మంచి తెలుగు సైట్లు సూచించండి


తెలుగు పోర్టల్స్ లలో గ్రేట్ ఆంధ్రా, దట్స్ తెలుగు చూస్తుంటాను. తెలుగులో డాట్ కాం చూద్దామంటే దానితో పాటు ఏవో వైరసులు వస్తుంటాయి. దట్స్ తెలుగుతో పాటు కూడా వైరస్ రావడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ నేను వాడే అవస్ట్ వాటిని నిభాయిస్తుంది. ఇహ ఆయా సైట్లలో విషయం తక్కువ - పుకార్లు ఎక్కువ అని తెలిసిందే కదా. రోజూ ఎన్నో కొత్త సైట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో మంచివి నేనేమయినా మిస్సవుతున్నానా అనిపిస్తుంటుంది.


వీటికంటే మాంఛి పోర్టల్స్ ఏవయినా వున్నాయా? మీరు తరచుగా ఏవి చూస్తుంటారు? తెలుగువి మాత్రమే నాకు సూచించండి. మీరు సూచించినవి మిగతా వారికి కూడా ఉపయోగపడవచ్చు. కేవలం పోర్టల్సే కాకుండా మీకు బాగా నచ్చే తెలుగు సైట్లు చెబితే మాకూ అవి నచ్చవచ్చు. పుకార్లు తక్కువ - విషయం ఎక్కువ వున్న సైట్లు అయితే బావుంటుంది. కొన్ని సైట్లలో అయితే రంగులెక్కువయ్యి, ఇరుకు ఇరుకుగా అనిపిస్తాయి. ఆ సైట్లు చూడటానికి ఆహ్లాదంగా వుండవు. కొన్ని సైట్లలో పస తక్కువ - ప్రకటనలు ఎక్కువ. ఇక మరికొన్ని సైట్లు తరచుగా అప్డేట్ కావు - మరికొన్నింటిలో ఫాంట్ బావుండదు. ఇలాంటి లోపాలు లేకుండా వున్న చక్కటి పోర్టల్స్ ఏమయినా వున్నాయా అనేది నా సందేహం.


మొత్తం మీద పూర్తిగా కాకపోయినా బాగా సంతృప్తి పరచిన తెలుగు పోర్టల్ నాకయితే ఇంతవరకు కనపడలేదు. మరి మీకు?

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - ముగింపు - ఈ కోడ్ మీరు ఛేదించగలరా?

అలా అప్పుడు భోనగిరి గుట్ట మీద విశాల స్మృతుల్లోకి వెళ్ళి బయటకి వచ్చాము. "విశాల వ్రాసిన కోడ్ నీ దగ్గర వుందా?" అని సందీపుని అడిగాను. వేరే పెళ్ళి కాగానే విశాల ఉత్తరాలు అన్నీ చింపేసాననీ, వాటితో పాటుగా ఆ కోడ్ కూడా పోయిందనీ చెప్పాడు. నేను ఆ కోడును భద్రపరిచానని చెప్పి, దానిని డీకోడ్ చేయడానికి చేసిన ప్రయత్నాలని వివరించాను. చీకటి పడుతుండటముతో గుట్ట దిగిపోయాము.

విశాల మరణంపై రకరకాల పుకార్లు:
- వెంకటే విశాలని చంపాడు.
- సందీప్ నే ఆమెని చంపాడు. వెంకట్ పాత్ర ఇందులో లేదు - పోలీసుల వత్తిడిపై ఆ నేరాన్ని కొంత ఒప్పుకున్నాడు.
- విశాలతో గొడవపడి వెంకట్ గుట్ట దిగివెళ్ళిన తరువాత ఎవరో విశాలని ఏదో చేసి గుండంలోకి తోసేసారు
- చెల్లె కనపడకపోవడముతో రకరకాల పుకార్లు విని ఆమె కోసం వెతుకుతున్న విక్రంకి గుట్టమీద ఒంటరిగా వున్న విశాల కనిపించింది. ఇలాంటి పనులు చేస్తున్న చెల్లె మీది ఆగ్రహంతో విక్రమే ఆమెని నీళ్లలోకి తోసేసాడు.
- ఇవేవీ జరగలేదు. జీవితం మీది నిస్పృహతో విశాలనే గుట్టమీదికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం రెండు సార్లు విఫలమయిన తన ప్రేమలు. తద్వారా వచ్చిన గర్భం. రెండో సారి అప్పటికే పెళ్ళి అయిన వ్యక్తి ప్రేమలో పడిందనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఎవరేం చేస్తున్నారిప్పుడు?
విక్రం: ఎక్కడున్నాడో తెలియదు.
వైదేహి: ప్రత్యూష (అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సినిమా తార) ట్రస్టులో పనిచేస్తున్నట్లుగా చివరి సమాచారం. ఈ ట్రస్టుని కాంటాక్ట్ చేయడం కోసం బాగా ప్రయత్నిస్తున్నాం కానీ తెలియడం లేదు. ఎవరికయినా ఫోను, అడ్రసు వివరాలు తెలిస్తే ఇవ్వగలరు.
సందీప్: సూర్యాపేటలో ప్రభుత్వ ఉద్యోగం
వెంకట్: సమాచారం లేదు

ఈ సంఘటన సుమారుగా పద్ధెనిమిది ఏళ్ళ క్రితం జరిగింది. ఖచ్చితమయిన సంవత్సరం, తేదీ నాకు గుర్తులేవు. సందీపుకి ఏమయినా గుర్తుకువున్నాయేమో కనుక్కోవాలి.

