బ్లా.బ్లా..బ్లా...బ్లాగుల్లో నా తొలిరోజులు


దాదాపుగా రెండు ఏళ్ళ క్రితం నేనూ వున్నానంటూ బయల్దేరి నా బ్లాగింపు మొదలెట్టి బ్లాగు సాంప్రదాయ పూర్వకంగా కూడలిలో కలిపి...ఆ విషయం మరిచేపోయాను. టెస్టింగ్ కోసమని కొన్ని పోస్టులు వేసాను. ఆహ్వానం అంటూ ఓ రెండు, మూడు  కామెంట్లు వచ్చాయి. అందులో ఒకటి జ్యోతి గారిదనుకుంటా. అబ్బో మన బ్లాగు చూడటమే కాకుండా ప్రోత్సాహం కూడానా ఇక వీరి పని పట్టాలి అనుకుని మన పైత్యపు భావాలు కొన్ని వెల్లగక్కుకున్నాను. మళ్ళీ కామెంట్లు వస్తే ఒట్టు. తిట్లను కూడా కామెంట్లు అనుకుంటే అవి వచ్చినట్టే. నా వ్రాతలు చూసి కిక్కు సినిమాలో రవితేజను చూసి జయప్రకాశ్ రెడ్డి అనుకున్నట్లుగా లేదా ఈ రోజుల్లో మార్తాండని చూసి చాలా మంది అనుకుంటున్నట్లుగా 'ఎవడబ్బా వీడు' అని చాలామంది బుర్రలు గోక్కునే వుంటారు. 

సరే అని కాస్త ఛేంజ్ కోసమని మా చిన్న పాప ఫోటో వేసుకున్నాను. క్యూట్ గా వుందని ఒకటి రెండు కామెంట్లు వచ్చాయి. ఎంతయినా ఇది మన బ్లాగు మన ఇష్టమే కదా అనుకుని మా దంపతుల ఫోటో వేసేసాను. నెటిజెన్ నుండి అనుకుంటా 'మీ ఆవిడ అనుమతి తీసుకున్నారా ' అని క్వెషన్ వచ్చింది. నా బుర్ర తిరిగిపోయింది. నా బ్లాగులో మా ఫోటో వేసుకోవడం కోసం కూడా అనుమతులు కావాలా అని సందేహం వచ్చింది. మా ఆవిడ యాహూ ఫోటోస్ లోనూ, ఫ్లికర్ లోనూ మా అందరి ఫోటోలు ఎక్కిస్తుంది. ఎన్నడయినా నా పర్మిషన్ అడిగిందా అని బుర్ర గోక్కున్నాను. లే. మా ఆవిడను అడిగాను 'నా అనుమతి లేకుండా నా ఫోటోలు ఆ సైట్లలో ఎందుకు పెట్టావూ? ' అని. నన్నో విచిత్ర జంతువు ను చూసినట్లు ఎగాదిగా చూసింది. ఆమె నన్ను అలా చూడటం తరచుగా జరుగుతుంటుంది లెండి.     

ఆ కామెంటుకి ' అవసరమా?' అని స్పందించాను. ఎవరినుండో మరో వ్యాఖ్య వచ్చింది కొంతకాలానికి. 'ఫోటో వెయ్యడమే కాకుండా మళ్ళీ అనుమతి అవసరమా అని అడుగుతావురా ' అని. ఇదేదో తకరారుగా వుందని ఎందుకయినా మంచిదని ఆ ఫోటో తీసివేసాను.

మొదట్లో కొద్ది రోజులు నా బ్లాగు వున్నట్లు ఎవరికి తెలుస్తుందిలె, ఎవరు చూస్తారులే అబ్బా అనుకుని ఏదో కాలక్షేపానికి ఏవో వ్రాసుకుంటే, ఫోటోలు వేసుకుంటే ఇంతమంది ఇలా ఎలా తిడుతున్నారబ్బా అని విస్మయం చెందాను. కొద్ది రోజుల తరువాత కూడలి ఎందుకో చూస్తే నా టపా కనపడి ఉలిక్కిపడ్డాను. ఇదన్న మాట సంగతీ అని అర్ధమయ్యి అప్పటినుండి విజృంభించాను... కానీ ఏం లాభం?

అలా అలా అప్పటిదాకా మన బ్లాగ్ అంటే ఏమయినా వ్రాసుకోవచ్చనీ, ఏమయినా వేసుకోవచ్చని అనుకుంటున్న నా కళ్ళు త్వరగానే తెరచుకున్నాయి. హిపోక్రాట్ గా వుండాలని, మన గురించి అన్నీ గొప్పలే చెప్పుకోవాలని, ఎప్పుడూ ఇతరుల లోని లోపాలనే ఎత్తిచూపాలని అర్ధమయ్యింది.  మన ఆనందాలే వెల్లడించుకోవాలి గానీ మన బలహీనతలు, కష్టాల ఊసు ఎత్తవద్దనీ, ఎవరి మనోభావాలూ గాయపడకుండా కాలక్షేపం బఠాణ్ణీలాగున బ్లాగుతూ వుండాలని బోధపడింది.  బ్లాగుబన్ (బ్లాగు తాలిబాన్) ల గురించి కూడా బోధపడింది. మిగతా నా బ్లాగు చరిత్ర మీలో చాలా మందికి తెలిసిందే. 

