ఈ మధ్య ఓ రెండు నెలలు బ్లాగు వ్రాయడం ఆపాను కదా. అబ్బో ఎంత ప్రశాంతంగా వుండేదో మనస్సుకి. మరీ ప్రశాంతత ఒత్తొత్తుగా అయిపోయి బోర్ కొట్టి, చిరాకేసి కూడా మళ్ళీ బ్లాగింగ్ మొదలెట్టాను.
-----------------------------------------
మా అమ్మగారి మార్గం: నా చిన్నప్పుడు మా అమ్మగారు ఆస్తిక శిక్షణా తరగతులకూ, మా నాన్నగారు నాస్తిక గుడులకూ నన్ను తిప్పుతూ నాతో బంతి ఆట ఆడుకునేవారు. ఎవరిదో ఒకరి కోర్టులో సెటిల్ కాకపోతే నా జీవితం బంతిలాగే పొర్లుతూ వుంటుందని లైటు వెలిగి మా నాన్న గారి కోర్టులో సెటిలయ్యా.
మా అమ్మగారు ఇదివరలో కాస్త సూర్యకాంతం టైపు: ఆమె గయ్యాళి తనం తీరడానికి ఎదుట కనీసం ఎవరో ఒకరో వుంటే మిగతావారు బ్రతికి బట్ట కట్టేయొచ్చు. దాదాపుగా పన్నేండేళ్ళనుండి సహజ మార్గం అనే ఆధ్యాత్మిక మార్గం పట్టింది. అప్పటినుండీ ఆమెలో చాలావరకు ప్రశాంతత పెరిగింది. పదేళ్ళ క్రితమే మా నాన్నగారు పైకి పోవడమూ, మేమెవరమూ అందుబాటులో లేకపోవడమూ కూడా ఆ ప్రశాంతతకి కారణం అయ్యుండొచ్చు. రోజుకి చాలాసార్లు, చాలా సేపు ధ్యానంలో గడుపుతూ వుంటుంది. ఈ మధ్య ఫోన్ చేసినప్పుడు సంతోషంగా కొన్ని విశేషాలు చెప్పింది. మా పెద్ద అక్కయ్య, బావయ్య, పెద్ద కోడలూ, భర్తా కూడా సహజ మార్గంలో చేరారంట. చిన్నక్కయ్య కొంత సమయం తీసుకొని చేరతా అందిట. 'మరి నువ్వు ఎప్పుడు చేరతావు బాబూ' అని అమ్మ అడిగింది. చేరితే గీరితే నేను మున్ముందు మార్తాండజీ స్థాపించబోయే బైరాగుల మఠంలో చేరతానని చెప్పాను. మార్తాండజీ ఎవరు అని అడిగింది. మీ గురూజీ కంటే చాలా గొప్పవారని చెప్పాను.
మొత్తమ్మీద వృద్ధాప్యంలో మా అమ్మగారికి చక్కటి వ్యాపకం దొరికింది. మా నాన్నగారు (నిజమయిన) స్వాతంత్ర్య యోధులు కాబట్టి వారి డిపెండెంటుగా ఫ్రీ రైల్వే పాసు వుంది కాబట్టి ఎంచక్క మరొక సహాయకురాలిని తీసుకొని ఆ మార్గం సభలకూ, సమావేశాలకూ దేశమంతా చక్కర్లు కొడుతూ వస్తోంది. ఆ ఫ్రీ పాస్ తో ఒక సహాయకురాలితో సహా రైలులొ మొదటి తరగతిలో ఉచితంగా దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు. ఆమెకు తోడుగా ఇప్పుడు మా ఇతర కుటుంబ సభ్యులూ వుంటుండటంతో తను క్షేమంగా వుందో లేదో అని నేను ఇక్కడనుండి పడే ఆదుర్దా కొంత తగ్గింది. మా అమ్మగారు మా చెంతనే వుండటానికి ఒక చిన్న సమస్య వుంది. మా ఇంట్లో ఇంకో గయ్యాళి వుంది. అఫ్కోర్స్ - ఇద్దరు గయ్యాళులూ పోట్లాడుకుంటూ వున్నప్పుడు నేను చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ టివి నో, బ్రవుజింగో చేస్తుండంలో చాలా మజా చేస్తుంటానుకోండి. ఈ సారి ఆ సీన్ వచ్చినప్పుడు లైవ్ బ్లాగింగ్ చేస్తానుండండి. మరి సహజమార్గంలో చేరిన తరువాత ప్రశాంతత వచ్చిందన్నావు కదా అన్న ధర్మసందేహం మీకు వస్తుందని నాకు బాగా తెలుసు. మరో గయ్యాళి మా అమ్మగారికి తటస్థించినప్పుడు మాత్రం తాను బ్యాక్ గ్రవుండులో వుంచేసిన కళను ముందుకి తీసుకువస్తూవుంటుంది అనే విషయం ఇక్కడ మీరు గమనించాల్సివుంది!
---------------------------------------------------------
వ్యాఖ్యలు:ఇంతకుముందు టపాకి శిశిర అని ఒకరు స్పందించారు. పేరు నచ్చింది. ఎందుకంటే మా చిన్న పాప పేరు అదే కాబట్టి. మాకు బాబు పుడితే నాకు వున్న రుతువు పేరు లాగా అబ్బాయికి శిశిర్ అని పెడదామనుకున్నాం. అమ్మాయి పుట్టింది కాబట్టి పేరుకి లింగ మార్పిడి చేసేశాం.
శాస్త్ర, విజ్ఞాన బ్లాగులూ, ప్రింట్ మీడియాలో ప్రముఖులయిన బ్లాగులూ ఎవరూ పెద్దగా చదవడం లేదంటూ ఒక అజ్ఞాత బ్లాగ్ ప్రజల మీద కినుక వహించారు. నిజమే - అలాంటివి నేనూ పెద్దగా చదవను. ఎందుకంటే వాటిమీద ఆసక్తి వుంటే బ్లాగులే చదవక్కరలేదు. గూగుల్ చేస్తే బోలెడంత సమాచారం వస్తుంది కదా. బ్లాగుల్లో పెద్దగా సమాచారం కోసం చూడను - వ్యక్తిగత అనుభవాలతో మిళితమయిన విజ్ఞానాన్నీ, సమాచారాన్నీ, విశ్లేషణలనీ, అనుభూతులనీ తెలుసుకోవాలని వుంటుంది. మరి మీకు?
ఉదాహరణకు నేను కొంతకాలం హిప్నటిజం చేసేవాడిని. దానిమీద వ్రాయొచ్చు. కేవలం దానిమీద విజ్ఞానాన్ని వ్రాస్తూ పోవడం అంత ఉపయోగకరం కాదు. దానిమీద సమాచారం నెట్ లో బోలెడంత వుంటుంది. నా హిప్నటిజం అనుభవాలతో రంగరించి ఆ సమాచారం ఇస్తే బావుంటుంది. ఎందుకంటే ఒకరి అనుభవం వారు తెలపందే నెట్ లో దొరకదు కాబట్టి.
6 comments:
నా మట్టు కు మా అన్న ప్రవీణ్ శర్మ లేక పోతే ఇటువైపు అసలు రా బుద్ది కావడం లేదు
రౌడి..మంచు..నాగాప్రసాద్..ఖర్మ..ఇంకా చాలా మంది బ్లాగర్లు అన్నయా ను ఈ వైపు రాకుండా చేస్తున్నారు ఈ మద్య కోందరు బ్లాగు కుడా మేదలు పేటి అయన మీద ఏదెదో రాస్తున్నారు
http://onlyforpraveen.wordpress.com
ఏదొ ఒక్క రోజు మా అన్న తిరిగి వస్తాడు అప్పుడు ఉంది ఒక్కక్కరికి ....