ఇక ముందు: హతురాలు అందించిన కోడును ఎవరయినా ఛేదించగలిగితే అందులో పనికివచ్చే సమాచారం ఏమయినా వుంటే ఆ దిశగా ఏమయినా ప్రయత్నాలు చేయవచ్చు. ఈ సారి నేను ఇండియా వచ్చేలోగా వైదేహిని కనుక్కుంటానని సందీప్ అన్నాడు. ఆమె ద్వారా మరిన్ని వివరాలు, విశాల మరణించిన ఖచ్చితమయిన స్థలం తెలిస్తే మరో సారి గుట్టమీదికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వస్తాం. విశాల పేరు మీద ఒక ట్రస్టు పెట్టి కొన్ని మంచి పనులు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాము కానీ ఇంకా కుదిరింది కాదు. ఈ సంఘటన ఆధారంగా ఒక వీడియో ఫిల్మ్ తీయించాలని అనుకున్నాను కానీ అదీ కుదరలేదు. వెంకట్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇంకా అప్పుడప్పుడు సందీప్ ఉబలాటపడుతూనేవున్నాడు.

కొన్ని ముఖ్య విషయాలు:
- విశాలకి ఇదివరలోనే ప్రేమ, పెళ్ళీ అయ్యిందని వెంకట్ వాళ్ళకు బహుశా ఇప్పటికీ తెలియదు.
- తనకీ, విశాలకీ ఎందుకు ముఖ్యంగా తేడాలొచ్చాయో నాకు తెలుసునన్న విషయం, మీకూ తెలుసన్న విషయం సందీపుకి తెలియదు. అతనికి బ్లాగులు చదివేంత దృశ్యం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఓకె. తెలిసినా ఏముందిలెండి.
- అన్నట్లు చెప్పడం మరిచేపోయాను - వైదేహి నన్ను ఇష్టపడుతుండేది. నాకూ అమె అంటే కొంత ఇష్టమే వుండేది కానీ అప్పట్లో ఇంకా స్థిరపడకపోయినందున ఈ ఇష్టాలని పెద్దగా పట్టించుకోలేదు.

కోడ్: ఈ క్రింద ఇచ్చిన కోడును ఛేదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యానని మీకు తెలుసుకదా. దయచేసి మీరూ ప్రయత్నించండి - సరదాగా అయినా - సీరియస్సుగా అయినా. మీకు ఇంకా ఏమయినా వివరాలు కావాలంటే అడగండి. విశాల అప్పట్లో చదివింది ఇంటర్ బై పి సి. ఏదయినా కెమిస్ట్రీ కోడులో వ్రాసిందేమో అనికూడా చూసాము.

17, 29, 38 P 1 17 P 5 50 P 4 29 P 5 45 P 1 46 P 10 36 ? 5 (29 P 3. 29 P 3. 50 P 4.)

P అంటే to the power of అని చదువుకోగలరు. దానికి అర్ధం to the power of అనో కాదో తెలియదు కానీ క్రింది అంకెలకు పైన కొద్దిగా కుడి ప్రక్కన విశాల అలా వ్రాసింది. ? తరువాత వున్న 5 సంఖ్యనేమో 36 క్రింద కొద్దిగా పక్కకు వ్రాసింది. ఆ కన్వెన్షన్ ను ఏమంటారో తెలియక ? నేనే పెట్టాను. 36 తరువాత వున్న అంకె 5 కావచ్చు లేదా మరొకటి కావచ్చు. నేను భద్రపరచిన కాగితం అక్కడ కొద్దిగా తడిచి అంకె సరిగ్గా కనిపించడం లేదు. నాకు అయితే 5 లాగే అనిపిస్తోంది.

మీరు ఎప్పుడయినా భోనగిరి గుట్ట/కోట ఎక్కడం తటస్థించితే ఈ మీ మిత్రుడి కోసం చిన్న పని చేయండి. నా మిత్రురాలు విశాల కొసం ఓ క్షణం శ్రద్ధాంజలి ఘటించండి. భోనగిరికి దగ్గర్లో వున్నవారు, హైదరాబాదులొ వున్నవారు ఒకసారి అయినా అక్కడికి పిక్నిక్ గా వెళ్ళడం చక్కగా వుంటుంది. అలా వెళ్ళి ఆ కోట చరిత్రలోకి, ఈ 'విశాల ' చరిత్రలోకి వెళ్ళి రావడం మీకు ఓ మంచి అనుభూతిని ఇవ్వగలదు. ఎవరయినా వెళ్ళినప్పుడు నాకూ తెలియపరిస్తే నా చక్కటి మిత్రురాలు గడిపిన ఊరిలో, గడిపిన ప్రదేశాల్లో మీరూ తిరుగాడారన్న విషయం నన్ను ఆహ్లాదపరుస్తుంది. మరచిపోకండేం!

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 5

విక్రం వాళ్లకి ఇచ్చిన మరో మాట ప్రకారం విశాల మరణం విషయం నా స్నేహితుడు మరియు విశాల మాజీ భర్త అయిన సందీపుకి నేను చెప్పలేదు. అప్పట్లొ అతను నాకు పెద్దగా టచ్ లో కూడాలేడు. దానికి ఒక కారణం వుంది. విశాలను సందీపు అతను పెళ్ళి చేసుకొని వచ్చాక వాళ్ళ ప్రేమకి సహకరించిన నన్ను, మరో మిత్రుడినీ అతను కొంత దూరంగా వుంచుతూ వుండడముతో మేమూ అతడిని అప్పట్లో పెద్దగా పట్టించుకోవడం మానివేసాము. సందీప్ అలా ఎందుకు కాస్త దూరంగా వుంటున్నాడో మాకు పెద్దగా అర్ధమయ్యేది కాదు. బయట బయటనే కలిసేవాడు, ఇంటికి పిలిచేవాడు కాదు. సంకుచిత మనస్థత్వంతో అలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాం.

