మనలో బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో!

పాశ్చాత్యదేశాలలో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్నప్పుడు బ్లయిండ్ స్పాట్స్ చూసుకోమ్మని బాగా చెబుతూవుంటారు. మనం లేన్ మారున్నప్పుడు కానీ, మలుపు తిరుగుతున్నప్పుడు కానీ ఇతర వాహనాలు ఏ అద్దంలోనూ కనపడని ప్రదేశాలు వుంటాయి - అటువంటి ప్రదేశాలని మనం తలతిప్పి చూసి పరిశీలించుకోవడాన్ని బ్లయిండ్ స్పాట్ చెకింగ్ అంటారు. ఇది డ్రైవింగులో చేయాల్సిన ముఖ్యమయిన పని.

మన దృష్టిలో కూడా ఇలాంటి స్పాట్స్ వుంటాయి. ఆ ప్రాంతం నిజానికి మన కళ్ళకు కనపడదు కానీ మిగతా చుట్టూ అంతా కనిపిస్తూనేవుటుంది కనుక ఆ ఏరియా కూడా మనకు కనపడ్డట్టే అనిపిస్తుంది కాబట్టి మనకు ఆ అనుమానం రాదు. ఒక్కో కన్నులో ఒక బ్లయిండ్ స్పాట్ వుంటుంది.

అలాగే మన జీవితాల్లో, వ్యక్తిత్వాల్లో అలాంటి గుడ్డి స్పాటులు వుంటాయి కానీ మనకు తెలియదు - అవి ఇతరులకు మాత్రమే తెలుస్తాయి. ఉదాహరణకు మీరు చెస్ ఆటనో, పేకాటనో, క్యారంస్ నో ఆడుతున్నారనుకోండి - ఆడుతున్న వారికంటే ఆట చూస్తున్నవారికి ఒక్కోసారి గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి.

అలాంటి మనలో మనకు తెలియని ఇటువంటి మూర్ఖపు విషయాలని మనకు తెలియజెప్పేవారినే నిజమయిన స్నేహితులు, శ్రేయోభిలాషులూ అంటాము. ఒక వ్యక్తి తెలిసి తెలిసి లేదా కావాలని కొన్ని పనులు చేస్తూ అవి మనకు మూర్ఖంగా అనిపిస్తే అవి వారి బ్లయిండ్ స్పాటులు అనలేము. వారి దృష్టిలో అవి సరి అయినవే కావచ్చు. ఉదాహరణకు లైంగిక విషయాల గురించి నేను రాయడాన్ని, మాట్లాడటాన్ని ఎవరయినా అది నాకు తప్పు అని ఎత్తిచూపితే అది నాలోని బ్లయిండ్ స్పాటును సూచిస్తున్నట్లు కాదు - ఎందుకంటే అటువంటి విషయాలు నాకు ఇష్టమయ్యి చేస్తున్నాను కాబట్టి.

నాలో వున్న నాకు తెలియని లోపాలని ఇతరులు ఎత్తి చూపితే అది నాలోని బ్లయిండ్ స్పాట్స్ ని తెలియచెప్పినట్లు. ఉదాహరణకు కొన్ని నెలల క్రితం ఒక బ్లాగర్ నాకు ఈమెయిల్ చేసారు. లైంగిక విషయాల గురించి సమాచారం, విజ్ఞానంపై లింకులు మీ సాధారణ బ్లాగులో ఎందుకండీ, వేరే అడల్ట్ బ్లాగులో పెట్టుకుంటే బావుంటుందేమో అని సూచించారు. అప్పటిదాకా నేనేమీ బూతు లింకులు ఇవ్వడం లేదు కదా, సభ్యమయిన సమాచారం, విజ్ఞాన పరమయినవే కదా ఆ లింకులు అని ఇస్తూ వచ్చాను. ఈమెయిల్ వచ్చాక ఆలోచించి వెంటనే ఆ లింక్స్ తీసివేసాను.

నిజానికి మనలోని లోపాలు మన మిత్రులు, శ్రేయోభిలాషులకంటే మరొకరు చక్కగా ఎత్తిచూపుతారు. ఎవరు వారు? ఊహించగలరా? అజ్ఞాతలు. చెబితే మనం నొచ్చుకుంటామనో లేదా మన మనస్సు గాయపడుతుందనో లేదా చెప్పిన వారి మీద చెడు అభిప్రాయం కలుగుతుందో ఏమో అని చాలామంది మిత్రులు మన లోపాలని మనకు చెప్పరు - పైగా కొంతమంది మనస్సులో హేళనగా నవ్వుకుంటారు. బ్లాగావరణంలో అజ్ఞాతలకి అటువంటి ఇబ్బంది వుండదు కాబట్టి హాయిగా చెప్పేస్తారు. మన శ్రేయోభిలాషులు కూడా ఎదురుగా చెప్పలేక అలా అజ్ఞాతంగా సూచిస్తారు. నెట్టులో కాబట్టి అజ్ఞాతం బాగానే వర్కవుట్ అవుతుంది కానీ నిజ జీవితంలో అలా అజ్ఞాత సలహాలు అందే అవకాశం తక్కువ.