మరి బ్లాగుల్లో మన ఇష్టం వచ్చినట్లు వ్రాసుకునే స్వేఛ్ఛ, మార్గం లేదా? వుంది. అది 'స్వయంతృప్తి' లాంటిది!    అలాంటి తుత్తి బ్లాగు నాకొకటి వుంది.

పులి రాజు

విజయవాడ V K కంప్యూటర్స్ లో విద్యార్ధిగానూ, బోధకుడిగానూ పనిచేస్తున్న పద్దెనిమిది ఏళ్ళ క్రితం రోజులవి. ఒక రోజు దినపత్రికలో విజయవాడలో 'పులి రాజు' అనే వ్యక్తి చేసిన ఘనకార్యాల గురించి కథనం వచ్చింది. అతని చేష్టలూ, నా భావాలూ ఒకే రకం కావడంతో అక్కడి మిత్రులూ, స్టాఫూ ఆడ, మగా అందరూ నాకు పులి రాజు అని పేరు పెట్టేసారు. క్రమంగా అక్కడి పరిస్థితి ఎలా అయ్యిందంటే అందరూ నా అసలు పేరు పక్కన పెట్టి పులి రాజు అని సంబోధించడం మొదలెట్టారు.   

కట్ చేస్తే కొన్ని ఏళ్ళయ్యాక పూనేలో పి జి చేయడానికి వచ్చాను. అక్కడి మిత్రులకి ఎలాగో నా నిక్ నేం తెలిసిపోయి పులి పులి అనడం మొదలెట్టారు. మా మిత్రులు అలా పిలుస్తున్నందుకు కొద్ది రోజులు ఛాతి విరుచుకొని తిరిగినా తరువాత అలా వాళ్ళు పిలవడం వెనుక వున్న మరో ద్వందార్ధం తెలిసిపోయి వుడుక్కున్నాను.
  
అందరూ నన్ను పులి పులి అని ఎందుకు అంటున్నారో అర్ధం కాని తోటి తెలుగు విద్యార్ధిని (క్లోజ్ ఫ్రెండ్ లెండి) నన్ను అడగనే అడిగింది 'ఎందుకు నిన్ను అలా పిలుస్తున్నారూ ' అని. మింగలేక కక్కలేక ఎలాగోలా వాళ్ళు పిలుస్తున్న అర్ధం చెప్పేసాను. తానూ పులి పులి అని పిలవడం ప్రారంభించింది. "మరి నువ్వేమన్నా ఓవెన్ ఫ్రెష్ నా?" అని సరదాగా ద్వందార్ధంలో తిరిగి వెక్కిరించాను. అంతటితో ఆమె నన్ను అలా పిలవడం మానివేసింది. 

కట్ చేస్తే పన్నెండేళ్ళ క్రితం కెనడా వచ్చేసాను. ఆ తరువాత ఒక ఏడాదికి విజయవాడ నుండి యు ఎస్ కి ఒక మిత్రుడు వచ్చేసాడు. కెనడాలోని మా గదికి ఫోన్ చేసాడు. మా రూమ్మేట్స్ "ఎవరు కావాలండీ" అని అడిగారు. 
"పులి .. పులి రాజు వున్నాడా" అని అడిగాడు.
నా కెనడా రూం మేట్స్ కి నా ఘనచరిత్ర అంతగా తెలియదు కాబట్టి నాకు అలాంటి పేరు ఒకటి వుందని తెలియక కంగారు పడ్డారు. "పులి రాజా? అలాంటి వారెవరూ ఇక్కడ లేరే!" అని సమాధానం ఇచ్చారు. 
నా విజయవాడ మిత్రుడికి నా అసలు పేరు అస్సలు గుర్తుకురాక ఖంగారు పడ్డాడు. "అదేనండి పులి.. పులిరాజు.." అంటూ నసిగాడు.
మా మిత్రులకి ఎందుకో సందేహం వచ్చి "శరతా?" అని అడిగారు.
"ఆ. ఆ. అవును. అవును"

అప్పుడు నేను గదిలో లేను. నేను వచ్చాక నా రూం మేట్స్ పొర్లి పొర్లి నవ్వుతూ ఈ విషయం చెప్పారు.

