెంటనే 57 పెట్టాను. అది ఈ ముసిపాలిటీ వారి ఛానల్. అందులో వస్తోంది కర్ఫ్యూ గురించిన సమాచారం!
12 గంటలనుండీ నిరవధిక కర్ఫ్యూ అని. కిటికీలు, బ్లయిండ్స్ మూసివేయాలని, ఎవరూ బయటికి రావద్దనీ హెచ్చరికలు. కిటికీలు, తలుపులు టేపుతో సీల్ చేయాలని ముఖ్య గమనికగా చెప్పారు. అది చూడగానే వళ్ళు జలదరించింది. ఎదో పెద్ద ప్రమాదమే జరిగిందో, జరగబోతుందో! ఎందుకు అవన్నీ సీల్ చేయమంటున్నారు? ఎందుకు ఏమిటి అన్న వివరాలు లేవు. ప్రజలని ఎక్కువగా భయభ్రాంతులను చేయకుండా వుండటానికి, పుకార్లు వ్యాప్తి చెందకుండా వుండటానికి అవి ఇవ్వడం లేదేమో.

ఇంట్లో వారికి విషయం చెప్పాను. హారిక ముఖంలో విభ్రాంతి. రణిల్ ముఖంలో '? '. మా పాప ముఖం చూద్దామంటే అది అక్కడ లేదు.

"టేప్ తెస్తున్నా డాడీ" అని లోపలి గదిలోనుండి వినపడింది. మరుక్షణంలో టేప్ తో ప్రత్యక్షమయ్యింది! "నేనూ టేప్ అతికిస్తా"

"ఖంగారు ఏమీలేదు. ఏదో ముందు జాగ్రత్తకొసం అయివుంటుంది" అన్నాను హారికతో నా కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ.
"నాకు ఆమధ్య చూసిన సినిమా గుర్తుకువస్తోంది!" ఏడుపు మొఖంతో అంది.
"ఛ. అంత దృశ్యం వుండదులే. ఖంగారు పడకు - పిల్లలని ఖంగారు పెట్టకు". పిల్లలు అప్పటికే అనుమానంగా మా వైపు చూస్తున్నారు.
"ఎందుకు టేప్ అతికించాలి డాడీ" అని మా పాప అడిగింది.
"వెల్. ఎంత టేప్ అతికించినా ఎక్కడో ఒక మూలనుండి వచ్చేవి రాకుండా పోతాయా" మా బాబు. వాడో పెద్ద పెసిమిస్ట్. అదో గొప్ప వేదాంతం అనుకుని సంతొషిస్తుంటాడు వాడు.
"వివరాలు తరువాత. నోరుమూసుకొని నాకు సహాయం చెయ్యండి ముందు" అని గదమాయించాను.

కొద్దిగా బ్లయిండ్స్ తెరచి బయట వున్న డండీ రోడ్డును చూసింది హారిక. మా ఇంటి పక్కనే వుంటుంది కాబట్టి స్పష్టంగా కనిపిస్తుందా రోడ్డు. మా ఇంటినుండి డైరెక్టుగా ఆ రోడ్డు మీదికి వాహనాలు పోలేవు. హిల్ వే వీధినుండి వెళ్ళాల్సిందే. "మనం టేప్ అతికిస్తాము బాగానే వుంది కానీ. ఆ పోలీసుల సంగతి ఏమిటి? వాళ్లకేమీ కాదా?"
చేతిలో వున్న టేప్ పక్కనే గిరాటు వేసి ఒక్క అంగలో కిటికీ దగ్గరికి వెళ్ళాను. నా వెనుకే పిల్లలూనూ. నిజమే. మరి బయట వున్న పోలీసులకి ఏమీ కదా? అటువంటప్పుడు కిటికీలకు, తలుపులకూ టేప్ దృఢంగా అతికించమని ఎందుకు హెచ్చరిస్తున్నారు?
(ఇంకా వుంది)

మంగళవారం 17 మార్చి 2009

నా 'ఎవరు?' నవలపై 'చతుర'లో బహుమతి పొందిన సమీక్షలు

ఈ సమీక్షలను నా పాత బ్లాగులో మీరు ఇదివరకే చూసివుండవచ్చు. కొత్తవారికోసం నా ఈ కొత్త బ్లాగులో మళ్ళీ ఇస్తున్నాను.
'ఎవరు?' నవల: ఈ నవల ఆద్యంతమూ మెటా ఫిక్షనే. మన తెలుగు లో ఇలాంటి టెక్నిక్ తో రచనలు చాలా అరుదు.
నా నవలకి లంకె http://www.geocities.com/sarath.films/Evaru.pdf
Metafiction is a type of fiction that self-consciously addresses the devices of fiction. It can be compared to presentational theatre, which does not let the audience forget they are viewing a play; metafiction does not let the reader forget he or she is reading a fictional work.
For further information on Meta Fiction please click the following link: http://en.wikipedia.org/wiki/Metafiction
నవల వీడియో పరిచయం: http://www.youtube.com/watch?v=mp--ib4XR8w
ఫిబ్రవరి 2006 'చతుర' నవల 'ఎవరు?' పై సమీక్షలు
(ఏప్రిల్ 2006 'చతుర'సంచికలో ప్రచురింపబడినవి)

మొదటి బహుమతి పొందిన సమీక్ష - జె.వి రమణ, మణుగూరు
మేల్కొనవలసిన సమయం
పాశ్చాత్య సంస్కృతి విష ప్రభావం హాలాహలంలా విజృంభించి భరత ఖండమంతా కమ్ముకుని కకావికలం చేస్తున్న తరుణంలో ప్రవాసాంధృనిచే సంధించబడిన అస్త్రానికి బాసటగా నిలచిన 'చతుర'కు అభినందనలు.రక్తపు గ్రూపులకు చెందిన సమాచారాన్ని యువతరం తమ మనస్తత్వానికి, అభిరుచులకు తగ్గవారిని ఎన్నుకోవడానికి ఉపయోగించుకొని శాంతి సౌభాగ్యాలు పెంపొందించుకోవాలి. నేటికాలంలో వెర్రితలలు వేస్తున్న విశృంఖలత వల్ల అక్రమసంబంధాలు, అక్రమ సంతానం, భ్రూణ హత్యలు, ఎయిడ్స్ వంటి భయంకర పరిణామాలు సంభవిస్తున్నాయి. ఉన్నతమయిన మన భారతీయ సంస్కృతిని నిర్వీర్యపరచడానికి పాశ్చాత్య దేశాల దాడికి అంకురమే ఈ విశృంఖలత. ఒక దానినుండి మరొకటి సమస్యలు ఉద్భవించి విశ్వరూపం దాల్చాయి. ఈ సమస్యలను అదుపుచేయడానికి ఒక సాధనంగా రక్తపు గ్రూపులకు చెందిన విజ్ణానాన్ని మలచుకోవాలి. మార్గం తప్పిన వారిని దారికి తేవడానికి దాని భయకర కోణాన్ని అవిష్కరించడమే సరి అయిన పని. ఇందుకోసం రచయిత అనేక పాత్రల ద్వారా మానవ సంబంధాల లోని వివిధ కోణాలను సృజించి అక్రమ సంబంధాల పర్యవసానాలను చక్కగా వివరించారు. నిజాలు తెలుసుకోకముందే అపోహలతో బాధపడిన లక్ష్య, మదాలసలే గాక రమణి, గురు, రాజేష్,హొయసల పాత్రలలో కూడా మార్పు తీసుకొచ్చినట్లు చూపితే ఇంకా బాగుండేది.శేషాచలం పాత్ర చెప్పినట్లు ప్రభుత్వం ప్రజలలో నైతిక విలువలు పెరిగేటట్లుగా చర్యలు తీసుకోవడం, పెనుభూతంగా మారుతున్న ఎయిడ్స్ వ్యాధి గురించి జనాన్ని జాగృతం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి సమస్య భయంకర రూపం సంతరించుకొనకముందే మేలుకొనవలసిన అవసరాని ఈ నవల నొక్కి చెపుతోంది.