ఇక బ్లాగావరణంలో కూడా ఈ మనిషి చెబితే సవరించుకుంటాడు అన్న అభిప్రాయం కలిగినప్పుడే అలాంటి సూచనలు వస్తుంటాయి. పొగరుగా వుంటే ఎవడు పట్టించుకుంటాడు - కావాలని కెలుక్కునే వాళ్ళు తప్ప. అలా అజ్ఞాతలనుండి నాకు చాలా విలువయిన సూచనలు, సలహాలు వచ్చాయి. వారికందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ నాకు రుచించకపోవచ్చు కానీ వాటిల్లో ఏమాత్రం నిజం వుందనుకున్నా నేను మారాను, మారతాను కూడా. మీరు చెప్పినవన్నీ చేయకపోవచ్చు కానీ మీరు నా బాగుకోరి మీ సమయం వెచ్చించి హితం చెప్పారని గుర్తుంచుకుంటాను. ఇక దురుసుగా, తిట్లతో వచ్చే అజ్ఞాతలది వేరే విషయం. వాటిల్లో కూడా ఏమయినా విషయం వుంటే ఆలోచిస్తాను.

నాలో అయితే ఇతరులకు ఎలా లోపాలు కనిపిస్తాయో అలాగే ఇతరులలో నాకు లోపాలు కనపడటం సహజం కదా. ఒక బ్లాగరు సాధారణ జనాన్ని హేళన చేస్తూ వ్రాస్తూ మేధావిలాగా కనపడటానికి యత్నిస్తుంటారు - మరొకరు ఎప్పుడో సిస్టం ముందే కూర్చున్నట్లు అనిపించి కుటుంబానికి తగిన సమయం ఇవ్వగలుగుతున్నారా అనిపిస్తుంటుంది. ఇంకా అలా ఎన్నో. అవన్నీ నేను అజ్ఞాతంగా చెప్పలేను, ఎదురుగా చెప్పలేను - చెప్పినంత మాత్రం వింటారా - వారి ధోరణి, లోపాలు వారికి తెలియకనా అనిపిస్తుంది.

(Edited. ఈ టపాలోనే ఒక బ్లయిండ్ స్పాట్ వుందని కొంతమంది సూచించారు. అందుకని ఈ పేరాని, దానికి సంబంధించిన వ్యాఖ్యలని తొలగించడమయినది)

సో, ఎందుకయినా మంచిది మీలో ఏమయినా బ్లయిండ్ స్పాట్స్ వున్నాయేమో చూసుకోండి లేదా మీలో నాకేమయినా కనిపించేయేమో అడగండి :) - అలాగే నాలో ఏమయినా మీ దృష్టికి వస్తే నాకు చెబుతూ వుండటం మరచిపోకండేం!

పెరుగులో నెయ్యి - రివర్స్ ఇంజినీరింగ్

కొన్ని టపాల క్రితం నా యుక్తవయస్సులో నేను లావుకావడానికి చేసిన ప్రయత్నాలు చెప్పా కదా. మీకు గుర్తుండేవుంటాయి. అందులో భాగంగా పెరుగులో నెయ్యి వేసుకొని అన్నం తింటే నేను లావుకావడం మాట అటుంచి బుల్లి పొట్ట మాత్రం తయారయ్యిది. ఇప్పుడిక కొంత వయస్సు వచ్చింది కాబట్టి ఆ బుల్లి బొజ్జను తగ్గించకపోతే ముందుముందు భయంకరమయిన డయాబెటిస్ (ఎయిడ్స్ అన్నా భయపడనేమో కానీ అదంటే నాకు భయ్యం) మొదలయినవి రావచ్చని అక్కడా ఇక్కడా చదవుతున్నా. ఆ క్రమంలో అహార మార్పులు, శారీరక శ్రమ గట్రా చేసేస్తున్నాను.

వరి అన్నం తగ్గించి గోధుమ రొట్టెలు/ చపాతీలు తినడం మొదలెట్టాను. వాటికంటే పళ్ళు తినడం బెటరని తెలిసి పళ్ళు ఎక్కువ చేసాను. వాటికంటే కూరగాయలు మంచిదని తెలుసుకొని కూరగాయలు ఎక్కువ చేసాను. ఇక్కడ వచ్చింది చిక్కు. పచ్చి కొరగాయలు ఎలా తినాలి? సరే, మైక్రోవేవ్ ఓవెన్ లో ఉడికించుకుంటూ తింటున్నా. పదేపదే కూరగాయలు కోయమంటే మా ఆవిడ విసుక్కుంటోంది. అలా లాభం లేదని గ్రోసరీ షాపుల్లో నుండి కట్ చేసిన కూరగాయ ప్యాకెట్టులు తెచ్చుకొని లాగిస్తున్నా. ఇంతవరకూ బాగానే వుంది కానీ అలా ఉడికించిన కూరగాయలు రుచికరంగా వుండవు కదా. అక్కడొచ్చిందీ సమస్య!

మీరయితే ఏం చేస్తారేమిటి? నేను సమస్యా పరిష్కారం కోసం తపస్సు చేసా. అప్పుడు నాకు కలలో ఒక అందమయిన దేవత కనిపించి చిన్నప్పుడు లావుకావడానికి పెరుగులో నెయ్యి కలుపుకొని తాగిన నా వైనం గుర్తుకుచేసి దాంట్లోనే పరిష్కారం దొరుకుతుందని తెలియజేసి అంతర్ధానం అయిపోయింది. చప్పున కళ్ళు తెరచి తపస్సులోంచి బయటకి వచ్చా. పెరుగు - నెయ్యి - నెయ్యి - పెరుగు అనుకుంటూ ఆలోచిస్తూ పోయా. అప్పుడు జ్ఞానోదయం అయ్యింది.

ఉడికించిన కూరగాయలకి చట్నీ అద్దుకొని తినడం మొదలెట్టాను. ఇంకా అలా కాదని ఆ కూరగాయల గిన్నెలో ఇంట్లో ఏదుంటే అది కూర, చారు, చట్నీ, పచ్చళ్ళు అన్నీ పడేసుకోని తింటూ వుంటే నా సామి రంగా రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలా తింటూ వుండటాన్ని మా ఆవిడ వింతగా చూసి కూరగాయల సాంబారుకీ, దీనికీ ఏం తేడా వుందని పొరపాటున అడిగింది. అప్పుడు నాకు ఒక దివ్యమయిన ఆలోచన వచ్చింది. అప్పటినుండీ మా ఇంట్లో ఎప్పుడు సాంబార్ చేసినా నేను అందులో కూరగాయల ముక్కలు మిగలనివ్వడం లేదు. నా ఈ ఆరోగ్యవ్రతాన్ని ఇంట్లో కొంతమంది సహించక కుట్ర పన్ని వంటకాగానే కొంత సాంబార్ దాచేసుకుంటున్నారని అభిజ్ఞవర్గాల ద్వారా అనగా అమ్మలు అనగా మా చిన్నమ్మాయి ద్వారా భోగట్టా.

సాధారణంగా సగటు మనిషికి రోజుకి 2000 క్యాలరీల శక్తికి తగ్గ ఆహార పదార్ధాలు కావాలి. దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట. అలా తగ్గించాలంటే ఇలా ఏవో కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత మెటబాలిజం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు వారు ఈ టపాని లైటుగా తీసుకొని నవ్వుకొవచ్చేమో గానీ మీకు నలభై దాటి కూడా నవ్వుకొని వదిలేసారనుకోండి - ప్చ్, లాభం లేదు.

వుండాల్సింది మానసిక సారూప్యత

చాలా జంటలని పరిశీలించిన పిమ్మట నాకు అర్ధమయ్యిందేమిటంటే జంటల మధ్య (దంపతులు/ ప్రేమికులు/ సహ జీవనం చేస్తున్నవారు) ముఖ్యంగా వుండాల్సింది మానసిక సారూప్యత అని. పెళ్ళి చేసుకోబోయే యువతీ యువకులు తమకాబోయే పార్ట్నర్ లోని చాలా విషయాలని బేరీజు వేస్తారు కానీ దీనిని మాత్రం పెద్దగా పట్టించుకోరు.

సాధారణంగా పెళ్ళిళ్లలో కులం, మతం , డబ్బు. హోదా,ఆదాయం, పేరు, ప్రతిష్ట, మంచితనం గట్రా గట్రాలకే విలువ వుంటుంది కానీ ఎదుటి వ్యక్తి తమ ఆలోచనా రీతులకు ఎంతగా సరిపోలుతారు అన్న విషయం పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కొన్ని ఏళ్ళ క్రితం విన్న ఒక సర్వే రిజల్ట్ ప్రకారం సైక్లాజికల్ ఫ్రీక్వెన్సీ బాగా మ్యాచ్ అయిన దంపతుల జీవనాలే ఎక్కువ సుఖంగా వుంటున్నాయిట.

ఇద్దరు వ్యకులు మంచివారు అయినా వారి దాంపత్యజీవనం మంచిగా వుండాలని లేదు. తేడా ఎక్కడ వస్తుంది? ముఖ్యంగా ఇక్కడే. అలోచనా రీతుల్లో, భావాల్లో, ఆసక్తులలో తేడా. రాజీ పడవచ్చు - కానీ అది ఎంత శాతం? అన్ని విషయాలలో జీవితాంతం రాజీ పడుతూపోతే జీవితం నిస్సారంగా అవుతుంది. మింగలేని కక్కలేని బ్రతుకయ్యి జీవితం ముసుగులో గుద్దులాటవుతుంది.