కట్ చేస్తే కొన్ని ఏళ్ళ తరువాత ఇండియా చూడటానికి వచ్చాను. ఈలోగా ఎయిడ్స్ ప్రకటనల పుణ్యమా అని పులి రాజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందాడు. నాకు పులి రాజు అన్న పేరు వుంది అని తెలుసున్న బంధుమిత్రులంతా "పులి రాజుకి ఎయిడ్స్ వచ్చిందా?" అని అడగసాగారు. దానితో నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాక ఆ తరువాత మళ్ళీ ఎవరికీ నాకు అలాంటి నిక్ నేం వుందని చెప్పుకోలేదు. మళ్ళీ మీకే చెప్పడం. ష్. ష్.. ష్...!     

ఎందువలన అంటే...ఇందువలన...

ఈమధ్య నా బ్లాగులో వ్రాయడం లేదని ఆలి, నెలబాలుడు, మరికొంత మంది మిత్రులు కాస్త విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వివరణ. 

ఆఫీసులో: నాకు ఇంట్లో తీరిక వుండదు - ఆఫీసులో తీరిక వుండకపోవడం అంటూ వుండదు. రోజుకి సరాసరి అయిదు నిమిషాల పనితో, నా ఆఫీసు గదిలో గోళ్ళు లేదా ఇంటర్నెట్ గోక్కుంటూ కూర్చుంటాను.   ఆఫీసు పాలిట్రిక్స్ చేయడానికి + ఎంజాయ్ చేయడానికి దేశీ లెవరూ మా ఆఫీసులో లేరు మరియు మిగతావాళ్ళందరూ చాలా మంచాళ్ళు! నా టెక్నాలజీలో పనిచేసేది నేనొక్కడినే కావడంతో ఇతర వుద్యోగులతో ఇంటరాక్షన్ పెద్దగా అవసరం లేక నాది సాలిటరీ కన్ఫయిన్మెంట్ అనిపిస్తూవుంటుంది.  అఫీసులో కూర్చుని బ్లాగులు చదవడం అయితే ఓక్కె గానీ మరీ బ్లాగులు వ్రాయడం అన్నది బావుండదేమో అన్న నైతిక (?) సందేహం వచ్చి ఆపేసాను. అసలు విషయం ఏమిటంటే గబుక్కున మా మేనేజర్ వచ్చి చూస్తే నా బ్లాగింపు కనపడ్డం బావుండదు కదా అని.

ఇంట్లో: నా ల్యాప్టాప్ (బాగుపడలేనంతగా) ఖరాబు అయ్యింది. ఇంకో ల్యాప్టాప్ మా పెద్దమ్మాయి ఎవరికీ ఇవ్వదు. మరింకో లాప్టాప్ మాయింట్లో వాళ్ళని బ్రతిమలాడితే కొద్దిసేపు నాకు పడేస్తారు. ఆ కొద్ది సేపట్లో ఏం బ్లాగగలం? ఆ సిస్టం ను మా ఆవిడ, చిన్న పాప, మా మాంగోరు వన్ బై వన్ ఉపయోగిస్తుంటారు - నేను అడిగితే చిరాకు పడతారు :( అలా నాకు కంప్యూటర్ గతిలేక నాలోని బ్లాగాగ్నిని ఇప్పటివరకూ శాంతపరుస్తూ వస్తున్నాను.

ఇహ లాభం లేదని మొన్ననే ఓ నెట్ బుక్ + మొబయిల్ బ్రాడ్ బ్యాండ్ ఆర్డర్ చేసాను.  కొరియర్ లో ఇవాళ రావాల్సి వుంది. దానిని మా ఇంట్లో ఎవ్వరికీ ఇవ్వొద్దని కంకణం కట్టుకున్నాను! ఇక రేపటి నుండి మళ్ళీ నా బ్లాగింగ్ దడదడ లాడిస్తానేమో. ఈ బ్లాగు ఏమో గానీ నా ఇంకో బ్లాగు వుంది చూసారూ - అందులో చాలా వ్రాయాల్సి వుంది. ఓ బుక్కు మొదలెట్టాను కదా అది ముగించవలసి వుంది.

అజ్ఞాతంగా: బహిరంగంగా బ్లాగింగు చేయడం నాకు సౌకర్యంగా లేదు. ఏదయినా వ్రాయవలసి వస్తే ఎవరినీ నొప్పించకుండా. మన వ్యక్తిగత విషయాలు, భావాలూ ప్రకటించుకోకుండా చాణుక్య నీతితొ వ్రాయాల్సి వస్తోంది. అజ్ఞాతంగా వ్రాసే వారి స్వేఛ్ఛ చూస్తే నాకు అసూయ కలుగుతోంది. త్వరలో అజ్ఞాతంగా కూడా ఓ బ్లాగు మొదలెడతానేమో. నా శైలిని బట్టి ఎవరయినా కనిపెట్టినా గమ్మున వుండండేం!