గురువారం 24 సెప్టెంబర్ 2009

How to Stop Worrying and Start Living

ఆ రోజుల్లో గుంటూర్ 'రవి కళాశాల' వారు మొదటిసారి IAS శిక్షణ ప్రారంభించారు. అందులో చేరాను నేను. కలెక్టర్ అయిపోదామనే! కాదు - కలెక్టర్ కి గురి పెడితే కనీసం బిల్లు కలెక్టర్ కావొచ్చని. అందులో నాతో పాటు చేరింది శ్రీదేవి. తెల్లగా చాలా బావుండేది,  చక్కటి వ్యక్తిత్వం. అందమయిన, తెలివయిన, చలాకీ అయిన అమ్మాయి. ఇంకా ఏం కావాలి. తనతో చక్కటి స్నేహం. ఇద్దరం కలిసి లైబ్రరీలలో చదువుకునేవారం. ఆ అమ్మాయిని ప్రేమించాలని తెగ మనసయ్యింది కానీ అప్పటికే మా మరదలికి కమిట్ అయి వుండటంతో ఉసూరుమంటూ మనస్సుకు కళ్ళాలు వేసుకున్నాను. ఆ అమ్మాయి దగ్గర చూసాను ఈ పుస్తకం. చదివి ఇచ్చేస్తానని తీసుకొని ఏదో పని మీద మా సూర్యాపేట వచ్చాను.

కొద్దిరోజులు అక్కడే వున్నప్పుడు గుంటూర్ నుండి ఫోన్. IAS శిక్షణ కేంద్రం డైరెక్టర్. కొన్ని కారణాల వల్ల ఈ ట్రైనింగ్ మూసివేద్దామనుకుంటున్నాను అని వివరించాడు. నా సలహా అడిగాడు. ఆ బ్యాచులో నాకు మాంఛి గుర్తింపు వుండేది లెండి. అలాగే ఆ ట్రైనింగ్ తీసుకునివుంటే ఇలా కంప్యూటర్ కళాకారుడుని అవకుండా తప్పకుండా బిల్లు కలెక్టర్ అయి ప్రభుత్వోద్యోగం చేస్తూ వూండేవాడిని. ఎత్తేసేయమని చెప్పాను.  ఎత్తేసారు.

IAS ట్రైనింగ్ ఎత్తేసారు కనుక ఇక గుంటూర్ వెళ్ళలేదు. శ్రీదేవి ని కలవలేదు. పుస్తకం ఇచ్చేయలేదు. మళ్ళీ ఇక తను కలవలేదు. ఆ తరువాత మా మరదలుతో విభేదాలు వచ్చి ఇద్దరం ప్రేమలో విడిపోయాము. అలా విడిపోతామని తెలిస్తే శ్రీదేవిని గాఢంగా ప్రేమించేవాడిని కదా అని అప్పుడప్పుడూ నిట్టూర్పులు విడుస్తుంటాను. నేను తనని ప్రేమించినా శ్రీదేవి ఖచ్చితంగా నన్ను ప్రేమించి వుండకపోయేది. అయినా మనిషి ఆశాజీవి కదా.

 పుస్తకం పేరు చెప్పి ఆత్మకథ బాదేస్తున్నాడేమిటా అనుకుంటున్నారా. అక్కడికే వచ్చేస్తున్నా. అన్ని పుస్తకాల గురించి ఒకే రకంగా వ్రాస్తే బావుండదు కదా. అందుకే.

ఆ రోజుల్లో చాలా బాధల్లో వుండేవాడిని. నెలలు, నెలలు ఆ బాధ అలా కొనసాగుతూనే వచ్చింది. ఈ పుస్తకం చదివినా, చదివేంత వరకు బాగానే వుండేది. పక్కకు పెట్టగానే మళ్ళీ చింత, దిగులు. హ్మ్మ్.   ఈ పుస్తకం ప్రకారం ఆలోచనా ధోరణిని ఎంత మార్చుకుందామని ప్రయత్నించినా ప్రయోజనం లభించలేదు. మరి డేల్ కార్నెగీ వ్రాసిన ఈ పుస్తకం ( 'How to win friends & Influence people' వ్రాసింది కూడా వీరే) అంత వృధానా. కాదు. చాలా చక్కటి పుస్తకం ఇది. మరి లోపం ఎక్కడ. నామీద నేను రెసెర్చ్ చేసుకుని కనుక్కున్నాను - విషయం ఏమిటో - మాంద్యం  - డిప్రెషన్.     

చీకూ చింతలతో షట్ డవున్ అయిన మీ జీవితాన్ని రిస్టార్ట్ చేసేందుకు ఈ పుస్తకం బాగా ఉపకరిస్తుంది. చక్కటి పుస్తకం ఇది. ముఖ్యంగా బాధల్లో వున్నవారికి/వుండేవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే డిప్రెషన్ లాంటి దీర్ఘకాలిక విషాదాల్లో వున్నప్పుడు ఈ పుస్తకం వల్ల కొంత ప్రయోజనమే వుంటుందని స్వానుభవంతో తెలుసుకున్న విషయం. మానసిక మాంద్యం రావడానికి గల కారణాలు వేరు - అవి ఈ పుస్తకం చదివినంత మాత్రాన తొలగిపోవు. 