రెండవ బహుమతి పొందిన సమీక్ష - ముద్దంశెట్టి అండమ్మ, చిలకలూరిపేట
ప్రయోగాత్మకం
ఎవరు? నవల లంకెఈమధ్యకాలంలో వచ్చిన నవలలన్నింటిలోనూ 'ఎవరు?' ప్రత్యేకమయినది, ప్రయోగాత్మకమయినది. ఇటువంటి సబ్జెక్ట్ నిజంగా సంచలనాత్మకమయినదే! సాధారణంగా ఎవరూ ఇలాంటి సాహసానికి ఒడిగట్టరు. కానీ రచయిత శరత్ ఎన్నుకున్న కమర్షియల్ టెక్నిక్ నవల ఆద్యంతమూ చదివిస్తుంది. నవలలో 'రక్త విశ్లేషణ'లు గమ్మత్తుగా వున్నాయి. చాలామంది చదువరులు కూడా ఒకింత ఆలోచనకు గురికాక తప్పదేమో! ఎందుకంటే బ్లడ్ గ్రూపులను గురించి వివరణాత్మకమైన వ్యాసం కూడా నవలతోపాటు ఇవ్వదం సంచలనమేకాదు, సాహసం కూడా. అయితే నవలలో వచ్చిన చాలా పాత్రలు కథ కనుగనంగా ఇమిడిపోయాయేకానీ గొప్పగా గుర్తుండిపోయే విధంగా పాత్ర చిత్రణ జరగకపోవడం రవ్వంత లోపం. సాధ్యాసాధ్యాలు పక్కకు పెడితే నిజజీవితం లోని మనుషులు, వారి మనస్తత్వాలు ఎంత విచిత్రంగా మారిపోతున్నాయో చిత్రిస్తూ కొన్ని పాత్రలను మలిచిన తీరుకు శరత్ అభినందనీయులు.సాక్షాత్తూ ముఖ్యమంత్రులు, మంత్రివర్గ సహచరులు, ప్రముఖులు, గృహిణులు, మధ్యతరగతి వారు, అభ్యుదయ మహిళల మీద విసిరిన సున్నితమయిన సెటైర్లు ఈమధ్య కాలంలో ఏ నవలలోనూ ఇంతగా కనిపించలేదు. ప్రజలూ, ప్రభుత్వాలూ ఎప్పుడూ అనవసర విషయాలకే ప్రాధాన్యతనిస్తారన్నది నగ్నసత్యం. రచయిత సత్యశ్రీ పాత్ర కూడా అంతగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఇక ప్రస్తుత సమాజం లోని 'అక్రమ సంబంధాల భాగోతం' పై ఎక్కుపెట్టిన ఈ 'ఎవరు' బాణం చాలా తక్కువ పేజీలలో రావడం బాగా లేదు. నవల ముగింపు కూడా వేగంగా, అనుకోకుండా, అర్ధాంతరంగా ముగించినట్లనిపించింది. ఆఖరుగా 'ఎయిడ్స్' వైపు పాఠకుల దృష్టి మళ్ళించి ' తస్మాత్ జాగ్రత్త' అన్న రచయిత అభినందనీయుడు.నాకు నచ్చిన సమీక్ష ఇది.
(సమీక్ష అంటే ఇలా వుండాలి. రచయిత గొప్పదనాన్ని, లోపాలని ఎత్తిచూపగలగాలి. ఇక్కడ వెలిబుచ్చిన ప్రశంసతోనూ, విమర్శతోనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను. - శరత్)

మూడవ బహుమతి పొందిన సమీక్ష - లక్ష్మి, మిర్యాలగూడ
ఆరోగ్యకరమయిన ఇతివృత్తం ఉండాలి
ఎయిడ్స్(నవల) కు సరైన గుర్తింపు రాలేదన్న అక్కసుతో 'ఎవరు?' అనే సంచలనన్ని సృష్టించి, ఆ విధంగా ఎయిడ్స్ నిర్మూలనకు పరోక్షంగా కృషిచేసారు నవలలోని రచయిత సత్యశ్రీ. బ్లడ్ గ్రూప్ కాంబినేషను కారణంగానైనా అక్రమ సంబంధాలు మానుకుని రుజువర్తనను అలవరచుకుంటారని రచయిత ఆకాంక్ష. కానీ ఇది సరి అయిన మార్గం కాదు. సమాజానికి మార్గ నిర్దేశనం చేయాల్సిన వారు మానసిక పరివర్తన తీసుకువచ్చే ప్రయత్నం చేయాలే కానీ ఘాటైన డోసిచ్చి వికటించే పరిస్థితి తీసుకురాకూడదు. ఇలాంటి అపరిపక్వ పరిశోధనల వల్ల ఎప్పుడో జరగబోయే నష్టం సంగతేమో గానీ ఇప్పుడు మాత్రం ఆసక్తి పెరుగుతుంది. అనుమానాల బీజాలు మొలకెత్తి తల్లితండ్రుల బ్లడ్ గ్రూపులను వెతుక్కుంటూ, అనుకోని నిజాలు బయటపడటంతో లక్ష్య, మదాలస లాంటి ఎదిగీ ఎదగని మనస్సులు ఎంత తల్లడిల్లిపోతాయో గమనించాలి. ఏ చిన్న తేడాలు వచ్చినా అలాంటివారు అభద్రతకు లోనవుతారు.ఏ విషయం లోనయినా వాస్తవిక దృక్పథంతో అడుగు ముందుకేసినప్పుడే సమాజంలో్ నీతి, నిజాయితీ కల్గిన నాణ్యమయిన బీజాలు మొలకెత్తుతాయి. ముఖ్యమంత్రి అంతటి పెద్ద మనిషే తన సంతానం బ్లడ్ గ్రూపుల గురించి ఎందుకు ఆరా తీసినట్లు? అనుమాన బీజం మొలకెత్తబట్టే కదా్. భార్యాభర్తల మధ్య నమ్మకం వుండాలి. ఎయిడ్స్ వ్యాధి ప్రబలటానికి చదువు సంస్కారం ఉన్న పెద్ద కుటుంబాలు కూడా దోహదపడుతున్నాయనటంలో సందేహించాల్సిన పని లేదు. సిద్దాంత పరంగా రుజువుకాని అసంపూర్తి పరిశోధనలు ప్రజల్లో ప్రవేశపెట్టడం తగదు. ప్రేమానుబంధంతో అల్లుకుపోవాల్సిన హృదయాలు, రెండు కుటుంబాల మధ్య అవగాహనతో పెనవేసుకుపోవాల్సిన పెళ్ళి సంబంధాలు బ్లడ్ గ్రూపుల పేరుతో నిర్ణయించుకోవాలనుకోవడం, ఇంతకన్న దుర్భర జీవితం ఏముంటుంది? సంచలనం సృష్టించి సమాజంలో చలనం తీసుకురావడానికి ఆరోగ్యకరమయిన ఇతివృత్తం ఎంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

