(ఈ ధారావాహిక నడక నాకే సంతృప్తికరంగా లేనందువల్ల ఇంకో రెండు భాగాల్లో ముగిస్తాను. చివరిమాటలో ఈ సీరియల్ ఎత్తుగడల్లో చేసిన తప్పిదాల గురించి వివరణ ఇస్తాను)
టపా వ్రాసి పబ్లిష్ చేసి ముందు గదిలోకి వచ్చాను. పాఠశాలలు మూసివేసారు కాబట్టి పిల్లలు పండగ చేసుకుంటున్నారు. పాప టివికి అతుక్కుపోయింది - బాబు సిస్టం కి అతుక్కుపోయాడు. హారిక మరో సిస్టం లో ఏడుపుగొట్టు హిందీ సీరియల్ ఏదో చూస్తోంది. బయట నడుస్తున్న విపత్కర పరిస్థితి గురించి నేను తప్ప ఇంట్లో ఎవరూ పట్టించుకోవడంలేదు! ఇంకో రోజు ఇలా సాగితే అందరూ దీనిని తేలిగ్గా తీసుకొని జోకులేసుకునేటట్టుగా వున్నారు.
బ్లయిండ్స్ తెరచి చూసాను. సైనికుల పహరా ఎక్కువయ్యింది. ఇంటివెనుక కిటికీలోనుండి చూసాను. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా సైనికుల పహరా వుంది! ఆశ్చర్యమే. దానికి నేనే కారణం ఏంటి? నాలా కొంతమంది కమ్యూనిటీ లోపల్లో కర్ఫ్యూ ఉల్లంఘిస్తున్నారని పహరా పెంచారా?
సందేహం వచ్చి రాంకీకి ఫోన్ చేసి విషయం చెప్పి తన కమ్యూనిటీలో గమనించి చెప్పమన్నాను.
"మా కమ్యూనిటీలో అలా ఏమీ లేదండీ." అని చెప్పాడు
"తరువాత వస్తారేమో మీ దగ్గరికి. ఎప్పుడు వారి పహరా కనిపిస్తే అప్పుడు నాకు చెప్పండి"
"ఉదయం మీరు చేసిన పని వల్ల ప్రభుత్వం ఠారెత్తినట్లుంది. ఆ పహరా మీరు బయటకి రాకుండా వుండటం కోసమే అనుకుంటా!" అని బాగా నవ్వుతూ జోకాడు.
నేనూ ఏడవలేక నవ్వి "అదేనేమో. నన్ను వీడియో తీసి యు ఎస్ అంతా ప్రసారం చేసారు కాదు. మీరు అయితే ఏదన్నా విషయం వుంటే చెప్పండి" అని ఫోన్ పెట్టేసాను.
నా టపా సంకలినిలలో వచ్చిందో లేదో చూసాను. హారం లో వచ్చింది కానీ ఇంకా కూడలి, జల్లెడలలో రాలేదు. ఎవరయినా స్పందించడానికి కాస్త సమయం పట్టేట్టుగా వుంది. గస్తీ కాస్తున్న సైనికుల ఫోటోలతో సహా టపా ఇచ్చాను కాబట్టి జనం ఈ విషయాన్ని నమ్మే అవకాశం వుంది. ఆ ఫోటోలని, వివరాలనీ సంధ్యకు కూడా పంపించాను. ఏమయినా కొత్త సమాచారం వుందా అని ఇంగ్లిష్ బ్లాగులూ, వీడియో బ్లాగులూ చూసాను. మరిన్ని పుకార్లు మినహా పెద్ద క్రొత్త విషయాలు ఏమీలేవు.
మధ్యాహ్న భోజనం చేసి ఈ ఆలొచనలు అన్నీ ప్రక్కనపెట్టి ఓ గంటన్నర కునుకేసాను. మెలకువ రాగానే నా టపాకి స్పందనలు ఏమయినా వచ్చాయా అని ఈమెయిల్ చూసాను. కొన్ని వున్నాయి. అందులో విరాగి వ్రాసిన వ్యాఖ్య ఉపయుక్తంగా అనిపించింది. ఇది గ్రహాంతరవాసులకి సంబంధించిన విషయం కావచ్చునంటూ కొంత సమాచారం, లంకెలూ ఇచ్చారు. గ్రహాంతర వాసులకి సంబంధించిన విషయాలలో ఇదివరకు యు ఎస్ సైన్యం ఎలా గుట్టుగా వ్యవహరించిందీ, ఎలా విషయాలను మరుగున పరిచిందీ సోదాహరణంగా క్లుప్తమయిన సమాచారం ఇచ్చారు.
ఆ కోణంలోనుండి చూస్తే కాస్త నమ్మబుద్ధి అవుతోంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో విషయం జరిగినట్లు అనిపించడం లేదు - జరగబోతున్నట్లు అనిపిస్తోందే! ఆ సందేహమే తిరుగు వ్యాఖ్యలో వ్రాసాను.
రాంకీ నుండి ఫోన్ వచ్చింది. ఉత్సుకతతో అడిగాను "ఏంటీ మీ దగ్గర కూడా సైనిక పహరా పెరిగిందా!"
"లేదండీ"
"మరి?"
"తగ్గింది" కూల్ గా చెప్పాడు
"తగ్గింది?"
"అవునండీ. సైనికులు వెళ్ళిపోయి మామూలు పోలీసులు పహరా కాస్తున్నారు. మరి మీ దగ్గర?"
ఉరికి వెళ్ళి కిటికీలోనుండి చూసాను. సైనిక గస్తీ తగ్గినట్లు ఏమీ అనిపించలేదు. అదే విషయం చెప్పాను.
"మీ దగ్గర కూడా త్వరలోనే తీసివేస్తారు లెండి"
"నేను అలా అనుకోను. మా ఏరియాలోనే ఏదో జరుగబోతూ వుంది. అందుకే మా కమ్యూనిటీలో సైనికుల సందడి ఎక్కువయ్యింది"
ఫోన్ పెట్టేసి ఈ తాజా విషయాలు ఇంట్లో వారికి చెప్పాలా వద్దా అని అందరి వైపు చూసాను. ఎవరి వ్యాపకంలో వారు మునిగి వున్నారు.
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి