తూర్పుకు వెళ్ళే రైలు

బాలచందర్ అనుకుంటా ఈ టైటిల్ తో సినిమా తీసేడు - ఆ సినిమా చూడటం నాకు కుదరలేదు కానీ రైలు చూసినప్పుడల్లా తరచుగా ఆ పేరు గుర్తుకువస్తుంది. చక్కటి భావం ఉన్న పేరు కదా అది.

మా ఇంటి దగ్గరి స్టేషన్ నుండి షికాగో డవుంటవున్ రైలులో ముప్పావు గంట ప్రయాణం. దినపత్రిక చదువుతూ రైలు కోసం ప్రాతహ్ కాలాన్నే వేచి వుండటం చక్కటి అనుభూతినిస్తుంది. మరీ ఎక్కువ చలిలేకుండా మంచు ఝల్లు కురుస్తున్నప్పుడు అలా ఎదురుచూడటం ఇంకా బావుంటుంది. పేపర్ తిరగేస్తూ నాతోటి ప్రయణీకులను ముఖ్యంగా దేశీ వారిని గమనిస్తుంటాను. అందులో ఇద్దరయినా చక్కటి యువతులు వుండి ఆ రోజు ధన్యమయిందా నాకు అన్నట్లుగా మనస్సును రాగరంజితం చేసేస్తూంటారు.

మెట్రా రైలు బోగీలు పాతకాలం బోగీలేకానీ అంబాసడార్ కారులోలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. ఓ పదినిముషాలు రైలు లోపల కూడా పేపర్ తిరగేసి ఎంచక్కా నిద్రలోకి జారతాను. కనీసం ఓ ఇరవై నిముషాలయినా అలా జోగిన తరువాత మెలకువవస్తుంది. కదులుతున్న రైలు నుండి వెళ్ళిపోతున్న పరిసరాలనూ, పచ్చదనాన్నీ, ప్రకృతినీ తాపీగా చూస్తుండటం బావుంటుంది.

రైలులో గడిపే ఈ సమయం నాది - నా ఒక్కడిదేనూ. ఉద్యోగ సమయం కాదు, ఇంటి సమయం కాదు, పిల్లల కోసం సమయం కాదు. ఏ ఒత్తిళ్ళూ లేని ఒంటరి సమయం ఇది. మన మనస్సులోకి తీరిగ్గా తొంగి చూసుకునే సమయం, ఆత్మ విమర్శ చేసుకొనే సమయం, ఏ ఆదుర్దా లేని సమయం, తాపీగా మధుర స్మృతులు నెమరువేసుకొనే సమయం. వెళ్ళేటప్పుడు దాదాపుగా ఒక గంట, వచ్చేటప్పుడు దాదాపుగా ఒక గంట. మనకంటూ ప్రత్యేకంగా కొంత సమయం వుండటం మంచిదంటారు - ఇందుకే - చక్కటి ఆలోచనలు, నిర్ణయాలు వస్తాయప్పుడే.

అందుకే నాకు తూర్పుకి వెళ్ళే రైలు అంటే ఎంతో ఇష్టం. మీకూ ఇష్టమయితే నాతో పాటుగా ఎక్కెయ్యండి మరి! ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా ఏకాంతాన్ని నానుండి దూరం చేయడం మీకు ఇష్టం లేదా - అయితే దిగిపొండి. అలా అయినా సరే ఇలా అయినా సరే - మీకు ధన్యవాదములు.

3 comments:

  1. కిళక్కే పోగుం రైల్ తమిళ్ళో భారతీరాజా అనుకుంటా తీసింది దాన్నే బాపుగారు తెలుగులో తూర్పువెళ్ళేరైలు గా మళ్ళీ తీశారు.

    ReplyDelete
  2. nijam ..alaa ontari journylo ..manaloki manam choosukogalam ,five years ala travel chesaanu ,.vijayawada to elur.nenaite panta polalni chadivesanu.,window pakka seat nundi .

    ReplyDelete
  3. @Vijayamohan,
    ఓ ఆ చిత్రం బాపు గారిదా!
    @Chinni
    భావన గారి బ్లాగులో మీ వ్యాఖ్య చూసి మీరూ చలం అభిమానులేనని తెలిసి సంతోషమయ్యింది.

    ReplyDelete