బుధవారం 18 మార్చి 2009

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 3

"ఈ తెల్లోలంతా ఇంతే. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దగా చేస్తారు. లైట్ తీస్కో" అంది హారిక
"వాటెవర్" అని ఓ డైలాగ్ వేసి ఎంచక్కా తన సిస్టంలో ముఖం దూర్చేసాడు మా వాడు.
మా పాప టేప్ తీసుకొని తలుపు దగ్గరికి వెళ్ళి అతికిస్తూనేవుంది.
"అంతేనంటావా" అన్నాను మా ఆవిడతో నా మనసులోని అలజడి బయటపడకుండా. పోలీసులు అటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వున్నారు అంటే ఏదో ఉపద్రవం జరగలేదేమో - ఇది బాగానే వుంది కానీ ఆ ఉపద్రవం ఇకముందు జరగబోతోందా? నా ఉద్దేశ్యమే నిజమయితే...! బ్లైండ్స్ తెరచి మరో సారి రోడ్డును పరీక్షగా చూసాను. నా అనుమానం నిజమయ్యింది. అప్పుడున్నంత పోలీసు ఫోర్స్ ఇప్పుడు లేదు. కొంత ఫోర్స్ తమ వాహనాలు ఎక్కి నిష్క్రమిస్తున్నాయి.

సమయం మధ్యాహ్నం 12:30 దాటింది. నా అనుమానం నిజమౌతున్నదా లేక కర్ఫ్యూ ఎత్తేస్తున్నారా? 57 ఛానల్ పెట్టి చూసాను. అవే హెచ్చరికలు వస్తున్నాయి. కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లుగా ఏమీలేదు. అంటే? నా నుదిటిన చిరు చెమట్లు పట్టాయి. హారిక వైపు చూసాను. ఎంచక్కా తన సిస్టంలో హిందీ సీరియల్ చూస్తోంది. మా పాప మాత్రం శ్రద్ధగా తలుపుకి టేప్ అతికిస్తోంది.
తన వైపు నేను సాలోచనగా చూస్తున్నది గమనించి "కిటికీలకు టేప్ అతికించు డాడీ. లేకపోతే డేంజర్ కదా" అంది.
"అవునమ్మా" అన్నాను తలపంకిస్తూ
"ఎందుకూ. ఏమొద్దు. కర్ఫ్యూ ఒక గంటలో తీయకపోతారా" హారిక అంది తలేత్తకుండానే.
నా అనుమానం ఆమెకు చెప్పకుండానే "ఎందుకయినా మంచిది. అతికిద్దాం" అన్నాను
"ఏమన్నా అతికించుకోండి"
బాబు వైపు చూసాను. వాడిని సహాయానికి రమ్మనమని చెప్పి వాడితో వాదన పెట్టుకోవడం కంటే పాపతో కలిసి నేనే ఈ పని చేసుకుంటేపోలా అనుకుని ఆ పనిలో పడ్డాను. బయటనుండి ఏమీ గాలి ప్రవేశించకుండా పది నిముషాల్లో తలుపుకి టేప్ అతికించాను. టేప్ ఎక్కువలేదు. అన్ని కిటికీలకు సరిపోతుందా?

12:45 PM. కిటికీ చుట్టూ కూడా డక్ట్ టేప్ అతికిస్తూ ఆసక్తి కొద్దీ కొద్దిగా బ్లయిండ్స్ తెరచి చూసాను. పోలీసులు ఎవరూ దగ్గర్లో లేరు. దూరంగా ఇద్దరు మాత్రం వున్నారు. ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళని పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాను!

నా ఉలికిపాటును ఎవరయినా గమనించారా అని ఇంట్లో చుట్టూ చూసాను. ఎవరి పనుల్లో వాళ్ళు వున్నారు. మా పాప కూడా కిటికీలోనుండి చూసింది కానీ విషయం గమనించలేదు. నా ఊపిరి బరువెక్కినట్లు నాకు తెలుస్తూనే వుంది. విషయం ఇంట్లోవారికి చెప్పాలా వద్దా? చెబితే హడలిపోతారేమో. చెప్పకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోరేమో. ఎలాగూ తెల్సిసేదేకదా.ఇప్పుడే చెబితే పోలా.
ఆలోచిస్తూనే మా వాడిమీద కేకలేసాను - హారిక మీద అరవలేక. "తలకాయ వుందా నీకు. చిన్నపిల్ల చెల్లె హెల్ప్ చేస్తోంది. నీకు మాత్రం ఎప్పుడూ సిస్టం కావాలి"
తల ఎత్తి చూసాడు బాబు
"రా ఇటు. వచ్చి టేప్ వెనుకగది కిటికీలకు అతికించు"
"సరిపోదేమో" అన్నాడు కూల్ గా.
నిజమే. సరిపోదు. గొంతులో ఏదో అడ్డం పడ్డ ఫీలింగ్.
"నీకెప్పుడూ కంగారే డాడీ. ఇప్పుడేమయ్యిందని? నేనూ, మమ్మీ ఎంత కూల్గా వుంటున్నామో చూడు"
అసలే టెన్షనుతో వున్న నాకు వాడి మాటలతో అరికాలి మంట నెత్తికి ఎక్కినట్లయ్యింది.
"ఇటు వచ్చి చూడురా వెధవా. రా" అని అరిచాను.
నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చాడు. చూసాడు. భుజాలు ఎగరేసాడు.
నాకు వళ్ళు మండింది. "అద్దాలు పెట్టుకొని చూసి తగలడు" అని సహనం కోల్పోయి అరిచాను.
"ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడి ఏమయ్యిందని. రోజురోజుకీ నీకు ఓపిక తక్కువ - కోపం ఎక్కువ అవుతోంది" హారిక గయ్ మంది.
ఆమెకు వినపడకుండా పళ్ళు నూరాను. వినపడితే మొదలవుతుంది ఎదవ గోల.
ఈలోగా వాడు అద్దాలు పెట్టుకొని వచ్చి పరీక్షగా చూసి "O M G" అన్నాడు.
వాడు అలా అన్నాడంటే అదేదొ కొంపలు మునిగేవ్యవహారమేనని ఖంగారుగా కిటికీ దగ్గరికి వచ్చింది హారిక. ముందు మామూలుగా చూసింది. ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు. "నాకేం కనిపించ... ఓరి నాయనో" అని అక్కడే కూలబడింది. "ఇప్పుడు ఏమవుతుంది మనకు? ఆ ఇంగ్లిష్ సినిమాలోలా అవుతుందా మన గతి!". ఆమె కళ్ళనుండి జలజలా నీళ్ళు.

మా పాప తన పని తాను చేస్తోంది. కిటికీ చుట్టూ అందినంతమేరకు టేప్ అతికిస్తోంది.

6 comments:

పరిమళం చెప్పారు...

ఏం జరుగుతోంది? :)

చైతన్య చెప్పారు...

కనీసం ఆ ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పినా బాగున్ను హారిక గారు... ఆ సినిమాలో ఏం జరిగిందో.. ఇక్కడ ఏం జరుగుతుందో కొంచం తెలిసేది... hmm

బ్లాగాగ్ని చెప్పారు...

మంచి ఒడుపుగా సస్పెన్స్ ని కొనసాగిస్తున్నారు. ఇట్లాంటిదే సీక్వెన్స్ మల్లాది గారి మిస్టర్ నో అనే నవల ప్రారంభంలో వస్తుంది. హీరో నిద్రలేచేటప్పటికి వాళ్ళ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా కనిపించకుండా మాయమవుతారు. అలా ఒక పదిపేజీలు మనకి బి.పి. పెంచుతాడు రచయిత. మీ ఈ ధారావాహిక చదువుతుంటే మళ్ళీ ఆ కథ గుర్తొస్తోంది.

శరత్ 'కాలం' చెప్పారు...

@ పరిమళం
ఏమో :)

@ చైతన్య
హారిక నిజంగా మా ఆవిడ పేరు, రణిల్ అనే అబ్బాయి మాకు వున్నాడు అనుకుంటున్నారల్లే వుంది. లేదండీ.

సరేలెండి - సినిమా పేరు మాకు గుర్తుంటే మీకు ఎందుకు చెప్పమూ. అది గుర్తుకులేకే 'ఆ సినిమా ' అనటం. చక్కటి సినిమా అది. పేరు ఏమాత్రం గుర్తుకు రావడం లేదు. సినిమా గురించి కొంత తదుపరి భాగంలో వివరిస్తాను. అప్పుడు మీకు పేరు ఏమయినా స్ఫురిస్తుందేమో చూద్దాం. ఒక ఏడాది క్రితం విడుదల అయ్యిందనుకుంటా. ప్రసిద్ద నటులు ఎవరూ లేరు అందులో (అనుకుంటా).

@బ్లాగాగ్ని
మల్లాదివి చాలా నవలలు చదివాను కానీ మిస్టర్ నో చదివినట్లు గుర్తుకులేదు. చదివి మరచిపోయికూడా వుండవచ్చు. ప్లాట్ వింటుంటే ఆ నవల చదవాలనిపిస్తోంది.

Mahi చెప్పారు...

cinema peru gurtu ledu kaani,aa cinema edo viruski related,Nenu aa movie choosanu.kaani ikkada cheppanu.

:)

శరత్ 'కాలం' చెప్పారు...

@మహి,
అవును. వైరస్ సినిమానే. భార్యకు సోకుతుంది. భర్త ఆమెను ఇంట్లోకి రానివ్వలేడు. ఫర్వాలేదు, ఆ మూవీ వివరాలు చెప్పొచ్చు. ఈ సీరియల్ అలా వుండదు. పేరు గుర్తుకువస్తే చెప్పండి.