బుధవారం 18 మార్చి 2009

ధారావాహిక - ఏం జరుగుతోంది? - పార్ట్ 2

గమనిక: తెలుగు బ్లాగావరణంలో ధారావాహికలకు/కొత్త నవలలకు అంతగా ఆదరణ లేదని తెలుసు. అయినా సరే ఇదివరకటి అలవాటుకొద్దీ వ్రాస్తున్నాను/వ్రాసుకుంటున్నాను.

రోడ్డు ఎక్కాను. ఆ తరువాత డండీ రోడ్డుకు మీదకి వచ్చాను. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదలుతోంది. పోలీసు కార్లు మాత్రం సైరన్లు మ్రోగించుకుంటూ ఎలాగోలా హడావిడిగా వెళుతున్నాయి. మిగతా కార్లలోని వ్యక్తుల వైపు పరికించిచూసాను. అందరి ముఖాల్లోనూ ఆందోళన. సరి అయినంత సమాచారం అందకుండా వుండటం కూడా మరింత టెన్షన్ కలగజేస్తోంది అనుకున్నాను. రేడియో గుర్తుకువచ్చింది. 780 పెట్టాను. ప్రకటనలు. ప్చ్. అది తప్ప నాకు మరో వార్తా చానల్ తెలియదు. వేరే ఛానల్స్ ప్రయత్నించాను కానీ అన్నీ సంగీతం, ఇతరాలు దొరికాయి.

ట్రాఫిక్ ఆగిపోయింది. సమయం పదకొండున్నర. ఇంకా అరగంటే టైం వుంది కర్ఫ్యూకి. రేదియోలో వార్తలు. చెవులు రిక్కించాను. ఎ ఐ జి బ్యాకు బోనస్సుల గురించిన గొడవ గురించి. ఆ గొడవ సరే - ఇక్కడ జరుగుతున్న గొడవ సంగతి ఏమిటి? తరువాత చెబుతారేమో. ఊహూ. చెప్పడం లేదు!

ఫైర్ ఇంజిన్లు వెళుతున్నాయి. ఈ ట్రాఫికులో కష్టకష్టంగా వెళుతున్నాయి. నా పక్కనున్న వీధిలో దూరంగా చూసాను. ట్రాఫిక్ వెళ్లకుండా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుకు దృష్టి సారించాను. అరడజను పోలీసులు వుండి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

సమయం పదకొండూ నలభై. పోలీసుల శ్రమ వల్ల ట్రాఫిక్ కొద్దిగా వెళుతోంది. వెళ్ళి బాబుని తీసుకువచ్చే సమయం లేదు. ఏం చేయాలి? కొద్దిగా ముందుకు వెళ్లగలిగాను ఆలోచిస్తూనే. పోలీస్ కార్లు కర్ఫ్యూ ప్రకటన చేస్తూ అందరినీ త్వరగా ఇంటికి వెళ్ళాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.

11:45. లాభంలేదు. 12 లోపుగా వెనక్కి రాలేను. కూడళ్ళల్లో పోలీసులు పొజిషన్ తీసుకుంటున్నారు. బాబుని ఇక వెనక్కి తీసుకురాలేనని అర్ధమయ్యి యూ టర్న్ తీసుకొని వెనక్కు వచ్చాను. బాబు తన స్నేహితుని ఇంటిదగ్గర క్షేమంగానే వుంటాడు కానీ ఇంటిదగ్గర నా అవసరం బాగా వుంటుంది. అందుకే వెనక్కి మళ్ళాను. అదే విషయం బాబుకి చెబుదామని ఫోన్ చేయబోయేంతలో ఇంటిదగ్గర నుండి ఫోన్ వచ్చింది.

"బాబు వచ్చేసాడు" అని చెపంది మా ఆవిడ.
"ఎలా?" అన్నాను విస్మయంతో
"నడుచుకుంటూ"
"నడుచుకుంటూ?"
"అవును. ఈ వార్త వినగానే అడ్డదారిలో పార్కులోనుండి నడుచుకుంటూ వచ్చాడట"
బాబు ఇంటికి క్షేమంగా రావడం సంతోషకరంగా అనిపించింది. ఇబ్బందుల్లో వున్నప్పుడు అందరం ఒక దగ్గరే వుంటేనే బాగనిపిస్తుంది.

రోడ్ల మీద మామూలు జనం తక్కువయ్యి గవర్నమెంట్ వాహనాలు, పోలీసు వాహనాలు ఎక్కువ అవడం గమనించాను. కొన్ని వాహనాలు బారికేడ్లు తీసుకువెళుతున్నాయి. అక్కడక్కడ ఫైర్ ఇంజిన్లు నిలిచి వున్నాయి. ఇంకో అయిదు నిమిషాల్లో కర్ఫ్యూ.

ఇంటికి చేరుకున్నాను. హడావిడిగా లోపటికి వెళ్ళాను. ముందు వార్తలు చూడాలి. ఏం జరుగుతోందో, కర్ఫ్యూ ఎందులో తెలుసుకోవాలి.

లోపల హారిక (మా ఆవిడ) ఎంచక్కా హిందీ సినిమా చూస్తోంది.
వళ్ళు మండినా నిగ్రహించుకొని సాధ్యమయినంత శాంతంగా అడిగాను "ఏం సినిమా?"
"వెన్సుడే" తలతిప్పకుండానే చెప్పింది.
"న్యూస్ విన్నావా?"
"రాలేదు"
"ఏం రాలేదు?"
"మీరు చెప్పిన న్యూస్ ఎక్కడా రాలేదు! కర్ఫ్యూ ఎని ఎక్కడా చెప్పడం లేదు"
"నిజమా!"
సి ఎన్ ఎన్ పెట్టి చూసాను. నమ్మలేక. ఊహూ వార్త లేదు. మిగతా ఛానల్స్ పెట్టి చూసాను. ఎక్కడా ఈ వార్త కవర్ కావడం లేదు.
"ఈ కర్ఫ్యూ వార్త నిజమేనా?" హారిక అడిగింది.
"ఒక్క సారి డండీ రోడ్డు చూడు ఇంట్లోంచి"
బ్లైండ్స్ తొలగించి చూసింది. "నిజమే. పోలీసులు, ఫైర్ వున్నారు. కార్లు లేవు" అంది.
రణిల్, పాప కూడా ఉత్సాహంగా వచ్చి బ్లైండ్స్ తెరివబోయారు.
"తెరవద్దు. కొద్దిగా పక్కకు అని చూడండి అంతే" హెచ్చరించాను.

ఒకసారి పోలీసుల ప్రకటన గుర్తుకుతెచ్చుకున్నాను. అందులో లోకల్ ఛానల్ చూడమని వుంది. వెంటనే 57 పెట్టాను. అది ఈ ముసిపాలిటీ వారి ఛానల్. అందులో వస్తోంది కర్ఫ్యూ గురించిన సమాచారం!
12 గంటలనుండీ నిరవధిక కర్ఫ్యూ అని. కిటికీలు, బ్లయిండ్స్ మూసివేయాలని, ఎవరూ బయటికి రావద్దనీ హెచ్చరికలు. కిటికీలు, తలుపులు టేపుతో సీల్ చేయాలని ముఖ్య గమనికగా చెప్పారు. అది చూడగానే వళ్ళు జలదరించింది. ఎదో పెద్ద ప్రమాదమే జరిగిందో, జరగబోతుందో! ఎందుకు అవన్నీ సీల్ చేయమంటున్నారు? ఎందుకు ఏమిటి అన్న వివరాలు లేవు. ప్రజలని ఎక్కువగా భయభ్రాంతులను చేయకుండా వుండటానికి, పుకార్లు వ్యాప్తి చెందకుండా వుండటానికి అవి ఇవ్వడం లేదేమో.

ఇంట్లో వారికి విషయం చెప్పాను. హారిక ముఖంలో విభ్రాంతి. రణిల్ ముఖంలో '? '. మా పాప ముఖం చూద్దామంటే అది అక్కడ లేదు.

"టేప్ తెస్తున్నా డాడీ" అని లోపలి గదిలోనుండి వినపడింది. మరుక్షణంలో టేప్ తో ప్రత్యక్షమయ్యింది! "నేనూ టేప్ అతికిస్తా"

