అవార్డ్ వాలే భాగో భాగో


(Edited)


ఈ మధ్య తమకు తాము క్లాసు అనుకొనే జనాలకు మాస్ అంటే చాలా లోకువ అయిపోయింది. బ్లాగ్లోకంలో ఎక్కడ చూసినా మా లాంటి మాసోళ్ళ మీద చులకనగా మాట్లాడేస్తున్నారు.  వాళ్లకు నచ్చినట్లుగా రిక్షా పుల్లర్లూ, ఆటో ద్రైవర్లు  మరియు నా బాపతు లాంటి మాస్ జనాలందరూ కూడా అవార్డ్ సినిమాలే చూడాలంట. కాస్తంత వినోదం కోసం ఐటెం సాంగులు చూస్తే అది సెక్స్ కి మొఖం వాచి చూసినట్లట. ఇదివరకటి రోజులే బావుండేవేమో. ఎంచక్కా ఊర్లల్లో భోగం మేళాల డ్యాన్సులూ, రికార్డింగ్ డ్యాన్సులూ, మధ్యలో కేతిగాడి కవ్వింపులూ ఏ మేధావులూ కనుచూపుమేరలో లేకుండా హాయిగా, మనస్ఫూర్తిగా పెద్దలూ, పిన్నలూ ఆనందించేవారు.  

ఇప్పుడవన్నీ పోయినాయి పోనీ కనీసం సినిమాల్లో కూడా అలాంటి ఐటెం సాంగులు చూడొద్దంటున్నారు (Edited). ఇప్పటికీ తెలుగు ఛానళ్ళలో ఒద్దున అంతా భక్తి కార్యక్రమాలతొ చావగొడుతున్నారు. రోజంతా అవే వుండాలనీ లేదా రోజంతా అవార్డ్ సినిమాలూ, అవార్డ్ గీతాలు మాత్రమే వుండాలని (edited) అభిప్రాయమేమో. 'రింగా రింగా' . 'ఆకలెస్తే అన్నం పెడతా' లాంటి మాస్ పాటలని, సినిమాలని నిషేధించి కేవలం క్లాస్ సినిమాలనే ప్రజలు చూసేట్టుగా చేయాలనీ దాదాపుగా తీర్మానించేస్తారులాగుంది. మన అదృష్టం బావుండి వీళ్ళ చేతిలో సినిమా రంగం లేదు గానీ వుంటే ఓ ఫత్వా అర్జంటుగా పాస్ చేద్దురు వీళ్ళంతా. 

మాస్ కూ మనస్సు వుంటుంది, దానికి వినోదం కావాలి అని కాలం గారు ఎన్నడో చెప్పారు. ఈ కాలం ఎవ్వర్ అని మధ్యలో కుశంకలు తీయకండి. నేను ఇటు క్లాసు, అటు మాసు. నేను సమైక్యవాదిని. నా మనో భావాలు అర్జంటుగా గాయపడ్డాయి. నాలో ఆత్మన్యూనత ఎక్కువయ్యింది. నాకు అర్జంటుగా ఓదార్పు, సానుభూతి కావాలి. ప్లీజ్.    

ఈ బ్లాగ్లోకంలో అందరూ తెగ చదివినవారే ఎక్కువకావడంతో మేధావులతో పాటు మేతావులు కూడా చాలా మందే వుంటుండటంతో మాస్ కి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. అందుకే అఖిలాంధ్ర మాస్ జనాల పక్షాన నేను ఒక సంస్థను స్థాపించి అధ్యక్షుల వారిగా ప్రకటించేసుకుంటున్నాను. దానిపేరు మాస్ ప్రజా హక్కుల సమితి. మాస్ అన్నా ప్రజలే కదా మళ్ళీ ఆ పేరులో ప్రజలెందుకు అని చొప్పదంటు ప్రశ్నలేయకండి. ఏ పేరులోనయినా ప్రజా అనేది వుంటేనే ప్రజలకి కిక్కు, కక్కు వస్తుంది. అనగా భావోద్వేగాలు బాగా పుడతాయన్నమాట. 

మాలాంటి మాస్ జనాల మీద అవాకులూ, చవాకులూ వ్రాస్తే బ్లాగుల్లో టపాలు కత్తిరిస్తాం (నాలుకలు కత్తిరిస్తాం అన్న టైపులో చదువుకోవాలని మనవి). ఏంటో ఇంకా నాకు కే సీ ఆర్ స్టైల్ బూతులు అలవాటు పడలేదు. 'తెలంగాణా బూతులు ఫర్ ఇడియట్స్' అన్న పుస్తకం చదివి ప్రాక్టీసు చేసి త్వరలో మీమీదకి వదులుతా. 

మా MPHS (మాస్ ప్రజా హక్కుల సమితి) తరఫున కొన్ని ఫత్వాలని జారీ చేస్తున్నాను:
- అవార్డ్ సినిమాలను నిషేధించాలి ( అంటే నాకు వ్యక్తిగతంగా అవార్డ్ సినిమాలు, క్లాస్ సినిమాలు అంటే ఇష్టం లేదని కాదు గానీ చంద్రబాబు లాగా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాను. అలా వుండకపోతే నేనూ అవార్డువాదినని మాసువాదులు నా తోకలు కత్తిరిచ్చేస్తారు - అధ్యక్షులవారిని అని కూడా చూడకుండా. ష్! ) 
- ప్రొద్దుటే భక్తి కార్యక్రమాలకు బదులుగా మాస్ సినిమాలు ప్రసారం చేయాలి. లేకపోతే కేబుల్ వైర్లు కట్.
- మాస్ కు అంతటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి. మరీ క్లాస్ వాళ్ళని పాకీస్థాన్ పంపించివేయాలి.
- గట్రా, గట్రా, గట్రా.... 

అవెటారం 'అనుభవించు' రాజా!


నేను నాస్తికుడినే కానీ జీవితంలో మహా బాగా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆదేవదేవుని వేడుకుంటూవుంటాను. అలాంటి మహా కష్టం ఇప్పుడొకటి వచ్చి పడింది. వచ్చే ఆదివారం అవెటార్ (అవతార్ అందామంటే మా చిన్న పాప ఒప్పుకోవడం లేదు) సినిమా చూడాలని డెసైడ్ చేసాం. IMAX 3D కి అడ్వాన్సుడ్ టికెట్లు కూడా బుక్ చేసాం. ఇంకేదిరా భై హాయిగా చూడుర భై అంటున్నారు కదా భాయ్ సాబ్. అక్కడె వచ్చింది చిక్కు. ఎలా చూడాలి ఈ సినిమాను? చూడాలా అనుభవించాలా? చూస్తే రంధ్రాన్వేషణ చేస్తూ విమర్శకుడిలా చూడాలా లేక సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూస్తూ కళ్ళు తేలవేయాలా? మెసేజీ కోసం చూడాలా మాస్ సినిమా చూసినట్లు చూడాలా? సినిమా చూసిన ఒక్కొక్కరు తమ తమ అమూల్యమయిన అభిప్రాయాలను సెలవిచ్చారు. ఇప్పుడు నేను ఏ అభిప్రాయంతో చూడాలి? కొంతమంది అయితే ఎంచక్కా కథ అంతా చెప్పెసారు. కొంతమంది కథే లేదు పొమ్మన్నారు. కొంతమంది మెసేజ్ లేదన్నారు, కొంతమంది ఏలియన్స్ అంటారు కానీ అవి కాదన్నారు. కొంతమంది  హీరోవి తారక రత్న హావభావాలు అన్నారు. అసలెవరూ హీరోయిన్ను గురించి మాట్లాడలా. అసలు ఈరోయిన్ను వుందాలేదా? ఈరోయిన్ను లేకపోతే ఇంకా సినిమా ఎందుకు చూడటం?


కొంతమంది ఆ ఏముంది మన పురాణాలూ, మన నీలి కిష్టుడే గదో అన్నారు. మన తోకల కోతులే - వానర సైన్యం అన్నారు. ఇంకా ఎవరెవరో చిత్రాన్ని అనుభవించకుండా మేధావితనం మహా బాగుగా పెట్టి మరీ 'చూసి' రంధ్రాన్వేషణ బాగానే చేసారు. ఇన్ని అభిప్రాయాలు చదివి ఇన్ని కుశంకలతో సినిమాకి వెళ్ళి నా మొఖం ఇంకా నేను అనుభవించేదేమిటి? సున్నా నేమో. సినిమా చూడటం అనే కళ ఏమాత్రం తెలియని వారు సినిమాలు చూసి సినిమాలోని లోపాలు మహా గొప్పగా విశదీకరించారు. ఇవన్నీ మనస్సులోకి రాకుండా మానసిక నిగ్రహంతో ఈ సినిమా చూడటం ఎలా గబ్బా. ఇంకో చిన్న ఇబ్బందీ వుంది. ఎలాంటి రివ్యూలూ, అభిప్రాయాలూ చూడని, చదవని నా భార్య సినిమాను 'అనుభవిస్తుంటే' నాకు మాత్రం సినిమా 'చూడాల్సిన' అగత్యం పడుతుందేమోనని నాకు యమ కుళ్ళుగా వుంది. నోరు తెరచుకొని మా ఆవిడగారు సినిమా చూస్తుంటే నోరు మూసుకొని సినిమాను చూడాల్సిన ఖర్మ పట్టదు కదా అనేది నా బెంగ.

