భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 3

ఫ్లాష్ బ్యాక్:

మేము సూర్యాపేటలో వుంటున్నప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వచ్చింది. మనకు బాగా తెలిసినవారు అని చెప్పింది మా అమ్మ. ఆంటీ కూడా అల్లుడా అల్లుడా అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. వాళ్ళ ఇంటికి రమ్మంది. వెళ్ళాను. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. భర్త జరిగిపోయాడు. పెద్ద అమ్మాయి (విశాల), కొడుకు (విక్రం) ఇంటర్ మొదటి సంవత్సరం - గ్రూపులు వేరే. చిన్నకూతురు వైదేహి ఏడు చదువుతుండేది. ఆ కుటుంబం చూపినే ఆప్యాయత, ఆదరణ నాకు బాగా నచ్చాయి. త్వరలోనే అందరమూ బాగా సన్నిహితం అయ్యాము. విక్రం, విశాలలు మా ఇంటి దగ్గరే వున్న లెక్చరర్ దగ్గరికే ట్యూషనుకి వస్తుండటముతో వారి స్నేహితులు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు.


నాకు విశాల బాగా నచ్చింది. మరీ గొప్ప అందగత్తె కాకపోయినా చక్కటి వ్యక్తిత్వం. ప్రేమిస్తే పోలా అనుకునేవాడిని కానీ ఇప్పుడే ఎందుకులే అని ఆమెను పరిశీలిస్తూ వుండిపోయాను. అలా కొన్నాళ్ళు గడిచాయి. విశాల ఇంటర్ రెండో సంవత్సరంలోకి అడుపెట్టింది. ఆమె ఫ్రెండు అయిన సందీప్ నాకు కూడా బాగా క్లోజ్ అయ్యాడు. అతను ఒకరోజు తనకు - విశాలకి వున్న ప్రేమ బంధాన్ని చెప్పి నా సహకారం అడిగాడు. అలా నేను ప్రేమించాలనుకున్న ప్రేమను త్యాగం చేసేసి వారిద్దరి ప్రేమకు నేను క్యారెక్టరు (ఆర్టిస్ట్) అయ్యాను.


ఇంకేముంది - వారిద్దరి ప్రేమ కథ శరా మామూలే. కులం తేడాల వల్ల అటు వైపు, ఇటు వైపు పెద్ద వారు ఒప్పుకోకపోవడముతో వాల్లకూ వీళ్ళకూ సర్దిచెప్పలేక నాకూ, ఇంకో ఫ్రెండుకూ తలలు బొప్పికట్టాయి. గొడవలు, వాదులాటలు, ఆత్మహత్యా ప్రయత్నాలు మామూలు అయ్యాయి. ఇలా లాభం లేదని ఒక శుభ ముహూర్తాన ఆ ప్రేమ జంటను బస్సెక్కించి మేము ఇద్దరమూ ఏమీ ఎరగనట్టు నటించాము.


వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పమంటూ పెద్దల వేధింపులు మా మీద ఎక్కువయ్యాయి. ఈలోగా ఆ ప్రేమ జంట ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుంది. సందీప్ తల్లితండ్రులు కాస్త మెత్తబడి అబ్బాయినీ, కోడలినీ ఇంటికి పిలిచారు. అలా సందీప్ కాపురం మొదలయ్యింది. విశాల తల్లిగారి కోపం మాత్రం తొందరగా తగ్గలేదు. కొన్ని నెలల్లోనే సందీపుకీ, విశాలకీ పొరపొచ్చాలు రావడం మొదలయ్యి విశాల తల్లికి దగ్గరయ్యి నెమ్మదిగా తల్లి దగ్గరే వుండటం మొదలుపెట్టింది. వారిద్దరినీ కలపడానికి మిత్రులం కొన్ని ప్రయత్నాలు చేసాము కానీ ఫలించలేదు. వారిద్దరి కాపురం విచ్చిన్నం అయ్యింది.


ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడవుంటే బావుండదనుకొని విశాల వాళ్ళు భోనగిరికి మారారు. ఇటు వారి కుటుంబంతో అటు సందీపుతో నా స్నేహం చక్కగానే సాగుతుండేది. విక్రం (విశాల అన్న) ఆహ్వానంపై ఒక సారి భోనగిరికి వెళ్ళి విశాల వారి ఇంట్లొ కొన్ని రోజులు గడిపివచ్చాను. అక్కడ విక్రం తమ ఎదురింటిలో వుండే వెంకట్ సారుని పరిచయం చేసాడు. ఆ సారు చక్కటి వ్యక్తి అని చెప్పాడు. వారితో చాలాసేపు మాట్లాడాను.

దూరంగా వున్నందుకేమో ఈలోగా మళ్ళీ విశాల, సందీపుల మధ్య రహస్య అనుబంధం మొదలయ్యింది. ఉత్తరాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడూ సందీప్ భోనగిరికి వెళ్ళి రహస్యంగా విశాలతో గడిపి రావడం నాకు తెలుసు. అలా కొంతకాలం గడిచింది.

ఒకరోజు ఈనాడు నల్లగొండ జిల్లా సంచికలో ఒక చిన్న వార్త చూసాను. భోనగిరి గుట్టమీద యువతి శవం. పేరు, వయస్సు ఇచ్చి ప్రైవేటు టీచరుగా పనిచేస్తున్నదని తెలిపారు. నా గుండె గుభేలుమంది. కొంపదీసి ఈ విశాలనే కాదు కదా. అప్పుడు వారికి ఫోనులేదు కాబట్టి విషయం నిర్ధారించుకోవడం కోసం వెంటనే భోనగిరి బయలుదేరి వెళ్ళాను. విశాల ఇంటికంటే ముందే వెంకట్ ఇల్లు వుండడముతో ముందస్తు సమాచారం కోసం వెంకట్ ఇంటికి వెళ్ళాను. వెంకట్ ఇంట్లో లేడు అని అతని భార్య, తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకు అని అడిగారు ఆత్రుతగా. సూర్యాపేట నుండి వస్తున్నానని, పేపర్లో విశాల గురించి వార్త చూసానని, అది ఈ విశాల గురించేనా కాదా అని తెలుసుకోవడానికై వారి ఇంటికి వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చానని చెప్పాను. ఏంటో వారు అంతా కంగారు కంగారుగా, అరకొరగా సమాధానం ఇచ్చారు.

చిత్రంగా వుందే అనుకుంటూ వాళ్ళింటిలోనుండి బయటకు వస్తుండగానే విక్రం తన ఇంటినుండి బయటకి వెళుతూ నన్ను చూసాడు. అతని ముఖంలో ఎప్పుడూ వుండే చిరునవ్వు లేదు. నాకు విషయం రూఢి అయ్యింది. వెంకట్ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. చెప్పాను. చెల్లెని చంపింది వాడే - వాడిప్పుడు పోలీసు కస్టడీలో వున్నాడు అని చెప్పాడు!

4 comments:

 1. ఇక సస్పెన్స్ మొదలయ్యింది... మా ఎదురుచూపులు కూడా...

  నాకైతే ఇది చాలా ఇంటెరెస్టింగ్ గా అనిపిస్తుంది.... ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ కథలు బాగుంటాయి...
  కాని ఇదంతా నిజం కథ అని గుర్తొచ్చినప్పుడంతా... ఏదోలా ఉంటుంది!

  ReplyDelete
 2. @ చైతన్య
  ఈ సంఘటణ లోని మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. హతురాలు గొప్ప క్లూ వదిలిపెట్టింది కానీ అది డీకోడ్ చేయడం ఇప్పటివరకూ మాలో ఎవరివల్లా కాలేదు. ఆ క్లూ ఈ సీరియల్ తరువాత అందరికీ ఇస్తాను. ఎవరన్నా ఛేదిస్తారేమో చూద్దాం.

  ReplyDelete
 3. పూర్తిగా చెప్పేయండి.

  ReplyDelete
 4. ఇంకో రెండు భాగాల్లో పూర్తి అవుతుంది లెండి :)

  ReplyDelete