"ఖంగారు ఏమీలేదు. ఏదో ముందు జాగ్రత్తకొసం అయివుంటుంది" అన్నాను హారికతో నా కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ.
"నాకు ఆమధ్య చూసిన సినిమా గుర్తుకువస్తోంది!" ఏడుపు మొఖంతో అంది.
"ఛ. అంత దృశ్యం వుండదులే. ఖంగారు పడకు - పిల్లలని ఖంగారు పెట్టకు". పిల్లలు అప్పటికే అనుమానంగా మా వైపు చూస్తున్నారు.
"ఎందుకు టేప్ అతికించాలి డాడీ" అని మా పాప అడిగింది.
"వెల్. ఎంత టేప్ అతికించినా ఎక్కడో ఒక మూలనుండి వచ్చేవి రాకుండా పోతాయా" మా బాబు. వాడో పెద్ద పెసిమిస్ట్. అదో గొప్ప వేదాంతం అనుకుని సంతొషిస్తుంటాడు వాడు.
"వివరాలు తరువాత. నోరుమూసుకొని నాకు సహాయం చెయ్యండి ముందు" అని గదమాయించాను.

కొద్దిగా బ్లయిండ్స్ తెరచి బయట వున్న డండీ రోడ్డును చూసింది హారిక. మా ఇంటి పక్కనే వుంటుంది కాబట్టి స్పష్టంగా కనిపిస్తుందా రోడ్డు. మా ఇంటినుండి డైరెక్టుగా ఆ రోడ్డు మీదికి వాహనాలు పోలేవు. హిల్ వే వీధినుండి వెళ్ళాల్సిందే. "మనం టేప్ అతికిస్తాము బాగానే వుంది కానీ. ఆ పోలీసుల సంగతి ఏమిటి? వాళ్లకేమీ కాదా?"
చేతిలో వున్న టేప్ పక్కనే గిరాటు వేసి ఒక్క అంగలో కిటికీ దగ్గరికి వెళ్ళాను. నా వెనుకే పిల్లలూనూ. నిజమే. మరి బయట వున్న పోలీసులకి ఏమీ కదా? అటువంటప్పుడు కిటికీలకు, తలుపులకూ టేప్ దృఢంగా అతికించమని ఎందుకు హెచ్చరిస్తున్నారు?
(ఇంకా వుంది)

4 comments:

చైతన్య చెప్పారు...

అబ్బా... ఒకేసరే కథ మొత్తం చెప్పేయొచ్చు కదండీ... ఈ సస్పెన్స్ ఏంటి మాకు....

Dr. నరహరి చెప్పారు...

idi ozone gurinchaa...? 12noon taravata curfew ante?

శరత్ 'కాలం' చెప్పారు...

@ చైతన్య,
హమ్మా. ఆశ, దోశ, అప్పడం. అప్పుడే చెప్పనుగా.
మీ ప్రశంస, ప్రోత్సాహం నాకు స్ఫూర్తిదాయకంగా వున్నాయి. నిజంగా ఆ మాత్రం సీన్ నాకుందో లేదో గానీ నాకు మాత్రం సంతోషంగా వుంది.

నా రచనల్లో తరువాత ఏం జరుగుతుందో నాకే తెలియదండీ. ప్రారంభం ఆలోచించి నవల మొదలెడుతాను. ఏరోజుకారోజు వచ్చిన ఆలోచనల ప్రకారం కథ కొనసాగుతూ వుటుంది. ప్లాట్ నేమీ స్కెచ్ వేయను. థీం దృష్టిలో వుంచుకొని తదుపరి భాగం ఆలోచిస్తూవుంటాను. ఒక్కో రచయితది ఒక్కో విధానం కదా.

మీకు నా రచనల్లో ఏదయినా నచ్చకపోతే కూడా చెప్పేసెయ్యండి.

@ డా. నరహరి
లేదండీ. ఓజోన్ గురించి కాదు. అలా ఎందుకు అనిపించింది? మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత కర్ఫ్యూ మొదలవుతుంది.

చైతన్య చెప్పారు...

రోజూ మీ బ్లాగు చదవటం ఒక దినచర్య అయిపోయిందండి నాకు... కథలో తర్వాత ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్ తెలుసుకోవాలనే ఆత్రుత వలన.
you are really a worthful writer!

కథ గురించి పక్కా క్లారిటీ ఉండి... దాన్నే కొంచం విడమరిచి... వివరిస్తూ... వ్రాసే విధానమే నాకు తెలుసు ఇప్పటివరకు. ఏరోజుకారోజు మీరు రాస్తాను అంటే ఆశ్చర్యంగా అనిపించింది... ఆసక్తి కూడా ఎక్కువ అయింది :)

నచ్చని విషయం అంటారా... అలా ఏదైనా అనిపిస్తే... చెప్పటానికి నాకేమి మొహమాటం లేదు :)