అయితే అసలు విషయం కొన్నాళ్ళ తరువాత తెలిసింది. విశాల భోనగిరిలో వుంటున్నరోజుల్లో విశాల అమ్మగారు అయిన వాణి ఆంటీ అవో ఇవో పనుల నిమిత్తం సూర్యాపేటకి వస్తుండేది. ఒకరోజు నన్ను ఆమె కలిసి విశాలకీ, సందీపుకీ జరిగిన గొడవల గురించి చెప్పింది. అందులో ముఖ్యంగా జరిగిన గొడవ గురించి విని నేను అవాక్కయ్యాను. ఆ విషయం మీకు వెళ్ళడించడం సముచితంగా వుంటుందో లేదో అని తటపటాయిస్తూ ఈ భాగం వరకు ఆగాను. మీరు వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవడం కోసం ఇప్పటికీ తటపటాయిస్తూనే వెళ్ళడిస్తున్నాను.

విశాలకీ, సందీపుకీ ముఖ్యంగా గొడవ నా గురించే జరిగేదట! నాతో విశాల చాలా సన్నిహితంగా వుంటుండేదని అతని అనుమానమట!! అలా నామీది అనుమానాలతో విశాలను అతను చాలా వేధించాడట. అతని వేధింపులకి తట్టుకోలేక, విసిగిపోయి విశాల ఒకసారి అతని అనుమానాలని అంగీకరించి 'అవును, శరత్ తో సన్నిహితంగా వుండేదానిని. సరేనా! ఇక ఏం చేస్తావో చేసుకో' అని అక్కడనుండి వచ్చేసిందిట.

సందీప్ అనుమానం వాస్తవమేనా అని అడిగింది వాణి ఆంటీ. ఏమాత్రమూ వాస్తవం లేదని చెప్పాను. అటువంటి విషయాలు అప్పట్లో నాకు సాధారణమే అయినా విశాలతో అంత సాన్నిహిత్యం లేదు నాకు. ఆమె నాకు ఓ చక్కటి మిత్రురాలు అంతే. ఇలాంటి అనుమానం వున్నవాడు మరి విశాలను ఎందుకు పెళ్ళిచేసుకున్నాడో అర్ధం అయ్యింది కాదు. పెళ్ళి చేసుకున్నాక ప్రేమ మత్తు దిగి ఏవేవో సందేహాలు బయల్దేరి వుంటాయి. వాళ్ళిద్దరూ విడిపోక ముందు సందీపు నన్ను అడిగితే అతని అనుమానాలని నివృత్తి చేసివుండేవాడిని.

ప్చ్. నేను చేసిన పెళ్ళి నా వల్లనే పెటాకులవడం నాకు బాధ కలిగించింది. నా పొరపాటు వున్నా లేకున్నా నా వల్ల ఆమెకు తీరని అన్యాయం జరిగింది కాబట్టి దీనికి పరిష్కారం ఒకటి అప్పట్లో ఆలోచించాను. నావి ఎలాగూ విశాలభావాలే కాబట్టి నేను స్థిరపడిన తరువాత ఆమెకు ఇష్టమయితే పెళ్ళి చేసుకోవాలని. అయితే నా వుద్దేశ్యాన్ని ఆమెకు ఎప్పుడూ తెలియపరచలేదు. అంతలోకే ఆమె మరణించడం జరిగింది. ఇలా ఎందుకు చేసావంటూ సందీపునీ నేను ఎప్పుడూ అడగలేదు. వాళ్ళు విడిపోయాక ఇవన్నీ తవ్వుకొని ఏం ప్రయోజనం అనుకొని, అతని నిజ స్వరూపం తెలిసి కాస్త దూరంగా వుంటూ వచ్చాను. విశాల మరణ వార్త అతనికి చెప్పకపోవడానికి కారణం ఇదీ.

రెండు మూడు నెలల తరువాత విశాల మరణవార్త సందీపుకి చేరి నిజమా కాదా తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. నిజమే అని చెప్పాను. ఈ పరిస్థితులల్లో భోనగిరికి వెళ్ళి ఈ విషయాలని కలబెడితే పోలీసులు అనుమానంతో నిన్నే అరెస్టు చేసే అవకాశం వుంటుందని చెప్పి అతనిని అటువైపు వెళ్ళకుండా ఆపాను. విశాలను హత్య చేసిన వెంకట్ మీద ఎలాగయినా ప్రతీకారం తీర్చుకోవాలని ఆవేశపడ్డాడు. తరువాత కూడా అప్పుడప్పుడూ వెంకట్ మీద ప్రతీకారం తీర్చుకొని విశాలకు ఆత్మశాంతి కలిగించాలని అంటుండేవాడు.

సందీప్ నన్ను తన ఇంటికి పిలిచాడు. విశాల భోనగిరిలో వుంటున్నప్పుడు తమ మధ్య మళ్ళీ నడిచిన ప్రేమాయణం, లేఖల గురించి చెప్పుకువచ్చాడు. చివరి లేఖలో ఆమె కోడ్ పద్ధతిలో వ్రాసిన సందేశం చెప్పాడు. దానికి డీకోడ్ చేయడం అతని వల్ల కాలేదు. ఆ లేఖ నాకూ చూపించాడు. 'బావా ఒక రహస్యం చెబుతున్నాను. కనుక్కో' అని వ్రాసింది. డీకోడ్ చేయడానికి నేనూ శత విధాలా ప్రయత్నించాను కానీ అర్ధం కాలేదు. ఆమె మరణించిన కాలంలో గర్భవతి అయి వుండవచ్చు. ఆ విషయం ఏమన్నా చెప్పిందా? లేక వెంకట్ గురించి ఏమయినా చెప్పిందా? ఆ కోడ్ ఛేదిస్తే తన మరణ రహస్యం ఏమయినా బయటపడుతుందా?