అందుకే పెళ్ళి చేసుకోబోతున్నవారికీ, ప్రేమలోకి దిగబోతున్నవారికీ నాదయిన సలహా ఇది. మీ మధ్య సైకలాజికల్ ఫ్రీక్వెన్సీ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూసుకోండి. 60% కంటే తక్కువ సరిపోలితే కష్టమే. 30% కంటే తక్కువయితే ఆ వ్యక్తిని పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది. 80% కంటే ఎక్కువ మ్యాచ్ అయితే మీది చాలా చక్కటి దాంపత్యం అవవచ్చు - అలా అని 90% కంటే ఎక్కువ మ్యాచ్ అయినా మీ జీవితాల్లో వైవిధ్యం వుండకపోవచ్చు.

పెళ్ళి చూపుల్లోనూ, వీలయితే అక్కడ మాట్లాడుకొనే కొద్ది సేపట్లోనూ ఎదుటివారి గురించి మనకు చాలా అవగాహన వస్తుంది అనుకోవడం పొరపాటు. అలాగే ప్రేమ గుడ్డిది కాబట్టి పెళ్ళయి వేడి చల్లారేంతవరకు వ్యక్తుల మధ్య వైరుధ్యాలు అర్ధం కావు. ఒక విపులమయిన ప్రశ్నావళి తయారు చేసుకొని ఇద్దరి ఆలోచనా విధానం కలుస్తుందా లేదా అన్నది బేరీజు వేసుకోవడం అన్నది దీనికి ఒక పరిష్కారం కాగలదు.

కొన్ని ఉదాహరణ ప్రశ్నలు:

అ. విజయవంత అయిన వ్యక్తి
1) డబ్బు వున్నవాడు 2) పేరు వున్నవాడు 3) మంచి వ్యక్తిత్వం వున్నవాడు

ఆ. ఈ జీవితం మీకు బాగా నచ్చుతుంది
1) నగర జీవితం 2) పల్లె జీవితం 3) ఆశ్రమ జీవితం

ఇ. ఈ సినిమాలు మీకు బాగా నచ్చుతాయి
1) అవార్డ్ సినిమాలు 2) కాలక్షేపం సినిమాలు 3) సెంటిమెంటు సినిమాలు

కేవలం పై మూడు జవాబులని బట్టి అంచనా వేస్తే కాలక్షేపం సినిమాలే బాగా ఇష్టమయ్యి, నగర వాతావరణమే బాగా నచ్చి డబ్బు వున్నవారే గొప్పవారనుకొనే ఒక అబ్బాయికి పల్లె వాతావరణం బాగా నచ్చి, మంచితనం ముఖ్యం అనుకునే, అవార్డ్ సినిమాలు నచ్చే అమ్మాయి దొరికిందనుకోండి. వారి వైరుధ్యాల జీవితం ఎలా వుంటుందో - అసలు దానిని దాంపత్యం అంటారో లేక దాంపత్యం వున్నా రూం మేట్స్ అనొచ్చో మీరు ఊహించుకోవచ్చు.

హ్మ్మ్. పెళ్ళికి ఇంత దృశ్యం అవసరమా అని మీరనుకుంటే కనీసం ఆ అభిప్రాయంతో నన్నా ఏకీభవించే పార్ట్నర్ ని చేసుకోండి. ఎందుకంటే కనీసం ఒక్క విషయంలోనన్నా మీలో సారూప్యత వుంది - జీవితంలో ముఖ్యవిషయాలను లైట్ తీసుకోవడం. మీరిద్దరూ అలాంటివారయితే కొంతవరకు నయమే కదా.

డెంటల్ ఫ్లాసింగ్ - మెంటల్ ఫ్లాసింగ్


రోజూ శుభ్రంగా పళ్ళు తోముకుంటే 50 %, రోజూ ఫ్లాస్ చేస్తే 70 %, ఏడాదికి రెండు సార్లు డెంటిస్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు శుభ్రం చేయించుకుంటే పళ్లల్లో ప్లేక్ చాలా వరకు తొలగిపోయి 90% మన పళ్ళు ఆరోగ్యంగా వుంటాయిట. ఓ సన్నటి దారం లాంటి దానితో పళ్ళ చిగుళ్ళకూ, పళ్ళకూ మధ్య వుండే ప్లేక్ (పాచి) ని తొలగించడాన్ని ఫ్లాసింగ్ అంటారు.

ఈ డెంటల్ ఫ్లాసింగ్ గురించి ఇండియాలో వున్నప్పుడు తెలియదు కానీ నార్త్ అమెరికాకు వచ్చిన దగ్గరినుండీ ఒహటే డెంటిస్టుల నస. ఎప్పుడు పళ్ళ పరీక్షకి వెళ్ళినా హైజినిస్టులూ, డెంటిస్టులూ సుతిమెత్తగా నన్ను మందలిస్తుంటారు. మనది దున్నపోతు మనస్తత్వం - వింటే కదా. చాలా సార్లు ప్రయత్నించాను కానీ అది ఒక అలవాటుగా చేస్కోవడం మాత్రం నావల్ల ఒక పది ఏళ్ళుగా అవలేదు. ఈ డెంటిస్టుల మృదువైన హెచ్చరికలూ, మందలింపులూ తినకా తప్పడం లేదు.

ఈ మధ్య ఒక క్రొత్త డెంటిస్ట్ దగ్గర చేరాను. అక్కడ ఒక దేశీ హైజినిస్ట్ నాకు సేవలు చేస్తుంటుంది. అంత అందగత్తె కాదు గానీ బాగా మాట్లాడుతుంది. గుజరాతీ. నేను డెంటల్ ఫ్లాసింగ్ చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు ఐమాక్స్ సినిమా లెవెల్లో దృశ్యం చూపించింది. హడలిపోయి ఫ్లాసింగ్ అనేది అలవాటుగా చేసుకోవడానికి ఈమధ్య బాగానే కష్టపడుతున్నాను. ఆగస్ట్ 20 న మళ్ళీ పళ్ళ పరీక్ష వున్నప్పుడు రిజల్ట్ చూస్తానంది ఆమె.

రోజూ డెంటల్ ఫ్లాసింగ్ చేస్తూవుంటే పళ్లకి ఎలా అయితే మంచిదో అలాగే రోజూ మెంటల్ ఫ్లాసింగ్ చేస్తే మనస్సుకి మంచిదంటారు. అయితే అది ఎలా చేయాలి? సింపుల్. రోజూ నా బ్లాగు పారాయణం చేయండి.

మా అమ్మగారి 'సహజ' మార్గం Vs మా మామగారి 'అచల' మార్గం

సహజమార్గం: మా అమ్మగారు చాలా ఏళ్ళనుండీ సహజమార్గం పాటిస్తున్నారు. మా నాన్నగారు (వారిది నాస్తిక మార్గం లెండి) జరిగిపోయి తొమ్మిదేళ్ళు కావస్తుండటంతో ఆ తరువాత సహజమార్గం కార్యక్రమాలకి ఎక్కడికయినా వెళ్ళడానికి బాగా వీలు కలిగింది. చాలా వివరాలు, విశేషాలు చెబుతూవుంటుంది కానీ నాకు ఆయా విషయాలపై ఆసక్తి లేనందువల్ల పెద్దగా గుర్తుండవు. సత్కోల్ తదితర ప్రదేశాలకు, హిమాలయాలలో వున్న కేంద్రానికీ వెళ్ళివస్తుంటుంది. మా నాన్నగారు స్వాతంత్ర్య సమర యోధులు కాబట్టి అందువల్ల వచ్చిన రైల్వే పాస్ అమ్మగారి ప్రయాణాలకు చాలా సౌకర్యంగా వుంది.

యథాశక్తి మా అమ్మగారు నన్ను అందులోకి మార్చాలనుకుంటుంది కానీ నాది వేరే మార్గం కాబట్టి తప్పించుకుంటూవుంటున్నాను.

అచల మార్గం: ఇక మా (పిల్ల నిచ్చిన) మామగారిది అచల మార్గం. వారు దానికి రాష్ట్రాధ్యక్షులు. పెళ్ళయిన మరునాడే నన్ను పట్టుకొని ఒక మూడు గంటలు బోధ చేసారు. ఆ తరువాత ఎలాగో తప్పించుకున్నాను. వారిది అచలం మార్గం అయితే నాది చలం మార్గం అని ఎలా చెప్పేది? చెబితే బావుండదని అప్పుడు చెప్పలేదు కానీ మరో సారి చెప్పి ఎందుకయినా మంచిదని ఆ టాపిక్ పెద్దగా పెరగకుండా కట్ చేసాను.

ఈమధ్యే మా మామగారు మా దగ్గరికి (యు ఎస్ కి) వచ్చారు. వారికి మా ఇంటి ప్రక్కనే వుంటున్న ఒక అంకుల్ పరిచయం అయ్యారు. వారిది సహజ మార్గం. ఇద్దరూ రోజూ కలుసుకొని పాదయాత్రలు చేస్తూ అద్ధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటారు. ఒకరి మార్గంలోకి మరొకరిని మార్చాలని ప్రయత్నిస్తూవుంటారు. చూద్దాం ఎవరు గెలుస్తారో! ఆ అంకుల్ కూడా నన్ను ఆ మార్గంలోకో ఈ మార్గంలోకో మారమని ఉద్బోధ చేస్తుంటారు. నాకు కూడా చలం మార్గం గురించి వారికి ఉపదేశం చేయాలని వుంటుంది కానీ ఇప్పుడు వారికి అది అంత అవసరమా అని వారి మాటలు వింటూ వుంటాను.

ఈ రోజే తెలిసింది - కొంత మంది బ్లాగర్లు సహజమార్గీకులని. సంతోషం అనిపించింది - ఎందుకంటే మా అమ్మగారి మార్గం కూడా అదే కాబట్టి. మీలో అచల మార్గీకులెవరయినా వుంటే నాకు తెలియజేయండి. మా మామగారిని పరిచయం చేస్తాను - లేదా మా మామగారు మీకు ఇప్పటికే తెలిసివుండవచ్చు.

Update: సహజ్ మార్గ్ దేశదేశాలలో బాగా విస్తరిస్తోంది. దాని గురించి రామరాజు గారు ఒక లింక్ అందించారు. చూడండి.

http://www.srcm.org/index.jsp


అచల మార్గం పెద్దగా వ్యాప్తిలో లేదు. వారికి సంబంధించిన వెబ్ సైట్లు కూడా పెద్దగా లేవు. ప్రస్తుతానికి ఒకే ఒక వెబ్ సైట్ వుంది.

http://brahmanirvan.org/docs/index.htm

నే వ్రాసిన ఒకే ఒక్క ప్రేమలేఖ

అప్పట్లో సూర్యాపేటలో వుంటుండేవారం. మా స్నేహితుడి ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళు కిరాయికి వుంటుండేవారు. కొద్దిగా స్నేహం ఏర్పడింది. డిగ్రీ చదువుతుందామె. నేను పూణే లో పి జి చేస్తూ సెలవుల్లో ఇంటికి వస్తుండేవాడిని. ఆమె డైనమిజం, ఉత్సాహం, చురుకుదనం నాకు బాగా నచ్చాయి. కొంతకాలం ఆమెని పరిశీలిస్తూ వచ్చాను. నా అభిరుచులకి తగ్గ అమ్మాయి అని ధ్రువీకరించుకొని ఒక ప్రేమలేఖ వ్రాసి పూణే నుండి సూర్యాపేటలో వున్న మా స్నేహితుడికి పోస్ట్ చేసి ఆమెకి అందించమని చెప్పాను.

సహజంగానే ఆత్రుత. కొద్దిరోజులయ్యక మా ఫ్రెండుకి ఫోన్ చేసి కనుక్కున్నాను - రిజల్ట్ ఏమయ్యిందనీ. నెగటివ్. ఇప్పట్లో ప్రేమించే ఉద్దేశ్యం లేదని ఆమె స్పందన. కాస్త నిరాశ పడ్డా ఆమె పై పీకలోతు ప్రేమలోకి ఏమీ మునిగిపోలేదు కాబట్టి పెద్దగా దాని గురించి బాధ పడలేదు. లైట్ తీసుకున్నాను. ఇంకేముంది - మరో చక్కని అమ్మాయి కోసం అన్వేషణ. ఆ అన్వేషణ నడుస్తుండగానే మా స్నేహితుల, బంధువుల ప్రోద్బలంతో కొన్ని పెళ్ళి చూపులు. ఆ విశేషాలు మళ్ళెప్పుడన్నా.


ఆ తరువాత కొద్ది నెలలకి సెలవుల్లో పూణే నుండి ఇంటికి వచ్చాను. ఒక రోజు సూర్యాపేటలో కాంగ్రెసు వారి ప్రతిష్టాత్మకమయిన రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ఒకటి జరుగింది. దానికి కొంతమంది జాతీయనాయకులు కూడా వచ్చినట్టున్నారు. మా స్నేహితుని ఇల్లు ఆ సభ జరిగే ప్రదేశానికి దగ్గర్లో వుండటంతో మా ఫ్రెండుతో కలిసి వాళ్ల ఇంటి డాబా మీది నుండి ఆ సభని చూస్తూ వుండగా వెనుకనుండి నా తల మీద ఎవరో ఠపీ మని ఎవరో కొట్టారు! ఎవరా అని చూద్దునుకదా ఆ అమ్మాయి! ఆశ్చర్యపడి, సంతోషపడ్డాను. కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం. నా ప్రేమలేఖ ప్రస్థావన ఇద్దరమూ తేలేదు.

