సైన్స్ ఫిక్షన్ కథ: కొత్త తరం

"మీకు ఎలాంటి రోబోట్ కావాలి?" అడిగాడు ఈస్టర్న్ రోబోటిక్స్ అధినేత సందీప్ రాజు.

"మామూలివే. అందరి ఇండ్లల్లో వుంటున్నాయి చూడండి. అటువంటివే" అన్నాడు అతను.

"అలాక్కాదు. మీకు ఎందుకు రోబోట్ కావాలో వివరంగా చెప్పండి"

"మీరు ఇక్కడ నా ప్రైవసీ హక్కులని ఉల్లంఘిస్తున్నట్లు లేదా?"

"నిజమే. మీకు ఏదో ఒక రోబోట్ తేలిగ్గా అంటగట్టేయొచ్చు. మేము బ్యుజీగా వుండే రోజుల్లో అలాగే చేస్తుంటాం. మీకు తెలుసుకదా - 2009 లో వచ్చిన గొప్ప ఆర్ధిక మాంద్యం తరువాత వచ్చిన మాంద్యం ఇదేనని. అందువల్ల రోబోట్ అమ్మకాలు కూడా తగ్గాయి. తీరిగ్గా వున్నాము కాబట్టి కస్టమర్ల అవసరాలు ఎక్కువగా పట్టించుకుంటున్నాము. మీకు మంచి సరుకు అమ్మితే మళ్ళీ మా అమ్మకాలు పుంజుకుంటాయనే ఆశ"

"అలాగయితే సరే. మీకు వివరంగా చెప్పడమే మంచిదిలా వుంది"

"మీ అవసరం ఎంత వివరంగా చెబితే అంతగా మీకు కస్టమయిజ్ చేసిన రోబోట్ ఇవ్వగలము. సాధారణ రోబొట్ మీరు తీసుకువెళితే మీ ప్రత్యేక అవసరాలు చూడదు. మీకు మీ రంగంలో తప్ప ఇతర విషయాల్లో పెద్దగా నాలెడ్జి లేదనిపిస్తోంది. అలా అన్నందుకు దయచేసి ఏమనుకోకండి. ఎంతోమంది కస్టమర్లను చూస్తుంటాము కదా. చూడగానే పరిస్థితి అర్ధం అవుతుంది. మీకు మంచి రోబోట్ ఇవ్వాలన్నదే నా తాపత్రయం."

"అవును. నేను ఆహార పరిశోధనా సంస్థలో సైంటిస్టుని. మన జాతీయ ఆహార అవసరాకు సరిపడేలా క్రొత్త క్రొత్త జన్యు మార్పిడి వంగడాలను కనిపెడుతున్నాను. ఈమధ్యనే 2బి2టి అనే వరి వంగడాన్ని కనిపెట్టాను. మీరు వార్తల్లో చూసే వుంటారు. ఎప్పుడూ ఆ పరిశొధనల్లోనే మునిగివుంటాను కనుక నాకు ఇతర విషయాలమీద ఆసక్తి, తీరిక వుండదు" అని అన్నాడతను.

"మీ అంత గొప్ప ఆహార శాస్త్రవేత్తకు మా సేవలు ఇవ్వగలగడం సంతోషంగా వుంది.మీకు చాలా చక్కని రోబోట్ ప్రత్యేక శ్రద్ధతో అందిస్తాను. వివరాలు చెప్పండి" ఉత్సాహంగా ముందుకు వంగుతూ అన్నాడు సందీప్ రాజ్.

"పదిహేనేళ్ళ క్రితం కొత్తగా సైంటిస్టుగా చేరినప్పుడు ఒక పని అమ్మాయిని సహాయకురాలిగా పెట్టుకున్నాను. పని మనుషులకీ ఇంటి యజమానులతో సమాన స్థాయి, గౌరవం ఇవ్వాలనే 'పని గౌరవం చట్టం' వచ్చినతరువాత పని మనుషులతో చాలా సమస్యగా అనిపించి వారిని తీసివేసాను"

"నిజమే. అప్పటినుండే జనాలందరికీ రోబోట్స్ మీద ఆసక్తి పెరిగింది"

"ఆ తరువాత నా తల్లితండ్రుల సలహా మీద పెళ్ళి చేసుకున్నాను కానీ ఆమె జడురాలు అని తరువాత తెలిసింది. రెండు సార్లు 'గృహ అత్యాచారం చట్టం' క్రింద కేసు పెట్టింది. కిందా మీదా పడి విడాకులు పుచ్చుకున్నాను. నా జీతం లోంచి సగం ఆమెకు భరణంగా చెల్లిస్తూవస్తున్నాను" అన్నాడతను విచారగ్రస్థంగా.

"హుం. మీ సమస్య అర్ధం చేసుకోగలను. అలాంటి ఇబ్బందులు వుంటాయనే నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు. హాయిగా రోబోట్లతో కాలం వెళ్ళదీస్తున్నాను"

"అయితే నా అవసరాలు మీరు బాగా అర్ధం చేసుకుంటారు. నాకు సాధారణ విషయాలలోనే కాకుండా అన్ని విషయాలలో ఉపయోగకరంగా వుండాలి"

"మీరు ఇంకేం చెప్పనక్కర లేదు. మీ అవసరాలు అర్ధమయ్యాయి. మీకు తగ్గట్టుగా తయారుచేస్తాం. కాకపోతే ఖర్చు కొద్దిగా ఎక్కువవుతుంది. మీకు ఎవరిలాంటి రూపురేఖలు వున్నవారు కావాలి?"

"ఏ ఒక్కరి రూపు రేఖలతో వద్దులెండి. అలాయితే ఎవరి మనోభావాలు అయినా గాయపడొచ్చు. ఎందుకొచ్చిన ఇబ్బంది. రూపురేఖలకి ప్రాధాన్యత లేదు. అవసరం మాత్రమే ముఖ్యం అన్నది గుర్తుంచుకుంటే చాలు"

"అలాగే. తప్పకుండా. నెలన్నర రోజుల్లో రోబోట్ మీ ఇంట్లో వుంటుంది. దానిని ఎలా వుపయోగించాలనే సూచనలు కూడా ప్యాకేజీలో వుంటాయి"

"సంతోషం. నెలన్నర తరువాత నా సమస్యలు చాలా తీరుతాయన్నమాట" ఆనందంగా అన్నాడతను.

"షూర్. ఒక విషయం. ఈ రోబోట్లలో ప్రతి రెండు ఏళ్ళకీ ఒక క్రొత్త వర్శన్, ప్రతి పదేళ్ళకీ కొత్త తరం వస్తుంది. మీరు ప్రతి సారీ ఇబ్బందిపడకుండా ఆటోమేటిగా కొత్త వర్శనూ, కొత్త తరం రోబోటునూ మీకు అందించేలా చేయమంటే చేస్తాం. వర్శన్ అయితే సాఫ్టువేర్ పంపిస్తాము. కొత్త తరం అయితే కొత్త రోబోటుని పంపిస్తాము"

"అలాగే చేయండి. నాకు శ్రమ తగ్గుతుంది"

"దానితో పాటుగా సర్వీసు నిబంధనలు, కొత్త చట్టాలు తదితర సమాచారం కూడా పంపిస్తాము. అవి మీరు తప్పకుండా చదివితే మీకు ఉపయోగకరంగా వుంటుంది"

"ఏదీ చిన్న అచ్చులో వుండేవే కదా. కష్టమే. అయినా సరే ప్రయత్నిస్తా" బిగ్గరగా నవ్వుతూ అన్నాడతను.