అందుకే అదేదో సినిమాలో భోజనానికి ముందు వెంకటేష్ దైవ ప్రార్ధన చేసినట్లు ఈ నా ఘోర కష్టాన్ని తీర్చవలసిందిగా సినిమా ప్రారంభానికి ముందు ఆ దేవదేవుని ప్రార్ధించదలచుకున్నాను. నా ప్రార్ధన డ్రాఫ్ట్ ఇదీ. దయచేసి ఈ ప్రార్ధనకు మెరుగులు దిద్దండి. ఈ సినిమాను నేను అనుభవించే మాహాద్భాగ్యం నాకు కలిగేలా మీరూ తోడ్పడండి. మనకు ఇంకా ఈ ఆదివారం మధ్యాహ్నం  దాకా సమయం వుంది.

"ప్రభూ, సినిమా చూసేటప్పుడు కేవలం మంచి విషయాల మీదే  నా మనస్సు నిలిచేలా చూడు ప్రభూ. మేతావితనం కానీ, మేధావితనం గానీ సినిమా చూసేంత సేపూ నా మనస్సులోకి దరిచేరనీయకు స్వామీ. రంధ్రాన్వేషణ దురద నా మనస్సులోకి రానీయకుండా చూసే బాధ్యత మీదే ప్రభువా. అవార్డ్ సినిమలా కాకుండా మామూలు సినిమా అంచానాతో వెళుతూ సగటు ప్రేక్షకునిలా అబ్బురపడే అదృష్టం కలగనీయి స్వామీ. 'రంధ్రం ఎక్కడున్నదీ' అని నేను వెతుక్కోకుండా 'హృదయం ఎక్కడున్నదీ' అని సినిమాలో నా హృదయం పెట్టి చూడనీయి స్వామీ. తొక్కలో లాజిక్కులు నా మనస్సు దరిదాపులలొకి కూడా రాకుండా చూసి నన్ను సినిమాను అనుభవించనీ దేవా.  మా   ఆవిడ కంటే, పిల్లల కంటే చక్కగా ఈ సినిమాను చూసి అబ్బురపడే భాగ్యం కలిగించు స్వామీ.  సినిమా చూసింతతరువాత మహా మేధావి అయిన మా పెద్ద పాప నెగటివ్ కామెంట్స్ వేసి ఒక అద్భుతాన్ని చూసిన ఆనందాన్ని క్షణభంగురం కానీయకుండా చూసే బాధ్యత  కూడా మీదే దేవా! సినిమా పూర్తి అయిన తరువాత సినిమా ఎంత గ్రేట్గా వుందో అని చిన్న పాప అంటూ వుంటే నాకు అంత థ్రిల్లు కలగక బిక్క మొగం వేసుకునే పరిస్థితి రానీయకు దేవా. సినిమా ఎక్కడెక్కడ ఎంజాయ్ చేసానో అని మా ఆవిడ వర్ణిస్తూ వుంటే ఆ సన్నివేశాలలో ఏమేం లోపాలు వున్నాయ్యో స్ఫురణకు వచ్చే దౌర్భాగ్యం కలగనీయకు ప్రభువా.

ఆమెన్" 


ఈ ప్రార్ధన అంత గొప్పగా రాలేదని నాకు తెలుసు. అందుకే దానిని మోడిఫై చేసే బాధ్యత మీకు ఇచ్చాను. అన్నట్లు ఈ సినిమా చూసే విషయంలో ప్రాంతీయ అభిమానం కూడా వుందండోయ్. దర్శకుడు జేమ్స్ కేమరూన్ మావాడే. కెనడియన్.  