ఆ తరువాత కొద్ది నెలలకే నా పెళ్ళి జరగడమూ, కెనడాకి వెళ్ళడమూ జరిగిపోయాయి. ఇండియాకి వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మాయి గురించి కనుక్కుంటూ వుంటాను. సూర్యాపేటలోనే వుంటూ అక్కడి దగ్గరి గ్రామంలో ఉపాధ్యాయురాలిగా చేస్తోందిట. క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు మా ఇద్దరినీ కలపాలని మా ఫ్రెండు ప్రయత్నించాడు కానీ కుదరలేదు. ఈ సారి వెళ్ళినప్పుడు ఆమెను ఎలాగయినా కలవాలి. ఆమె సమక్షంలో కొద్దిసేపు ఆహ్లాదకరమయిన గతంలోకి వెళ్ళాలి. అప్పుడు నన్నెందుకు తిరస్కరించేవూ అని చిలిపిగా ఆరాలు తీయాలి.

నేనూ మఠంలో చేరిపోతా..చేరిపోతా.. నన్ను ఆపేదెవరు?

ఈ మధ్య బైరాగులు, మఠం, బైరాగుల మఠం మన బ్లాగావరణంలో చాలా ఫేమస్ అయిన విషయం అందరికీ తెలిసేవుంటుంది. ఈ మధ్య రమణి, మార్తాండల వివాదం తరువాత నాకు జీవితం అంటే చాలా విరక్తిగా అనిపించింది. జీవితం ఏంటో నిస్సారంగా జిందగీ ముష్కిలే - కమాల్ హై అనిపిస్తోంది. అందుకే నేనూ మఠంలో చేరిపోవాలనుకుంటున్నాను. సరేలే మరీ అంత తొందరేం వచ్చిందని నిన్న నిగ్రహించుకున్నా ఇవాళ ఉదయం లేచేసరికి మార్తాండ గారి ప్రతిరూపం అయిన నాదెండ్ల గారి పోస్టు, దానికి వచ్చిన 60 పైచిలుకు వ్యాఖ్యలు చూసిన తరువాత నాకు విరక్తి ఎక్కువయ్యింది. నేను చేరిపోతా. దయచేసి నన్నాపకండి. ప్లీజ్. సన్యాసులు కూడా బ్లాగులు రాయొచ్చో లేదో ఇంకా గూగుల్ లో రిసెర్చ్ చేయలేదు - ఈ టపా అయిపోయాక అదేపనిలో వుంటాను.

నాకెందుకో నాదెండ్లా, మార్తాండా ఒక్కరేనని అనిపిస్తోంది. నిజమే అంటారా లేక నా కళ్ళకి ఏమయినా మాయ మార్తాండ మబ్బులు కమ్మాయేమో అర్ధం కావడం లేదు సుమీ.

నేను బైరాగుల మఠంలో చేరాలని ఆలోచిస్తున్నానని ఇదే సందనుకొని కొన్ని విదేశీ శక్తులతో సహా కొన్ని కె బ్లా స స్వదేశీ శక్తులూ నన్ను అందులోకి తోసేయడానికి ప్రయత్నించవచ్చు. వాళ్ల కుట్రలు గమనిస్తూ వుండమని మీకు విజ్ఞప్తి. అధ్యక్షుల వారికి నేను ఎక్కడ పోటీగా తయారవుతానేమో అని కాస్త బెదురుగా వున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా భోగట్టా. అలాగే మరి కొందరికి సిద్ధాంతకర్త పదవి మీద కన్ను పడి నన్ను ఎలాగయినా సన్నాసుల్లో కలపాలని కొంతమంది లింగమంతులు చాలాకాలం నుండి కుట్రలు కుతంత్రాలు చేస్తూనేవున్నారని మీకు ఈ సందర్భంగా సవినయంగా మనవిచేసుకుంటున్నాను. వీళ్లందరికీ పాదాబివందనాలు చేసే సీను లేదు కానీ పదవి అంటే మాత్రం మోజు. ఎనీ వే, వీళ్ళ కలలు ఈ సరికొత్త వివాదం కారణంగా తీరుతున్నాయి.

నాకో మాంఛి మఠం సూచించండి. చలం లాగా రమణశ్రమంలో చేరమంటారా? అందులో అందమయిన సన్యాసినులు వుంటారంటారా? అహ ఏమీ లేదు మాటవరుసకి అడుగుతున్నానంతే. మఠంలో చేరేముందు మా కుటుంబ సభ్యులకు ఒక లేఖ వ్రాసి పెట్టి వెళతాను. నేను సన్యాసుల్లో కలవడానికి మార్తాండ, రౌడీ, ఏకలింగం గట్రాలు బాధ్యులనీ కావాలంటే వారిమీద కేసేసుకోవచ్చనీ వ్రాసివెళతాను.