How to Stop Worrying and Start Living

 ఎక్కడ వుందో శ్రీదేవి ఏమిటో కానీ ఆమె గుర్తుగా ఈ పుస్తకాన్ని పదిలంగా దాచుకొని తత్కాలికంగా ఏవయినా బాధల్లో వున్నప్పుడు ఈ పుస్తకం చదువుతూ, చల్లని మనస్సున్న శ్రీదేవిని తలచుకుంటూ సేదతీరుతూ వుంటాను.  మళ్ళీ జీవితంలో ఎప్పుడయినా, ఎక్కడయినా తటస్థించకపోతుందా అని ఎదురుచూస్తున్నా. ఏమో ఎవరు చెప్పొచ్చారు - యండమూరి 'ఆనందోబ్రహ్మ' నవలలో లాగా 'యాజీ, నువ్వేనా' అంటూ ఈ టపా చదివి ఈమెయిల్ ఇస్తుందేమో!  వీటినే మరి గొంతెమ్మ కోరికలు అంటారు కదూ.

మా ఆవిడకి ఈ పుస్తకం చరిత్ర చెప్పలేదు లెండి - బయటకి గిరవాటేస్తుంది - నన్ను కాదు - ఈ పుస్తకాన్ని. పొరపాటున ఈ టపా చదివినా ఈ పుస్తకానికి గ్రహపాటు వచ్చినట్లే! (ఆఫీసు నుండి) ఇంటికి వెళ్ళాక చూడాలి - పుస్తకం ఇంట్లో వుందో లేక ఇంటి పక్కనే వున్న సరస్సులో వుందో.    

6 comments:

అజ్ఞాత చెప్పారు...

Oh is that you who stole my book? Please call 800-UNO-WHAT. I am Sridevi trying to find you to get my book back and smash your face for stealing it!
Sridevi

భాస్కర్ రామరాజు చెప్పారు...

అజ్ఞాత - :):)
నేనొప్పుకోను..మొన్న మా ఊళ్ళో ఎవరో ఒకామె, నడివయసు, కనిపించిన ప్రతీ దేశీని పట్టిపట్టి చూట్టం గమనించా. ఒకళ్ళిద్దర్ని అడిగింది కూడా ఇన్డైరెక్టుగా స్టాప్ అన్డ్ స్టార్ట్ అని కోడ్ ల్యాంగ్వేజ్ లో....బహుశా ఆమేనేమో????

కొత్త పాళీ చెప్పారు...

"నేను తనని ప్రేమించినా శ్రీదేవి ఖచ్చితంగా నన్ను ప్రేమించి వుండకపోయేది. అయినా మనిషి ఆశాజీవి కదా."
కరక్టు. ఆ సూత్రమ్మీదనే నేను శ్రీదేవినీ జయప్రదనీ అటుపిమ్మట మాధురీ దీక్షిత్ నీ కూడా ప్రేమించేశాను! :)

నెలబాలుడు చెప్పారు...

మీరు అదే పనిగా.. ఇన్ని పుస్తకాలు పరిచయం చేస్తుంటే నేను చదవాల్సినివి ఇంకా చాల ఉన్నాయ్ అని బాధేస్తుండోయ్... హ్మ్... శ్రీదేవి కి పుస్తకం తిరిగి ఇవ్వాల్సింది.. ;)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ శ్రీదేవి
హెంత మాటన్నావు శ్రీ. ఏదో నీ పుస్తకం నీకు తిరిగీచ్చేద్దామని నేను పోస్టు వేస్తే నా దవడ వాయగొడతానని ఇలా పబ్లిక్కుగా స్టేట్మెంట్ ఇవ్వడం నీకు న్యాయమా చెప్పు?

@ రామరాజు
నవ్వుకోండి..నవ్వుకోండి..నా శ్రీ నాకు కనపడకపోతుందా...నవ్విన నాపచేలే పండకపోతాయా!

@ క్త్తపాళీ
హర్రే. మీరు కూడా నా బాపతే. 'ఊహే సౌఖ్యమనే భావన రానీ' అన్నారు కదా పెద్దలు. పర్లేదు బాధని మార్చేసాలెండి.. అవసరం కోసం.

@ నెలబాలుడు
శ్రీ కి పుస్తకం తిరిగి ఇచ్చేద్దామనే కదా ఈ పోస్ట్ వేస్తుంట. తను ఎక్కడకనపడ్డా నాకు చెప్పండి. TV9 వాళ్ళని పిలిచి మరీ నా నిజాయితీ నిరూపించుకుంటా.

aswin budaraju చెప్పారు...

"నేను తనని ప్రేమించినా శ్రీదేవి ఖచ్చితంగా నన్ను ప్రేమించి వుండకపోయేది. అయినా మనిషి ఆశాజీవి కదా."

:-))