సందీప్ రాజు కూడా బిగ్గరగా నవ్వాడు. "అవన్నీ ఎవరూ చదువుతారు లెండి. చదవాల్సిందింగా చెప్పడం చట్టపరంగా మా బాధ్యత"

"మీ బాధ్యత మీరు నిర్వర్తించారు. మీరు ఇక బిల్లు ఇస్తే నేను వెళతాను"

*****

పన్నెండున్నర ఏళ్ళ తరువాత బి పి ఎన్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది:

"ప్రసిద్ధ ఆహార జన్యు శాస్త్రజ్ఞులు విశాల్ మాధవ్ గారు రోబో హక్కుల చట్టం క్రింద అరెస్టయ్యారు. కొత్త తరం రోబోట్లపైన హింస, అత్యాచారాలు పెరిగిపోవడంతో ఒక ఏడాది క్రితం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసింది మీకు తెలిసిందే. ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు విశాల్ మాధవ్ గారి ఇంటిమీద దాడిచేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఎ బి పి వార్తా సంస్థ నుండి సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

కొత్త తరం రోబోట్ల చిప్స్ మానవ మెదడు కణజాలమయిన న్యూరాన్లతో తయారుచేసినందున వాటికి పన్నెండేళ్ళ వయసు పిల్లల ఆలోచనా శక్తి, మానసిక శక్తి వచ్చింది. రోబోట్ల నుండి ఫిర్యాదులు అధికం కావడంతో విశాల హక్కుల సంఘం వారు ఆందోళన చేసారు. ప్రభుత్వం కూడా సమస్య తీవ్రతని గుర్తించి జంతు హక్కుల చట్టం తరహాలో రోబో హక్కుల చట్టం చేసి దాని గురించి సమాచారం ప్రజలకు చేరువయ్యేలా పలు చర్యలు తీసుకున్నది. గొప్ప మేధావి అయిన విశాల్ మాధవ్ గారు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా ప్రవర్తించడం విస్మయంగా వుందని మా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు."

4 comments:

  1. The Robot that wrote this story had its Database corrupted. It cant distinguish bettween "Vishal Madhav" and "Vishal Bhardwaj"

    ReplyDelete
  2. ఇందులో మీరు ఏం చెప్పాలనుకున్నారో నాకయితే అర్థం కాలేదు. మీరు ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ దానిని చదవరనిపిస్తుంది (నేను కూడా అంతే.!!).

    చివరి నుండి రెండవ పేరాలో చూడండి...
    "ప్రసిద్ధ ఆహార జన్యు శాస్త్రజ్ఞులు విశాల్ మాధవ్ గారు రోబో హక్కుల చట్టం క్రింద అరెస్టయ్యారు"

    అందులోనే...
    "ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు విశాల్ భరద్వాజ గారి ఇంటిమీద దాడిచేసి రెడ్ హ్యాండెడ్...."

    మధ్యలో ఈ భరధ్వాజ ఎక్కడనుండి దూరాడు ?? :) :)

    మీ కథ ఎప్పుడో గుర్తు తెలియని భవిష్యత్తులో జరుగుతున్నట్లుగా రాసారు... అంటే ఆకాలంలో మనుషుల పేర్లు నిమిషాల్లో మారిపోతుంటాయా??

    నాకయితే అంతా గందరగోళంగా ఉంది.

    ReplyDelete
  3. @ భరద్వాజ్
    ఊప్స్. ఆ కథ వ్రాస్తున్నప్పుడు ఎందుకో మీ పేరు గుర్తుకువచ్చింది కానీ అక్కడ అది పెట్టేసా అనుకోలేదు. సవరించాను.

    @ ఏకలింగం
    మళ్ళీ ఊప్స్. కొన్ని కొన్ని పబ్లిష్ అయిన తరువాత కూడా కొన్ని సార్లు చదువుతాను కానీ పదం పదం పట్టి పట్టి చదవను కనుక ఇలాంటి పొరపాట్లు జరుగుతూనేవుంటాయి. సవరించాను. ధన్యవాదములు.

    ReplyDelete
  4. Hi Sharat,

    What is the meaning for this word "Jaduraalu" ? Did you derive this word from "Jadatvam" ? Is it a proper established word ? Just out of curiosity ....

    ReplyDelete