నాలుగవ బహుమతి పొందిన సమీక్ష - వి. లలితాంబ, పర్లాకిమిడి
సెన్సేషనల్ నవల
మనిషి మనస్సు సహజంగా కుతూహలజనకం. ఏది 'గుప్త'మో దాన్నేతెలుసుకోవాలనుకుంటుంది. రక్తపు రకాల వల్ల మనుషుల మనస్సులను మధించడం, ఆ మధనం తమ సంతానం సక్రమమా, అక్రమమా అన్న అతర్మధనంగా మారటం, భర్తలకు భార్యల మీద, భార్యలకు భర్తల మీద, అనుమానాలు వగైరా ఆంశాలతో కూడిన కథావస్తువుతో ఊపిరి సలపకుండా చదివించగల సెంసేషనల్ నవల రాసిన రచయిత శరత్ అభినందనీయులు. ఇంచుమించుగా ఎనిమిది జతలతో, ప్రతి జతకీ ఏదో ఒక అసంబద్ధమయిన రక్త రకమున్న సంతానాన్ని ఇరికించి 'ఎవరు' నవలను సాగించారు. మన దేశం లో శాస్త్ర విషయాలు చాలామందికి తెలియవు. తెలిసిన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మేనరికాలతో మందబుద్ధి సంతానం పుట్టుకొస్తున్నా, ఆర్. హెచ్. సరిపోక, తల్లే బిడ్డకి పాలివ్వడానికి అనర్హురాలయినా, ఈ వివాహాలు తగ్గటం లేదు. రాశి, ఆంశ, లగ్నం, నక్షత్రం, శాఖ, గోత్రం, చూస్తారే కానీ బ్లడ్ గ్రూప్, ఆర్. హెచ్. అంశం సరిచేసి చూసుకోరు. ఇవి సరిచేసుకోవడం, వివాహం ఏ తంతుతో జరిగినా రిజిస్టర్ చేసుకోవడం, ముందు ముందు అవిర్భనించనున్నాయి. శేషాచలం ప్రతి ఒక్కరికి వాత పెడుతూ, అసలు వస్తువుల నుంచి ఎయిడ్స్ మీదికి మళ్ళించి, తను మట్టుకు ఎవరికీ పట్టుబడకుండా చాకచక్యంగా తప్పుకోవడంతో ముగింపు చాలా బాగుంది.

ఐదవ బహుమతి పొందిన సమీక్ష - నరసింహప్రసాద్, పి వి ఎల్., కరీంనగర్
సమాజానిదే బాధ్యత
రచయితల నుండి సమాజం ఆశించేది వాస్తవాలనా లేక సామాజిక బాధ్యతనా? నగ్న సత్యాలనా లేక నాగరికులు మెచ్చే రచనలనా? అనాదిగా ఎడతెగకుండా నడుస్తున్న ఈ చర్చకు శరత్ గారి 'ఎవరు' నవల మరో సారి తెర తీసింది. ఈ నవల విభిన్న కథల సమాహారం. నవల ఆద్యంతం ఎవరు నవలపై ఆంధ్ర రాష్ట్రం లో కలుగుతున్న సంచలనం దానికి రచయిత ప్రతిస్పందన మాత్రమే ఏకసూత్రం. మిగతా భాగమంతా వేరు వేరు కుటుంబాలల్లో ఈ నవల కలిగించిన సంక్షోభం, సంభ్రమాల ప్రహసనమే. ప్రతి సంఘం కొన్ని విలువల పునాదిగా మనుగడ సాగిస్తుంటుంది. అలాంటి విలువల్ని ఒక రచయితో, ఒక ఉద్యమకారుడో వచ్చి కూలదోసి తమదైన శైలిలో నూతన సమాజాన్ని అవిష్కరిస్తారు. ఆ ప్రయత్నాలకు ఎల్లప్పుడూ అనుకూల, ప్రతికూల స్పందనలు ఎదురవుతుంటాయి. ఏది మంచి, ఏది చెడు అనే ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాల్సిన బాధ్యత సమాజానిదే కానీ సాహితీ విమర్శకులది కాదు. విజ్ఞాన శాస్త్ర వాస్తవాలను ఆధారం చేసుకొని రూపుదిద్దిన 'ఎవరు' నవల మరలా అలాంటి ప్రశ్ననే లేవనెత్తి వాదోపవాదాలకి ఆరంభం పలికింది.

సోమవారం 16 మార్చి 2009

ఈ శరత్ ప్రేమ కథ

నన్ను సీరియస్సుగా ప్రేమలో పడేసింది మా మరదలు రేఖ (పేరు మార్చాను). నా డిగ్రీ అయిపోయిన తరువాత సాంఘిక సేవ మీద ఆసక్తితో ఒక ఏడాది అది చేసి తరువాత గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటున్న రోజులవి.

ఒక రోజు రేఖ అడిగింది. "పెళ్లెప్పుడు చేసుకుందాం?"
"పెళ్ళి?"
"ఆహా. ఇన్నాళ్ళ నుండీ ప్రేమించుకుంటున్నాము కదా. మరి మన పెళ్ళి ఎప్పుడు?"
"ప్రేమ?"
"అదేంటీ అలా అంటావూ?"
"మరి? మన మధ్య ప్రేమ ఏమిటి?"
"నను ప్రేమిస్తూనేవున్నావుగా!"
"ప్రేమిస్తున్నానా!?"
"ప్రేమగా వుంటూ వస్తున్నావు కదా"
"నేను అందరు అమ్మాయిలతోనూ ప్రేమగానే వుంటాను"
"అందరితో అలాగే వుంటావా!"
"ఆహా"
"ఎందుకలా!"
"విశాల భావాలు మనవి. ప్రేమకి హద్దులు లేవని"
"సరే గానీ ఇకపై నన్ను ప్రేమించు"
"కుదరదు"
"ఏం?"
"సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా. ప్రేమలు, పెళ్ళిళ్ళు మనకు సరిపడవు"
"మరి నేను ఏమయిపోవాలేంటి?"
"నేను బాధ్యుడిని కాదు. ఒక్కసారన్నా నేను ప్రేమిస్తున్నానని చెప్పానా?"
"చెప్పలేదనుకో కానీ నువ్వు ప్రేమిస్తున్నావనుకొని నేను ప్రేమిస్తూవస్తున్నానే!"
"దాందేముంది. ఇప్పుడు ప్రేమించకు"
"అలా నాకు కుదరదు. జీవితంలో ఒక్కడినే ప్రేమిస్తా నేను. నిన్ను ఆల్రెడీ ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు. మనం పెళ్ళి చేసుకుందాం. ఓ పని అయిపోతుంది"
"మరి నా సోషల్..."
"ముందు నా సర్వీస్ చేయి. ఆ తరువాత నీతో కలిసి నేనూ (సోషల్) సర్వీస్ చేస్తా"
"నిజ్జంగా!"

ఎటూ తేల్చుకోలేక మా ఇంట్లో అందరినీ కోర్చోబెట్టి సలహా అడిగేను. అందరూ రేఖకే వోటు వేసారు ఎందుకంటే మా ఇంట్లో నాకంటే రేఖకే ఎక్కువ గౌరవం కాబట్టి! నా తొట్టి గ్యాంగు (ఫ్రెండ్స్)ని అడిగాను. వారుకూడా ఆమెకే వోటు వేసారు - నువ్వు ప్రేమించే అమ్మాయికంటే నిన్ను ప్రేమించే అమ్మాయి - అందులో తెలివయిన అమ్మాయి దొరకడం నా అదృష్టం కాబట్టి నేను ఆమెతో లవ్వులోకి దిగాల్సిందేనట.

బాగానే వుంది. కాకపోతే చిన్న సమస్య.
అదే రేఖతో చెప్పాను. "నేను మంచి వాడిని కాదు"
"నాకు తెలిసీ నీలో మరీ గొప్ప అవ లక్షణాలులేవే!"
"మరదే. నాకు మండుద్ది. నాలో ఒకటి వుంది. నీకు నచ్చదు. ప్రేమ క్యాన్సిల్ చేస్కో"
"ఏంటది?"
చెప్పాను.
ఒక నిమిషం దీర్ఘ నిశ్వాస విడిచింది. ఓ రెండు నిమిషాలు ఆలోచించి అంది "ఇంతకుముందు సరే. ఇకనుండి మానివేయ్"
"నా వల్ల కాదు. అవి నా భావాలతో కూడుకున్న పనులు"
"అవుతుంది"
"కాదు"
"ఒక పనిచేయి. నాకోసం ఒక్క మూడు ఏళ్ళు ఆ అలవాట్లు మానివేయి. ఆ తరువాత నీ ఇష్టం"
"మూడు ఏళ్ళు!"
"అవును. మూడు ఏళ్ళు"
"ఆ తరువాత ఏమవుతుంది?"
"ఒక మూడు ఏళ్ళు నీ అలవాట్లు మానుకోగలిగితే జీవితాంతం మారే సమర్ధత నీకే వస్తుంది. అప్పుడు ఇంత మొండిగా మాట్లాడలేవు. నా ప్రేమతో నిన్ను ఈ మూడేళ్ళలో మార్చుకుంటాను"
"నిజంగా!"

మూడేళ్ళే అంది కదా అని ఒప్పుకున్నాను. తరువాత ఆమె ప్రేమలో పూర్తిగా తలమునకలయ్యి ఆమెకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసాను. బుద్ధిమంతుడిగా మారాను. ఒక ఏడాదిన్నర తరువాత వేరే కారణాల వల్ల మామధ్య మనస్పర్ధలు వచ్చాయి. ప్రేమ క్యాన్సిల్ చేసుకున్నాము. గౌరవంగా విడిపోయాము.

అయినా సరే ఆమెకిచ్చిన మాటప్రకారం మిగతా ఏడాదిన్నర కాలం కూడా బుద్ధిగా మసిలాను. తరువాత నా రూటుకి నేను వచ్చేసాను.

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 1

గమనిక: తెలుగు బ్లాగావరణంలో ధారావాహికలకు/కొత్త నవలలకు అంతగా గుర్తింపులేదని తెలుసు. అయినా సరే ఇదివరకటి అలవాటుకొద్దీ వ్రాస్తున్నాను/వ్రాసుకుంటున్నాను.

పాప డ్యాన్స్ క్లాసులో వుంది. చేసే పనేమీలేక కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను. ఎవేవో ఆలోచనలు. లీలగా ట్యాప్ డ్యాన్స్ టీచర్ చెబుతున్న పాఠం వినపడుతూవుంది. అంతలోకే సైరన్లు వినపడ్దాయి. మామూలేకదా. ఎక్కడొ ఏదో తగలబడివుంటుంది - అదికాకపోతే మరొకటి. సైరన్లతో పాటుగా ఏదో ప్రకటన. ప్రకటన? అలా ఎప్పుడూ వినలేదు. చెవులు రిక్కించాను.

"గో హోం". "ఇంటికి వెళ్లండి!".

ఇంటికి వెళ్ళండి? దిగ్గున కళ్ళు తెరిచి చూసాను. తలుపు దగ్గరే వున్న ఇంకోక స్టుడెంట్ తల్లి నా వైపు అయోమయంగా చూసింది - తను వింటున్నది నమ్మలేనట్లుగా. మళ్ళీ ఏదొ వినిపిస్తుండటంతొ దిగ్గున లేచి తలుపు దగ్గరికి వెళ్ళాను.

"వెంటనే ఇంటికి వెళ్ళండి. మరో గంటలో కర్ఫ్యూ"
కర్ఫ్యూ?
"సమాచారం కోసం లోకల్ ఛానళ్ళు చూడండి"
ఏం జరుగుతోంది? ఎందుకు కర్ఫ్యూ? ఆ తల్లి మరోసారి నవైపు అయోమయంగా చూసింది.
దిగ్గున కర్తవ్యం గుర్తుకువచ్చింది. తలుపు తట్తకుండానే హడావిడిగా డ్యాన్స్ తరగతి తలుపు తెరిచాను. డ్యాన్స్ టీచర్ నికోల్ చెప్పేది ఆపి విస్మయంతో చూసింది.
"మరో గంటలో కర్ఫ్యూ. అందరూ ఇంటికి వెళ్లాలని పోలీసు ప్రకటిస్తున్నారు" గాభరాగా చెప్పాను.
క్లాసులో అందరూ నమ్మలేనట్లుగా చూసారు. నికోల్ కూడా ఆశ్చర్యంతో ఏదో అడగబోయేంతలో ఆ తల్లి గాభరాగ చెప్పింది "అవును. నిజమే. అందరూ వెంటనే ఎవరింటికి వారు వెళ్ళాలి!"

అందరూ ఇంకా విస్మయం నుండి తేరుకునేలోపే "త్వరగా రా" అంటూ పాపని రెక్కపట్టుకు బయటకి నడిపించుకువెళ్ళాను. అందరికీ తెలిసి ట్రాఫిక్ ఎక్కువకాకముందే బయటపడాలి. ఇల్లు కొద్ది దూరమే కానీ ఈ పరిస్థితిలో ఎంతసేపు అవుతుందో ఎవరు చెప్పగలరు. మిని వ్యాన్ ముందుకి ఉరికించాను. డ్రైవ్ వే నుండి రోడు మీదకు వస్తూ చుట్టూ పరికించాను. చుట్టుప్రక్కల షాపులలో నుండి అందరూ తమతమ వాహనాల దగ్గరికి పరుగులు తీస్తున్నారు. అప్పుడే రోడ్డు మీదికి మామూలుకంటే ఎక్కువ ట్రాఫిక్ వచ్చేసింది. ఎక్కువ ఖాళీ లేకపోయినా వ్యాన్ ని రోడ్డు మీదికి ఉరికించాను. వెనుక నుంచి వస్తున్నవాడు బోయ్ మని హార్న్ కొట్టాడు. ఈ స్థితిలో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? నిర్లక్ష్యంగా సాగిపోయాను.
"ఏంటి డాడీ. ఎందుకు ఇంటికి వెళ్లాలి?" పాప ప్రశ్న.
"ఏమోనమ్మా. పోలీసులు వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పారు"
"ఎందుకు పోలీసులు అలా చెప్పారు?"
"తెలియదు. ఇంటికి వెళ్ళాక చూద్దాం టివిలో. కాసేపు మాట్లాడకు" ట్రాఫిక్ మీద శ్రద్ధ పెడుతూ అన్నాను. అషనంగా వున్నందుకేమో ట్రాఫిక్ స్లొగా వెళుతున్నట్లు అనిపిస్తోంది.
ఇంటర్ సెక్షన్లో పోలీసు వుండి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నాడు - ట్రాఫిక్ సిగ్నళ్ళు వున్నాకూడా.
దాదాపు పది ఏళ్ళుగా యు ఎస్ లో వుంటున్న ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. కర్ఫ్యూ దేశమంతా ప్రకటిస్తున్నారా? రేడియో గుర్తుకువచ్చింది. షికాగో లోకల్ 780 ఏ ఎం. వ్యాపార ప్రకటనలు! ఇప్పుడు కూడా వీరికి వ్యాపారం కావాల్సి వచ్చిందా!

ప్రకటన అయిపోయింది. దేశ ఆర్ధిక స్థితి గురించి ఏదో చర్చ! అదేంటి? ఈ కర్ఫ్యూ సంగతి చెప్పడం లేదేంటి? ఈ వార్త ఇంకా రేడియో వారికి అందలేదా లేక ఇంతకుముందే చెప్పారా? చెప్పినా కూడా పదే పదే ఆ విషయం కవర్ చేయాలి కదా.

మా ఇంటికి వెళ్ళే హిల్ వే వీధిలోకి వచ్చాము. ట్రాఫిక్ ఎక్కువగాలేకపోవడముతో కారుని ఒక్క ఉదుటున ఉరికించి పారింగ్ లాటులో హడావిడిగా ఆపివేసాను.
స్లో డాడీ అంటోంది పాప.
"సరే. ముందు నువ్వు దిగు"
లాక్కెళ్ళినట్లే పాపని తీసుకొని తలుపు తెరచి ఇంటిలోకి వెళ్ళాను. హడావిడిగా లోపలికి వస్తుండటం చూసి తలేత్తింది మా ఆవిడ.
"విన్నావా? బయట చెబుతున్నది?"
తల ఎగిరేసింది
"ఆ హెడ్ఫోన్స్ తీసి కాస్త పక్కకు పెట్టు" చిరాగ్గా అరిచాను.
గబుక్కున తీసి ఏంటని అడిగింది.
"గంటలో కర్ఫ్యూనట. అందరినీ ఇళ్ళకు వెళ్ళమని పోలీసుల ప్రకటన. వినలేదా?"
"కర్యూ?"
"అవును. కర్ఫ్యూనే"
"కర్ఫ్యూ!"
"నేను సరిగ్గానే చెబుతున్నాను కానీ న్యూస్ పెట్టు"