ప్రతి ఒక్కరి మీద ఒక్క కదతో రేడి గా ఉన్నాడు
అయన టపాల కోసం ఇప్పటికే తలనోప్పి టాబ్లెట్ లతో సిద్దంగా ఉన్నాను.
ప్రవీణ్ నువ్వు రావాలి నీ కోసం కాదు కనిసం
saridon..zandu balm..amruthanjan..ల సేల్స్ కోసం అయినా రావాలి
నువ్వు వస్తావు ఖచ్చితనంగా వస్తావు...
అబ్బా ప్రవీణూ,
నేను నా ప్రశాంతతను గురించి వ్రాసాను. బ్లాగుల్లో ప్రశాంతత గురించి కాదు. మీరన్నది కూడా నిజమే, ఇలాంటి ప్రశాంతతకి కారణమయిన రౌడి..మంచు..నాగాప్రసాద్..ఖర్మ..వీరినందరినీ బ్లాగులోకం నుండి బహిష్కరించాల్సిందిగా 'ఆధికార తెలుగు బ్లాగోద్దరణ సమితి'కి విజ్ఞప్తి చేస్తున్నాను.
భలే ఉంది మీ ప్రశాంత టపా!
మీరన్నట్లు మీడియా గురించి చదవాలంటే బ్లాగులెందుకు? వేడి వేడి న్యూసు రహస్య కెమెరాలతో చిత్రించిన క్లిప్పింగులతో సహా ఛానెల్సే చూపుతోంటే?
మీ అమ్మగారి గురువు కంటే గొప్ప అయిన గురువు మీకు లభించినందుకు నాకు ఈర్ష్యగా ఉంది.అంత అదృష్టం అందరికీ ఉండొద్దూ?
అన్నట్లు మీ వైఫ్ కి తెలుగు చదవడం వచ్చా?
>>గూగుల్ చేస్తే బోలెడంత సమాచారం వస్తుంది<<
ఎలాగొస్తుందండీ? ఎవరో ఒకరు రాయబట్టే కదా వస్తాంట.
@ సుజాత
కొన్నాళ్ళ క్రితం నా ఈమెయిల్ సంతకం క్రింద ఈ బ్లాగు పేరు పెట్టుకునేవాడిని. ఎవరన్నా ఆ విధంగా నా బ్లాగు చదివారారో లేదో కానీ ఒకరినుండి మాత్రం 'ఇది వ్రాయడం అంత అవసరమా? ఇది చెప్పుకోవడం అంత అవసరమా?' లాంటి యక్ష ప్రశ్నలతో నా బ్లాగు స్వేఛ్ఛకి విఘాతం కలిగేది. ఇంకెవరూ మా ఆవిడ. ఎప్పుడన్నా మా ఆవిడకి నేను ఏ ఈమెయిలో ఫార్వర్డ్ చేసినప్పుడు నా బ్లాగు లింక్ చూసి చదివేది.
ఇలా కాదని నా ఈమెయిల్ సంతకం క్రింద నా బ్లాగు లింక్ తీసివేసాను. అప్పటినుండీ ప్రశాంతంగా వ్రాసుకుంటున్నాను. తెలుగు వచ్చినా తనకి చదవడం బొత్తిగా ఆసక్తి వుండదండీ - కేవలం చూడటం వరకే. సినిమాలూ, (ఏడుపుగొట్టు) సీరియళ్ళు మాత్రమే ఆసక్తి. అందుకే (ప్రస్తుతానికి) ఇదిగో ఇలా బ్లాగు బ్రతుకు బ్రతుక గలుగుతున్నాను హి... హీ.
@ అజ్ఞాత
మీరు చెప్పింది నిజమేనండీ. అన్నీ ఎవరో ఒకరు వ్రాయాల్సిందే. ఆకాశంలో నుండి ఊడిపడవు కదా.
నన్ను సవరించినందుకు ధన్యవాదాలు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి