సోమవారం 27 ఎప్రిల్ 2009

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 7

సందేహం వచ్చి గిల్లి చూసుకున్నాను. నొప్పి. కలగనట్లేదు - నిజమే. నెమ్మదిగా లేచి పక్కమీదికి వెళ్ళి పడుకున్నాను. హారిక, పాప ముందు గదిలో ఇంకా సినిమా చూస్తూనేవున్నారు. మానసికంగా బాగా అలసిపోయానేమో వెంటనే నిద్ర పట్టింది.

ఒక మూడుగంటల నిద్ర తరువాత చలిపెట్టి ఠక్కున మెలకువ వచ్చింది. ముందుగదిలోకి వెళ్ళాను. హారిక, పాప అక్కడే పడుకున్నారు. రణిల్ తన గదిలో పడుకున్నాడు. కిటికీలు, తలుపులన్నీ బాగానే వేసివున్నాయి, ఎ సి కూడా సరిగ్గానే వుంది. మరి ఎందుకు చలిపెడుతోంది? అప్పుడు గుర్తుకువచ్చింది - గోడకు వున్న కరెంట్ ప్లగ్ ల ద్వారా కొంత బయటి గాలి వస్తుంటుందని.

బయటినుండి గాలి! నా ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. అక్కడినుండి బయటిగాలి వస్తున్నదంటే ఇప్పటిదాకా కిటికీలకు, తలుపులకు టేప్ అతికించి జాగ్రత్త తీసుకున్నదంతా వృధానేనా? వళ్ళు జలదరించింది.
కిటికీ దగ్గరకు వురికి బ్లయిండ్స్ కొద్దిగా తెరచి చూసాను. హజార్డ్ లైట్లు వేసుకొని మిలటరీ వాహనాలు అప్పుడప్పుడూ పహరా కాస్తున్నాయి.


ఇప్పటివరకూ బయట ఏమీ జరుగకపోతే ఆ ప్లగ్గు హోల్డర్ల లోనుండి గాలి వస్తున్నా ఏమీ కాదు. వాటిని సరిగ్గా మూయించమని, హీటింగ్ ఖర్చు ఎక్కువవుతుందని హారిక ఇదివరలో అప్పుడప్పుడు చెప్పినా చలికాలంలో ఇంట్లో తేమ ఎక్కువగా కాకుండా వుంటుందని బయటినుండి ఆ కొద్దిగాలి రాకుండా చేయించలేదు. ఆ వస్తున్న గాలిని మూయడానికి టేప్ కోసం వెతికాను. కనిపించలేదు. అయిపోయిందన్న విషయం గుర్తుకువచ్చింది. ఇప్పుడెలా? కొద్దిగా సెల్లో టేప్ అన్నా కనిపిస్తుందేమో అని అలమారాలు అన్నీ వెతికాను కొద్దిగా వెతికాను. నా సందడి చూసి 'ఇంకా పడుకోలేదా?' అని హారిక కళ్ళు తెరచి అడిగింది. ఇప్పుడే లేచా అని చెప్పి శ్రద్ధగా ప్లగ్ హోల్డర్ల చుట్టూరా టేప్ అతికించడములో మునిగిపోయాను. నేను చేస్తున్న పని కాసేపు చూసి హారిక మళ్ళీ పడుకుంది.

ఆ ఉపద్రవం ఏదో ఇంకా జరగలేదు అనే అనిపిస్తోంది. అలా అయితే మేము ప్రస్తుతానికి భద్రమే. బయటినుండి ఏ గాలీ, దుమ్మూ, ధూళి రాకుండా ఇంటినంటా సీల్ చేసినా ఎక్కడొ ఏమూలనుండో తెలియకుండా కొద్దికొద్దిగా నయినా వస్తే ఎలా? హుం. తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకున్నాము. ఇంకేం చేయగలం.

ఆ ఆందోళనతో మళ్ళీ నిద్ర రావడం లేదు. ఈ విషయాన్ని తోటి బ్లాగర్లతో నయినా పంచుకుందామని ఇక్కడ జరుగుతున్న విషయాలను క్లుప్తంగా వ్రాసి ఒక టపాగా పబ్లిష్ చేసాను. ఈ విషయం గురించి నెట్ లో ఏం వస్తుందా అని చూసాను. కొత్త విషయాలు ఏమీలేవు. ఏవేవో పుకార్లు రాజ్యం ఏలుతున్నాయి. అవన్నీ బ్లాగావరణం లొనే తప్ప యు ఎస్ పత్రికలల్లో ఎక్కడా రావడం లేదు. విదేశీ పత్రికలల్లో మాత్రం కొంత వస్తోంది. భారతీయ పత్రికలు ఈ విషయాన్ని బొత్తిగా పట్టించుకోవడం లేదు.

అధికారికంగా ఏమీ ప్రకటించకపోవడం, ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఈ విషయం గురించి నోరు మెదపకపోవడముతో మిగత మాధ్యమాలలో, దేశాల్లో అన్నీ పుకార్లే రాజ్యం ఏలుతున్నాయి. ఆ పుకార్లలో ఏది నిజం అవుతుండవచ్చు? ఆ ఊహలు చాలావరకు భయంకరమైనవే వున్నాయి. యు ఎస్ ఈ కమ్యూనిటీని ఒక రసాయన పరీక్షకోసం గినియా పందులుగా ఉపయోగించుకుంటోందని ఒక అభియోగం. యు ఎస్ సైన్యం భూగర్భంలో జీవాయుధాలు దాచిందని అవి పొరపాటున బయటపడ్డాయని ఒక పుకారు. విపత్కర పరిస్తితులని సైన్యం ఎలా ఎదుర్కోవాలనే విషయమై శిక్షణ అని కొందరి అభిప్రాయం. తీవ్రవాదుల చేత జీవయుధాలు లేదా రసాయన ఆయుధాల ప్రయోగమో జరిగివుంటుందని కొత్తగా వచ్చిన ప్రభుత్వం సిగ్గుపోకుండా జాగ్రత్తపడుతున్నదని మరి కొందరి ఊహ. ఏది జరిగినా అందులో ఏదో కుట్ర వుంటుందనే ఆలోచనాకారులకి అమెరికాలో కొదవలేదు.

కాసేపు అలా ఇంటర్నెట్ గెలికి నిద్ర వచ్చి పడుకున్నాను. ఉదయం రణిల్ నన్ను హడావిడిగా నిద్రలేపుతుంటే గభాలున మెలకువ వచ్చింది.

2 comments:

చైతన్య చెప్పారు...

waiting waiting

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ చైతన్య
వ్రాస్తున్నా...వ్రాస్తున్నా