ఆ కోడును నేను భద్రంగా వ్రాసుకొని జాగ్రత్త చేసాను. యు ఎస్ కు వచ్చిన తరువాత చాలా ఏళ్ళకు ఆ కోడుని చిన్నపాటి హ్యాకర్ అయిన నా మేనల్లుడికి, అతని మిత్రులకీ ఇచ్చి ఛేదించమన్నాను. వాళ్ల వల్ల కూడా కాలేదు.
నేను కెనడా నుండి, యు ఎస్ నుండి ఇండియాకు సెలవుల్లొ వచ్చినప్పుడు సందీపుని కలుస్తుండేవాడిని. మళ్ళీ బాగా సన్నిహితం అయ్యాడు. విశాల మరణించిన ప్రదేశానికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి రావాలని ఎప్పుడూ అనుకునేవారం. అది ఇప్పుడు కుదిరింది.


ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.

హతురాలు ఇచ్చివెళ్ళిన కోడ్, విశాల మరణంపై ఇతర సందేహాలు/పుకార్లు , ఇంకా ఏమయినా మరచిపోయిన ముఖ్యవివరాలతో ముగింపు వచ్చే భాగంలో.

హిప్నటైజ్ చేయడం ఎలా? - పార్ట్ 1

దీనిమీద మీరు ఏ గూగులమ్మనో అడిగితే చాలా వివరాలు తెలియకపోవు. అయితే ఒకప్పటి హిప్నటిస్టుగా నా అనుభవాలని రంగరించి ఇక్కడ రాయాలనేది నా వుద్దేశ్యం.

నేను ఇంటర్ చదువుతున్నరోజుల్లో యండమూరి, తదితరులు వ్రాసిన నవలల్లోనూ, నాస్తిక హేతువాద పత్రికలలోనూ హిప్నటిజం గురించి, హిప్నటిస్టుల గురించి తరచుగా వినిపిస్తూ నాలో దీనిమీద ఆసక్తి పెరిగింది. అలా గుంటూరులోనో ఏలూరులోనో వున్న హిప్నటిస్టు దగ్గరికి వెళ్ళి నేర్పమని కోరాను కానీ ఆయనకు వీలుకాలేదు.

మిగతా ఇక్కడ చదవండి:
http://sainyam.in/?p=254

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 4

విక్రం ఇంటిలోకి వెళ్ళాను. జరిగినదంతా తెలుసుకున్నాను. అయిదురోజుల క్రితం రోజూలాగే స్కూల్ కి వెళ్ళిన విశాల ఆరోజు ఎంతకూ తిరిగిరాలేదట. వారినీ వీరినీ విచారించగా ఒకరిద్దరు గుట్టమీదికి ఎక్కుతుండగా చూసామని చెప్పారంట. విక్రం గుట్ట మీదికి ఎక్కి వెతికాడు. ఒకచోట గుండం వద్ద చెప్పులు మాత్రం కనిపించాయట - మనిషి మాత్రం కనిపించలేదు. అప్పటికే చీకటి పడటముతో భయం వేసి వెతుకులాట ఆపి విక్రం క్రిందకు వచ్చాడట.

మరుసటి రోజు ఉదయం అందరూ వెళ్ళి వెతికితే విశాల ఎక్కడా కనిపించలేదు. ఈతగాళ్లని పెట్టించి చెప్పులు కనిపించిన దగ్గరి గుండంలో వెతికించితే విశాల శవం బయటపడింది. పోలీసులు విచారణ జరిపి అనుమానంతో వెంకటును అరెస్ట్ చేసారు. విశాల కనిపించకుండా పోయిన రోజు విశాలతో పాటుగా వెంకట్ కూడా గుట్ట ఎక్కాడని పుకారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుండో ప్రేమ నడుస్తున్నదనీ, ఏవో తేడాలు వచ్చి విశాలని వెంకట్ హత్య చేసాడనీ అభియోగం. విశాలతో గుట్టమీదికి ఎక్కిన విషయం నిజమేననీ, వాదులాట జరిగాక తాను తిరిగివచ్చాననీ, విశాలను తాను హత్య చేయలేదనీ వెంకట్ ఒప్పుకోలు. ఇది అయినా నిజమేనా లేక పోలీసుల టార్చర్ భరించలేక ఇంతమాత్రమయినా ఒప్పుకున్నాడా అనేది మనకు తెలియదు.


ఆ రోజు సాయంత్రం విక్రం వాళ్లతో కలిసి వారి దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆందరు నన్ను బ్రతిమలాడి ఒక విషయాన్ని నాతో ఒప్పించారు! విశాల సందీపుల ప్రేమ, పెళ్ళి వ్యవహారం భోనగిరిలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆ విషయం ఇక్కడ ఎవరికయినా బయటపెడితే విశాలకు చెడుపేరు వస్తుంది - వెంకట్ మీది అభియోగం తేలిక అవుతుంది - కేసు పక్కదారి పడుతుంది. సందీపు గురించి మౌనంగా వుండటానికి నేను అంగీకరించాను.

మరుసటి రోజు నేను వెళతానంటే విశాల వ్యవహారం ముగిసేదాకా నన్ను అక్కడే తోడుగా వుండమని అందరూ అన్నారు. వారి ఇంటిలోనే కొద్దిరోజులు వున్నాను. వెంకట్ వాళ్ళు వీరితో రాజీకి వచ్చారు. నష్టపరిహారంగా కొంత డబ్బు ఇస్తామన్నారు కానీ విక్రం వాళ్ళు ఒప్పుకోలేదు. నాలుగయిదు రోజులు అలా రకరకాల చర్చలూ, వాదోపవాదాలు, వ్యూహాలూ జరిగాయి. మహిళా హక్కుల సంఘం వారు కూడా వచ్చి విచారించారు. అప్పటి భోనగిరి మేయర్ (పేరు నాగేందర్ అనుకుంటా) కూడా పరామర్శించడానికి వచ్చి తమ సంతాపం, సహకారం ప్రకటించారు. ఆశ్చర్యకరంగా ఆ పట్టణ మేయర్ మా నాన్న గారి ప్రియ శిష్యులలో ఒకరు! విశాల వాళ్ళు మాకు బాగా తెలిసినవారు అని అర్ధం అవడముతో ఈ విషయంలో మేయర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

చివరికి అందరూ కలిసి వెంకట్ వాళ్లకీ, విక్రం వాళ్లకీ రాజీ కుదిరించారు. నష్టపరిహారం క్రింద వెంకట్ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు - విక్రం వాళ్లు వెంకట్ మీద కేసు తీయించేస్తారు. వెంకట్ ప్రభుత్వ ఉద్యోగి/ టీచర్ కాబట్టి ఈ విధంగా తన ఉద్యోగం ఊడకుండా వుంటుంది. ఇలా విషయాలన్నీ ఒక కొలిక్కి రావడంతో నేను భోనగిరి నుండి సూర్యాపేటకి తిరిగివచ్చాను.

అయితే ఇంతకీ విశాలది హత్యనా, ఆత్మహత్యనా? హత్య అయితే చేసింది ఎవరు? వెంకట్ మాటల్లో నిజం వుందా? అతను చెప్పిందే నిజమయితే అతను గుట్ట దిగి వెళ్ళిన తరువాత ఒంటరిగా వున్న విశాలను మరెవరన్నా ఎందుకన్నా హత్య చేసారా? లేక విశాలనే వెంకటుతో జరిగిన గొడవతో కలత చెంది ఆత్మహత్య చేసుకుందా? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వేరే బలీయమయిన కారణాలు వున్నాయా? ఈమె మరణంలో సందీప్ పాత్రం ఏమయినా వుందా? లేక స్వంత అన్న విక్రం పాత్ర ఏమయినా వుందా? ఇలాంటి శేష ప్రశ్నలు వున్నాయి. మరణించడానికి కొద్దిరోజులకు ముందు హతురాలు కొన్ని క్లూస్ విడిచిపెట్టింది. ఆ వివరాలన్నీ వచ్చే భాగంలో.

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 3

ఫ్లాష్ బ్యాక్:

మేము సూర్యాపేటలో వుంటున్నప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వచ్చింది. మనకు బాగా తెలిసినవారు అని చెప్పింది మా అమ్మ. ఆంటీ కూడా అల్లుడా అల్లుడా అంటూ ఆప్యాయంగా మాట్లాడింది. వాళ్ళ ఇంటికి రమ్మంది. వెళ్ళాను. ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు. భర్త జరిగిపోయాడు. పెద్ద అమ్మాయి (విశాల), కొడుకు (విక్రం) ఇంటర్ మొదటి సంవత్సరం - గ్రూపులు వేరే. చిన్నకూతురు వైదేహి ఏడు చదువుతుండేది. ఆ కుటుంబం చూపినే ఆప్యాయత, ఆదరణ నాకు బాగా నచ్చాయి. త్వరలోనే అందరమూ బాగా సన్నిహితం అయ్యాము. విక్రం, విశాలలు మా ఇంటి దగ్గరే వున్న లెక్చరర్ దగ్గరికే ట్యూషనుకి వస్తుండటముతో వారి స్నేహితులు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు.


నాకు విశాల బాగా నచ్చింది. మరీ గొప్ప అందగత్తె కాకపోయినా చక్కటి వ్యక్తిత్వం. ప్రేమిస్తే పోలా అనుకునేవాడిని కానీ ఇప్పుడే ఎందుకులే అని ఆమెను పరిశీలిస్తూ వుండిపోయాను. అలా కొన్నాళ్ళు గడిచాయి. విశాల ఇంటర్ రెండో సంవత్సరంలోకి అడుపెట్టింది. ఆమె ఫ్రెండు అయిన సందీప్ నాకు కూడా బాగా క్లోజ్ అయ్యాడు. అతను ఒకరోజు తనకు - విశాలకి వున్న ప్రేమ బంధాన్ని చెప్పి నా సహకారం అడిగాడు. అలా నేను ప్రేమించాలనుకున్న ప్రేమను త్యాగం చేసేసి వారిద్దరి ప్రేమకు నేను క్యారెక్టరు (ఆర్టిస్ట్) అయ్యాను.


ఇంకేముంది - వారిద్దరి ప్రేమ కథ శరా మామూలే. కులం తేడాల వల్ల అటు వైపు, ఇటు వైపు పెద్ద వారు ఒప్పుకోకపోవడముతో వాల్లకూ వీళ్ళకూ సర్దిచెప్పలేక నాకూ, ఇంకో ఫ్రెండుకూ తలలు బొప్పికట్టాయి. గొడవలు, వాదులాటలు, ఆత్మహత్యా ప్రయత్నాలు మామూలు అయ్యాయి. ఇలా లాభం లేదని ఒక శుభ ముహూర్తాన ఆ ప్రేమ జంటను బస్సెక్కించి మేము ఇద్దరమూ ఏమీ ఎరగనట్టు నటించాము.


వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో చెప్పమంటూ పెద్దల వేధింపులు మా మీద ఎక్కువయ్యాయి. ఈలోగా ఆ ప్రేమ జంట ఏ గుళ్ళోనో పెళ్ళి చేసుకుంది. సందీప్ తల్లితండ్రులు కాస్త మెత్తబడి అబ్బాయినీ, కోడలినీ ఇంటికి పిలిచారు. అలా సందీప్ కాపురం మొదలయ్యింది. విశాల తల్లిగారి కోపం మాత్రం తొందరగా తగ్గలేదు. కొన్ని నెలల్లోనే సందీపుకీ, విశాలకీ పొరపొచ్చాలు రావడం మొదలయ్యి విశాల తల్లికి దగ్గరయ్యి నెమ్మదిగా తల్లి దగ్గరే వుండటం మొదలుపెట్టింది. వారిద్దరినీ కలపడానికి మిత్రులం కొన్ని ప్రయత్నాలు చేసాము కానీ ఫలించలేదు. వారిద్దరి కాపురం విచ్చిన్నం అయ్యింది.


ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడవుంటే బావుండదనుకొని విశాల వాళ్ళు భోనగిరికి మారారు. ఇటు వారి కుటుంబంతో అటు సందీపుతో నా స్నేహం చక్కగానే సాగుతుండేది. విక్రం (విశాల అన్న) ఆహ్వానంపై ఒక సారి భోనగిరికి వెళ్ళి విశాల వారి ఇంట్లొ కొన్ని రోజులు గడిపివచ్చాను. అక్కడ విక్రం తమ ఎదురింటిలో వుండే వెంకట్ సారుని పరిచయం చేసాడు. ఆ సారు చక్కటి వ్యక్తి అని చెప్పాడు. వారితో చాలాసేపు మాట్లాడాను.

దూరంగా వున్నందుకేమో ఈలోగా మళ్ళీ విశాల, సందీపుల మధ్య రహస్య అనుబంధం మొదలయ్యింది. ఉత్తరాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడూ సందీప్ భోనగిరికి వెళ్ళి రహస్యంగా విశాలతో గడిపి రావడం నాకు తెలుసు. అలా కొంతకాలం గడిచింది.

ఒకరోజు ఈనాడు నల్లగొండ జిల్లా సంచికలో ఒక చిన్న వార్త చూసాను. భోనగిరి గుట్టమీద యువతి శవం. పేరు, వయస్సు ఇచ్చి ప్రైవేటు టీచరుగా పనిచేస్తున్నదని తెలిపారు. నా గుండె గుభేలుమంది. కొంపదీసి ఈ విశాలనే కాదు కదా. అప్పుడు వారికి ఫోనులేదు కాబట్టి విషయం నిర్ధారించుకోవడం కోసం వెంటనే భోనగిరి బయలుదేరి వెళ్ళాను. విశాల ఇంటికంటే ముందే వెంకట్ ఇల్లు వుండడముతో ముందస్తు సమాచారం కోసం వెంకట్ ఇంటికి వెళ్ళాను. వెంకట్ ఇంట్లో లేడు అని అతని భార్య, తల్లిదండ్రులు చెప్పారు. ఎందుకు అని అడిగారు ఆత్రుతగా. సూర్యాపేట నుండి వస్తున్నానని, పేపర్లో విశాల గురించి వార్త చూసానని, అది ఈ విశాల గురించేనా కాదా అని తెలుసుకోవడానికై వారి ఇంటికి వెళ్ళే ముందు మీ ఇంటికి వచ్చానని చెప్పాను. ఏంటో వారు అంతా కంగారు కంగారుగా, అరకొరగా సమాధానం ఇచ్చారు.

చిత్రంగా వుందే అనుకుంటూ వాళ్ళింటిలోనుండి బయటకు వస్తుండగానే విక్రం తన ఇంటినుండి బయటకి వెళుతూ నన్ను చూసాడు. అతని ముఖంలో ఎప్పుడూ వుండే చిరునవ్వు లేదు. నాకు విషయం రూఢి అయ్యింది. వెంకట్ వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. చెప్పాను. చెల్లెని చంపింది వాడే - వాడిప్పుడు పోలీసు కస్టడీలో వున్నాడు అని చెప్పాడు!

హిప్నటిస్ట్ శరత్

మనలో ఈ కోణం కూడా వుందండోయ్. డిగ్రీ చదువుతున్నరోజుల్లోనే తెనాలి వెళ్ళి ఒక హిప్నటిస్టు ఇంట్లో ఓ అయిదురోజులు వుండి నేర్చుకుని వచ్చాను. యండమూరి నవలలు గట్రా చదువుతుండేవాడిని కాబట్టి ఎలాగయినా హిప్నటిజం నేర్చుకోవాలని ఆరాటం వుండి అది నేర్చేసుకున్నాను. దానిమీద పుస్తకాలు సేకరించాను.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు నాకు తెలిసిన అందరినీ హిప్నటైజ్ చేసేస్తూవుండేవాడిని. కొంతమంది అయేవారు - కొంతమంది కాకపోయేవారు. అప్పట్లో మా మరదలు, ఆమె ఫ్రెండ్స్ మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు. ఆమె స్నేహితురాళ్ళనందరినీ హిప్నటైజ్ చేసాను కానీ మా మరదలు హిప్నటైజ్ కావడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఏదో గొప్ప ప్రమాదం శంకించి వుంటుంది. అటువంటి ప్రమాదాలు ఇందులో ఏమీ జరగవని చెప్పినా వినలేదు. అలా మా బంధువులనీ, మిత్రులనీ హిప్నటైజ్ చేస్తూ, వాటిల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడిని. కొంతకాలం తరువాత దానిమీద ఆసక్తి తగ్గిపోయి పక్కకు పెట్టేసాను.

ఆ తరువాత ఒక సారి విజయవాడలో ఒక ప్రముఖ హిప్నాటిస్ట్ (టి ఎస్ రావు అనుకుంటా పేరు) ఇచ్చిన ప్రదర్శనలో పాల్గొని హిప్నటైజ్ అయ్యాను. నామీద అప్పుడు కొన్ని హిప్నటిజం ప్రయోగాలు చేసారు. త్వరగా, గాఢంగా నేను హిప్నటైజ్ అవుడం గమనించి ఆ ప్రదర్శనలో నామీదనే ఎక్కువ ప్రయోగాలు చూపించారు.

మళ్ళీ నాలోని విద్యని బయటకి తీసి మా ఆవిడ నామాట విననప్పుడల్లా ఆమె మీద ప్రయోగించాలని వుంటుంది కానీ అది జరిగేపని కాదులెండి.

భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 2
(యదార్ధ సంఘటణ ఇది. భువనగిరి లేదా పరిసర ప్రాంతం చదువరులు ఎవరయినా వుంటే ఈ ఘటణ మీకు తెలిసే వుండవచ్చు - స్పందించండి. ఆ గుట్ట ఎక్కిన వారు వున్నా స్పందించండి. వ్యక్తుల అసలు పేర్లు ఉపయోగించలేదు. ఇవాళే సందీప్ తో ఫోనులో మాట్లాడి తన కథ బ్లాగుతున్నానని చెప్పా. వైదేహి ట్రేస్ కొంచెం తెలిసిందనీ ఎలాగయినా ఆమెను కలుస్తానని చెప్పాడు. )

సందీప్ చాలా విచారగ్రస్తుడయ్యాడు. భోనగిరి గుట్టమీద గుండంలో విశాల శవం బయటపడిందని నాకు తెలుసుగానీ ఖచ్చితంగా గుట్టమీద ఏ ప్రాంతమో, ఏ గుండమో నాకు తెలియదు. అదే విషయం సందీప్ కు చెప్పాను. ఇంకా పై గుట్టమీద కొన్ని కొలనులు, గుండాలు వున్నాయని ఒకవేళ అక్కడేమయినా బయటపడిందేమో నాకు తెలియదని చెప్పాను. చాలావరకు ఇక్కడి గుండాల్లోనే ఏదో ఒకటి అయ్యుంటుందని చెప్పాను.

ఇద్దరం కలిసి అక్కడవున్న గుండాల్లో ఏ గుండంలో విశాల ఆత్మహత్యకి పాలుపడివుండవచ్చో లేదా ఆమె హత్య జరిగివుండవచ్చో పరిశీలించాము. ఒక రెండు గుండాలు అటువంటి పరిస్థితులకు అనువుగా అనిపించాయి. అలా చర్చ జరుగుతునంతసేపు అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనించాను. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఈ సందీప్ నే ఆ అమ్మాయిని హత్య చేసి వుండవచ్చుకదా. చెప్పలేం. నా దగ్గర అమాయకత్వం నటిస్తున్నాడేమో. చాలా దగ్గరి స్నేహితుడే కానీ ఇటువంటి విషయాలలో అందరూ నిజం చెబుతారా?

ఒకవేళ సందీప్ నే ఆ హత్య చేసివుంటే ఆ గుండాల్లో నన్నూ తోస్తాడేమో - నామీద అతనికి కొన్ని అనుమానాలున్నాయని తెలుసు. లేక నన్నూ అతను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడేమో! కొంపదీసి ఈ హత్య చేసింది నేనే అని సందీప్ అనుకోవడం లేదు కదా. అలాంటి ఏ మూర్ఖపు అనుమానంతోనో లేక నిజంగా తనే హంతకుడు అయివుండి తనలో వున్న అనుమానాలతోనో, మరెందుకో నన్ను ఈ గుండాల్లో తోసినా తోస్తాడు అని ఎందుకయినా మంచిది అని అక్కడ వున్నంతసేపు వళ్ళు దగ్గరపెట్టుకొని జాగ్రత్తగా వున్నాను. అతని కదలికల్ని ఓరకంటా గమనిస్తూ మరీ గుండాలకి దగ్గరగా వెళ్ళకుండా అప్రమత్తంగా వున్నాను. అసలే వేరే ఎవరికీ చెప్పకుండా ఈ గుట్ట ఎక్కాము మేము. చుట్టూ చూసాను - వేరే ఎవరూ లేరు - గుట్టమీది ఆ ప్రాంతంలో.

మరి అతను కూడా అలాగే నాపట్ల సందేహంతో వుండి జాగ్రత్తగా మసలుకుంటున్నాడేమో తెలియదు. ఒకవేళ నిజంగానే సందీపునే హంతకుడయితే విశాలలాంటి చక్కటి అమ్మాయిని హత్యచేసినందుకు గానూ అతన్ని ఆ గుండాల్లోకి తోసినా తప్పులేదు! నేను తనని అనుమానిస్తున్నానని సందీపుకి తెలుసు.

విశాలను హత్యచేసిన వెంకట్ ను ఇక్కడే బొందపెట్టాలని ఆవేశంగా మాట్లాడాడు సందీప్. అతన్ని అనునయించాను నేను. ఆ తరువాత గుట్ట పై భాగం మీదికి వెళ్ళాము. అక్కడ రాజభవనం, కొలనులు, గుండాలు వున్నాయి. నా స్నేహితురాళ్లతో, స్నేహితులతో అక్కడ గడిపిన క్షణాలు గుర్తుకువచ్చాయి. అక్కడ వున్న గుండంలోంచి ఏనుగులతో నీళ్ళు తోడించేవారు అని ప్రతీతి. ఆ మధ్య కూడా ఇద్దరు అబ్బాయిలు ఆ గుండంలో మునిగి చనిపోయారు. పక్కనే వున్న కొలను చూసాము. అక్కడే నా చిన్నప్పుడు ఫ్రెండ్సుతో పిక్నిక్ చేసుకున్నాను. ఆ కొలనులోనే విశాల చనిపోవడానికి అవకాశం వుందన్నాడు సందీప్. అలా అయివుండకపోవచ్చు అన్నాను నేను. ఆమె చనిపోయినప్పుడు గుండంలో చనిపోయిందని విన్నాను కానీ కొలనులో అని కాదు. కొలను అంత లోతుగా వుండకపోవచ్చు - పైగా ఏటవాలుగా, విశాలంగా వుంది - తేలిగ్గా అందులోనుండి బయటకు రావచ్చు.

తరువాత అక్కడ వున్న గుండం శ్రద్ధగా పరిశీలించాము. అక్కడ ఇంకా కొంతమంది సందర్శకులు కూడా వున్నారు. విశాల చాలావరకు ఇక్కడే పోయివుండవచ్చని సందీప్ తీర్మానించాడు కానీ నేను అంతగా కన్విన్స్ కాలేదు. నా అనుమానం అంతా గుర్రాల శాలల దగ్గర వున్న గుండాల మీదే. ఈ టపాలో వున్న ఫోటోలు ఆ గుండాలవే. విశాల చెల్లెలు వైదేహి మాతో పాటు గుట్టమీదికి వచ్చివుంటే తన అక్కయ్య ఎక్కడ చనిపోయిందో మాకు సరిగ్గా చూపించివుండేది. ఆమెకోసం భోనగిరిలో వెతికాము కానీ దొరకలేదు.