మీటప్: అన్నట్లు ఇంకో విశేషం కూడా వుందండోయ్. ఈ మూవీకి మీటప్ సభ్యులతో కలిసి వెళుతున్నాం. మా మీటప్ గ్రూపులో మేము తప్ప అందరూ ఇక్కడి అమెరికన్సే. దాదాపు ఒక నలభై మంది ఈ సినిమా చూడటానికి రాబోతున్నారు. 12 గంటలకు సినిమా అయితే అందరూ 11 గంటలకే వచ్చేస్తారు. 11 నుండి లైనులో నిలబడి కబుర్లు చెప్పుకోబోతున్నాము. హాలులో అందరమూ ఒకదగ్గరే కూర్చొని సినిమా ఎంజాయ్ చేస్తాము. మూవీ అయిన తరువాత ఒక రెస్టారెంటుకి వెళ్ళి భోంచేస్తూ ఈ సినిమా అబ్బురాన్ని, అద్భుత క్షణాలనీ అందరం నెమరువేసుకోబోతున్నాము.      

O Shit! - మరోసారి


గమనిక: ఈ టపా తెలంగాణా ఆంశానిది కాదు.

కెనడా ఫోర్ట్ ఎరీ (నయాగరా ఫాల్స్) లో వుంటూ యు ఎస్ బఫెలో సిటీలో పని చేస్తున్న రోజులవి. రెండు దేశాల మధ్య ప్రయాణమే అయినా మా ఇంటినుండి ఆఫీసుకి కారు ద్వారా 5 నిమిషాల దూరం. అలా నాలుగేళ్ళు పని చేస్తూ ప్రతి పని రోజూ బోర్డర్ దాటుతుండేవాడిని. బోర్డర్ మామలతో, ఆంటీలతో అనగా అఫీసర్స్ తో కొన్ని గుర్తుంచుకోదగ్గ స్మృతులు వున్నాయి. వాటినన్నింటినీ మరోసారి పంచుకుంటాను కానీ ఒక సంఘటన మాత్రం ఇప్పుడు చెబుతా. 

ఎప్పుడన్నా అక్కడెక్కడో ఏ లాడేనో తుమ్మితే ఇక్కడ అమ్రికాలో జలుబుచేస్తుంది కదా. అప్పుడు బోర్డర్ ఆఫీసర్సుకి పూనకం వస్తుంది. కుక్కలని పట్టుకొని కార్లలో చిచ్చుబుడ్లలాంటి మందుగుండు సామాగ్రి ఏమయినా వుందా అని వాసన చూస్తుంటారు. ఓ సారి కుక్క ఆఫీసర్ నా కార్లోకి ఎక్కింది. ఎంతకూ ఆ కుక్క దిగి వెళ్ళిపోదే! ఎదో వాసన తెగ చూస్తోంది. ఆ కుక్క గారిని వదిలిన ఆఫీసర్లేమో ఎంచక్కా ముచ్చట్లు పెట్టుకుంటూ దీని విషయమే మరిచారు. నా మినీ వ్యానులో అది ఏం వాసన చూస్తూ తన్మయత్వం చెందుతుందో నాకు కనపడక నా గుండెల్లో రైల్లు పరిగెత్తాయి.  కొంపదీసి నేను ఇలా రోజూ బోర్డర్ దాటుతానని తెలిసిన ఏ తీవ్రవాదన్నా నా కార్లో ఏమన్నా పెట్టలేదు కదా?

కుక్క గారు ఎంతసేపటికీ బయటకి రాకుండా, మొరగకుండా అక్కడే వాసన చూస్తూ వుండటంతో బయట నిలబడి వున్న ఆఫీసర్సుకి చిరాకేసి బయటకి రమ్మని అదిలిస్తే గానీ ఆ కుక్క గారు కారు దిగి క్రిందికి వెళ్ళలేదు. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆఫీసుకి వచ్చి కార్ పార్క్ చేసి ఆ కుక్కగారు అంతగా ఏం వాసన చూసి వుంటుందా అని సీట్ల క్రింద పరిశీలించాను. చిన్న పాప వాడేసిన డయపర్ వుందక్కడ! 

తెరాస సిద్ధతకర్తలాగా కొద్దిగా అగుపించే బ్లాగర్
మన తెలుగు బ్లాగర్లలో ఒకరు కొద్దిగా తెరాస సిద్ధతకర్త జయశంకర్ లాగా అనిపిస్తారు. వీరికంటే జయశంకర్ కొద్దిగా ఎత్తు, బక్క. ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీరెవరూ చెప్పలేకపోతే కొద్దికొద్దిగా క్లూలు ఇస్తుంటాను.