"రణిల్" అంటూ వాడి గది తలుపు తెరిచాను. లేడు. గది బయటికి వచ్చి "రణిల్" అని అరిచాను.
"లేడు" అంది మా ఆవిడ మెల్లగా.
"అప్పటినుండీ అరుస్తుంటే చెప్పవేం" మళ్ళీ అరిచాను. "ఎక్కడికి వెళ్లాడు?"
"ఫ్రెండ్ ఇంటికి"
"ఏ ఫ్రెండ్?"
"మైకేలో, జోర్దానో"
"సరిగ్గా చెప్పు" విసుగ్గా అన్నాను
"మైక్ అనుకుంటా. ఆ. అవును మైక్" ఏదో కాగితం చూసి చెప్పింది.
"సరే. వాడిని తీసుకురావడానికి వెళుతున్నా. ఈలొగా ఫోన్ చేసి విషయం చెప్పు వాడికి"
"అలాగే. వచ్చేటప్పుడు పాలు, పెరుగూ, పళ్ళూ పట్టుకురా"
"అంత సమయం లెదు" విసురుగా బయటకి నడిచాను.
"కర్ఫ్యూ ఎన్నిరోజులుంటుందో ఏమో"
"కుదరదు. అన్నీ మూతబడి వుంటయి. అరగంటలొ వచ్చేయాలి నేను" అంటూ కార్ దగ్గరికి నడిచాను. అరగంటలో రాలేకపోతే? వెనక్కి తిరిగి చెప్పాను "జాగ్రత్త. బయటకు రాకండి. న్యూస్ చూడు"
కార్ స్టార్ట్ చేసూ రోడ్డు మీదికి చూసాను. రద్దీగా వుంది. ఆ ట్రాఫికులో అరగంటలో వెనక్కి రాగలనా! రాలేకపోతే? అలా ఊహించడానికే నచ్చలేదు. వ్యానుని ముందుకు ఉరికించాను.
(ఇంకా వుంది )

శుక్రవారం 13 మార్చి 2009

నాకు నచ్చని జూనియర్

కొన్నేళ్ళ క్రితం సంగతి. అప్పుడు కెనడాలో వుంటుండేవారం. మా స్నేహితులు (కెనడాలో - టొరొంటోలో) ఒక షూటింగుకి వెళ్ళి వచ్చి ఆ కబుర్లు చెప్పారు. ఆ చిత్ర దర్శకుడొ, నిర్మాతొ లేక మరెవరో కాస్త తెలిసినవారు అవడం చేత ఆ తెలుగు సినిమా షూటింగ్ దగ్గరినుండి చూడగలిగారు. అది జూనియర్ ఎన్ టి ఆర్ సినిమా. పేరు గుర్తుకులేదు. అప్పట్లో అతను పెద్ద ఫేమస్ కాదు.

షూటింగ్ చూస్తున్న మా స్నేహితులను జూనియర్ చూసి "ఎందుకొస్తార్రా వీళ్ళంతా" అని విర్రవీగుతూ తన ప్రక్కన వున్నవారితో అన్నాడట! అప్పటినుండి అతనంటే సదభిప్రాయం పోయింది. నటన కొన్ని సినిమాల్లొ బావున్నా అతని వ్యవహార శైలి ఎప్పుడూ నచ్చదు.

ఇప్పుడేమో ఈనాడు పత్రిక అతనిని కాబోయే ముఖ్యమంత్రి లెవల్లో ఆకేశానికి ఎత్తేస్తూవుంటే మింగుడు పడకుండా వుంది. మిగతావారందరి కంటే కూడా అతనినే ఫోకస్ చేయడం వెనుక ఈనాడు వ్యూహం ఏమిటో? చంద్రబాబు నాయుడిమీద ఆశలు పోయినట్లున్నాయి ఈనాడుకి - జూనియర్నే బాగా ప్రోజెక్ట్ చేస్తోంది!

ఎనీ వే - ఇందుకయినా కూడా టి డి పి ఓడాలని నేను కోరుకుంటున్నాను. నాకు అక్కడ వోటు లేదు కానీ వుంటే మాత్రం చిరంజీవికే నా వోటు. వున్న ముఖ్యమయిన మూడు పార్టీలలో అదే బెటర్. చిరంజీవికి ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం.

అన్నట్లు గ్రేట్ ఆంధ్రాలో లోకేశ్ నాయుడి మీద ఒక చక్కటి వ్యాసం వచ్చింది. చదవండి:

http://telugu.greatandhra.com/cinema/8-03-2009/nuv_13.php

తదుపరి బాండ్ గర్ల్ ఫ్రీదా పింటో?

ప్చ్! నాకు అయితే నచ్చలేదు ఈ వార్త. నా దృష్టిలో ఫ్రీదా బాగానే వుంటుంది కానీ మరీ గొప్ప అందగత్తె కాదు. 'స్లం డాగ్' దర్శకుడు డానీ బోయల్ నే బాండ్ చిత్రానికి దర్శకుడు అవచ్చుననే వార్తతో పాటు ఈ వార్త వస్తోంది. బాండ్ గర్ల్ గా ఐశ్వర్య కంటే బాగా ఎవరు సరిపోతారు చెప్పండి? ఐశ్వర్యను ఆ రోల్ లో చూసే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు :(

బాండ్ గర్ల్ అయినంత మాత్రాన అందరూ అందంగా వుండరు లెండి. ఒక చిత్రంలో చైనీస్ హీరోయిన్ వుంది కానీ ఏం బావుందీ? అలాగే కొన్ని ఇంగ్లిష్ సినిమాలలో హీరోయిన్లను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది - అందమూ వుండదు - నటనా వుండదు. వారికంటే రోడ్డుమీద కనిపించే అమ్మాయిలు వందరెట్లు బావుంటారు.

సరే. ఏం చేస్తాం. ఎవరో ఒకరు భారత దేశం నుండి బాండ్ కాకపోయినా బాండ్ గర్ల్ అయినా సంతోషమే కదా. ఏమయినా పింటోకు బాగానే వున్నట్లుంది...దశ!

నాకు రీసెషన్ బానే వుందే :)

- కెనడాలో వున్న మా ఇంటిని ఈ ఆర్ధిక మాంద్యం కంటే ముందే వదిలించుకున్నాను కాబట్టి ఆ బెంగ లేదు.

- మా కంపెనీలో మనకు తెలిసింది ఎవరికీ తెలియదు కాబట్టి సాధారణంగా ఉద్యోగం పోదు. అంతకూ పోతే కెనడాకి వెళ్ళి వెల్ఫేర్ మీదనయినా బ్రతికేసెయొచ్చు.

- మాంద్యం వల్ల ఎలాగూ ఇంతకుమించి ఎదగలేము కాబట్టి ఏదో ఇంకా ఎదగాలనే తాపత్రయం, శ్రమపడాల్సిన అవసరం లేదు. ఏదో ఇలా బ్లాగేస్తూ విశ్రాంతిగా వుంటున్నాను.

- మాంద్యం వుంది కాబట్టి కుటుంబంలో గొంతెమ్మ కోర్కెలు లేవు. పొరపాటున ఎవరయినా ఏదయినా పెద్దవి అడిగితే మాద్యం బూచి చూపెడుతున్నాను. ఆ రకంగా ప్రాణానికి హాయిగా వుంది.

- ఏ రకమయిన అప్పులు (క్రెడిట్ కార్డులతో సహా), వాయిదాలు లేవు కాబట్టి ఆ రకంగానూ హాయిగా వుంది.

- ప్రపంచమంతా పరిస్థితి బావోలేదు కాబట్టి నలుగురితో పాటు నారాయణ - పదిమందితో పాటు గోవిందా లాగా మనకూ ఇప్పుడు పెద్ద పెద్ద కోర్కెలు ఏమీ లేవు. ఉద్యోగం ఊడిపోకుండా వుండటమే గొప్ప ఈ పరిస్థితుల్లో.

ఇలా ప్రస్తుతానికి కాళ్ళు బార్లా చాపుకొని హాయిగా వుంటున్నాను కాబట్టి మాంద్యం ఎక్కడ తగ్గుతుందో అని అప్పుడప్పుడు కాస్త బెంగగా వుంటోంది :(

కాస్కేడింగ్ ఎఫెక్ట్స్

లంచ్ బాక్సు లోకి చపాతీలు కానీ, అన్నం కానీ పెట్టలేదు అని నిన్న ఉదయం చెప్పింది మా ఆవిడ. చపాతీలు బూజు పట్టాయిట - అన్నం లేదుట. హుం. ఈ రోజు వృధా అనుకున్నాను నిన్న.

- పదకొండున్నరకి జిమ్ము చేయాలంటే పదింటికి అల్పాహారం తినాలి - రోజూ చపాతీ తినేవాడిని. కుదరలేదు. అల్పాహారం క్యాన్సిల్.

- రోజూ పదకొండున్నరకి జిమ్ముకెళ్ళే వాడినల్లా నిన్న ఆ సమయానికి బాగా ఆకలయి మా ఆఫీసు క్యాఫిటేరియాకి వెళ్ళాను. కేవలం 6$ లకే ఎన్నో రకాల అహార పదార్ధాలు ఎన్నో తినవచ్చు. ఎంచక్కా ఫుల్లుగా లాగించా. భుక్తాయాసం - జిం క్యాన్సిల్.

- రోజూ సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి వెళ్ళే ముందు మరో చపాతీ స్నాక్ గా తినేవాడిని. అది కుదరలేదు కదా. ఇంటికి నకనకలాడుకుంటూ వెళ్ళి ఫుల్లుగా ఫుడ్డు లాగించాను. భుక్తాయాసం. అలసట. ప్రజాసేవ (నా వెబ్ సైట్ల నిర్వహణ) క్యాన్సిల్!

- ఈ రోజు డైటింగ్ సరిగ్గా చేయలేదనే విచారమోనేమో తలనొప్పి. ఇంకేముంది - తరువాత నిద్ర. ఎంచక్కా ముసుగుదన్ని పడుకున్నాను. మా పాప డ్యాన్స్ క్లాస్ క్యాన్సిల్.

పునాది సరిగ్గాలేకపోతే ఇల్లు ఎలా బావుంటుంది? ఇదీ అంతే. ప్రతి రోజుకీ కూడా పునాది గట్టిగా వుండాలి అనిపించింది. గత మూడు రోజులుగా జిమ్ములో కరిగించిన క్యాలరీల కన్నా ఎక్కువే తిన్నా మా ఆఫీసు క్యాఫిటేరియాలో అగుడుబడినట్లు ఒక్క సారికే - 6$ కి న్యాయం చేయాలని! అందుకని నా జీవితంలో ఒక రోజే క్యాన్సిల్ అయ్యింది.

నచ్చావు బావా!

అందరిలాగే నాకూ కొన్ని ప్రేమ కథలు వున్నాయి. డిగ్రీ వెలగబేడుతున్న రోజుల్లో మా పక్కింటి అమ్మాయి నా డైరీ తీసుకొని అందులో ఇలా వ్రాసింది: "బావా నువ్వు నాకు నచ్చావు, నా కలల రాకుమారుడివి నీవే. ఐ లవ్ యూ". బావుంది. సహజంగానే నేను సంతోషించాను. ఆ అమ్మాయి చదివేది 9వ తరగతి. బంధువులేమీ కారుగానీ వరుస అయితే వుంది.

ఆ తరువాత ఆ అమ్మాయిని అడిగాను. "నాలో ఏం చూసి ప్రేమించావు?"
"నీ మంచి తనాన్ని చూసి"
"ఛ! నేను అంత మంచోడిని ఏమీ కాదు"
"లేదు. నువ్వు మంచాడివే"
"నిజంగా! హు! సరే. ఓ పనిచేయి. ఒక ఆరు నెలలు నా మంచితనం ఎంత మంచిదో గమనించు. ఆ తరువాత కూడా నేను నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం"

ఆ తరువాత రెండు నెలలకి వారి కుటుంబం ఖమ్మం మారింది. మరో ఆరు సంవత్సరాలదాకా ఆ అమ్మాయి కనపడలేదు నాకు. అప్పటికి మరో అమ్మాయి ప్రేమలో పీకల్దాకా నిండివున్నాను.

గురువారం 12 మార్చి 2009

ఇదివరకు - ఇప్పుడు - ఇకముందు

ఇదివరకు:కాస్త ఆహార నియంత్రణ చేయాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజనం తరువాత పెద్దగా ఏమీ తినకుండా ఇంటికి నకనకలాడుకుంటూ వచ్చి తలుపు తెరుస్తూనే 'అన్నమో రామచంద్రా' అని అరిచేవాడిని. త్వరత్వరగా ఫుల్లుగా లాగించిన తరువాత భుక్తాయాసంతో విశ్రాంతి తీసుకునేవాడిని. మితంగానే తినాలని వుంటుంది కానీ బాగా ఆకలి మీద వుంది సాధ్యం అయేది కాదు. మనకు తింటే ఆయాసం తినకపోతే నీరసం కదా - ఆయాసంతో వేరే పనులేమీ చేయాలనిపించేది కాదు - మన్ను తిన్నపాములా మత్తుగా, నీరసంగా అనిపించేది. కొన్నిసార్లు అలా పెందలకడనే పడుకునేవాడిని.

ఇప్పుడు:డైటింగ్ అంటే ఆకలితో నకనకలాడుతుండటం కాదు అని హెల్త్ మీటప్ లకి వెళ్ళి, జాలం లో చూసి నేర్చుకున్నాను. ప్రతి రెండు మూడు గంటలకు కడుపులో మితంగా కొంత పడేస్తూ వుంటే మెటబాలిజం బావుంటుందని, శక్తివంతంగా, ఉత్సాహంగా వుంటామని అర్ధమయ్యింది. అందుకే సాయంత్రం ఆఫీసునుండి ఇంటికివెళ్ళే ముందు ఒక చిన్న రవుండ్ (మందు కాదు - అల్పాహారం) వేస్తున్నాను. ఇదివరకటిలా ఇంటికి ఆకలితో వెళ్లడం లేదు. వస్త్తూనే అన్నమో రాంచంద్రా అనే బదులుగా 'వీలయితే కప్పు కాఫీ ఇంకా వీలయితే నాలుగు కబుర్లు' అని మా ఆవిడని అడుగుతున్నాను. కొద్దిసేపు అయాక మితంగా పెరుగు అన్నం తిని వుండగలుగుతున్నాను. మన్ను తిన్న పాములా కాక ఉత్సాహంగా వుంటున్నాను. రాత్రి 9 గంటల వరకు కుటుంబంతో గడిపి ఆ తరువాత ఓ గంట ప్రజా సేవ (?!) చేసి పదిన్నరకి పడుకోవడం నా దిన చర్యలో కొంత భాగం. నేను చేసే ప్రజా సేవ ఏంటంటే నా వెబ్ సైట్లు కొన్ని వున్నాయి కదా వాటిని నిర్వహించడం!

ఇకముందు:హెల్త్ మీటప్ లలో నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే - ఉదయం అల్పాహారం ప్రాధాన్యత. బొజ్జ తగ్గించడం కోసం -ఆహారం తగ్గించడం కోసం ఉదయం ఓ కప్పు పాలు తాగి - ఆఫీసుకు వచ్చాక మరో కప్పు టీ తాగి మధ్యాహ్నం వరకు అలాగే వుంటూ వస్తున్నాను. కానీ అది పొరపాటు విధానమట. ఉదయమే మెటబాలిజానికి పని కల్పించాలి - బ్రేకఫాస్ట్ తినాలిట. ఉదయం వేళలో మెటబాలిజం బాగా అవుతుందట. ఇలా ఉదయమే కొంత పొట్టలో పడేయడం వల్ల మిగతా రోజంగా మరీ ఎక్కువ ఆకలి కాదట. ప్రస్తుతం ఆఫీసుకి వచ్చాక ఏ పది గంటల తరువాతనో అల్పాహారం తీసుకుంటున్నాను కానీ ఆ మార్పు సరిపోదు. ఉదయమే పాలతో పాటు అల్పాహారం తీసుకోవాల్సివుంది. ఆ మార్పు త్వరలోనే చేస్తాను.

బుధవారం 11 మార్చి 2009

ఆవిరిగది అనుభవాలు

కెనడాకి వచ్చాక మా అపార్ట్మెంట్ బ్యుల్డింగులో నాకు మరీ నచ్చినదేమంటే సానా గది. ఎంచక్కా అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తుండటం బావుండేది. వెచ్చటి గదిలో చెమట్లు కక్కుతూ కూర్చోవడం హాయిగా అనిపించేది. అది కాకుండా సానా చేయడం ద్వారా ఇంకేం సాధిస్తున్నానో అర్ధం కాక మా బ్యుల్డింగ్ సూపర్( వైజర్) ని అడిగాను. సానా వల్ల చెమట బాగా వచ్చి శరీరంలోని టాక్సిన్స్ బయటకు వచ్చి ఆరోగ్యం మెరుగవుతుంది అని చెప్పింది. ఒత్తిడి తగ్గి మనసు ఆహ్లాదంగా అవుతుందని కూడా తెలుసుకున్నాను. అస్త్మా లాంటి శ్వాసకోశ వ్యాధులు వున్నవారికి చాలా రెలీఫ్ నిస్తుందని కూడా తెలుసుకున్నాను. చర్మం కాంతులీనుతుంది - స్త్రీలకు ఇది ముఖ్య ప్రయోజనం.

సులభంగా ఇన్ని ప్రయోజనాలు రావడం చక్కటి విషయమే కదా. మనం చేయాల్సిందల్లా బట్టలిప్పి 20 నిమిషాలకు మించకుండా ఆ గదిలో కూర్చొని రావడం. వీజీ పనే కదా. ఆ తరువాత స్నానం చేస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. జిం చేసాక సానా చేసి అటుపై స్నానం చెస్తుంటే ఆ మజానే వేరు. జిం చేసి అలసిపోయిన కండరాలకు సానా రెలీఫ్ ని ఇస్తుంది.

ఆ తరువాత జిం క్లబ్ లొ చేరి అక్కడ కూడా సానా చేస్తుండేవాడిని. అయితే ఒక చిన్న ఇబ్బంది ఎదురయ్యేది. ఆడవారికి మగవారికి వేరేగా సానా గదులు వుంటాయి. అందరికీ కలిపి ఒకే గది వుంటే బావుండేదేమో అని ఎన్నో సార్లు అనుకుంటూవుంటాను. ఇక మగ సానా గదిలో మిగతా మగ వారంతా దిగంబరంగా వుండేవారు. నాకేమో అలా వుందటం సిగ్గుగా అనిపించి చెడ్డీతో వుండేవాడిని. అది మిగతావారికి చిత్రంగా అనిపించేది. చిత్రమేకాదు మరో రకంగా కూడా మిగతావారికి అనిపించేది అని తరువాత అర్ధం అయ్యింది.

ఒక నాడు ఒక నల్లవాడు అడగనే అడిగాడు - సానా గదిలో చెడ్డీ ఎందుకువేసుకుంటున్నావు అని. అది మా సంస్కృతి అని డాంబికాలు పలికాను. మిగతావారు అందరూ దిగంబరంగా వుందగా నేను డ్రాయర్ తో వుండటంతో సెక్సీగ అనిపించినట్లుంది అతగాడు ఎవరూలేనిది చూసి అడ్వాన్స్ అవబోయాడు. అక్కడే వుంటే ఏదో అఘాయిత్యం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి బ్రతుకు జీవుడా అని ఆ గదిలోంచి హడావిడిగా బయటపడ్డాను.

ఆ తరువాత కొంతకాలం ఆ నల్లవాడికి కనిపించకుండా, కనిపించినా చూడకుండా తప్పించుకు తిరిగాను. కొంతకాలానికి కేవలం సానా గదిలో కూర్చోవడం కోసం జిం లో చేరి డబ్బులు ఎందుకు వృధా అని మానివేసాను.

ఆ తరువాత మేము నయాగరా ఫాల్స్ కి మారాము. ఊర్కో బుద్ధికాక అక్కడ మళ్లీ జిం లో చేరాను. అక్కడ మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది - కాకపోతే ఈ సారి తెల్లవాడితో. నాకో పడవ వుంది - హాయిగా అందులో విహరిద్దాం రా అనేవాడు. ఒరే బాబూ నన్ను వదిలేయిరా నీకు పుణ్యం వుంటుంది అని తప్పించుకు తిరిగేవాడిని. కొంతకాలానికి మళ్ళీ జిం మానివేసాను - లేజీ అయిన నాకు బరువులెత్తడం వీజీ కాదని అర్ధమయ్యి.

ఇప్పుడు యు ఎస్ లో షికాగోలో వుంటున్నాము. ఇక్కడ జిం లో సానా గది , స్టీం గది రెండూ వున్నాయి. సానా (డ్రై హీట్) కంటే స్టీం (వెట్ హీట్) నే నాకు నచ్చుతుంది. ఆవిరి పొగలు కక్కే గదిలో గడపడం హాయిగా అనిపిస్తోంది. మా బాస్ ని అడిగి భోజనం సమయం పెంచి ఆ వేళ వెలుతున్నాను. అరగంట వ్యాయామం - పావుగంట ఆవిరి. ఇదేదో ప్రస్తుతానికి బాగానేవుంది.

ఇక్కడ ఆవిరి గదిలోనూ, సానా లోనూ పూర్తిగా దిగంబరంగా వుండటం లేదు - అందరూ తువ్వాళ్ళు కట్టుకొని వుంటున్నారు - అందువల్ల ఇక్కడ నాకు ఇదివరకటిలాంటి సమస్యలు ఎదురుపడకపోవచ్చు.


మంగళవారం 10 మార్చి 2009

నా జిం కబుర్లు

ఇప్పుడే జిం నుండి వచ్చాను. బయట సన్నగా వర్షం పడుతోంది. కొద్దిగా చలిగా కూడా వుంది.

జిం లో చేరిన కొత్తలో ఒక ఉచిత సలహా సెషన్ వుంటుందని చెప్పారు. ఆ సమయం రానే వచ్చింది ఒక రోజు. ఆ సలహా సెషన్ ఇచ్చే ఆమె పేరు సింథియా. పేరూ బావుంది - అమ్మాయీ బావుంది. కుశల ప్రశ్నలు అయ్యాక నా పల్స్ చూస్తానంది. చేయి పట్టుకొని చూస్తో వుంది. అందమయిన అమ్మాయి చేయిపట్టుకొని నాడి చూడటం న్యాయమేనా? ఆటోమేటిక్ గా నాడి పెరగదూ. ఇన్నాళ్ళ నుండి చేసిన వెధవపనుల వల్ల సాధించిన తపోశక్తితో ఆ సమయానికి పల్స్ పెరగకుండా చూసుకోగలిగాను కాబట్టి సరిపోయింది.

"ఎన్నాళ్ళనుండి జిం కి వస్తున్నావు?" అని అడిగింది
"మూడు వారాలు"
"క్రమం తప్పకుండా వస్తున్నావా?"
"ఆహా"
"భేష్. ఏం చేస్తుంటావు"
"స్టీం రూములో కూర్చుంటాను"
"అది సరే. ఇంకా ఏం చేస్తుంటావు?"
"ఏవీ చేయను - సమయం లేక"
కళ్ళు విశాలం చేసింది. ఆమె కళ్ళు అందంగా అనిపించాయి. "ఏం ఉద్యోగం చేస్తుంటావు?"
"సాఫ్ట్ వేర్"
"కూర్చొని చేసే వుద్యోగం కదా"
"అవును"
"సరే. ఇంటికెళ్ళి ఏం చేస్తుంటావు?"
"కూర్చుంటాను - సిస్టం ముందట"
"అంటే రోజూ మొత్తం కూర్చోవడం తప్ప ఏవీ చేయవన్నమాట!" కళ్ళు మరింత అందంగా విశాలం చేసి అడిగింది.
"అవును - కాదు. పనులు అన్నీ కూర్చొని చేస్తుంటాను"
"అలా కుదరదు. ఇహనుండి జిమ్ములో కూర్చోకు - ఏదయినా ఏక్టివిటీ చేయి. అంతగా ఆవిరి గదిలొ కూర్చొవాలనిపిస్తే మరోసారి జిం కి వచ్చి కూర్చో. ప్రతి రోజూ ఏ ఏక్టివిటీ లేకుండా వుంటూ జిమ్ములో కూడా ఏక్టివిటీ లేకపోతే నీ ఆరోగ్యం బావుండదు. అర్ధమయ్యింది కదా"
బుద్ధిగా బుర్ర ఊపాను.

మీటప్

ఈ మధ్య నేను చేస్తున్న ఒక మంచి పని ఏమిటంటే మీటప్ సమావేశాలకు వెళుతుండటం. సాంకేతికత పెరిగి నెట్ పెరిగిన తరువాత అందరితో అసలు సంబంధాలు తక్కువ అయి నెట్ స్నేహాలు మాత్రమే ఎక్కువవుతుండటం అసంతృప్తిగా అనిపించేది. దానికి ఈ మీటప్ ల ద్వారా మంచి పరిష్కారం దొరికినట్లయ్యింది. ఆ సమావేశాల ముఖ్యవుద్దేశ్యం ఏమిటంటే ముఖాముఖి కలుసుకోవడం.

www.meetup.com సైటుకి వెళ్ళి లాగిన్ అయ్యి మీకు దగ్గర్లోని మీకు నచ్చిన మీటప్ లో చేరిపోవచ్చును. కావాలంటే మీరూ ఒక మీటప్ మొదలుపెట్టొచ్చు కానీ నెలకి 6 యు ఎస్ $ ల ఫీజ్ వుంటుంది.

మన ఆసక్తులను బట్టి నచ్చిన మీటప్ లో చేరిన తరువాత మనకు తదుపరి సమావేశాలకు మన వీలుని బట్టి వెళ్లవచ్చు. క్రొత్త క్రొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారంతా మనలాంటి ఆసక్తులు వున్నవారే కాబట్టి ఉత్సాహంగా వుంటుంది. అయా విషయాలపై కబుర్లు, చర్చలు నడుస్తుంటాయి. చాలావరకు ఈ సమావేశాలు భోజనవేళకి ఏ రెస్టారెంటులోనో పెట్టేస్తారు. తింటూ ముచ్చట్లు పెట్టుకోవచ్చు.

ఈ మీటప్ లలో ఎన్నో రకాలు వుంటాయి. కొన్ని అవుట్ డోర్ ఏక్టివిటీస్ వి కూడా వుంటాయి. మన ఆసక్తులను పెంపొందించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మనకు తెలిసింది ఇతరులకు చెప్పవచ్చు - తెలియనిది ఇతరుల దగ్గర నేర్చుకోవచ్చు.

నేను ఇప్పటికి కొన్ని సమావేశాలకు వెళ్లాను. అవన్నీ నాకు ఫలవంతంగా అనిపించాయి.

శుక్రవారం 6 మార్చి 2009

(ఆర్ధిక) రీసెషన్ కీ, డిప్రెషన్ కీ తేడా ఇదీ

పక్కనోడి ఉద్యోగం ఊడిపోతే రీసెషన్ - మన ఉద్యోగమే ఊడితే డిప్రెషన్!

ప్రస్తుతం నేనయితే రీసెషన్ లో వున్నాను. ప్రస్తుతానికయితే ఉద్యోగం ఊడేటట్లుగా ఏమీ అనిపించడం లేదు కానీ ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పగలరు. మా కంపెనీలో నాకు తెలిసిన టెక్నాలజీ మరెవరికీ తెలియకపోవడం వల్ల ఉద్యోగ భద్రత వుందనుకుంటున్నాను - కానీ ఇక్కడ ఉద్యోగ భద్రత అనేది మేడి పండు లాంటిదని బాగా తెలుసు....

మిగతాది ఇక్కడ చదవండి:
http://sarath.ning.com/profiles/blogs/2972045:BlogPost:81

బుధవారం 4 మార్చి 2009

తూర్పుకు వెళ్ళే రైలు

బాలచందర్ అనుకుంటా ఈ టైటిల్ తో సినిమా తీసేడు - ఆ సినిమా చూడటం నాకు కుదరలేదు కానీ రైలు చూసినప్పుడల్లా తరచుగా ఆ పేరు గుర్తుకువస్తుంది. చక్కటి భావం ఉన్న పేరు కదా అది.

మా ఇంటి దగ్గరి స్టేషన్ నుండి షికాగో డవుంటవున్ రైలులో ముప్పావు గంట ప్రయాణం. దినపత్రిక చదువుతూ రైలు కోసం ప్రాతహ్ కాలాన్నే వేచి వుండటం చక్కటి అనుభూతినిస్తుంది. మరీ ఎక్కువ చలిలేకుండా మంచు ఝల్లు కురుస్తున్నప్పుడు అలా ఎదురుచూడటం ఇంకా బావుంటుంది. పేపర్ తిరగేస్తూ నాతోటి ప్రయణీకులను ముఖ్యంగా దేశీ వారిని గమనిస్తుంటాను. అందులో ఇద్దరయినా చక్కటి యువతులు వుండి ఆ రోజు ధన్యమయిందా నాకు అన్నట్లుగా మనస్సును రాగరంజితం చేసేస్తూంటారు.

మెట్రా రైలు బోగీలు పాతకాలం బోగీలేకానీ అంబాసడార్ కారులోలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఓ పదినిముషాలు రైలు లోపల కూడా పేపర్ తిరగేసి ఎంచక్కా నిద్రలోకి జారతాను. కనీసం ఓ ఇరవై నిముషాలయినా అలా జోగిన తరువాత మెలకువవస్తుంది. కదులుతున్న రైలు నుండి వెళ్ళిపోతున్న పరిసరాలనూ, పచ్చదనాన్నీ, ప్రకృతినీ తాపీగా చూస్తుండటం బావుంటుంది.

రైలులో గడిపే ఈ సమయం నాది - నా ఒక్కడిదేనూ. ఉద్యోగ సమయం కాదు, ఇంటి సమయం కాదు, పిల్లల కోసం సమయం కాదు. ఏ ఒత్తిళ్ళూ లేని ఒంటరి సమయం ఇది. మన మనస్సులోకి తీరిగ్గా తొంగి చూసుకునే సమయం, ఆత్మ విమర్శ చేసుకొనే సమయం, ఏ ఆదుర్దా లేని సమయం, తాపీగా మధుర స్మృతులు నెమరువేసుకొనే సమయం. వెళ్ళేటప్పుడు దాదాపుగా ఒక గంట, వచ్చేటప్పుడు దాదాపుగా ఒక గంట. మనకంటూ ప్రత్యేకంగా కొంత సమయం వుండటం మంచిదంటారు - ఇందుకే - చక్కటి ఆలోచనలు, నిర్ణయాలు వస్తాయప్పుడే.

అందుకే నాకు తూర్పుకి వెళ్ళే రైలు అంటే ఎంతో ఇష్టం. మీకూ ఇష్టమయితే నాతో పాటుగా ఎక్కెయ్యండి మరి! ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా ఏకాంతాన్ని నానుండి దూరం చేయడం మీకు ఇష్టం లేదా - అయితే దిగిపొండి. అలా అయినా సరే ఇలా అయినా సరే - మీకు ధన్యవాదములు.