ఎత్తయిన గుట్టమీద వున్నాం కనుక చల్లగాలి రివ్వున వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. తరువాత రాజభవనం అంతా తిరిగిచూసి అక్కడ గోడల మీద కూర్చొని భువనగిరి టవునును చూస్తూ విశాల గురించి మాట్లాడుకుంటూ అమె స్మృతులలోకి వెళ్ళిపోయాము.

వచ్చే టపాలో ఫ్లాష్ బ్యాక్.

యదార్ధ సంఘటణ - భువనగిరి గుట్ట మీద (ఆత్మ)హత్య - పార్ట్ 1(గమనిక - వ్యక్తుల అసలు పేర్లు ఇవ్వలేదు)

నల్లగొండ జిల్లా లోని భోనగిరి/భువనగిరి గుట్టను చాలామంది హైదరాబాదుకి రైల్లో వెళుతూ చాలామంది చూసి వుండవచ్చు. ఒకేరాయితో అంత పెద్ద గుట్ట తయారవడం విశేషం. పర్యాటక శాఖ పట్టించుకోనందున ఆ చక్కటి, విశేషమయిన గుట్టగురించి ప్రచారం లేకపోవడముతో ఎక్కువమందికి ఈ గుట్ట గురంచి తెలియదు. అక్కడవున్న నిర్మాణాలని పట్టించుకున్నవారెవరూ లేకపోవడముతో రోజురోజుకీ అవి శిధిలావస్తకి చేరుకుంటున్నాయి.

ఏకశిల అనే పేరు భువనగిరి గుట్టకు రావాల్సిందని, అనవసరంగా వరంగల్లుకు వచ్చిందని మా నాన్నగారు అంటుండేవారు. భోనగిరిలో మా నాన్నగారు ఉపాధ్యాయులుగా పనిచేసినందున అక్కడే గంజ్ ప్రభుత్వ పాఠశాలలో నేను కూడా ఎనిమిది, తొమ్మిది తరగతులు చదివాను. సరదాపుట్టినప్పుడల్లా భోనగిరి గుట్టను మిత్రులతో సహా ఎక్కుతుండేవాడిని. అక్కడి కోట, రాజ భవనాలు, సొరంగాలు, ఆయుధశాలలు, గుర్రపు శాలలు మొదలయినవి అచ్చెరువొందిస్తూవుండేవి. ఆ గుట్టమీద కొలనులు, గుండాలు కూడా వున్నాయి. మా క్లాస్మేట్లందరమూ - అమ్మాయిలతో సహా కలిసి ఆ గుట్ట మీదికి పిక్నిక్ వెళుతుండేవారము.

అలా చిన్నప్పుడు వెళ్ళడమే తప్ప ఆ గుట్ట ఎక్కడానికి మళ్ళీ రెండు సంవత్సరాల క్రితమే వీలుపడింది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మా మిత్రులు, నేను ఎన్నిసార్లు ఎక్కాలనుకున్నా అప్పటికి మాత్రమే వీలుపడింది. అలా నల్లగొండనుండి నా మిత్రుడు సందీప్ నేనూ అక్కడికి వెళ్ళాము. అక్కడ వైదేహి అనే ఆమె అడ్రస్సు కోసం వెతికాముగానీ దొరకలేదు. ఆమె ఇల్లు ఖాళీచేసి వెళ్ళిందని ఎక్కడికి మారిందో తెలియదనీ ఆ ఇంటి ఓనర్ చెప్పారు. భువనగిరి గుట్ట ఎక్కినప్పుడు ఆమెకూడా వెంట వుంటే చాలా ప్రయోజనకరంగా వుండేది కదా అని అనుకున్నాము.

మేము ఇద్దరమూ గుట్ట ఎక్కసాగాము. నేను చాలాసార్లు ఆ గుట్టని చూసినా నా ఫ్రెండుకి అదే మొదటిసారి కావడముతో చాలా ఆసక్తిగా గుట్ట గురించిన విశేషాలు నన్ను అడుగుతూ, గుట్టని చాలా ఆసక్తిగా చూస్తూ వచ్చాడు. నాకు తెలిసిన వివరాలన్నీ చెబుతూవచ్చాను. ఈ భువనగిరి గుట్ట అంటే సందీప్ కి ఒక బంధం, ఆర్ద్రత వుంది. అందుకే గుట్టని ఆత్మీయతా భావంతో పరిశీలిస్తూవచ్చాడు. ఇదివరకు నేను గుట్టని చూసినదానికీ, ఇప్పుడు చూసినదానికీ ఒక తేడా వుంది. అందుకే నేనూ అర్ద్రమయిన మనస్సుతో, ఆలోచనలతో గుట్ట ఎక్కనారంభించాను.
సగం ఎక్కాక గుర్రపు శాలలు కనిపించాయి. వాటిగురించి అతనికి వివరించాక అక్కడికి దగ్గర్లో వున్న గుండాల దగ్గరికి తీసుకువెళ్ళాను. చిన్నవీ, పెద్దవీ కలుపుకొని ఏడెనిమిది గుండాలు వున్నాయక్కడ. కొన్ని బాగా లోతుగా, నీళ్ళ మీద పొదలు అలుముకొని భీతి కొలిపేలా వుంటాయి. ఈ గుండాల్లోనే ఏ గుండం లోనో విశాల యొక్క శవం బయటపడింది అని సందీప్ కి చెప్పాను.

Bhongir Fort Link: http://en.wikipedia.org/wiki/Bhongir

(ఇంకా వుంది)