ప్లీజ్. నన్నాపకండి. మీరు ఏమాత్రం ఆపాలని ప్రయత్నించినా నేను U టర్న్ తీసుకొని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

బొజ్జ భారతం

గత వారం పిట్స్బర్గ్ లో ఒక ఫంక్షనుకి వెళ్ళాను. అక్కడ బంధుమిత్రులందరూ కలిసారు - నన్ను చూసి బక్కగా అయ్యావన్నారు - సంతోషమనిపించింది. ఎందుకంటే నా శరీరానికి రోజుకి 1700 కాలరీలు అవసరం (ఒక సగటు వ్యక్తికి రోజుకి 2000 క్యాలరీలు అవసరం). డైటింగ్ చేసో, ఎక్సరసైజులు చేసో మొత్తం మీద నా శరీరానికి అంతకంటే తక్కువ కాలరీలే అందిస్తూ సన్న బడుతూ వున్నాను. తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారనీ నిన్ననే మళ్ళీ ధ్రువీకరింపబడిందనేది మీకు తెలుసా?

సన్నబడటం సంతోషమే కానీ నాకున్న చిన్ని బొజ్జ మాత్రం తగ్గిందని ఎవరూ అనలేదు. ఆ కాస్త బొజ్జనీ తగ్గించమని ఎప్పటినుండో మా ఆవిడ నస. ఆ పనిలోనే వున్నాను కానీ మిగతా శరీరం అంతా తగ్గుతోంది కానీ బొజ్జమాత్రం తగ్గడం లేదు :(

ఒక రోజు రెస్టు రూములో తపస్సు చేస్తూ నాకు ఈ చిన్ని బొజ్జ ఎక్కడినుండి వచ్చిందా అని పరిశోధిస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను.

ఫ్లాష్ బ్యాక్:
నేను చిన్నప్పటినుండీ చాలా సన్నంగా వుండేవాడిని. యుక్తవయస్సులో కూడా అలాగే పీలగా వుంటూ వుండటంతో నామీద నాకే వళ్ళు మండి ఎలాగయినా కండలు పెచాలని డిసైడ్ అయిపోయా. అసలు వంట్లో ఏమన్నా వుంటే కదా కండలు తయారయ్యేది! ముందు వళ్ళు పెంచి ఆ తరువాత ఆ వళ్ళుని కండలుగా మార్చాలని తీర్మానించా. దానికి ఒక వ్యూహం పన్నాను. ఏమిటంటే నెయ్యి, వెన్న, బీరు, మాంసం బాగా తీసుకోవాలని. భోజనంలో నెయ్యి బాగా వేసుకుంటే కూర బాగా చప్పగా అనిపించేది. అందుకో ఉపాయం పన్నాను - పెరుగుతో పాటుగా బోల్డెంత నెయ్యి కుమ్మరించుకునేవాడిని.

మా క్లోజ్ ఫ్రెండ్ రమేష్ కి ఒక బార్ షాప్ వుండేది. అక్కడ తెగతింటూ, తాగుతూ బాగా లావవుతూ సన్నబడాలని అనుకునేవాడు. వాడికి ఒక ఐడియా ఇచ్చి అది నీ జీవితాన్నీ, నా జీవితాన్నీ మార్చేస్తుందని చెప్పాను కానీ విన్నాడు కాదు.

వాడికి నేను ఇచ్చిన ఐడియా ఇది. రోజూ నీ బీర్ షాపులోనుండి ఒకటో రెండో బీర్లు నాకు తాగించు - ఉచితంగా నేను రోజూ మీ షాపులోని బీర్లు తాగేస్తున్నాననే బాధతో నువ్వు సన్నబడతావు. తేరగా వస్తున్న బీర్లు రోజూ తాగి నేను లావు అవుతాను.


మొత్తం మీద రోజూ నెయ్యి, మాంసం, బీర్లు, స్వీట్లు గట్రా ఆరగించే కార్యక్రమం కొన్ని నెలలపాటు దిగ్విజయంగా నడించింది. ఎంత ప్రయత్నించినా వళ్ళు మాత్రం పెరగలేదు - పొట్ట మాత్రం బాగా పెరిగింది. ఆ పెరిగిన పొట్టతో వ్యాయామం చేయడం కష్టం అనిపించి ఆ ఆలోచన పక్కకుపెట్టేసాను.
ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.

ఆ పొట్టనే ఇన్నాళ్ళూ మోసుకుతిరుగుతున్నననే విషయం జ్ఞానోదయం అయ్యింది. అప్పుడే కనుక అలా పెరుగులో నెయ్యోసుకొని లాగించి వుండకపోతే ఇప్పుడు ఎంచక్కా ఫ్లాట్ టమ్మీతో వుండేవాడిని కదా అని రెస్టు రూములో మౌనంగా రోదించి కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చాను.

బొజ్జవుంటే ముందు ముందు రకరకాల గుండే జబ్బులూ, చెక్కెర వ్యాధి గట్రా వస్తాయిట. తగ్గించాలి -తగ్గించాలి - అదే పని మీద వున్నాను. అప్పుడప్పుడు నా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయని కుశలం అడుగుదురూ.

నీతి: పెరుగులో నెయ్యి వేసుకొని భోజనం లాగించరాదు - ముందు ముందు గుండె జబ్బులు, చక్కెర వ్యాధి వచ్చును.